జాంబీ కణాలు: వయసు పెరిగే కొద్దీ వచ్చే సమస్యలకు కారణం ఇవేనా, వీటికి విరుగుడు ఉందా?

ఫొటో సోర్స్, GETTY IMAGES
అవి మన మెదడు నుంచి కాలేయం వరకు ఉంటాయి. పైగా హానికరమైన అణువులను విడుదల చేస్తాయి. ఇవి కణజాలాన్ని దెబ్బతీస్తాయి. జ్ఞానాన్ని ప్రభావితం చేస్తాయి. మన రోగ నిరోధక వ్యవస్థను బలహీనపరుస్తాయి. మన వయసుతోపాటే వీటి సంఖ్యా పెరుగుతుంది.
అవే వృద్ధాప్య కణాలు. వీటిని జాంబీ కణాలని కూడా తరచూ పిలుస్తుంటారు.
వయసు పెరుగుతున్న కొద్దీ కణాలు కూడా వృద్ధాప్యానికి గురవుతాయి. ఈ స్థితిలో అవి పెరగడం ఆగిపోతాయి కానీ మృతకణాలుగా మాత్రం మారవు. అయితే హానికారమైన జీవరసాయన సంకేతాలను వెలువరిస్తుంటాయి.
యుక్తవయసులో ఉన్నప్పుడు రోగనిరోధక వ్యవస్థ ఈ వృద్ధాప్య కణాలను నిర్మూలిస్తుంది. కానీ చాలా కణాలు ప్రతిఘటించి ఆరోగ్య సమస్యలకు, అలాగే వయోభారం కారణంగా వచ్చే వ్యాధులకు కారణమవుతాయి.
అందుకే దశాబ్దానికిపైగా అనేక సైంటిస్టుల బృందాలు ఈ కణాలను నిర్మూలించి వయోపరమైన సమస్యలను రూపుమాపడమెలా అనే పరిశోధనలు చేస్తున్నారు.

ఫొటో సోర్స్, GETTY IMAGES
వృద్ధాప్య కణాలలో ఆరోగ్య రహస్యాలు
అనారోగ్యం, గాయాలు, ఇతర ఒత్తిళ్ళు మన శరీరంలోని కణాలను దెబ్బతీస్తాయి. ఈ దెబ్బతిన్న కణాలను మన రోగనిరోధక వ్యవస్థ అపాప్టోసిస్ అనే ప్రక్రియ ద్వారా తొలగిస్తుంది. కానీ వయసు పెరిగే కొద్దీ ఇలాంటి పనిచేయని కణాలను తొలగించడంలో మన శరీరం అంత సమర్థవంతంగా పనిచేయదు. దీనివల్ల రోగనిరోధక వ్యవస్థ బలహీనపడుతుంది, జీవక్రియల సామర్థ్యమూ తగ్గుతుంది..
కణజాలాలను పునరుత్తేజం చేయడంలోనూ, ఆరోగ్యకరమైన జీవితాన్ని పెంచడంలో వృద్ధాప్య కణాలు కీలకం కాగలవా అని అనేకమంది పరిశోధకులు అన్వేషణ సాగిస్తున్నారు.
వృద్ధాప్యకణాలపై కొనసాగుతున్న డజన్ల కొద్దీ క్లినికల్ ట్రయల్స్‌లో పరిశోధకులు అనేక ప్రయోగాలు చేస్తున్నారు. వృద్ధాప్యంతో ముడిపడి ఉన్న అనేక వ్యాధులను రూపుమాపేందుకు మందుల నుంచి బయోమార్కర్లు, జన్యుసాధనాల వరకు ప్రతిదాన్నీ ఉపయోగించి పరిశోధనలు జరుపుతున్నారు.
ఈ వృద్ధాప్యకణాలను తిరిగి సరిగా పనిచేసేలా చేయడమా, లేదంటే వాటిని పూర్తిగా చంపడం వల్ల ఎక్కువ మేలు జరుగుతుందా అనే కోణాలలో పరిశోధనలు చేస్తున్నారు.
మిన్నేసోటాలోని రోచెస్టర్‌లో గల మయో క్లినిక్ పరిశోధకులు ఏజింగ్ సెల్ అనే జర్నల్‌లో అక్టోబరు 2023లో ప్రచురితమైన అధ్యయనంలో కణాల స్థాయులో వృద్ధాప్యాన్ని వివరించేందుకు వృద్ధాప్య కణాలను విశ్లేషించినట్టు వెల్లడించారు.
‘‘ప్రజలు వేరు వేరు వయసుల్లో ఉంటారని మాకు తెలుసు. కానీ వారి కాలానుగుణ వయసు వారి బయోలాజికల్ వయసు కన్నా ఎక్కువగా ఉంటుంది’’ అని ఆ అధ్యయన ప్రధాన రచయిత డాక్టర్ జెన్నిఫర్ సెయింట్ సేవియర్ ఓ ప్రకటనలో తెలిపారు.
‘‘జాంబీ కణాలు విడుదల చేసే విభిన్న ప్రోటీన్ల సమూహం వృద్ధాప్య కణాల బయోమార్కర్లుగా పనిచేయడంతోపాటు వృద్ధులలో ఆరోగ్య ఫలితాలను అంచనా వేయగలవని మేం కనుగొన్నాం" అని జెన్నిఫర్ చెప్పారు.
రక్తంలోని ఈ బయోమార్కర్లను కొలవడం ద్వారా వ్యక్తుల కాలనుగుణ వయసు, లింగం, మొండి వ్యాధుల జాడను కనుగొనడంతోపాటు, మరణాన్ని అంచనా వేయడంలోనూ సహాయపడుతుందని పరిశోధకులు కనుగొన్నారు.
ఆ బయోమార్కర్లు ఉంటే..?
ఈ అధ్యయనం 65 ఏళ్ళు, అంతకుమించి వయసు పైబడిన 1,923 మందిపై చేశారు. వీరిలో 68 శాతం మందికి ఎటువంటి మొండి వ్యాధుల లక్షణాలు లేవు. 32 శాతం మందికి ఆర్థరైటిస్, అధిక కొవ్వు, క్యాన్సర్ చరిత్ర ఉంది.
ఎవరి రక్తంలో అయితే వృద్ధాప్య కణాల బయోమార్కర్లు ఉన్నాయో వారికి మరణం ముప్పు ఎక్కువగా ఉందని పరిశోధకులు కనుగొన్నారు.
ఈ బయోమార్కర్లు అప్పటికే గుండె జబ్బులు, కొన్ని రకాలైన క్యాన్సర్ల అభివృద్ధిలో సంబంధం కలిగి ఉన్నాయని గుర్తించారు.
వ్యాధుల ప్రమాదం ఉన్నవారిని కనుగొనేందుకు ఈ బయోమార్కర్లను క్లినికల్ ప్రాక్టిస్‌లో సాధనాలుగా వాడాలని పరిశోధకులు భావిస్తున్నారు.
జీవనశైలి, ఆహారం, శారీరక శ్రమ, మందులు అనేవి ఈ వృద్ధాప్య కణాలను నిర్మూలించడానికి ఎలా ఉపయోగపడగలవనే విషయంపై ప్రస్తుతం పరిశోధన కొనసాగుతోంది.

ఫొటో సోర్స్, GETTY IMAGES
సెనోలిటిక్స్‌పై ఆశలు
డెస్డాటినిబ్, క్వెర్‌సెటిన్ సమ్మేళనాల కలయిక ఎలుకలలోని వృద్ధాప్య కణాలను చంపగలదని 2015లో ప్రచురితమైన ఓ అధ్యయనం తెలిపింది. ఈ అధ్యయనం కూడా రోచెస్టర్‌లోని మయో క్లినిక్ నిర్వహించింది.
ఈ సమ్మేళనాన్ని ఎలుకలకు ఇచ్చిన తరువాత వాటి పెళుసుతనం తగ్గింది. పరిగెత్తే సామర్థ్యం పెరిగింది. వాటి గుండె కూడా పునరుత్తేజం పొందింది.
ఈ ఆవిష్కరణ సెనోలిటిక్స్ అనేక సరికొత్త ఔషధానికి దారితీసింది. అప్పటి నుంచి జంతువులు, మనుషులపై జరిపిన అనేక అధ్యయనాలు ప్రచురితమయ్యాయి. వాటిల్లో వయో సంబంధ వ్యాధులకు కొత్త ఔషదాలు, సైనోలైటిక్ లక్షణాలు కలిగి ఉన్న ఔషధాలను ప్రయోగించినట్టు తెలిపారు.
‘‘చికిత్సలో సెనోలిటిక్స్ ప్రభావం చూపుతుందని నేను నమ్ముతున్నాను’’ అని అనిర్వాన్ ఘోష్ చెప్పారు. ఆయన శాన్‌ఫ్రాన్సిస్కోలోని కాలిఫోర్నియా కంపెనీ యూనిటీ బయోటెక్నాలజీ సీఈఓగా ఉన్నారు. ఈ కంపెనీ సెనోలిటిక్స్ ఔషధాన్ని అభివృద్ధి చేస్తోంది.
కానీ సెనోలిటిక్ ఏజెంట్స్ పై అధ్యయనం ఎక్కువభాగం క్యాన్సర్ నిర్మూలనకు సంబంధించినవి. ఇవి ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నాయి.
అయితే ఈ ఔషధాలను మానవాళి ఉపయోగించవచ్చా లేదా అనే విషయం తెలయడానికి బహుశా దశాబ్దాలు పట్టవచ్చని పరిశోధకులు చెబుతున్నారు.
పైగా అనేక ప్రశ్నలకు శాస్త్రవేత్తలు సమాధానాలు ఇవ్వలేని స్థితిలో ఉన్నారు.
ఉదాహరణకు, ప్రయోగశాలలో కణాలు వృద్ధాప్య కణాలుగా మారడానికి వారాలు పడుతుంది. మరి అదే ప్రక్రియ మానవ శరీరంలో ఎంత సమయం పడుతుంది? ఎంతకాలం అవి మనుగడ సాగిస్తాయి? అన్ని కణాలు వృద్ధాప్య కణాలుగా మారతాయా? లాంటి ప్రశ్నలకు సమాధానాలు లేవు.
సెనోలిటిక్స్ కణాలను మట్టుపెడతాయని, కణాల నిర్మూలన వల్ల తలెత్తే జీవ, భౌతిక పరిణామాలను ఎదుర్కోవచ్చో లేదో ఇంకా తెలియదని శాస్త్రవేత్తలు చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- హెలికాప్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు, విదేశాంగ మంత్రి మృతి, అసలేం జరిగిందంటే..
- హెలికాప్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు, విదేశాంగ మంత్రి మృతి, అసలేం జరిగిందంటే..
- బ్యాంకు పరీక్షల కోచింగ్‌కు నంద్యాల ఎందుకింత ప్రత్యేకం?
- వైఎస్ రాజశేఖరరెడ్డి: హెలికాప్టర్ అదృశ్యమైన తర్వాత 25 గంటల్లో ఏం జరిగింది... ఆచూకీ ఎలా తెలిసింది?
- ‘మా నాన్న సీఎం’
(బీబీసీ తెలుగును ఫేస్‌బు














