తాడిపత్రి గ్రౌండ్ రిపోర్ట్: పోలింగ్ హింసకు ముందు, తర్వాత జరిగిన పరిణామాలు ఏంటి?

- రచయిత, బళ్ల సతీష్
- హోదా, బీబీసీ ప్రతినిధి
పోలింగ్ రోజున అనంతపురం జిల్లా తాడిపత్రిలో జరిగిన హింస సంచలనం సృష్టించింది. రెండు వర్గాల మధ్య పోరుతో యుద్ధ వాతావరణాన్ని చూసింది తాడిపత్రి.
పోలీసులకు కూడా ఆందోళనలు అదుపు చేయడం తలకు మించిన పని అయింది. అల్లర్లు సద్దుమణిగినా ఇంకా ఆ ప్రాంతం పోలీసు అదుపులోనే ఉంది.
రాయలసీమలో దాదాపు ఫ్యాక్షన్ గొడవలు తగ్గాయి. అల్లర్లు కూడా బాగా తగ్గాయి. కానీ తాడిపత్రిలో మాత్రం ఎన్నికలంటే ఘర్షణ వాతావరణం పోవడం లేదు. ఎందుకు తాడిపత్రి లాంటి కొన్ని ప్రాంతాల్లోనే ఈ పరిస్థితి కనిపిస్తోంది?
అసలు తాడిపత్రిలో ఏం జరిగింది?
అనంతపురం జిల్లా తాడిపత్రి ఎమ్మెల్యే వైయస్సార్సీపీ నుంచి కేతిరెడ్డి పెద్దారెడ్డి. మునిసిపల్ చైర్మన్ టీడీపీ నుంచి జేసీ ప్రభాకర రెడ్డి.
పెద్దారెడ్డి-ప్రభాకర రెడ్డి మధ్య వైరం ఈనాటిది కాదు. తెలుగునేల అంతటికీ తెలిసిన ఫ్యాక్షన్ వైరం అది. పోలింగ్ రోజు మరోసారి బయటపడింది. ఇరువైపులా నాయకుల అనుచరులు విధ్వంసానికి పాల్పడ్డారు.
కార్లు ధ్వంసం చేయడం, బైకు ర్యాలీతో హడావుడి చేయడం, ఏజెంట్లపై చేయి చేసుకోవడం, రాళ్లు విసరడం, బీఎస్ఎఫ్ కానిస్టేబుల్ తలకు గాయం, స్వయంగా జిల్లా ఎస్పీ రాళ్ల దాడి నుంచి తనను తాను కాపాడుకోవాల్సి రావడం...ఇలా పోలింగ్ రోజంతా ఉద్రిక్తంగా గడిచింది.
పోలీసులు అదుపు చేయలేకపోయారు. పోలీసులు పక్షపాతంతో వ్యవహరించారని రెండు పక్షాలూ ఆరోపణలు చేశాయి.
ఇక పోలింగ్ తర్వాతి రోజు తమ పార్టీ తరపున ఏజెంటుగా ఉన్న ఒక వ్యక్తిపై టీడీపీ దాడి చేసిందని వైయస్సార్సీపీ ఆరోపించింది.
టీడీపీకి చెందిన ఒక కార్యకర్త ఇంటికి వైయస్సార్సీపీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి వెళ్లడం ఘర్షణ వాతావరణాన్ని పెంచింది. అక్కడే రాళ్ల దాడి కూడా జరిగింది.
దానికి నిరనసగా, ఆ కార్యకర్త ఇంటికి టీడీపీ నాయకుడు ప్రభాకర రెడ్డి వెళ్లడం, అలాగే పెద్దారెడ్డిపై చర్యలు తీసుకోవాలంటూ వందలాది టీడీపీ కార్యకర్తలు గాంధీ విగ్రహం దగ్గర ధర్నా చేయడంతో వాతావరణం మరింత వేడెక్కింది.
వారిని అదుపు చేయడానికి పోలీసులు బాష్ప వాయువు ప్రయోగించారు. ఆ తర్వాత ప్రభాకర రెడ్డి అనారోగ్యం పాలై హైదరాబాద్ లో ఆసుపత్రిలో చేరారు.
తరువాత సీన్ పెద్దారెడ్డి ఇంటి దగ్గరలోని కాలేజీ గ్రౌండుకు మారింది. ఆ గ్రౌండ్ వేదికగా రెండు పక్షాల వాళ్లూ జెండాలు ఊపుతూ, పరస్పరం రాళ్ల వర్షం కురిపించుకున్నారు.
రాళ్లే కాకుండా దీపావళి టపాసులలో షాట్స్ గా పిలిచే టపాసులను పెద్ద ఎత్తున ఒకరిపై ఒకరు విసురుకున్నారు.
పెద్దారెడ్డి ఇంటి పై నుంచి వైయస్సార్సీపీ జెండా, ఎదురుగా ఉన్న కాలేజీ భవనంపై తెలుగుదేశం జెండాలు ఊపుతూ పోటీ పడ్డారు.
ఒకరిపై ఒకరు విసురుకుంటూ అప్పుడు కాల్చిన దీపావళి షాట్స్ తరహా క్రాకర్స్ తాడిపత్రిలో భయంగొలిపే శబ్దాలతోపాటు, మిరుమిట్లు గొలిపే వెలుగులకు కారణమయ్యాయి.
ఆ పరస్పర దాడులు దాదాపు 4 గంటల పాటూ సాగాయి. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన పోలీసులు ఎంతో శ్రమించి వాటిని అదుపు చేశారు.
ఆ క్రమంలో పోలీసులకు కూడా చాలా గాయాలయ్యాయి. కొందరికి తలలు పగిలాయి.
ఇదంతా 14వ తేదీ రాత్రికి కాస్త సద్దుమణిగింది.
‘‘పోలింగ్ జరుగుతున్నప్పటి నుంచీ పెద్దారెడ్డి దౌర్జన్యం చేస్తూనే ఉన్నారు. ఆ రకంగా పోలింగ్ తగ్గిస్తే టీడీపీ ఓడిపోతుందని ఆయన ప్లాన్. జేసీ దాన్ని అడ్డుకున్నారు. కానీ పోలీసులు పెద్దారెడ్డికే వత్తాసు పలికారు. మాకు రక్షణ ఇవ్వలేదు. పెద్దారెడ్డి టీడీపీ కార్యకర్తను బెదిరించడానికి వెళ్తే, ఆ కార్యకర్తకు అండగా ఉండటానికి జేసీ వెళ్లాడు. ప్రభాకర రెడ్డి ఇంటి మీదకు పెద్దారెడ్డి గూండాలు వస్తే, ఆత్మరక్షణ కోసమే టీడీపీ వారు అక్కడకు చేరుకున్నారు. అలా ఇళ్ళ మీదకు రావడం వైయస్సార్సీపీ వారికి కొత్త కాదు. గతంలో పెద్దారెడ్డి ఇలాగే ప్రభాకర రెడ్డి ఇంట్లోకి వచ్చి కూర్చున్నాడు.’’ అని అనంతపురం జిల్లా తెలుగుదేశం అధ్యక్షుడు జి.వెంకట శివుడు యాదవ్ బీబీసీతో అన్నారు
అసలు ఆ రోజు గొడవకు టీడీపీ వారే బాధ్యులంటున్నారు వైయస్సార్సీపీ నాయకులు.
‘‘ఈసీని కూడా ఎన్డీయే వారు తమ చేతుల్లోకి తీసుకుని నడిపించారు. వారి కుట్రలు, దురాలోచనల ఫలితమే తాడిపత్రి గొడవలు. పోలీసులను హడావుడిగా ఎన్నికల సమయంలో మార్చి, అవగాహన లేని వారిని తెచ్చి గొడవలకు కారణం అయ్యారు. సమస్యాత్మక ప్రాంతాలు ఏవో ముందు తెలిసినా అక్కడ సరైన భద్రత కల్పించలేక పోయారు. పెద్దారెడ్డి కారును ధ్వంసం చేశారు. 2019కి ముందు అనంతపురంలో ఫ్యాక్షన్ భయంకరంగా ఉండేది. విపరీతంగా హత్యా రాజకీయాలు జరిగాయి. కానీ ఈ ఐదేళ్లలో అలా ఏమీ జరగలేదు. జిల్లాలో ప్రశాంత వాతావరణాన్ని తెలుగుదేశం దెబ్బతీయాలని చూస్తోంది.’’ అని అనంతపురం నగర మాజీ మేయర్, వైయస్సార్సీపీ రీజినల్ ఉప కోఆర్డినేటర్ రాగే పరశురాం బీబీసీతో అన్నారు .

నాయకుల ఇళ్ళపై పోలీసుల దాడులు
మళ్లీ 14 అర్థరాత్రి మరోసారి ఉద్రిక్తత ఏర్పడింది. రాజంపేట డీఎస్పీ చైతన్య ఆ రాత్రి తాడిపత్రి వచ్చారు.
ఆయన గతంలో తాడిపత్రి డీఎస్పీగా పనిచేశారు. చైతన్య తన సిబ్బందితో కలసి జేసీ ప్రభాకర రెడ్డి ఇంటికి వెళ్లి విచక్షణా రహితంగా పలువురిని కొట్టారని టీడీపీ వారు ఆరోపించారు.
ఆ ఇంట్లో పనిచేసే వారు సహా అక్కడ ఉన్న వారందర్నీ అదుపులోకి తీసుకున్నారని వారు అంటున్నారు.
ప్రభాకర రెడ్డి దగ్గర పనిచేసే దాసరి కిరణ్ అనే ఉద్యోగి తలకు గాయం అయింది.
చైతన్యకు ప్రభాకర రెడ్డికీ మధ్య ముందు నుంచి మనస్పర్థలున్నాయనీ, ఆయన తాడిపత్రి డీఎస్పీగా ఉన్నప్పుడు పెద్దారెడ్డికి సహకరించారనీ, ప్రతిగా ప్రభాకర రెడ్డి ఆయనపై పలు ప్రైవేటు కేసులు పెట్టించారని కొందరు స్థానికులు, జేసీ మద్దతుదారులు బీబీసీతో చెప్పారు.
‘‘ఆ రోజు రాత్రి చైతన్య గారు పిలుస్తున్నారు అని కొందరు పిలిచారు. బయటకు రాగానే అక్కడ డీఎస్పీ చైతన్య సార్ ఉన్నారు. ఆయన గతంలో తాడిపత్రి డీఎస్పీగా చేశారు. జేసీ ప్రభాకర రెడ్డి గారి ఇంట్లో పనిచేసే వాళ్లంతా ఆయనకు తెలుసు. ఆయన నన్ను చూసి ఈ నా కొడుకుని ఎత్తి లోపలేయండి అన్నారు. నన్ను కొట్టి బస్సులో వేసారు. తలకు గాయం అయింది. నా చేతికి గతంలోనే గాయం అయింది. నేను రాళ్లు కూడా వేయలేను. అలాంటి నన్ను కొట్టడానికి కారణం ఏముంది?’’ అని బీబీసీతో అన్నారు దాసరి కిరణ్.
అయితే తనపై వచ్చిన ఈ ఆరోపణలపై రాజంపేట డీఎస్పీ చైతన్య బీబీసీతో మాట్లాడారు.
‘‘నేను ఎవర్నీ కొట్టలేదు. ఎవరి ఇంటిపైనా దాడికి వెళ్లలేదు. ఉన్నతాధికారులు పిలిస్తేనే తాడిపత్రి వెళ్లాను. వివిధ దాడుల ఘటనల్లో పాల్గొన్న వారిని వీడియోల ద్వారా గుర్తించేందుకు నన్ను పిలిచారు. నాకు ఎవర్నీ కొట్టాల్సిన అవసరం లేదు. ఏ పోలీసు అధికారీ తన పరిధి కాని చోట ఎటువంటి చర్యలూ తీసుకోలేరు. నేను అక్కడ ఘటనల్లో పాల్గొన్న వారిని గుర్తిస్తే ఇబ్బంది పడతామనుకున్న కొందరు కావాలని నాపై ఆరోపణలు చేస్తున్నారు’’ అని ఆయన బీబీసీతో అన్నారు.
ప్రభాకర రెడ్డి ఇంటిపై పోలీసులు దాడి చేయడాన్ని తెలుగుదేశం తప్పు పట్టింది.
‘‘అసలు డీఎస్పీ చైతన్యను ఎవరు పంపించారు తాడిపత్రికి? జేసీ ఇంటి మీద ఎందుకు దాడి చేశారు? పెద్దారెడ్డి ఇంట్లో బయటి ఊళ్ళ వారు ఎందుకు ఉన్నారు? అంటే ఇదంతా ప్రణాళిక ప్రకారమే జరిగిందని స్పష్టంగా తెలుస్తుంది.’’ అన్నారు వెంకట శివుడు యాదవ్.
అదే సమయంలో అదనపు ఎస్పీ రామకృష్ణ ఆధ్వర్యంలో పోలీసులు పెద్దారెడ్డి ఇంటి మీదకు వెళ్లారని, అక్కడ తలుపులు పగలగొట్టి హడావుడి చేశారని వైయస్సార్సీపీ నాయకులు ఆరోపించారు. ఆయన ఇంట్లో సీసీ కెమెరాలు ధ్వంసం చేస్తున్న దృశ్యాలు అయితే బయటపడ్డాయి.
ధర్మవరం ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డి తన చిన్నాన్న అయిన పెద్దారెడ్డి ఇంటికి కొందరు మనుషులతో వచ్చినట్టు స్థానికులు చెపుతున్నారు.
పెద్దారెడ్డి ఇంటి మీదకు పోలీసులు వెళ్లడాన్ని వైయస్సార్సీపీ తప్పు పట్టింది.
‘‘పోలీసులు పెద్దారెడ్డి ఇంటిపై స్వైర విహారం చేశారు. ఆ దృశ్యాలను రాష్ట్రమంతా చూసింది. ఇవన్నీ చూస్తే ఎన్నికల యంత్రాంగాన్ని కూటమి తన చెప్పు చేతల్లోకి తీసుకుందని తెలుస్తోంది.’’ అని రాగే పరశురాం ఆరోపించారు.
ఆరోజు రాత్రి పోలీసు అధికారులు అర్థరాత్రులు వీళ్ల ఇంటికి వెళ్లి సీసీ కెమెరాలు ఎందుకు ధ్వంసం చేశారు? అసలు ప్రభాకర రెడ్డి ఇంటికి డీఎస్పీ, పెద్దారెడ్డి ఇంటికి ఏఎస్పీ వెళ్లడం వెనుక వారి వ్యూహం ఏమిటన్నది అర్ధంకాని పరిస్థితి.
మొత్తానికి తాడిపత్రి డీఎస్పీ, సీఐలతో పాటూ అనంతపురం జిల్లా ఎస్పీని సస్పెండ్ చేసింది ఎన్నికల సంఘం. ఆ మరునాడు 15-16 తేదీల్లో పెద్ద ఎత్తున ఇరువైపులా కార్యకర్తలను అరెస్టులు చేశారు. దాదాపు 91 మందిని అరెస్టు చేసి జైల్లో పెట్టారు.
అరెస్టయిన వారిలో 34 మంది వైయస్సార్సీపీ, 57 మంది తెలుగుదేశం వారున్నారు. పెద్ద సంఖ్యలో నాయకులు అజ్ఞాతంలోకి వెళ్లారు.
తెలుగుదేశం వారిని ఒక జైల్లో, వైయస్సార్సీపీ వారిని మరో జైల్లో పెట్టారు. వారందరి మీద హత్యాయత్నం సహా పలు కేసులు నమోదు చేశారు.
తాడిపత్రిలో ఎన్నికల హింస, ఘర్షణల పై టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి, వైసీపీ నేత కేతిరెడ్డి పెద్దారెడ్డిని సంప్రదించడానికి బీబీసీ గత మూడు రోజులుగా ప్రయత్నించింది. కానీ వారు అందుబాటులోకి రాలేదు. వారి అనుచరులు మాత్రమే మాట్లాడారు.
తాడిపత్రిలోనే ఎందుకు?
తాడిపత్రిలో గ్రానైట్ లాంటి వనరులున్నాయి. హైవే పక్కన ఉంటుంది. వనరులమీద ఆధిపత్య పోరు ఉంది. ఎప్పటినుంచో సాగుతున్న ఫ్యాక్షన్ గొడవలు ఇంకా కంటిన్యూ అవుతున్న ప్రాంతం ఇది.
నాయకుల ఆధిపత్య పోరుకు ఈ ప్రాంతం బలి అయిపోతూనే ఉందని, గతంతో పోలిస్తే హత్యలు బాగా తగ్గాయని స్థానికంగా పని చేస్తున్న హక్కుల కార్యకర్తలు చెబుతున్నారు.
ఆర్థిక వనరుల మీద ఆధిపత్యం, పట్టణంపై పెత్తనం కోసం పోరు జరుగుతూనే ఉందని అంటున్నారు.
‘‘మొత్తం రాయలసీమలో మునిసిపల్ చైర్మన్, ఎమ్మెల్యే వేర్వేరు పార్టీగా ఉన్న సందర్భం ఇంకెక్కడా లేదు. అక్కడ రెండు పవర్ సెంటర్లు ఉన్నాయి. ఇద్దరి మధ్యా పెత్తనం కోసం పోరు నడుస్తోంది. నాలుగేళ్లుగా అక్కడ ఉద్రిక్తత ఉంటూనే ఉంది. అనంతపురం జిల్లాలోనే ఇది ధనవంతమైన ప్రాంతం కావడంతో అక్కడి వనరులు వ్యాపారాలపై పెత్తనం కోసం పోటీ అది. కేబుల్, లారీ, ఆటో.. ఇలా ప్రతీ రంగం మీదా వారి పెత్తనం ఉంటుంది.’’ అని బీబీసీతో అన్నారు అనంతపురానికి చెందిన మానవ హక్కుల వేదిక నాయకుడు ఎ.చంద్రశేఖర్.
తాడిపత్రి పట్టణం, పరిసర గ్రామాల మీద ఎప్పటి నుంచో జేసీ ప్రభాకర రెడ్డి కుటుంబానికి ఆధిపత్యం ఉంది. అప్పట్లో పరిటాల రవి, ఆ తరువాత కాలంలో కేతిరెడ్డి సూర్యానారాయణ రెడ్డి వారికి వ్యతిరేకంగా పనిచేశారు.
కేతిరెడ్డి సూర్యనారాయణ రెడ్డి కుమారుడే ప్రస్తుత ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి. సూర్యనారాయణ రెడ్డి తమ్ముడు కేతిరెడ్డి పెద్దారెడ్డి.
రాష్ట్ర విభజన తరువాత ముందుగా వైయస్సార్సీపీలోకి వెళతారనుకున్న జేసీ కుటుంబం తెలుగుదేశం పార్టీలో చేరింది. కేతిరెడ్డి కుటుంబం వైయస్సార్సీపీలోకి వెళ్లింది.
మునిసిపల్ ఎన్నికల కంటే ముందు, తాడిపత్రిలో జరిగిన ఘర్షణలో భాగంగా, జేసీ ప్రభాకర రెడ్డి ఇంటిలోకి కేతిరెడ్డి పెద్దారెడ్డి వెళ్లడం అప్పట్లో ఒక సంచలనం. నాడు ప్రభాకర రెడ్డి కుర్చీలో పెద్దారెడ్డి కూర్చున్న ఫోటోలు వీడియోలు బయటకు వచ్చాయి.
ఆ తరువాత మునిసిపల్ ఎన్నికల్లో రాష్ట్రమంతా తెలుగుదేశం దెబ్బతిని, కొన్నిచోట్ల పోటీ కూడా చేయలేని పరిస్థితి ఏర్పడినా, తాడిపత్రిలో మాత్రం అత్యంత ఘర్షణపూరిత వాతావరణంలో ఆ మునిసిపాలిటీని టీడీపీ కైవసం చేసుకుంది.
ఆ మునిసిపల్ ఎన్నిక కోసం పెద్దారెడ్డి-ప్రభాకర రెడ్డి గ్రూపుల మధ్య తీవ్ర పోటీ జరిగింది. ఇలా తాడిపత్రిలో నిరంతర ఘర్షణ వాతావరణం ఉంటూనే వచ్చింది.
‘‘మా తాడిపత్రిలో మాత్రం 2004 నుంచి దాదాపు ప్రతి ఎన్నికల్లో గొడవలు జరుగుతూనే ఉన్నాయి. 2019లో ఒకరు చనిపోయారు కూడా. వాస్తవానికి రెండవ, మూడవ స్థాయి నాయకులు, కార్యకర్తలు ఫ్యాక్షన్ అంటే భయపడుతున్నారు. కానీ పెద్ద నాయకులు వారిని ఊరక ఉండనివ్వరు. రాజకీయాలు వదిలేసిన వారిని కూడా కేసుల్లో ఇరికిస్తారు. చిన్న వ్యాపారాలు కూడా చేసుకోనివ్వరు. తన పర తేడా లేదు ఈ విషయంలో. కావాలని కేసుల్లో ఇరికిస్తారు. ఎన్నికల వేళ జరిగే గొడవల్లో ఎఫ్ఐఆర్ రాసినప్పుడు కొన్ని పేర్లు రాసి కింద ‘‘అండ్ అదర్స్ – ఇంకా ఇతరులు’’ అనే మాట పెట్టి, తరువాత ఏ పార్టీ వస్తే అవతలి పార్టీ వారిని ఆ అదర్స్ కింద ఇరికిస్తారు. దీంతో అనివార్యంగా ఎటో ఒకవైపు ఉండాల్సిన పరిస్థితి.’’ అని బీబీసీతో చెప్పారు తాడిపత్రికి చెందిన ఒక పార్టీ స్థానిక నాయకుడు.
తన వ్యాపారం సాగడం కోసం ఆయన ఒక రాజకీయ పార్టీలో సభ్యుడిగా ఉన్నానని, అయిష్టంగానే రాజకీయాల్లో తిరుగుతున్నానని ఆయన చెప్పారు.
‘‘గతంలో రాజకీయాల్లో చాలా చురుగ్గా తిరిగాను. ఎన్నో కేసులు పెట్టారు. అన్నీ కోల్పోయి రాజకీయాలు వదిలేసుకుందామన్నా, వదులుకోనివ్వరు. ఎలాగోలా ఇబ్బంది పెడతారు. అందుకే పార్టీల్లో ఉండడం, నాయకుల వెనుక ఉండడం తప్పనిసరి ఇక్కడ.’’ అని అన్నారాయన.

బాంబుల బదులు బాణాసంచా – సీమ మారుతోందా?
ఒకప్పుడు రాయలసీమలో ఎన్నికలు అంటే చావులకు ముహూర్తాలుగా ఉండేవని చెబుతారు స్థానిక విశ్లేషకులు.
ఎన్నికల ముందు, తరువాత వరుసగా మరణాలు సంభవించేవి. ఫ్యాక్షన్ కొట్లాటల్లో ప్రాణాలు పోయేవి. 2019లో కూడా తాడిపత్రిలో ఒకరు చనిపోయారు.
కానీ ఇప్పుడు ఆ పరిస్థితి చాలా వరకూ తగ్గింది. ప్రాణాల తీసే ఆయుధాల వాడకం తగ్గిందని వారు చెబుతున్నారు. బాంబుల స్థానంలో రాళ్ళు మాత్రమే కనిపిస్తున్నాయి.
తాడిపత్రిలో ఫ్యాక్షన్ ఇంకా కనిపిస్తున్నా, అక్కడ కూడా వచ్చిన ఒక పెద్ద మార్పు బాంబులు, తుపాకుల జాడ తగ్గిపోవడం.
‘‘తాడిపత్రిలో రెండు రోజులు అంత ఘర్షణ జరిగితే ఒక్క బాంబూ పడలేదు. గతంలో మేము స్వయంగా నాయకుల ఇళ్ళ దగ్గర బాంబులు చుట్టడాన్ని చూశాము. బాంబులు వేయడం సాధారణంగా జరిగేది. కానీ ఈసారి కేవలం దీపావళి బాణాసంచా ఒకరిపై ఒకరు వేసుకున్నారు తప్ప బాంబులు వేయలేదు. దాని వల్ల ప్రాణ నష్టం జరగలేదు.’’ అంటూ బీబీసీతో అన్నారు చంద్రశేఖర్.
‘‘ఒకప్పటిలా హత్యలు లేవు. చంపడం తగ్గింది. ఆ పెద్ద నాయకుడు చెప్పగానే ముందూ వెనుకా చూడకుండా చంపేసి వచ్చే అనుచరులు ఇప్పుడు లేరు. మాకేంటి అనే ఆలోచన పెరిగింది. ఒకప్పుడు అది లేదు. దెబ్బతిన్న కుటుంబాలు, చిన్న వయసులో వితంతులైన స్త్రీలను చూశాక పరిస్థితులు మారాయి. దానికితోడు పండ్ల తోటలు, హార్టికల్చర్ అభివృద్ధి కూడా పెరిగింది.’’ అన్నారు చంద్రశేఖర్.
అయితే ఈ మధ్య నాయకుల వెనుక తిరిగే కుర్రాళ్ళ గురించి ఒక ఆసక్తికర విషయం చెప్పారు అనంతపురానికి చెందిన ఒక పార్టీ నాయకుడు.
‘‘గతంతో పోలిస్తే కార్యకర్తలు గొడవలకు రావడం తగ్గింది. వారు కూడా పిల్లల చదువులు, తమ సంపాదన ముఖ్యం అనుకుంటున్నారు. దీంతో కొన్నిసార్లు పక్క ఊళ్ళ నుంచి జనాల్ని తీసుకువస్తున్నారు. కొందరు నాయకులు అయితే ఖాళీగా ఉండే కుర్రాళ్ళకు డబ్బు ఇచ్చి పోషిస్తున్నారు. డబ్బులు ఇస్తూ, బిర్యానీలు పెడుతున్న నాయకుల వెంట తిరిగితే వచ్చే ఇమేజీకి ఆ కుర్రాళ్ళు అలవాటు పడుతున్నారు. ఇప్పుడు తాడిపత్రిలో ఒక నాయకుడి దగ్గర ఇదే పరిస్థితి ఉంది.’’ అని బీబీసీతో చెప్పారాయన.
తాడిపత్రే కాదు. దాదాపు రాయలసీమ మొత్తం స్థూలంగా హత్యలు తగ్గాయనీ, ఆర్థిక వనరుల మీద ఆధిపత్యం కోసం, దాంతో పాటూ ఫ్యూడల్ తరహా పేరు ప్రఖ్యాతుల కోసం మాత్రమే ఇప్పుడు పోరాటం నడుస్తోందని చెబుతున్నారు విశ్లేషకులు.
తమ ప్రమేయం, తమ వాటా లేకుండా ఆర్థిక విస్తరణ జరగకుండా చూడడమే ఇక్కడి నాయకుల లక్ష్యం అంటున్నారు విశ్లేషకులు.

హోదా కోసం పోటీ పడుతోన్న యువతరం
సీమలో ఆధిపత్యం ఇప్పటికీ కొన్ని కుటుంబాల చేతుల్లోనే ఉంది. ఆ కుటుంబాల మధ్యే ఆర్థిక, రాజకీయ వ్యవహారాలు తిరుగుతాయి. వైయస్, జేసీ, భూమా, పరిటాల కుటుంబాలలాంటివి ఇందులో ప్రధానంగా కనిపిస్తాయి.
కాంగ్రెస్ మాత్రమే ఉన్నప్పుడు వారు కాంగ్రెస్ లో రెండు గ్రూపులుగా ఉండేవారు. తెలుగు దేశం పార్టీ ఏర్పడిన తర్వాత ఒక గ్రూపు కాంగ్రెస్ లో ఉంటే, రెండో గ్రూపు తెలుగుదేశంలో చేరింది.
ఇప్పుడు వైయస్సార్సీపీలో ఒక గ్రూపు ఉంటే, తెలుగుదేశంలో మరో గ్రూపు ఉంటోంది. వారి వారసులు కూడా ఇప్పుడు రాజకీయాల్లో ఉన్నారు.
వీరి పూర్వీకులు ఫ్యాక్షనిస్టులే అయినా ఈ తరం నాయకులు స్థానికంగా ఉండకుండా పెద్ద నగరాలలో కాపురం ఉంటూ, స్థానికంగా కథ నడిపిస్తున్నారు.
‘‘ఒకప్పటి ఫ్యాక్షన్ కుటుంబాల వారు ఎక్కువగా హైదరాబాద్, బెంగళూరుల్లో స్థిరపడ్డారు. వారిలో చాలా మంది అక్కడే ఉంటూ సీమకు వచ్చిపోతున్నారు. కానీ సీమలోని తమ ప్రాంతంపై పట్టు వదులుకోవడానికి వారు సిద్ధంగా లేరు. వారికి హైదరాబాద్ లో ఉండే ఆస్తితో పోలిస్తే తమ సొంత ప్రాంతంలో ఉండే ఆస్తి చాలా తక్కువ. ఈ యువతరం హైదరాబాద్ నుంచే ఆపరేట్ చేస్తారు. అవసరం ఉన్నప్పుడు ఇక్కడకు వస్తారు. వారికి ఇక్కడ పట్టు ఉండడం ముఖ్యం. ఇక్కడ వారికి వచ్చే గుర్తింపు ముఖ్యం. ఒక ఫ్యూడల్ గుర్తింపు అది. హైదరాబాద్ లో వందల మంది కోటీశ్వరులు ఉంటారు. కానీ ఇక్కడకు వస్తే వారు ఒక దొరలా, రాజులా ఫీల్ అవుతారు. దాన్ని వదులుకోవడానికి ఫ్యాక్షన్ కుటుంబాల యువతరం సిద్ధంగా లేదు.’’ అన్నారు చంద్రశేఖర్.

పోలీసుల వైఫల్యం వెనుక..!
తెలుగుదేశం నాయకులు, వైయస్సార్సీపీ నాయకులే కాదు. మానవ హక్కుల వేదిక నాయకులు కూడా బీబీసీతో చెప్పిన మాట, ఈ మొత్తం వ్యవహారంలో పోలీసుల తప్పు ప్రధానంగా ఉందని.
తాడిపత్రిలో సమస్య వస్తుందని ముందే గుర్తించి తగిన బలగాన్ని పెట్టుకోకపోవడం, అనుమానితులను ముందుగా కట్టడి చేయకపోవడం, పోలీసు ఉన్నతాధికారులను అకస్మాత్తుగా మార్చడం, ఇవన్నీ ఇక్కడ పోలీసుల వైఫల్యానికి కారణాలుగా వారు ఆరోపిస్తున్నారు.
దీనిపై బీబీసీ అనంతపురం జిల్లా పోలీసు కార్యాలయాన్నీ, డీఐజీనీ ఫోన్ ద్వారా రెండుసార్లు సంప్రదించింది. రెండు రోజులకు పైగా వారి స్పందన కోసం బీబీసి ఎదురుచూసింది. వారింకా స్పందించాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి:
- పాంబన్-ధనుష్కోడి: 130 మంది ప్రయాణిస్తున్న రైలు సముద్రంలో ఎలా మునిగిపోయింది?
- SRHvsRR: హైదరాబాద్ చేజారిందనుకున్న మ్యాచ్ ఎలా మలుపు తిరిగింది?
- తొమ్మిది నెలల చిన్నారి హత్య కేసు, తీర్పు చెప్తూ కన్నీళ్లు పెట్టుకున్న న్యాయమూర్తులు
- సుభాష్ చంద్రబోస్ 'ద గ్రేట్ ఎస్కేప్': బ్రిటిష్ వాళ్ల కళ్లుగప్పి నేతాజీ దేశం ఎలా దాటారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















