నాలుగో అంతస్తు నుంచి పడిన చిన్నారి, తర్వాత కొన్ని రోజులకే తల్లి ఆత్మహత్య, అసలేం జరిగింది?

ఫొటో సోర్స్, UGC
- రచయిత, ఎస్ ప్రశాంత్
- హోదా, బీబీసీ ప్రతినిధి
33 ఏళ్ల రమ్య, ప్రమాదవశాత్తూ తన చేతుల్లోంచి పడిపోయిన తొమ్మిది నెలల కుమార్తెను ఇతరులు రక్షించడాన్ని పదే పదే చూపించే ఒక వైరల్ వీడియోపై సోషల్ మీడియాలో వచ్చిన కామెంట్ల కారణంగా తీవ్రంగా కలత చెందారు. ఆ వీడియో వైరల్ అయ్యాక కొన్ని రోజుల తర్వాత ఆత్మహత్య చేసుకున్నారు.
ఈ ఘటన చెన్నైలోని ఒక అపార్ట్‌మెంట్‌లో జరిగింది.
ఏప్రిల్ 28న రమ్య తన కూతురితో ఆడుకుంటూ ఉండగా, ఆ పాప నాలుగో అంతస్తు బాల్కనీ నుంచి కింది అంతస్తులోని సన్‌షేడ్‌పై పడిపోయింది. అదృష్టవశాత్తూ వెంటనే అపార్ట్‌మెంట్‌లో ఉంటున్నవాళ్లు రంగంలోకి దిగి పాపను రక్షించారు.
ఈ ఘటనలో తల్లి కారణంగా చిన్నారి మరణం అంచుల వరకు వెళ్లిందని సోషల్ మీడియాలో చాలామంది కామెంట్లు చేశారు.
"పిల్లలను ఎలా పెంచాలో తెలియని తల్లి", "పిల్లల విషయంలో చాలా అజాగ్రత్తగా వ్యవహరించింది’’ అంటూ రమ్యను విపరీతంగా ట్రోల్ చేశారు.
ఆమెపై టీవీ ఛానళ్లలో విమర్శలు గుప్పించారు. అలాంటి తల్లిదండ్రులను అరెస్ట్ చేయాలంటూ కొందరు డిమాండ్ చేశారు.
తనకు కూతురు పుట్టినప్పటి నుంచి రమ్య ప్రసవానంతర డిప్రెషన్‌తో బాధపడుతున్నారని ఆమె తల్లిదండ్రులు తెలిపారు.
“నా కుమార్తె తన రెండవ బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత డిప్రెషన్‌లోకి వెళ్లింది. ఒత్తిడి కారణంగా ఆమె ఎవరితోనూ మాట్లాడేది కాదు’' అని రమ్య తండ్రి వాసుదేవన్ తెలిపారు.
ప్రసవానంతర డిప్రెషన్ అనేది కొత్తగా తల్లైన వారిలో వచ్చే ఒక మానసిక రుగ్మత. భ్రాంతి, భ్రమలు, చపలచిత్తం, చిరాకుగా ఉండడం దీని లక్షణాలు.
బిడ్డకు జరిగిన సంఘటనతో రమ్య మరింత డిప్రెషన్‌లోకి జారుకుందని ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు.
సోషల్ మీడియాలో కామెంట్లతో అవమానానికి గురైన రమ్య తీవ్ర ఒత్తిడికి గురయ్యారు. వాటి నుంచి తప్పించుకోవడానికి ఆమె భర్త, ఇద్దరు పిల్లలతో కలిసి తన స్వస్థలమైన కోయంబత్తూరుకు వెళ్లారు. కానీ, దాని వల్ల లాభం లేకపోయింది.
ఒక నెల లోపే, ఆమె తన ప్రాణాలను తీసుకున్నారు.
“సోషల్ మీడియా వేధింపులు ఆమెను తీవ్రంగా ప్రభావితం చేశాయి. అందుకే ఆమె తన ప్రాణాలను తీసుకుంది’’ అని పేరు చెప్పడానికి ఇష్టపడని ఆమె సమీప బంధువు ఒకరు తెలిపారు.
"ప్రతిరోజూ మీడియాకు చెందిన వ్యక్తులు ఆమెకు ఫోన్ చేసి, ఇంటికి వచ్చి బిడ్డ గురించి అడిగి ఆమెను వేధించేవారు. ఇది ఆమెను చాలా బాధ పెట్టింది" అని చెప్పారు.
"ప్రపంచంలో మీరు ఎలాంటి వారైనా కావచ్చు, కానీ దయతో ఉండండి" అని X లో సబా ఖాన్ అన్నారు.
"సోషల్ మీడియాలో ఆమె మీద వచ్చిన తీవ్రమైన విమర్శలతో ఆమె చాలా విసిగిపోయారు. అదే రమ్య ఆత్మహత్య చేసుకోవడానికి దారి తీసింది" అని ఈ కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసు అధికారి డి రాజశేఖరన్ అన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది

ఫొటో సోర్స్, Getty Images
రమ్య పరిస్థితి ఎలా ఉండేది?
రమ్య, ఆమె భర్త 37 ఏళ్ల వెంకటేష్ ఇద్దరూ ఇంజనీర్లు. వీరిద్దరూ ఐటీ కంపెనీలో పని చేస్తున్నారు. వీరికి మొదట ఐదేళ్ల క్రితం ఒక బాబు పుట్టగా, పాప రెండో సంతానం.
రమ్య తండ్రి బియ్యం వ్యాపారం చేస్తారు. రమ్య సంప్రదాయ కుటుంబం నుంచి వచ్చారు.
రమ్య బిడ్డ ప్రమాదం నుంచి బయటపడ్డాక తర్వాత, ఆమె కుటుంబం ప్రత్యేక పూజలు చేయించింది.
ఇద్దరు పిల్లలతో కూడిన కుటుంబాన్ని చూసుకోవడంతో పాటు, తన రెండవ బిడ్డను పెంచడం ఆమెకు చాలా కష్టమైందని రమ్య కుటుంబం చెబుతోంది.
చిన్నప్పటి నుంచి ఆమెకు తన ఇద్దరు సోదరీమణులంటే చాలా ఇష్టం. వారికి గాయాలు అయితే, ఆమే వారికి ప్రథమ చికిత్స చేసి, ఆసుపత్రికి తీసుకెళ్లేవారు.
"ఆమె చాలా ధైర్యవంతురాలు" అని పేరు చెప్పడానికి ఇష్టపడని బంధువు చెప్పారు.
"సోషల్ మీడియా వ్యాఖ్యలతో ఆమె తన ప్రాణాలను తీసుకుంటుందని మేము ఎప్పుడూ అనుకోలేదు" అన్నారు.
భారతదేశంలో ప్రసవానంతర డిప్రెషన్ అనేది చాలా మంది గుర్తించని, చికిత్స చేయకుండా వదిలేసే వ్యాధులలో ఒకటని ఇటీవలి నివేదిక ఒకటి పేర్కొంది.
చెన్నైలోని ఎగ్మోర్‌లోని స్త్రీలు, పిల్లల ప్రభుత్వ ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ కలైవాణి, "ప్రసవించిన మహిళలలో 30 శాతం మంది మహిళలు ప్రసవానంతరం అస్థిరమైన మనస్సుతో ఉంటారు. బిడ్డ పుట్టిన తర్వాత ఒత్తిడికి గురవుతారు. మానసికమైన అలజడి, తేలికపాటి డిప్రెషన్, ఏడుపు దీని ప్రధాన లక్షణాలు. ఇది రెండు వారాలకు మించి కొనసాగితే దానిని ప్రసవానంతర డిప్రెషన్ అంటారు. కేవలం 1-2 శాతం మంది మాత్రమే ఈ రకమైన డిప్రెషన్‌తో బాధపడుతుంటారు. కానీ ఒక మహిళలో 6 నెలల కంటే ఎక్కువ కాలం ఈ పరిస్థితి ఉండటం చాలా అరుదు" అని అన్నారు.

తల్లులు ఈ సమయంలో అనేక జీవ సంబంధిత, భావోద్వేగ, సామాజిక మార్పులకు గురవుతారు.
“ఆమె ఎదుర్కొన్న భావోద్వేగ ప్రభావాన్ని నేను ఊహించలేను. అందరూ ఆమెకు మనోధైర్యాన్ని ఇచ్చేలా మాట్లాడి ఉండాలి. కానీ ఆమె తల్లేనా అంటూ వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరం” అని ఇద్దరు పిల్లల తల్లి అయిన విమల బీబీసీతో అన్నారు. “ఎవరూ తమ బిడ్డను వాళ్లకు హాని కలిగించే వాతావరణంలో వదిలిపెట్టరు. తమ బిడ్డ పరుపు మీది నుంచి, తొట్టిలో నుంచి పడిపోయినప్పుడు లేదా నడుస్తున్నప్పుడు చిన్న గాయం అయినా తల్లులు భయాందోళనలకు గురవుతారు, అది మాతృత్వం” అని ఆమె చెప్పారు.
‘‘సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలు ఆ చిన్నారిని తల్లిలేని స్థితికి చేర్చాయి’’ అని కోయంబత్తూరుకు చెందిన అముద అన్నారు.
“సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలతో రమ చాలా బాధ పడి ఉండాలి. ప్రసవానంతర ఒత్తిడికి తోడు ఈ వేధింపులతో ఆమె తన ప్రాణాలు తీసుకొని ఉండొచ్చు,” అని కోయంబత్తూరుకు చెందిన మానసిక ఆరోగ్య నిపుణులు అనీషా రఫీ అన్నారు.
రమ్య స్థానంలో ఉన్నవారు కొన్ని వారాల పాటు సోషల్ మీడియాను ఉపయోగించకుండా ఉండటం మంచిదని అనీషా సూచించారు. అలాంటి వాళ్లకు గట్టి మద్దతు ఇవ్వాలని కూడా ఆమె నొక్కి చెప్పారు.
"బాధితులను రక్షించడానికి ఏకైక పరిష్కారం వారి వైపు నిలబడడం, వారిని పర్యవేక్షించడం, వారి మానసిక ఆరోగ్యాన్ని కాపాడటం," అని ఆమె చెప్పారు.
సైబర్ వేధింపులపై ఇంకా ఎలాంటి ఫిర్యాదు చేయలేదని రమ్య కుటుంబం తెలిపింది.
"ప్రజలు యూట్యూబ్, ఫేస్‌బుక్‌లో కామెంట్లు చేశారు. ఆమె గురించి ఎవరు కామెంట్ చేశారో మాకు తెలియకపోతే, గుర్తు తెలియని వ్యక్తులపై మేం ఎలా కేసు నమోదు చేయగలము?" అని ఆమె కుటుంబ సభ్యులు అన్నారు.
రమ్య భర్త వెంకటేష్, ఆమె తండ్రి వాసుదేవన్ ఈ కథనంపై వ్యాఖ్యానించడానికి నిరాకరించారు.
"మా పాపను రక్షించినప్పటి నుంచి వార్తా సంస్థలు మాకు నిరంతరం కాల్ చేస్తున్నాయి. అది మమ్మల్ని మరింత బాధకు గురిచేస్తోంది. రమ్యను కోల్పోయినందుకు మేము చాలా దు:ఖంలో ఉన్నాము, మేము మాట్లాడే స్థితిలో లేము" అని వారు చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
సైబర్ వేధింపులు
రమ్య మరణం సైబర్ వేధింపులపై చర్చకు దారితీసింది. ఇంటర్నెట్ వ్యాప్తి పెరగడంతో ఈ సమస్య భారతదేశంలో పెరిగిపోతోంది.
మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన 16 ఏళ్ల ప్రియాంషు యాదవ్, ఇటీవల వివిధ రకాల మేకప్‌లు ధరించి రీల్స్‌ను పోస్ట్ చేశాడు, అయితే ద్వేషంతో నిండిన ట్రోల్‌ల కారణంగా ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
కేరళకు చెందిన మొట్టమొదటి ట్రాన్స్‌జెండర్ బాడీబిల్డర్ ప్రవీణ్ నాథ్ ఫేస్‌బుక్‌లో మరో ట్రాన్స్‌జెండర్ నుంచి విడిపోతున్నట్లు ప్రకటించినప్పుడు వేధింపులకు గురై, ఆత్మహత్యకు పాల్పడ్డారు.
నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో డేటా ప్రకారం, 2022లో భారతదేశంలో మహిళలకు వచ్చిన సైబర్ బెదిరింపులపై 9,821 కేసులు నమోదయ్యాయి. మైక్రోసాఫ్ట్ నిర్వహించిన ఒక సర్వే ప్రకారం, భారతదేశంలోని పది మంది ఇంటర్నెట్ వినియోగదారులలో నలుగురు సైబర్ బెదిరింపులకు పాల్పడుతున్నారు. మొత్తం ఇంటర్నెట్ వినియోగదారులలో 38 శాతం మంది తాము 'సైబర్ వేధింపులకు' గురవుతున్నట్లు నివేదించారు, వీరిలో యువత ఎక్కువగా ఉన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
కొందరు 'సైబర్ వేధింపులు', 'పబ్లిక్ షేమింగ్' ఎందుకు చేస్తారు?
కోయంబత్తూరులోని కుమారగురు కళాశాలలో సైకాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ ధరణి మాట్లాడుతూ సోషల్ మీడియాలో 'సైబర్ వేధింపులు, పబ్లిక్ షేమింగ్' అనేది ఒక రకమైన మానసిక వ్యాధి అన్నారు.
దీనిపై వివరణ ఇస్తూ ఆయన, ‘‘ఇలాంటి వ్యక్తులు సమాజంలో తామూ ఒక భాగమని నిరూపించుకోవాలనుకుని, ఏం జరిగినా సోషల్ మీడియాలో పోస్ట్ చేసి, కామెంట్స్ షేర్ చేస్తుంటారు.’’ అని తెలిపారు.
‘పారాసోషల్ రిలేషన్ షిప్’ అనేది ఒక సంఘటన లేదా వ్యక్తిపై ఊహాజనిత యాజమాన్యాన్ని తీసుకొని, తమ ఆలోచనలను పంచుకోవడం. "చాలా మంది వ్యక్తులు ఒకరిపై ఊహాజనిత హక్కును తీసుకోవడానికి, సమాజంలో తమ ఉనికిని నమోదు చేయడానికి 'సైబర్ వేధింపులు', 'పబ్లిక్ షేమింగ్'ని ఆశ్రయిస్తారు. ఇది ఒక మానసిక అనారోగ్యం." అని ఆయన వివరించారు.
సహాయం ఎలా పొందాలి?
మానసిక ఆరోగ్య సమస్యలను మందులు, చికిత్సతో నయం చేయవచ్చు. దీని కోసం వారు మానసిక వైద్యుని సహాయం తీసుకోవాలి.
ఆత్మహత్య ఆలోచనలు వస్తున్నట్లయితే అలాంటి వారు AASRA వెబ్‌సైట్ ద్వారా సహాయాన్ని పొందవచ్చు.
ఆత్మహత్య ఆలోచనలను నుంచి తప్పించుకోవడానికి అవసరమైన కౌన్సెలింగ్ కోసం సంక్షేమ శాఖ హెల్ప్‌లైన్ – 104 లేదా స్నేహా సూసైడ్ ప్రివెన్షన్ హెల్ప్‌లైన్ – 044-24640050 కు ఫోన్ చేయవచ్చు.
మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరోసైన్సెస్‌కు చెందిన హెల్ప్‌లైన్ నంబర్ 08046110007 ను కూడా సంప్రదించవచ్చు .
ఇవి కూడా చదవండి:
- అంతరించి పోయిందనుకున్న ఈ ‘పర్వత రత్నం’ మళ్లీ కనిపించింది, ఎక్కడంటే..
- బెంగళూరు రేవ్ పార్టీ కేసు: పోలీసులు ఏం చెప్పారు? అసలు రేవ్ పార్టీ అంటే ఏంటి? అందులో ఏం చేస్తారు?
- ఓవర్సీస్ హైవే: సముద్రంలో 182 కిలోమీటర్ల రోడ్డు.. ప్రపంచంలో 8వ వింత ఇదేనా?
- #UnseenLives: వెనక 40 మంది పురుషులున్నా, నేను ఆ మరకను దాచుకోలేదు
- చంద్రుడి మీద బతకాల్సి వస్తే అక్కడ తినడానికి ఏముంటుంది, సైంటిస్టులు చేస్తున్న ప్రయోగాలేంటి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














