ప్రపంచంలోని సగం సముద్రాలు ఎందుకు రంగులు మార్చుకుంటున్నాయి?

సముద్రాల రంగులు

ఫొటో సోర్స్, Esa

    • రచయిత, ఫ్రాంకీ ఆడ్కిన్స్
    • హోదా, జర్నలిస్ట్

మనుషుల చర్యల వల్ల ఏర్పడే వాతావరణ మార్పుల ఫలితంగా సముద్రాలలోని ఫైటోప్లాంక్టన్ సమతుల్యత మారుతోంది. అది సముద్రాలను తీవ్రంగా ప్రభావితం చేసి రంగులు మార్చుకునేలా చేస్తోంది.

సముద్రం అంటే మెరుస్తున్న మణుల్లాంటి నీలి రంగు జలాలు గుర్తొస్తాయి మనకు.

కానీ, ఇటీవలి పరిశోధనలు ప్రపంచంలోని సముద్రాలు ఆకుపచ్చగా మారుతున్నాయని సూచిస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం వాతావరణ మార్పులు కావచ్చు.

ప్రపంచ ఉష్ణోగ్రతలు పెరిగే కొద్దీ కొన్ని జలాలు మరింత ఆకుపచ్చగా మారుతుంటే, ముఖ్యంగా భూమధ్యరేఖకు సమీపంలోని తక్కువ అక్షాంశాలలో ఉన్న సముద్రాలు నీలి రంగులోకి మారుతున్నాయి.

ఈ రంగు మార్పు కంటికి కనిపించకున్నా, ఉపగ్రహ అధ్యయనాలు వీటిని గుర్తించాయి.

యూకేలోని సౌతాంప్టన్‌లోని నేషనల్ ఓషనోగ్రఫీ సెంటర్‌కు చెందిన శాస్త్రవేత్త బీబీ కేల్ మాట్లాడుతూ.. "రంగులు కేవలం మనుషులు భాషతో వర్ణించి, కంటితో సులభంగా చూడగలిగినవి కావు. అంతకు మించినవి’’ అన్నారు.

యూరోపియన్ యూనియన్ కోపర్నికస్ క్లైమేట్ సర్వీస్ ఏప్రిల్ 2024లో ప్రచురించిన యూరోపియన్ స్టేట్ ఆఫ్ ది క్లైమేట్ రిపోర్టులో సముద్రంలో వస్తున్న మార్పుల గురించి వెల్లడించింది.

ఈ నివేదిక క్లోరోఫిల్ (ఇది ఫైటోప్లాంక్టన్, ఇంకా మొక్కలలో కనిపిస్తూ, వాటికి ఆకుపచ్చ రంగును ఇచ్చే ఫొటోసింథటిక్ పిగ్మెంట్), ఏప్రిల్ 2023లో యూకేకు ఉత్తరాన ఉన్న నార్వేజియన్ సముద్రం, అట్లాంటిక్ మహాసముద్రాలలో సగటు కంటే 200-500% ఎక్కువగా ఉండగా, లైబీరియన్ ద్వీపకల్పానికి పశ్చిమాన ఉన్న సముద్రంలో 60-80% తక్కువ ఉందని తెలిపింది.

జూన్ 2023లో మధ్యధరా సముద్రంలో కోరోఫిల్ స్థాయి సగటు కంటే 50-100% ఎక్కువగా ఉంది. రెండు సందర్భాల్లోనూ సగటును 1998-2020 మధ్య కొలిచారు.

శాస్త్రవేత్తలు ఈ రంగుల మార్పులు సహజంగా ప్రతి ఏడాది కనిపించే దానికి భిన్నంగా ఉన్నాయని, ఇది వేడెక్కుతున్న సముద్ర ఉష్ణోగ్రతలకు సంకేతమని భావిస్తున్నారు.

కోపర్నికస్ సేకరించిన సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలపై బీబీసీ జరిపిన పరిశీలనలోప్రపంచంలోని మహాసముద్రాలు రికార్డు స్థాయిలో వేడెక్కుతున్నాయని వెల్లడైంది.

గత ఏడాది కాలంలో మహాసముద్రాల ఉష్ణోగ్రతలు ప్రతిరోజూ గతంలోకన్నా ఎక్కువగా ఉన్నాయని తెలిసింది.

నాసా ఉపగ్రహాలను ఉపయోగించి, రెండు దశాబ్దాల డేటాను రికార్డు చేసిన ప్రధాన పరిశోధకులు కేల్ ఇటీవల నేచర్‌ పత్రికలో ఈ అధ్యయనాన్ని ప్రచురించారు.

మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (MIT) శాస్త్రవేత్తలతో పాటు చేసిన పరిశోధనలో, ప్రపంచంలోని సగానికి పైగా సముద్ర ప్రాంతం (56%) రంగు మారినట్లు ఆయన గుర్తించారు.

వైశాల్యం రీత్యా, ఇది ప్రపంచంలోని భూభాగం కంటే పెద్దది.

కోపర్నికస్ క్లైమేట్ ఛేంజ్ సర్వీస్

ఫొటో సోర్స్, Copernicus Climate Change Service/ECMWF

ఫొటో క్యాప్షన్, కోపర్నికస్ క్లైమేట్ ఛేంజ్ సర్వీస్/ఈసీఎండబ్ల్యూఎఫ్

ఫైటోప్లాంక్టన్ ప్రభావం

శాస్త్రవేత్తలు ఈ మార్పులకు ఖచ్చితమైన కారణాలను వివరించలేకున్నా, ఫైటోప్లాంక్టన్ ద్రవ్యరాశి, దాని వ్యాప్తి సముద్రాల రంగు మారడంలో ప్రధాన పాత్ర పోషించిందని విశ్వసిస్తున్నారు.

ఫైటోప్లాంక్టన్ అనేవి అతి సూక్ష్మంగా ఉండి, కిరణజన్య సంయోగక్రియలో పాల్గొనే జీవులు. ఇవి సముద్రపు ఆహార వ్యవస్థకు మూలంగా ఉంటాయి.

క్రిల్ నుంచి తిమింగలాల వరకు ఆహార గొలుసులో దీని మీదే ఆధారపడి ఉంటాయి.

ఫైటోప్లాంక్టన్‌లో క్లోరోఫిల్‌ ఉంటుంది. కిరణజన్య సంయోగక్రియ సమయంలో మొక్కలు సూర్యరశ్మి నుంచి శక్తిని సేకరించేందుకు ఉపయోగపడే ఆకుపచ్చ వర్ణద్రవ్యం క్లోరోఫిల్.

వాతావరణం నుంచి సముద్రంలోకి కార్బన్ డయాక్సైడ్‌ను బదిలీ చేయడంలో ఫైటోప్లాంక్టన్ ప్రధాన పాత్ర పోషిస్తుంది.

సాధారణంగా, సముద్రం రంగు దాని ఎగువ పొరలలో ఏం ఉంటుందన్న దాని మీద ఆధారపడి ఉంటుంది.

నీళ్లు ముదురు నీలం రంగులో ఉంటే తక్కువ జీవం ఉన్నట్లు, ఆకుపచ్చటి జలాలు ఎక్కువ ఫైటోప్లాంక్టన్ ఉనికిని సూచిస్తాయి.

సముద్రపు ఉపరితలం పైనుంచి ప్రతిబింబించే సూర్యకాంతి తరంగదైర్ఘ్యాలను అధ్యయనం చేసి, శాస్త్రవేత్తలు ఎంత క్లోరోఫిల్ ఉందో అంచనా వేస్తారు.

"వేర్వేరు ఫైటోప్లాంక్టన్‌లలో కిరణజన్య సంయోగక్రియకు ఉపయోగించే వివిధ వర్ణద్రవ్యాలు ఉంటాయి. ఈ వర్ణద్రవ్యాలు వివిధ తరంగదైర్ఘ్యాల వద్ద కాంతిని గ్రహిస్తాయి" అని కేల్ చెప్పారు.

"నీళ్లలో ఎర్రని ఫుడ్ డై కలిస్తే నీళ్ల గ్లాసు ఎర్రగా కనిపిస్తుంది ఎందుకంటే, ఎర్రగా లేని తరంగదైర్ఘ్యాలను గ్రహించేది ఏదో దానిలో ఉంటుంది. ఫైటోప్లాంక్టన్ నీటిలోని కణాలు కాబట్టి అవి కాంతిని వెదజల్లుతాయి" అని ఆయన చెప్పారు.

పచ్చనీళ్లు

ఫొటో సోర్స్, Getty Images

'ఊహాజనిత భూమి'

నాసాకు చెందిన ఆక్వా శాటిలైట్‌లోని మోడిస్ అనే పరికరం, కంటికి కనిపించే తరంగదైర్ఘ్యాలలో ఏడింటి కొలతలను తీసుకుంటుంది.

ఇది కంప్యూటర్ నమూనాల ఆధారంగా మునుపటి పరిశోధనలలో సంగ్రహించిన దానికంటే మరింత సంపూర్ణమైన స్పెక్ట్రం.

దీని సహాయంతో కేల్ అలాంటి పరిస్థితులను సృష్టించే ఒక నమూనాను రూపొందించారు.

"ఒక ఊహాజనిత భూమిని సృష్టించి, వాటిని రెండు భిన్న రకాలుగా మార్చాము. ఒక దానిలో వాతావరణ మార్పు చేయకుండా, మరొక దానిలో మార్పులు చేశాము" అని ఆయన వివరించారు.

కేల్ రంగు మార్పుల స్పెక్ట్రంను నమోదు చేయడానికి, మోడిస్ (మోడరేట్ రిజల్యూషన్ ఇమేజింగ్ స్పెక్ట్రోరాడియోమీటర్) డేటాగా పిలిచే నాసాకు చెందిన ఆక్వా ఉపగ్రహంలోని పరికరం నుంచి 20 సంవత్సరాల డేటాను సేకరించాడు.

"ఆ రెండు ఊహాజనిత భూములు కాలక్రమేణా ఎలా మారతాయో మనం చూడొచ్చు. మనం చూసేది నిజంగా సముద్రంలో వస్తున్న మార్పులకు సమానంగా ఉంటుంది" అని కేల్ వివరించారు.

ఈ ప్రయోగం ద్వారానే ప్రపంచంలోని 56% సముద్రాలలో రంగులు మారినట్లు కనుగొన్నారు. ప్రత్యేకించి, భూమధ్యరేఖకు సమీపంలో ఉన్న ఉష్ణమండల సముద్ర ప్రాంతాలు కాలక్రమేణా ఆకుపచ్చగా మారాయి. దీనికి కారణం ఫైటోప్లాంక్టన్ పెరగడంతో క్లోరోఫిల్ ఎక్కువైంది.

"ఇది కేవలం పసిఫిక్ లేదా అట్లాంటిక్ లేదా హిందూ మహాసముద్రానికి మాత్రమే పరిమితం కాలేదు. అన్ని ప్రధాన సముద్ర జలాలలో ఈ మార్పులను చూస్తున్నాము. ఇవి ప్రపంచ స్థాయి మార్పులు" అని కేల్ చెప్పారు.

ఇది ఎమ్‌ఐటీ, సెంటర్ ఫర్ గ్లోబల్ చేంజ్ సైన్స్‌లోని సముద్ర శాస్త్రవేత్త స్టెఫానీ డట్కీవిచ్ గతంలో చెప్పిన ఒక సిద్ధాంతాన్ని నిర్ధరిస్తుంది.

2019లో, డట్కీవిచ్ భవిష్యత్తులో సముద్రం రంగులలో మార్పులను అంచనా వేయడానికి కంప్యూటర్ నమూనాలను ఉపయోగించారు.

అయితే, ఆ రంగు మార్పులు వాతావరణ మార్పుల వల్ల జరిగాయా లేక ఎల్ నినో, లా నినా సమయంలో వచ్చిన సాధారణ సముద్రపు మార్పుల వల్ల జరిగాయా అని నిర్ధరించడం కష్టం అయింది.

సముద్రం

ఫొటో సోర్స్, Esa

"ఈ ప్రాకృతిక పరివర్తన చాలా పెద్దది. కాబట్టి వాతావరణ మార్పుల కారణంగా ఇది పెరుగుతుందా లేదా తగ్గుతోందా అనేది చెప్పడం చాలా కష్టం" అని డట్కీవిచ్ చెప్పారు.

కేల్ అధ్యయనంలోనూ పని చేసిన డట్కీవిచ్, ఇటీవలి పరిశోధన తన అంచనాలను ధృవీకరించిందని చెప్పారు.

"వాస్తవ-ప్రపంచానికి చెందిన ఉపగ్రహ డేటా, మోడల్‌లో కనిపించే దానికి అనుగుణంగా ఉంటుంది" అని ఆమె చెప్పారు.

"అందువల్ల వాస్తవ ప్రపంచంలో మనం చూస్తున్న మార్పులకు కారణం వాతావరణంలో మానవ-ప్రేరిత మార్పులే అని చెప్పడానికి చాలా అవకాశం ఉంది."

ఈ మార్పులు సముద్రంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.

పచ్చలుండే సముద్ర అగాధాలు, సముద్రంలోని లోతైన నీలం రంగు ఉన్న ప్రదేశాలు రాత్రికి రాత్రి అకస్మాత్తుగా రంగు మారవు. కానీ ఉష్ణోగ్రతలు పెరిగే కొద్దీ ఈ ధోరణి మారవచ్చని వెల్లడిస్తున్నాయి.

"మనం ఆలోచిస్తున్నది రంగు మారడం గురించి కాదు. రంగులో మార్పు పర్యావరణ వ్యవస్థలో మార్పును ప్రతిబింబిస్తుంది" అని కేల్ అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)