ఆంధ్రప్రదేశ్: మాచర్లలో ఈవీఎం ధ్వంసం, ఆ రోజు ఏం జరిగింది?

పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి ఫోటో
ఫొటో క్యాప్షన్, పోలింగ్ కేంద్ర వద్ద పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి
    • రచయిత, శంకర్ వడిశెట్టి
    • హోదా, బీబీసీ కోసం

ఆంధ్రప్రదేశ్‌లో మే 13న పోలింగ్ జరిగిన రోజు 9 చోట్ల ఈవీఎంలను ధ్వంసం చేశారని ఆంధ్రప్రదేశ్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ముకేశ్ కుమార్ మీనా తెలిపారు. ఇందులో ఒక్క మాచర్లలోనే 7 చోట్ల ఈవీఎంలు ధ్వంసం అయ్యాయని వెల్లడించారు.

ఎన్నికల సందర్భంగా పోలింగ్ రోజు, ఆ మరుసటి రోజు (మే14)న మాచర్ల నియోజకవర్గంలో హింస చెలరేగింది. రెంటచింతల మండలంలోని పాలువాయి రైల్వేగేటు పోలింగ్ కేంద్రంలో అందరూ చూస్తుండగానే ఈవీఎంను పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి ధ్వంసం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో తాజాగా బయటకు వచ్చింది.

‘‘ఈ నెల 20వ తేదీన రెంటచింతల సబ్‌ఇన్‌స్పెక్టర్ కోర్టుకు మెమో సమర్పించారు. అందులో పి.రామకృష్ణా రెడ్డిని ఏ1గా పేర్కొన్నారు. తొలుత గుర్తు తెలియని వ్యక్తులుగా కేసును నమోదు చేశారు. ఆ తరువాత విచారణలో వీడియోలను పరిశీలించాక ఆయన పేరు చేర్చారు. మొత్తం 10 సెక్షన్ల కింద కేసు పెట్టారు. నిన్న (మంగళవారం) వీడియో (ఈవీఎం ధ్వంసం) కూడా బయటకు వచ్చింది. ఈ కేసులో ఆయనకు ఏడేళ్ల వరకు శిక్ష పడే అవకాశం ఉంది’’ అని మీడియా సమావేశంలో ముకేశ్ కుమార్ మీనా తెలిపారు.

పాలువాయి రైల్వేగేట్ పోలింగ్ కేంద్రం
ఫొటో క్యాప్షన్, పాలువాయి రైల్వేగేటు పోలింగ్ బూత్ వద్ద వివరాల ప్రదర్శన

ఏం జరిగింది?

పాలువాయి రైల్వేగేటు బూత్ వద్ద వైసీపీ, టీడీపీ ఏజెంట్ల మధ్య వివాదం చెలరేగింది. తర్వాత పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తన అనుచరులతో అక్కడికి వచ్చారు. అప్పుడు సమయం దాదాపు మధ్యాహ్నం 12.30 గంటలు అవుతోంది. మీడియా సహా అందరూ చూస్తుండగానే పిన్నెల్లి పోలింగ్ బూత్‌లోకి వెళ్లారు.

ఆయన నేరుగా ఈవీఎం మెషిన్ వద్దకు వెళ్లి దాన్ని నేలకేసి కొట్టారు. ఆ తర్వాత వీవీ పాట్‌ను కూడా ధ్వంసం చేశారు. ఈ దృశ్యాలు సీసీటీవీ వీడియోలో రికార్డు అయ్యాయి. పిన్నెల్లి బయటకు వచ్చిన తరువాత టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.

ఎమ్మెల్యే మీద దాడికి టీడీపీ వాళ్లు ప్రయత్నించారు. ఎమ్మెల్యే అనుచరులు కూడా కర్రలతో దాడికి దిగారు. రెండు వర్గాలు రాళ్లు రువ్వుకున్నాయి. ఈ ఘర్షణలో పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి కుమారుడు గౌతమ్ గాయపడ్డారు.

పిన్నెల్లి ఈవీఎంని ధ్వంసం చేయడంతో ఇక్కడ చాలా సేపు పోలింగ్ నిలిచిపోయింది.

ఈవీఎంని సరిచేసి తిరిగి సాయంత్రం 5 గం.ల సమయంలో పోలింగ్ పునరుద్ధరించారు. దాదాపు 4 గంటల పాటు ఆ బూత్‌లో పోలింగ్‌కు అవకాశం లేకుండా పోయింది. ఎన్నికల అధికారులకు అందించిన సమాచారంతో సిబ్బందిని పంపించి తిరిగి ఈవీఎం, వీవీ ప్యాట్ సిద్ధం చేసిన తర్వాత పోలింగ్ ప్రక్రియ పునరుద్దరించగలిగారు.

సాయంత్రం పోలింగ్ మళ్లీ మొదలైన తర్వాత కూడా కొంత ఉద్రికత్త చెలరేగినప్పటికీ చివరకు నిర్దిష్ట గడువులో పోలింగ్ ప్రక్రియ ముగించినట్టు సిబ్బంది తెలిపారు.

పాలువాయి గేటుతో పాటుగా మాచర్ల నియోజకవర్గం పరిధిలో కొద్డిసేపు పోలింగ్ నిలిచిపోయిన ప్రతిబూత్‌లోనూ రీ పోలింగ్ జరపాలని విపక్ష కూటమి నేతలు డిమాండ్ చేశారు. కానీ, ఈసీ అందుకు నిరాకరించింది.

పోలింగ్ బూత్ 202
ఫొటో క్యాప్షన్, పోలింగ్ బూత్ 202

పల్నాడులో హింసాత్మక ఘటనలు

పల్నాడు ప్రాంతంలో పోలింగ్ రోజు, ఆ మరుసటి రోజున హింసాత్మక ఘటనలు చెలరేగాయి. ఏజెంట్ల తలలు పగల కొట్టడం, దాడులు, వాహనాలకు నిప్పు పెట్టడం, రాళ్లు విసురుకోవడం వంటి ఘటనలు జరిగాయి. కొన్ని చోట్ల ఓటింగ్ యంత్రాలను ధ్వంసం చేశారు.

ఈ హింస తర్వాత పల్నాడు జిల్లా ఎస్పీ, కలెక్టర్ల‌ను ఎన్నికల సంఘం సస్పెండ్ చేసింది. ఇతర కింది స్థాయి అధికారుల మీద చర్యలు తీసుకుంది. ఆ తరువాత ప్రత్యేక విచారణ బృందం (సిట్) పల్నాడు ప్రాంతంలో పర్యటించి నివేదిక రూపొందించింది. పల్నాడు జిల్లాలోని 22 కేసులకు సంబంధించిన విషయాలను అందులో పేర్కొంది.

"ఎన్నికల నిబంధనావాళి ప్రకారం ఎన్నికల ప్రక్రియ ఏ దశలో ఆటంకం కలిగించినా ఒకటే శిక్ష. ఈవీఎంలు ధ్వంసం చేయడం వంటి తీవ్ర చర్యలకు పాల్పడినవారిపై క్రిమినల్ చర్యలకు ఆస్కారముంది. ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేసినందుకు చట్ట ప్రకారం చర్యలుంటాయి" అని మాజీ రిటర్నింగ్ అధికారి ఆర్. రత్నాకర్ చెప్పారు.

నిబంధనలేం చెబుతున్నాయి?

ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం పోలింగ్ ప్రక్రియకు ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలకు ఆస్కారముంది.

ఎవరైనా ఈవీఎం/బ్యాలెట్ బ్యాక్సులను ధ్వంసం చేస్తే ప్రజా ప్రాతినిధ్య చట్టం 134బీ ప్రకారం చర్యలు తీసుకునే అధికారం ప్రిసైడింగ్ అధికారికి ఉంది. బాధ్యుడిని అరెస్ట్ చేసేందుకు ఆదేశాలు ఇవ్వొచ్చు. దాని ప్రకారం నిందితుడికి ఏడాది జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండూ విధిస్తారు.

ఐపీసీ సెక్షన్లు 332/333/353 లను అనుసరించి ప్రభుత్వ ఉద్యోగి విధులకు ఆటంకం కలిగించినందుకు రెండు నుంచి పదేళ్ల వరకు జైలు శిక్షతో పాటుగా జరిమానా విధించే అవకాశం కూడా ఉంటుంది.

1951 ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 136 కూడా ఈ ఘటనకు వర్తిస్తుందని ఎన్నికల నిబంధనలు చెబుతున్నాయి. ఓటు వేసే హక్కుకు భంగం కలిగించినందుకు చర్యలు తీసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)