ఓవర్సీస్ హైవే: సముద్రంలో 182 కిలోమీటర్ల రోడ్డు.. ప్రపంచంలో 8వ వింత ఇదేనా?

ఓవర్సీస్ హైవే

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఈ ఓవర్సీస్ హైవే‌కు పునాది వేసింది హెన్రీ మోరిసన్ ఫ్లాగ్లర్
    • రచయిత, ట్రేసీ టియో
    • హోదా, బీబీసీ ట్రావెల్

సముద్రంలో నిర్మించిన 182 కిలోమీటర్ల (113 మైళ్లు) పొడవైన ఈ రహదారి ఒక ఇంజనీరింగ్ అద్భుతం. దీన్ని తేలియాడే రహదారి (ఫ్లోటింగ్ హైవే) అని పిలుస్తారు. నీలిరంగు సముద్రంలో తేలియాడే ఈ రహదారి అమెరికాలోని ఫ్లోరిడా స్థితిగతుల్ని మార్చేసింది.

మయామి నుంచి ఫ్లోరిడాలోని కీవెస్ట్ ద్వీపానికి ప్రయాణించడం ఒకప్పుడు పెద్ద ప్రహసనంగా ఉండేది. ఇప్పుడది సులభంగా మారింది.

20వ శతాబ్దపు తొలి నాళ్లలో ఈ మార్గంలో ప్రయాణించడానికి పడవలే దిక్కు. కూడా సముద్రంలోని ఆటుపోట్లను ఎదుర్కొంటూ ఒక రోజంతా పడవ ప్రయాణం చేయాల్సి వచ్చేది.

కానీ, ఈ ఇంజనీరింగ్ అద్భుతం కష్టాలను దూరం చేసింది. ఈ ఓవర్సీస్ హైవే ఫ్లోరిడాలోని ప్రధాన భూభాగం దక్షిణ కొన నుంచి 44 ద్వీపాల మీదుగా 42 వంతెనలపై సముద్రంలో 113 మైళ్ల దూరం విస్తరించింది. అంటే హైదరాబాద్‌లోని నాంపల్లి నుంచి విజయవాడ మార్గంలో కోదాడ వరకు ఎంత దూరం ఉంటుందో అంత అన్నమాట.

దూరదృష్టి గల డెవలపర్ హెన్రీ మోరిసన్ ఫ్లాగ్లర్ అద్భుత సృష్టి ఈ ఓవర్సీస్ హైవే. హెన్రీ మోరిసన్‌కు ‘ది ఫాదర్ ఆఫ్ మోడ్రన్ ఫ్లోరిడా’’ అనే పేరుంది. ఓవర్సీస్ హైవే నిజానికి ‘‘ఓవర్-సీ రైల్‌రోడ్‌’’గా ప్రారంభమైంది.

ఓవర్సీస్ హైవే ఫోటో

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఫ్లాగ్లర్ తన రైలు ట్రాక్‌ను సముద్రం మీదుగా కీవెస్ట్ వరకు విస్తరించాలని నిర్ణయించుకున్నారు.

1870లో వ్యాపారవేత్త జాన్ డి రాక్‌ఫెల్లర్‌తో కలిసి స్టాండర్డ్ ఆయిల్ కంపెనీని ఫ్లాగ్లర్ స్థాపించారు.

ఈ కంపెనీ 20వ శతాబ్దం తొలినాళ్లలో ప్రపంచంలోని అతిపెద్ద, అత్యంత శక్తిమంతమైన సంస్థల్లో ఒకటిగా ఎదిగింది.

ఫ్లోరిడాను సందర్శించి, అక్కడి పర్యాటక రంగం సామర్థ్యాన్ని గుర్తించిన తర్వాత ఫ్లాగ్లర్, తన సంపదలో ఎక్కువ భాగాన్ని ఈ ప్రాంతంలోనే కుమ్మరించారు. విలాసవంతమైన రిసార్ట్‌లను నిర్మించారు. ఇది అమెరికాలోని అత్యంత పేద రాష్ట్రాల్లో ఒకటైన ఫ్లోరిడాను ఈశాన్య అమెరికా నుంచి వచ్చే యాత్రికులకు స్వర్గధామంగా మార్చింది.

అయితే, ఫ్లాగ్లర్ నిర్మించిన మారుమూల ప్రదేశాల్లోని ఈ సంపన్నమైన రిసార్టులకు వెళ్లడానికి సరైన మార్గం లేదు.

ఈ నేపథ్యంలో 1885లో ఫ్లోరిడాలోని అట్లాంటిక్ తీరం వెంబడి జాక్సన్‌విల్లే నుంచి మయామి వరకు ఉన్న రైలు మార్గాలను ఫ్లాగ్లర్ ఒకదానితో ఒకటి అనుసంధానించారు.

ఈ రైల్వే లైన్ మయామితో ముగియాలి. కానీ, అమెరికా 1904లో పనామా కాలువ నిర్మాణాన్ని మొదలుపెట్టినప్పుడు, కీవెస్ట్‌ ప్రాంతపు విలువను ఫ్లాగ్లర్ గుర్తించారు.

పనామా కాలువకు అతి సమీపంలోని అమెరికా భూభాగం కీ వెస్ట్. పైగా ఆగ్నేయ అమెరికాలో అత్యంత లోతైన ఓడరేవు కూడా.

ఓవర్ సీస్ హైవే ఫోటో

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కీవెస్ట్ ఎక్స్‌టెన్షన్ అసాధ్యమని చాలామంది భావించారు.

అసాధ్యం అనుకున్న దాన్ని చేసి చూపించారు

సిగార్, స్పాంజింగ్, ఫిషింగ్ పరిశ్రమలతో సందడిగా ఉండే కీవెస్ట్ హబ్ అప్పటికే అభివృద్ధి చెందుతోంది. కానీ, మారుమూల ప్రాంతంలో ఉన్న ఈ ద్వీపానికి వస్తువులను తరలించడం చాలా కష్టంగా, ఖరీదైన వ్యవహారంగా ఉండేది.

అందువల్ల, ఫ్లాగ్లర్ తన రైలు ట్రాక్‌ను సముద్రం మీదుగా, దక్షిణాన 156 మైళ్ల దూరాన ఉన్న కీవెస్ట్ వరకు విస్తరించాలని నిర్ణయించుకున్నారు. దీన్ని ‘కీవెస్ట్ ఎక్స్‌టెన్షన్’ మార్గం అని పిలిచేవారు. ఫ్లాగ్లర్ సమకాలీనులు చాలామంది ఈ ఎక్స్‌టెన్షన్ నిర్మాణం అసాధ్యమని భావించారు.

1905-1912 మధ్య వచ్చిన మూడు తుపాన్లు ఈ నిర్మాణాన్ని దెబ్బతీశాయి. 100 మందికి పైగా కార్మికులు మరణించారు.

కానీ, ఫ్లాగ్లర్ నిరుత్సాహపడలేదు, వెనక్కి తగ్గలేదు. ఈ రైల్‌రోడ్‌ను నిర్మించడానికి ఏడు సంవత్సరాల కాలం పట్టింది. అప్పట్లోనే 50 మిలియన్ డాలర్ల ఖర్చు అయింది. ప్రస్తుత కాలంలో అయితే ఈ వ్యయం రూ. 12, 957 కోట్ల (1.56 బిలియన్ డాలర్లు)కు సమానం.

నాలుగు వేల మంది ఆఫ్రికన్ అమెరికన్, బహామియన్, యూరోపియన్ వలసదారులు ఈ నిర్మాణంలో పనిచేశారు. వీరంతా కఠిన పరిస్థితుల్లో మొసళ్లు, తేళ్లు, పాములతో పోరాడుతూ ఈ నిర్మాణం కోసం పని చేశారు.

ఓవర్సీస్ హైవే ఫోటో

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, అప్పట్లోనే ఈ నిర్మాణానికి అయిన ఖర్చుల్లో 30 మిలియన్ డాలర్లకు పైగా నిధులను ఫ్లాగ్లర్ సొంతంగా సమకూర్చారు.

8వ వింత అన్నారు

1912లో ఈ రైలుమార్గం పూర్తయినప్పుడు, దీన్ని ప్రపంచంలోని ఎనిమిదో వింతగా పిలిచారు. మయామి నుంచి కీవెస్ట్‌కు ఈ మార్గాన ప్రయాణించిన తొలి రైలులో, అప్పటికే 82 ఏళ్ల వయస్సున్న ఫ్లాగ్లర్ ప్రయాణించారు. ఈ సందర్భంగా తన స్నేహితుడితో ‘‘ఇక ఇప్పుడు నేను సంతోషంగా చనిపోతాను. నా కల నెరవేరింది’’ అని చెప్పారు.

"ఈ నిర్మాణానికి అయిన ఖర్చుల్లో 30 మిలియన్ డాలర్లకు పైగా నిధులను తన సొంత జేబులో నుంచి ఫ్లాగ్లర్ అప్పట్లోనే సమకూర్చడం చాలా గొప్ప విషయం. ఈ రోజుల్లో జెఫ్ బెజోస్, బిల్ గేట్స్, ఎలాన్ మస్క్ వంటి వారు ఇలా చేయగలరేమో’’ అని ఫ్లోరిడా చరిత్రకారుడు బ్రాడ్ బెర్టెలీ అన్నారు.

1935 వరకు రైల్‌రోడ్ పని చేసింది. శతాబ్దంలోనే అత్యంత ఘోరమైనదిగా పిలిచే ఒక తుపాను కారణంగా కొన్ని మైళ్ల దూరం వరకు ఈ రైల్వే ట్రాక్‌లు తుడిచిపెట్టుకుపోయాయి.

ఓవర్సీస్ హైవే

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఈ ఓవర్సీస్ హైవే ఫ్లోరిడా కీస్‌ను పర్యాటక కేంద్రంగా మార్చింది.

రైల్వే ట్రాక్‌లకు పునర్జన్మ

ఈ ట్రాక్‌లను పునర్నిర్మించడానికి బదులుగా, ఫ్లాగ్లర్ మాస్టర్‌వర్క్‌కు అమెరికన్లు పునర్జన్మను ఇచ్చారు. అది అమెరికన్లు ఆటోమొబైల్స్ వైపు మళ్లుతున్న తరుణం. ఆటోమొబైల్స్‌కు అనుగుణంగా ప్రపంచంలోనే అతిపొడవైన ఓవర్ వాటర్ రోడ్లను నిర్మించాలని అమెరికా ప్రభుత్వం భావించింది.

ఈ మేరకు, గంటకు 200 మైళ్ల వేగంతో వీచే గాలులను తట్టుకోగలిగేలా నీళ్ల మీద ఫ్లాగ్లర్ నిర్మించిన వంతెనల మీదనే ఈ పొడవైన రహదారి నిర్మాణాన్ని అమెరికా ప్రభుత్వం ప్రారంభించింది.

రైల్వే ట్రాక్‌లను కార్లు తిరిగేందుకు వీలుగా రహదారుల్లాగా మార్చేశారు. కొత్తగా రూపొందించిన ఈ ఓవర్సీస్ హైవే సుదూరంలోని ఫ్లోరిడా కీస్‌ను పర్యాటక కేంద్రంగా మార్చింది.

"ఫ్లోరిడా కీస్ చరిత్రలో అత్యంత ప్రభావవంతమైన పనిగా నిస్సందేహంగా ఫ్లాగ్లర్ ఓవర్సీస్ రైల్వేను పూర్తి చేయడాన్ని చెప్పొచ్చు. ఆయన దార్శనికత, అంకితభావం, దూరదృష్టి కారణంగానే అమెరికా ప్రధాన భూభాగంతో కీస్ ద్వీపాలు అనుసంధానం అయ్యాయి" అని ఫ్లోరిడా కీస్ చరిత్రకారుడు, రచయిత డాక్టర్ కోరి కన్వర్టిటో చెప్పారు.

వీడియో క్యాప్షన్, సముద్రంలో 182 కిలోమీటర్ల తేలియాడే రోడ్డు..

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)