హైదరాబాద్: పురుగులు పట్టిన పిండి.. బూజు పట్టిన క్యారెట్లు.. గడువు తీరిన సాస్.. హోటళ్ళు, రెస్టారెంట్లపై ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడుల్లో ఏం తెలుస్తోంది?

ఫొటో సోర్స్, @cfs_telangana
- రచయిత, బళ్ల సతీష్
- హోదా, బీబీసీ ప్రతినిధి
పురుగులు పట్టిన మైదా… గడువు తీరిపోయిన సాస్… బూజు పట్టిన క్యారెట్లు.. ఎన్నిసార్లు వాడారో తెలియని నూనె.. సింథటిక్ రంగులు.. కిచెన్లో ఓపెన్ డ్రైనేజీలు.. పురుగు పట్టిన చింతపండు.. మూత పెట్టకుండా ఫ్రిజ్‌లో పెట్టిన పేస్టులు.. వంట గదిలో బొద్దింకలు… ఇవీ కొద్ది కాలంగా హైదరాబాద్ హోటళ్ళలో తెలంగాణ ఫుడ్ సేఫ్టీ అధికారుల సోదాల్లో బయటపడిన విషయాలు.
ఫుడ్ సేఫ్టీ అధికారులు నెల రోజులుగా హైదరాబాద్‌లోని వివిధ హోటళ్ళలో విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. ఇప్పుడు నగరంలో ఎక్కడ చూసినా దీనిపైనే చర్చ నడుస్తోంది.
అన్నీ పేరున్న హోటళ్లే. నగరవాసుల్లో చాలా మంది ఆయా హోటళ్లలో ఎప్పుడో ఒకప్పుడు భోజనం చేసే ఉంటారు కాబట్టి, ఇది హాట్ టాపిక్ అయిపోయింది.
తెలంగాణ రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ కమిషనర్ కార్యాలయం, జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ విభాగం కలసి ఒక టాస్కు ఫోర్స్‌ను ఏర్పాటు చేశాయి. ఈ టాస్క్ ఫోర్స్ హోటళ్లు, రెస్టారెంట్లలో అకస్మాత్తుగా తనిఖీలు చేస్తోంది. తాము తనిఖీలు చేయబోతున్నామనే సమాచారం రెస్టారెంట్ల నిర్వాహకులకు ముందుగా తెలియకుండా జాగ్రత్త పడుతున్నట్టు అధికారులు బీబీసీకి చెప్పారు.
‘‘ఉదయం 9 గంటలకు ఒక ఏరియాకు వెళ్ళాలనేది సిబ్బందికి చెబుతాం. వాళ్లు ఆ ప్రాంతానికి వెళ్లిన తరువాత అప్పుడు ఏ రెస్టారెంట్‌కు వెళ్లాలో చెబుతాం. దీని ప్రభావం బాగా పనిచేస్తోంది. ఇప్పటికే చాలా రెస్టారెంట్లు బాగా జాగ్రత్తపడి అన్ని నిబంధనలూ పాటిస్తున్నాయి. అంతేకాదు ప్రజలు రెస్టారెంట్లపై నేరుగా ఫిర్యాదు చేయవచ్చు. అందుకు తగిన నంబర్లు అందుబాటులో ఉంచాం. అటువంటి హోటళ్ళపైనా చర్యలు తీసుకుంటాం’’ అని బీబీసీతో చెప్పారు జీహెచ్ఎంసీ అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ బాలాజీ రాజు.
ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఫుడ్ సేఫ్టీ విభాగం తనిఖీలను పెంచింది. తనిఖీలతోపాటు వాటి వివరాలను ‘ఎక్స్’ ఖాతాలో వెల్లడించడం ప్రారంభించారు.
ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ చట్టం 2006 ప్రకారం నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు నమోదు చేస్తున్నారు.
శుభత్ర, నాసిరకం, పాడైపోయిన పదార్థాలు వంటివాటితో పాటూ, చట్టపరమైన లైసెన్సులు, రిజిస్ట్రేషన్ల పరమైన లోపాలపైనా కేసులు నమోదు చేస్తారు.

ఫొటో సోర్స్, @cfs_telangana
ఏఏ హోటళ్లలో సోదాలు చేశారు?
- మే 23న బాహుబలి కిచెన్‌లో సింథటిక్ ఫుడ్ కలర్స్ అక్కడికక్కడే ధ్వంసం చేశారు. వంటగదిలో బొద్దింకలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఫుడ్ స్టోర్ రూములో కూడా ఉన్నాయి. పెస్ట్ కంట్రోల్ రికార్డులు లేవు. వంటగదిలో నీరు నిల్వ ఉండిపోయి శుభ్రత లేదు. సగం వండిన రా ఫుడ్ ఫ్రిజ్‌లో పెట్టారు. బీబీసీ వారిని సంప్రదించింది. యాజమాన్యం స్పందించాల్సి ఉంది.
- మే 21వ తేదీన సోమాజిగూడ కృతుంగా పాలెగార్స్ క్యూజిన్‌లో సోదాలు చేశారు. మేతీ మలయ్ పేస్టు, సరిగా లేబుల్ లేని పన్నీరు, నాన్ వెజ్ పేస్టు, క్రిటిక్ యాసిడ్ ధ్వంసం చేశారు. కృతుంగా బ్రాండ్ వాటర్ బాటిళ్ళ టీడీఎస్ మీటర్ తక్కువ చూపడంతో వాటిని పరీక్షలకు పంపారు. సిబ్బందికి టోపీలు, గ్లౌజులు లేకపోవడం గుర్తించారు. పూర్తిగా వండని, రా ఫుడ్‌లను సరిగా కవర్ చేయకుండా అలానే ఫ్రిజ్‌లో పెట్టారు. వంటగదిలోకి ఈగలు, కీటకాలు రాకుండా మెష్ లేదు. డస్ట్ బిన్లకు మూతల్లేవు. ఈ విషయంపై బీబీసీ వారిని సంప్రదించింది. యాజమాన్యం స్పందించాల్సి ఉంది.
- మే 21న హెడ్ క్వార్టర్స్ రెస్టో బార్‌లో సింథటిక్ ఫుడ్ కలర్స్‌ను గుర్తించారు. లేబుల్ లేని పిజా బేస్‌లు, గార్లిక్ బ్రెడ్లు, నూడుల్స్ ను గమనించారు. వెజ్, నాన్ వెజ్‌లను ఫ్రిజ్‌లో సరిగా స్టోర్ చేయడం లేదని, సిబ్బందికి టోపీలు, గ్లౌజుల లేవని. కిచెన్లో చెత్త బుట్టలకు మూతలు లేవని, ఈగలు రాకుండా మెష్ ఏర్పాటు చేయలేదని గుర్తించారు.బీబీసీ వారిని సంప్రదించడానికి ప్రయత్నం చేస్తోంది.
- మే 18న లక్డీకాపూల్ రాయలసీమ రుచుల్లో సోదాలు చేశారు. నల్లులున్న మైదాను ధ్వంసం చేశారు. పురుగు పట్టిన రెండు కేజీల చింతపండును, గడువుతీరిన అమూల్ పాలను ధ్వంసం చేశారు. తయారీదారు లైసెన్స్ లేని గోలీ సోడా బాటిళ్ళు, జీడిపప్పుకు లేబుల్ లేకపోవడం, వెజ్, నాన్ వెజ్ కలిపి నిల్వ ఉంచడం, వంటగదిలో ఓపెన్ కిటికీలు, నీరు సరిగా పారని డ్రైనేజీని గుర్తించారు. బీబీసీ వారిని సంప్రదించింది. యాజమాన్యం స్పందించాల్సి ఉంది.
- మే 4వ తేదీన హిమాయత్ నగర్ క్లోవ్ వెజ్ ఫైన్ డైన్‌లో సోదాలు నిర్వహించి గడవుతేదీ ముగిసిన చీజ్, సిరప్, ఏటీసీ స్పైసెస్, శాండ్ విచ్ బ్రెడ్లను ధ్వంసం చేశారు. ఐస్ క్రీమ్ స్టోరేజ్ యూనిట్లో బతికున్న బొద్దింకులను అధికారులు గుర్తించారు. బూజు పట్టిన క్యారెట్లు, ఫ్రిజ్‌లో పెట్టిన వెజ్ బిర్యానీ, వంటగదిలో డ్రైనేజీ పైపు దగ్గర నీరు ఆగిపోవడాన్ని గుర్తించారు. బీబీసీ వారిని సంప్రదించింది. యాజమాన్యం స్పందించాల్సి ఉంది.

ఫొటో సోర్స్, @cfs_telangana
- ఏప్రిల్ 30న శరత్ సిటీ మాల్‌లో ఫైర్ ఫ్లై రెస్టారెంట్‌లో శుభ్రత, కీటకాల (పెస్ట్) కు సంబంధించిన నిబంధనలు పాటించలేదని అధికారులు గుర్తించారు. బీఐఎస్ లైసెన్సు లేని 9 వేల రూపాయల విలువైన వాటర్ బాటిళ్ళను సీజ్ చేశారు. అదే మాల్‌లోని ఎయిర్ లైవ్‌లో చాలా తక్కువ నాణ్యత ఉన్న వాటర్ బాటిళ్ళను గుర్తించారు. టాకో బాల్‌లో నూనెను మళ్లీ వాడిన రికార్డు నిర్వహించకపోవడం, వాడకూడని స్థాయిలో నూనె తిరిగి వాడడాన్ని గుర్తించారు. బాయిలర్ రూమ్ క్లబ్‌లో ఆహార నిల్వకు సంబంధించిన నిబంధనలు ఉల్లంఘించినట్టు గుర్తించారు. చట్టపరమైన నిబంధనలు పాటించాలని అన్ని ఫుడ్ స్టాళ్ళకు సూచించినట్టు మాల్ యాజమాన్యం బీబీసీకి తెలిపింది.
- ఏప్రిల్ 25న కొత్తపేట పండ్ల మార్కెట్లో సోదాలు చేశారు. మామిడి పండ్లలో నేరుగా ఇథలీన్ సెల్యూలోజ్ పాకెట్లు పెట్టిన వారిని గుర్తించారు. షేక్ ఖయ్యూం ట్రేడింగ్ కంపెనీ, త్రిపుల్ ఎస్ బనానా ఫ్రూట్ కంపెనీ, ఏబీసీ ఫ్రూట్ కంపెనీలకు చెందిన దాదాపు 550 కేజీల పండ్లను సీజ్ చేశారు. బీబీసీ వారిని సంప్రదించింది. యాజమాన్యం స్పందించాల్సి ఉంది.
- ఏప్రిల్ 20న కొంపల్లి మినర్వా హోటల్లో గడువుతీరిన సాస్, చాకోలెట్ సిరప్‌ను గుర్తించారు. అక్కడ వాడుతున్న దాదాపు లక్ష రూపాయల విలువైన వంట నూనె తక్కువ నాణ్యత కలిగిందనే అనుమానంతో ల్యాబ్‌కు పంపించారు. బీబీసీ వారిని సంప్రదించింది. యాజమాన్యం స్పందించాల్సి ఉంది.
- ఏప్రిల్ 18న గౌరంగ్ డిజైన్స్ ఇండియాలో గడవు తీరిన స్పైసెస్‌ని అధికారులు పారబోశారు. బీబీసీ వారిని సంప్రదించింది. యాజమాన్యం స్పందించాల్సి ఉంది.
- ఏప్రిల్ 27న జీవీకే వన్ బంజారాహిల్స్ ఫుడ్ కోర్టులో తనిఖీలు నిర్వహించారు. ఆహా దక్షిణ్, సిజ్లింగ్ జో, ఖాన్ సాబ్ స్టాళ్ళలో శుభ్రత, ఆహార నిల్వ విధానం, ఆహార నాణ్యతల్లో నిబంధనలు ఉల్లంఘించినట్టు అధికారులు కనుగొన్నారు.

ఫొటో సోర్స్, @cfs_telangana
- కేఎఫ్‌సీలో వంటనూనె తిరిగి వాడేప్పుడు దానికి సంబంధించిన పేపర్ లాగ్స్, రికార్డులు నిర్వహించలేదని గుర్తించారు. హార్డ్ రాక్ కేఫ్, స్టార్ బక్స్ కేఫ్‌లో కూడా చట్టపరమైన నిబంధనలు పాటించలేదని గుర్తించారు. బీబీసీ వారిని సంప్రదించింది. యాజమాన్యం స్పందించాల్సి ఉంది.
- మకావు కిచెన్ అండ్ బార్‌లో గడువు ముగిసిన స్నేహ చికెన్, బుల్ డాగ్ సాస్, మయినీస్, ఇతర సాస్‌లు అధికారులు గుర్తించారు. బూజు పట్టిన జీడిపప్పును, స్టోరేజీ ఏరియాలో బొద్దింకలను గుర్తించారు. బీబీసీ వారిని సంప్రదించింది. యాజమాన్యం స్పందించాల్సి ఉంది.
- మే 16న అమీర్‌పేట మెట్రో స్టేషన్లో సోదాలు చేశారు. ఫైవ్ స్టార్ ఫుడ్ కోర్టులో నూనె తిరిగి వాడేటప్పుడు పరీక్షించడం లేదు. శుభ్రతకు సంబంధించి ఓపెన్ డస్ట్ బిన్‌లు, సిబ్బంది తలలకు టోపీలు, చేతులకు గ్లౌజులులేవని గుర్తించారు. బీబీసీ వారిని సంప్రదించింది. యాజమాన్యం స్పందించాల్సి ఉంది.
- మే 16న అమీర్‌పేట మెట్రో స్టేషన్లో సోదాలు చేయడంతో జంబో కింగ్ బర్గర్‌కు సరైన లైసెన్సు లేదని, ఆయిల్ తిరిగి వాడేటప్పుడు నాణ్యత పరీక్షించే టీపీసీ మీటర్ లేకపోవడం, శుభ్రతా సమస్యలు, ఓపెన్ డస్ట్ బిన్‌లు, నీరు ఆగిపోవడం, లేబుల్ లేని పన్నీరును అధికారులు గుర్తించారు. బీబీసీ వారిని సంప్రదించింది. యాజమాన్యం స్పందించాల్సి ఉంది.
- మే 18న షాగౌస్‌లో లేబుల్ లేని, సెమీ ప్రిపేర్డ్ పదార్థాలను అధికారులు గుర్తించారు. ఫుడ్ హ్యాండ్లర్స్ మెడికల్ రికార్డులు లేవు. శుభ్రత సరిగా లేదు. నీరు సరిగా పారకపోవడాన్ని గుర్తించారు. అక్కడి పదార్థాలను ల్యాబ్ పరీక్షలకు పంపారు. బీబీసీ వారిని సంప్రదించడానికి ప్రయత్నం చేస్తోంది.

ఫొటో సోర్స్, @cfs_telangana
- మే 20న ఉప్పల్ మాస్టర్ చెఫ్ రెస్టారెంట్లో సోదాలు చేశారు. సింథటిక్ ఫుడ్ కలర్స్‌ను అక్కడికక్కడే ధ్వంసం చేశారు. లేబుల్ లేని వెల్లుల్లి పేస్టు, ఎక్స్‌పైర్ అయిన పాల పాకెట్లు, లేబుల్ లేని బేకరీ పదార్థాలను గుర్తించారు . మంచినీళ్ళ ఎనాలిసిస్ రిపోర్టు లేదు. ఫ్రిజ్ శుభ్రంగా లేదు. సగం వండిన పదార్థాలు ఫ్రిజ్‌లో దాచారు. ఫుడ్ హ్యాండిల్ చేసేవారు టోపీలు, గ్లౌజులు వేసుకోలేదని గుర్తించారు. బీబీసీ వారిని సంప్రదించడానికి ప్రయత్నం చేస్తోంది.
- మే 20న సాయి బృందావన ప్యూర్ వెజ్‌లో సింథటిక్ ఫుడ్ కలర్స్ కనిపిస్తే ధ్వంసం చేశారు. సరైన బ్రాండింగ్ లేని బెల్లం, జీడిపప్పును గుర్తించారు. సిబ్బంది టోపీలు, గ్లౌజులు వేసుకోకపోవడాన్ని గుర్తించారు. ఫుడ్ లైసెన్స్ అప్‌డేట్ కాకపోవడం, ఫ్రిజ్ పాడవడాన్ని గమనించారు. బీబీసీ వారిని సంప్రదించడానికి ప్రయత్నం చేస్తోంది.
- మే22న బంజారా హిల్స్‌లోని బాస్కిన్ రాబిన్స్‌లో గడువు ముగిసిన హార్న్ వైట్ చాక్లెట్ గుర్తించి ధ్వంసం చేశారు. బీబీసీ వారిని సంప్రదించింది. యాజమాన్యం స్పందించాల్సి ఉంది.
- మే 22న లెబనాల్ పైన్ బేకింగులో ఎక్స్‌పైర్ అయిన చాకోలెట్ క్రిస్పెరల్స్ గుర్తించి ధ్వంసం చేశారు. లేబుల్ లేని దిగుమతి చేసుకున్న అమెరికన్ గార్డెన్ వెనిగర్ స్వాధీనం చేసుకున్నారు. బీబీసీ వారిని సంప్రదించింది. యాజమాన్యం స్పందించాల్సి ఉంది.
- మే 23న రామేశ్వరం కేఫ్ మాదాపూర్‌లో మార్చిలో ఎక్స్‌పైర్ అయిన వంద కేజీల మినపప్పును గుర్తించారు. ఎక్స్‌పైర్ అయిన పాలు, పెరుగును అధికారులు పారబోశారు. సరిగా లేబుల్ లేని బియ్యాన్ని, లేబుల్ లేని బెల్లాన్ని సీజ్ చేశారు. చెత్తబుట్టలకు మూతలు సరిగా పెట్టలేదని గుర్తించారు. మెడికల్ ఫిట్‌నెస్ లేదు. బీబీసీ వారిని సంప్రదించింది. యాజమాన్యం స్పందించాల్సి ఉంది.

ఫొటో సోర్స్, @cfs_telangana
- మే 24వ తేదీన కొండాపూర్ బిగ్ బాస్కెట్ వేర్ హౌసులో ఎక్స్‌పైర్ అయిన పన్నీర్, పిజా, చీజ్‌లను గుర్తించారు. సరిగా స్టోర్ చేయని పాలు, థిక్ షేక్ బాటిళ్లను అధికారులు ధ్వంసం చేశారు. బీబీసీ వారిని సంప్రదించింది. యాజమాన్యం స్పందించాల్సి ఉంది.
- మే 25 మాసబ్ ట్యాంక్ చిచాస్ అసలీ హైదరాబాద్ ఖానాలో సోదాలు నిర్వహించి సింథటిక్ ఫుడ్ కలర్స్‌ని ధ్వంసం చేశారు. ఫుడ్ లైసెన్సును వీరు తీసుకోలేదు. సరిగా కవర్ చేయకుండా వెజ్, నాన్ వెజ్, రా ఫుడ్, సెమీ ప్రిపేర్డ్ ఫుడ్‌లను ఒకే ఫ్రిజ్‌లో నిల్వ ఉంచారు. వంటగదిలోకి కీటకాలు రాకుండా ఏర్పాట్లు లేవు. బీబీసీ వారిని సంప్రదించింది. యాజమాన్యం స్పందించాల్సి ఉంది.
- మే 25న లెబనాన్ బైట్స్‌లోని సింథటిక్ ఫుడ్ కలర్స్‌ను ధ్వంసం చేశారు. సెమీ ప్రిపేర్డ్, రా ఫుడ్ కలిపి ఫ్రిజ్‌లో ఉంచారు. చెత్తబుట్టలకు మూతల్లేవు.
‘‘మేం ప్రభుత్వం అప్రూవ్ చేసిన, ఎఫ్ఎస్ఎస్ఏ లైసెన్స్ ఉన్న ఫుడ్ కలరే వాడాం. అది ప్రమాదకారి అయితే అసలు దానికి ఎఫ్ఎస్ఎస్ఏ లైసెన్సే ఉండదుకదా? మాకు ఫుడ్ సేఫ్టీ టాప్ ప్రయార్టీ. మేం అన్ని జాగ్రత్తలూ తీసుకుంటాం. వారు వచ్చిన సమయంలో మాత్రం చెత్తబుట్టలకు మూతలు పెట్టనిది వాస్తవం. కానీ ఎప్పుడూ అలా ఉండదు. అదేమీ పెద్ద సమస్య కాదు. ఒకవేళ మేం వాడే ఫుడ్ కలర్ మంచిది కాదు అనుకుంటే ప్రభుత్వమే బ్యాన్ చేసి ఉండాల్సింది కదా? ఫ్రిజ్ లో పెట్టే పేస్టులు వంటి వాటికి కూడా యూజ్ బిఫోర్ లేబుల్ వేయమన్నారు. వేస్తాం.’’ అని బీబీసీతో చెప్పింది యాజమాన్యం.
- ఏప్రిల్ 16న జూబ్లీహిల్స్‌లోని బాబీలోన్ బార్ అండ్ కిచెన్ బార్‌లో సోదాలు చేసి ఎక్స్‌పైర్ అయిన పదార్థాలను గుర్తించారు. అలాగే సరైన లేబుల్, లైసెన్స్ లేని మంచినీళ్ల బాటిళ్లను, ఎక్స్‌పైర్ అయిన వాటిని ధ్వంసం చేశారు.
‘‘మాకు మంచినీటి బాటిళ్ళు ఇచ్చే సప్లయర్ తన లైసెన్సు రెన్యువల్ చేసుకోలేదు. దాంతో ఈ కేసు మాపై పడింది. మాకు దాదాపు అన్ని రకాల వస్తువులు సరఫరా చేసే వారు 60-70 మంది వరకూ ఉంటారు. అందరి లైసెన్సులు చూడలేకపోవడం వల్లే ఈ కేసు. ఇక ఎక్స్‌పైర్ అయిన పదార్థాల విషయంలో ఒక మాట చెప్పాలి. మా కిచెన్‌లో దాదాపు 600 పదార్థాలు ఉంటాయి. అందులో కేవలం 4-5 పాకెట్లు మాత్రమే ఎక్స్‌పైర్ అయినవి దొరికాయి. అది కూడా మేం ఉపయోగించం, ఎక్కడో పొరబాటున అవి ఉన్నాయి. ఏమైనా ఒక వంద పాకెట్లు ఎక్స్‌పైర్ అయినవి దొరికితే తప్పు. కానీ ఇక్కడ మా తప్పేమీ లేదని వారికీ తెలుసు’’ అని బీబీసీకి తెలిపింది బార్ యాజమాన్యం.
- ఏప్రిల్ 20న బార్కస్‌లోని ఇండో అరబిక్ రెస్టారెంట్‌లో 63 వేల రూపాయల విలువైన మంచి నీళ్ళ బాటిళ్ళను ల్యాబ్ పరీక్షలకు పంపారు. శుభ్రత పాటించనందుకు నోటీసులు ఇచ్చారు.
‘‘ఈ బాటిళ్ళు మేం జల్ పే అనే సంస్థ నుంచి తీసుకున్నాం. వారు ఎఫ్ఎస్ఎస్ఏ లైసెన్సు రెన్యూవల్ చేయించుకున్నారు. కానీ, పాత లైసెన్సు నంబర్ ఉన్న లేబుళ్లనే బాటిళ్లపై ముద్రించడంతో సమస్య ఏర్పడింది. వారి లైసెన్స్ కూడా మేం తెప్పించి చూశాం. ప్రస్తుతం ల్యాబ్ రిపోర్ట్ రావాల్సి ఉంది’’ అని రెస్టారెంట్ యాజమాన్యం చెప్పింది.

ఫొటో సోర్స్, @cfs_telangana
- ఏప్రిల్ 29వ తేదీన బంజారా హిల్స్‌లోని రోస్టరీ కాఫీ హౌస్‌లో శుభ్రతపరమైన లోపాలు గుర్తించారు. రోస్ట్ సీసీఎక్స్‌లో తప్పుగా బ్రాండ్ చేసిన పదార్థాలను గుర్తించారు. బీబీసీ వారిని సంప్రదించింది. యాజమాన్యం స్పందించాల్సి ఉంది.
- మే 4వ తేదీన మొజాంజాహీ మార్కెట్‌లో ఐస్ క్రీమ్ స్టాళ్లలో సోదాలు చేశారు. బిలాల్ ఐస్ క్రీము తయారీ యూనిట్‌కు ఎటువంటి లైసెన్స్, రిజిస్ట్రేషన్ లేదని గుర్తించారు. నకిలీ బ్రాండ్ నీళ్ళ బాటిళ్ళు గుర్తించారు.
‘‘మా తయారీ లైసెన్స్ కొద్ది కాలం క్రితమే ఎక్స్ పైర్ అయింది. మేం ఫుడ్ లైసెన్స్ 2017లోనే తీసుకున్నాం. జనవరి 2024 ఎక్స్‌పైర్ అయింది. అది ఇప్పుడు వెంటనే పునరుద్ధరించాం. ఇప్పుడు లైసెన్స్ వచ్చింది. ఇక వాటర్ బాటిల్ మేం లోకల్ బ్రాండ్ వాడాం. దాంతో సమస్య ఉందని గుర్తించి, ఒక పాపులర్ బ్రాండ్ బాటిళ్ళు పెడుతున్నాం’’ అని బీబీసీతో చెప్పింది యాజమాన్యం.
- కరాచీ బేకరీలో దాదాపు 5,200 రూపాయల విలువైన రస్కులు, బిస్కెట్లు, చాకోలెట్ కేకులు, టోస్టులు ఎక్స్‌పైర్ అయిపోయాయి. చాలా కేకుల మీద ఎప్పటివరకు వాడుకోవచ్చు అనే తేదీలు లేవని అధికారులు గుర్తించారు.
‘‘మాది చాలా నమ్మకమైన బ్రాండ్. ఎక్స్‌పైర్ అయినవి ఏదీ రాక్స్‌లో ఉంచం. ఆరోజు దొరికినవి కూడా షెల్ఫులో దొరికినవి కాదు. పక్కన పెట్టినవే. ఇక కేకులు మేం తాజాగా తయారు చేస్తాం. గంటల వ్యవధిలోనే చేస్తాం. మా దగ్గర అన్ని నిబంధనలూ పాటిస్తాం. అత్యంత ప్రొఫెషనల్‌గా పనిచేస్తాం. ఫుడ్ విషయంలో ఎక్కడా రాజీ పడం’’ అని కరాచీ సిబ్బంది ఒకరు బీబీసీతో చెప్పారు.
- నేచురల్స్ ఐస్ క్రీమ్‌లో ఐస్ క్రీమును స్టీల్ కంటైనర్లలో పెట్టడం, ఫ్రిజ్‌లో కోన్లు పెట్టడం, సిబ్బందికి మెడికల్ ఫిట్‌నెస్ సర్టిఫికేట్ లేకపోవడం వంటివి అధికారులు గుర్తించారు. బీబీసీ వారిని సంప్రదించింది. యాజమాన్యం స్పందించాల్సి ఉంది.
- మే4న క్రీమ్ స్టోనులో ఎక్స్‌పైర్ అయిపోయిన స్ట్రాబెర్రీ పేస్టు, ఫ్రిజ్‌లో పెట్టని పైనాపిల్ టిట్ బిట్ కేన్లు, ఎక్స్‌పైరీ తేదీలు లేని కేకులు, పేస్ట్రీలు ఉన్నట్టు గుర్తించారు. బీబీసీ వారిని సంప్రదించింది. యాజమాన్యం స్పందించాల్సి ఉంది.

ఫొటో సోర్స్, @cfs_telangana
- మే 15వ తేదీన జూబ్లీహిల్స్ 36 డౌన్ టౌన్ బ్ర్యూ పబ్‌లో సోదాల్లో ఎక్స్‌పైర్ అయిపోయిన స్నేహ చికెన్, డోన్ మష్రూమ్, హొయిజిన్ సాస్ మొత్తం 4 వేల రూపాయలవి గుర్తించారు. శుభ్రతా నియమాలు పాటించడం లేదని అధికారుల సోదాల్లో వెల్లడైంది. బీబీసీ వారిని సంప్రదించింది. యాజమాన్యం స్పందించాల్సి ఉంది.
- మే 16న అమీర్‌పేట మెట్రో స్టేషన్లో సోదాలు చేశారు. కేఎఫ్‌సీలోని సిబ్బందికి మెడికల్ ఫిట్‌నెస్ సర్టిఫికేట్లు లేవు. బీబీసీ వారిని సంప్రదించింది. యాజమాన్యం స్పందించాల్సి ఉంది.
- మే 17న ఖైరతాబాద్ లో కామత్ హోటల్లో లేబుల్ లేని నూడుల్స్, టీపొడిని సీజ్ చేశారు. ఆహార సిబ్బందికి టోపీలు, గ్లౌజులు లేవని గుర్తించారు. బీబీసీ వారిని సంప్రదించింది. యాజమాన్యం స్పందించాల్సి ఉంది.
- మే 17న సుఖ సాగర రెస్టారెంట్లో యూజ్ బై డేట్ లేని మష్రూములను ధ్వంసం చేశారు. వంట గది పెచ్చులూడుతూ, బయటి వాతావరణంతో సెపరేషన్ లేకుండా ఉంది. బీబీసీ వారిని సంప్రదించింది. యాజమాన్యం స్పందించాల్సి ఉంది.

ఫొటో సోర్స్, @cfs_telangana
హోటళ్ళకున్న నిబంధనలు ఏంటి?
ఆహార పరిశ్రమలు, ఆహారం అమ్మేవారు పాటించాల్సిన జాబితా చాలా పెద్దదే ఉంది. వాటిలో ఆహార నాణ్యతకు సంబంధించిన వాటితో పాటూ, డాక్యుమెంటేషన్, లైసెన్సు పరమైన నిబంధనలూ ఉన్నాయి. తాజా కేసుల్లో చాలా వరకూ అలాంటివి కూడా ఉన్నాయి.
రిజిస్ట్రేషన్ లేదా లైసెన్స్ తీసుకోవడం, దాన్ని రెన్యువల్ చేయడం, సిబ్బందికి మెడికల్ ఫిట్‌నెస్ పరీక్షలు చేయించడం, నూనె ఎన్నిసార్లు వాడారు అనే రికార్డు రాసుకోవడం, అలాగే ఫ్రిజ్‌లో నిల్వ ఉంచే పేస్టులు, ఏ రోజు ఫ్రిజ్‌లో పెట్టారన్నది లేబుల్ చేసి పెట్టుకోవడం వంటివి కూడా ఇందులో ఉన్నాయి.
1. నూనె మీటర్: సాధారణంగా పెద్ద సంస్థలు నూనె నాణ్యత కొలిచే మెషీన్లను వాడతాయి. అది తప్పనిసరి కాదు. కానీ, నూనెను పరిమిత సంఖ్యకు మించి తిరిగి వాడకూడదనే నిబంధన ఉంది. నూనె నాణ్యత టోటల్ పోలార్ గ్రౌండ్ 25 పాయింట్లు దాటకూడదు. వాడేసిన నూనె మళ్ళీ చిన్న స్థాయి ఆహార వ్యాపారులకు అమ్మకూడదు. ప్రభుత్వం ఆమోదించిన రీసైకిల్ కంపెనీలకు మాత్రమే అమ్మాలి. వారు దాన్ని పరిశ్రమల కోసం ఉపయోగిస్తారు. ‘‘ప్రస్తుతం హైదరాబాద్‌లో రోజుకు 3 వేల లీటర్ల వాడేసిన నూనె రీసైక్లింగ్‌కు వెళుతోంది. కానీ దాన్ని 12-15 వేల లీటర్లకు పెంచాలనేది మా లక్ష్యం’’ అని ఫుడ్ సేఫ్టీ అధికారులు తెలిపారు.
2. మెడికల్ సర్టిఫికేట్లు: ఉదాహరణకు రెస్టారెంట్లలో ఫుడ్ హ్యాండిల్ చేసే ప్రతివారూ అంటే వంటవారు, వడ్డించేవారు, వంటలో సాయం చేసే వారికి ఏమైనా అంటు వ్యాధులు, అంటే ముక్కు, నోరు, చర్మం ద్వారా వ్యాపించేవి ఉన్నాయేమోనన్న పరీక్షలు చేసి, అవి లేవు అని నిర్థరించుకున్న తరువాతే వారికి ఉద్యోగాలు ఇవ్వాలి అని చట్టం చెబుతోంది. అలాగే వారు ఉంగరాలు పెట్టుకోకూడదు, గోళ్ళు పెంచుకోకూడదు, ఉతికిన బట్టలు మాత్రమే వేసుకోవాలనే నిబంధనలు ఉన్నాయని జీహెచ్ఎంసీ అధికారులు బీబీసీతో చెప్పారు.
3. వంటగది బయటి వాతావారణం నుంచి వేరుగా ఉండాలి. అందులోకి ఈగలు ఇతర కీటకాలు రాకుండా ఏర్పాటు చేయాలి. వంట గదిలో నీరు నిల్వ ఉండకుండా పక్కా డ్రైనేజీ వ్యవస్థ ఉండాలి.
4. అసలు ఖాళీ స్థలంలో వంట చేయడం నిషిద్ధం. క్లౌడ్ కిచెన్ పేరుతో ఖాళీ స్థలంలో వంట చేసి ఆన్లైన్ సంస్థ ద్వారా అమ్మేస్తున్నారు. అక్కడ దుమ్ము, ధూళి, ఈగలు అన్నీ వస్తాయి. అది నిషేధం.
5. హోటళ్ళలో వాడే ప్రతి పదార్థంపైనా లేబుళ్ళు ఉండాలి. ఆఖరికి బెల్లం, పప్పులు, జీడిపప్పు వంటి పదార్థాలపై కూడా లేబుల్స్ ఉండాలి. ‘‘గతంలో వల్లే చింతపండు వంటి వాటిని ఎండబెట్టి ఎవరూ వాడడం లేదు. అలా అయితే నిల్వ ఉండేవి. ఇప్పుడు షాపులకు వచ్చేవి కోల్డు స్టోరేజీల నుంచి వస్తున్నాయి కాబట్టి ఇలాంటి పదార్థాలకు కూడా ఎక్స్‌పైర్ తేదీతో లేబుల్ ఉండాల్సిందే’’ అని బీబీసీతో అన్నారు బాలాజీ రావు.
6. రెస్టారెంట్లలో అమ్మే నీటికి నాణ్యతా పరీక్షలు చేయిస్తారు. సాధారణంగా ఐఎస్ఐ ప్రమాణం ఉన్న కంపెనీల నీటి బాటిళ్ళు ఈ ప్రమాణాలన్నీ పాటిస్తాయి. నీటి నాణ్యతను టీడీఎస్ పేరుతో కొలుస్తారు. నీటి ఫిల్టర్లు శుభ్రంగా ఉండాలి.

ఫొటో సోర్స్, @cfs_telangana
ఎలాంటి నేరానికి ఎలాంటి శిక్ష పడుతుంది?
అన్ సేఫ్ - ప్రమాదకరం: వస్తువులు బాగా పాడైపోవడం, వాడకూడదని పదార్థాలు వాడడం వంటివి ఇందులోకి వస్తాయి. ఉదాహరణకు చట్టం ప్రకారం బిర్యానీలు, కూరల్లో ఫుడ్ కలర్ కలపకూడదు. కేవలం బేకరీ ఐటెమ్స్, గోబీ 65 వంటి వాటిల్లో కేజీకి వంద పీపీఎం దాటకుండా వాడవచ్చు. కానీ వాస్తవంగా చాలా వాటిల్లో ఎక్కువ మోతాదులో ఇది వాడతారు.. దీనికి ౩ నెలల వరకూ జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. ఈ కేసులను క్రిమినల్ కోర్టులకు పంపుతారు.
సబ్ స్టాండర్డ్ – తక్కువ నాణ్యత: నాసి రకం పదార్థాలు అమ్మడం, శుభ్రత పాటించకపోవడం, వంటగది శుభ్రం చేయకపోవడం, వంట పాత్రలపై మసి, బ్లోయర్ మీద ఆయిల్ బొట్లుగా రాలడం, గోడలకు పెచ్చులూడడం, డ్రైనేజీ నీరు నిలవ ఉండడం, సగం వండిన పదార్థాలు ఎప్పటివో తెలియకుండా ఫ్రిజ్‌లో పెట్టడం వంటివి ఇందులోకి వస్తాయి. ఈ కేసులు కోర్టుల్లో కాకుండా, అదనపు కలెక్టర్ ఆధ్వర్యంలో విచారిస్తారు. వారికి. 5 లక్షల వరూ జరిమానా వేసే అధికారం ఉంటుంది.
మిస్ బ్రాండెడ్ – తప్పు పేరు, సమాచారం ఉండడం: ఆహార పదార్థం కవరుపై లోపల ఏ పదార్థం ఉంది అని రాస్తారో అదే ఉండాలి. ఏ పదార్థం లేదు అని రాస్తారో అది ఉండకూడదు. అలా కాకుండా పైకి ఒకటి రాసి, లోపల ఇంకోటి ఉండడం, ప్యాకింగ్, ఇతరత్రా లోపాలు ఈ కేటగిరీలోకి వస్తాయి. దీనికి 3 లక్షల వరకూ జరిమానా వేయవచ్చు.
హోటళ్ళ సంఘం ఏమంటోంది?
ఈ సోదాలపై హైదరాబాద్ హోటళ్ల, రెస్టారెంట్ల సంఘం అధ్యక్షులు కంచర్ల అశోక్ రెడ్డి బీబీసీతో మాట్లాడారు. ‘‘పాడైపోయిన, నాణ్యతలేని ఆహారం పెట్టడం వెయ్యి శాతం తప్పు. మా సంఘం తరపున ప్రతి మీటింగులో అది చెబుతాం. ఈ రోజుల్లో చాలా మంది ఉత్సాహంగా ఫుడ్ బిజినెస్ పెడుతున్నారు. వారికి ముందుగా ఆ చట్టం మీద అవగాహన కల్పించి, అప్పటికీ పాటించకపోతే అప్పుడు సోదాలు, కేసులు పెట్టవచ్చు. అంతేకానీ ఏ అవగాహనా కల్పించకుండా నేరుగా సోదాలు చేసి కేసులు, జరిమానాల వల్ల ఏం ప్రయోజనం ఉంటుంది? పైగా రిజిస్టర్ చేసుకుని, లైసెన్సులు తీసుకుని వ్యాపారం చేస్తున్నాం కాబట్టి మామీద ఇంత ఒత్తిడి. అసలు ఏ రిజిస్ట్రేషనూ లేకుండా, ఏ పన్నులూ చెల్లించకుండా ఉన్న వారిని ఎవరూ ఏమీ అనడం లేదు. అందరికీ ఒకే నిబంధన ఉండాలి. కొందరికి ఒకలా, మరికొందరికి మరోలా ఉండకూడదు కదా? గతంలో మేము సెమినార్లు పెట్టి అవగాహన కల్పించేవారం. కోవిడ్ తరువాత మా పరిశ్రమ బాగా దెబ్బతింది. మాకు ఎక్కడా మద్దతు దొరకలేదు. దీంతో మేం ఏం చేయలేకపోతున్నాం. ఒక ఫుడ్ బిజినెస్ చేయాలంటే పదుల సంఖ్యలో లైసెన్సులు తీసుకోవాలి. దానికే ఏళ్ళు గడచిపోతాయి. అందుకే ముఖ్యమైన నాలుగైదు లైసెన్సులు తీసుకుంటాం. దీనిని సింగిల్ విండో చేయమని ప్రభుత్వాన్ని అడిగినా చేయడం లేదు. రిజిస్టర్ చేయని హోటళ్లు పెరిగిపోయాయి. వాటి జోలికి ఎవరూ వెళ్లడం లేదు. ఫెయిర్ గేమ్ ఉండాలి కదా. అందరికీ ఒకటే నిబంధన కాకపోయినా ఆ పరిశ్రమకు తగ్గ నిబంధన అయినా ఉండాలి కదా.’’ అని ఆయన అన్నారు.
అన్ని నిబంధనలూ తెలియకపోవచ్చన్న హోటళ్ళ సంఘం వాదనతో జీహెచ్ఎంసీ అధికారులు ఏకీభవించడం లేదు. ‘‘చట్టంలో చాలా నిబంధనలు ఉన్నాయి. అవన్నీ కూడా మేం ఫోర్స్ చేయడం లేదు. కానీ కనీసం వంట గదిలో చెత్తబుట్ట మీద మూత పెట్టడం, వంటగది శుభ్రంగా ఉంచుకోవడం కూడా తెలియదా? మేము మినిమమ్ రిక్వైర్మెంట్స్ అడుగుతున్నాం. అయినప్పటికీ మేం ప్రతి హోటెల్ నుంచి ఒకరు చొప్పున సిబ్బందికి ఈ చట్టాలు, నిబంధనలపట్ల అవగాహన కల్పించాలని ప్రయత్నం చేస్తున్నాం. సాధారణంగా అందరూ చేసే రొటీన్ తప్పులు చెప్తాం.’’ అన్నారు జీహెచ్ఎంసీ అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ బాలాజీ రాజు.

స్ట్రీట్ ఫుడ్ సంగతేంటి?
ఈ సోదాల గురించి మాట్లాడే క్రమంలో పలువురు హోటళ్ల యజమానులు తమ అసంతృప్తిని వెల్లడించారు. ముఖ్యంగా వీధి వ్యాపారులు ఏ నాణ్యతా, శుభ్రతా పాటించకపోయినా వారినేమీ అనకుండా, అన్ని నిబంధనలూ పాటిస్తోన్న తమను లక్ష్యంగా చేసుకోవడాన్ని వారు తప్పు పడుతున్నారు.
‘‘మాకు ఫుడ్ సేఫ్టీ అతి ముఖ్యం. మేం అన్ని నిబంధనలూ పాటిస్తాం. కానీ భయంకరమైన అంటు వ్యాధులు ప్రబలే చోట ఆహారం తయారు చేసి అమ్ముతున్న వారి సంగతేంటి? మా శుభత్ర విషయంలో చిన్న లోపాలుంటే ఇంత చేసినప్పుడు, యూరినల్స్ పక్కనే ఫుడ్ అమ్ముతున్న వారిపై ఏం చర్యలు తీసుకున్నారు? మాపై సోదాలు మంచివే. తప్పు పట్టడం లేదు. కానీ వారి కంటే మేం వందల రెట్లు నయం కదా? అసలైన సమస్యను వదిలేసి మా వెంట పడితే ఏం వస్తుంది? ప్రజారోగ్యాన్ని ఎక్కువ పాడు చేస్తోంది వారు కదా.. మా దగ్గర ఉండేవి చిన్న చిన్న లోపాలు.. స్ట్రీట్ ఫుడ్ సేఫ్టీ ఎంత పెద్ద సమస్యో మీకు తెలుసు. అసలు సమస్యను వదిలేసి మావెనుక పడ్డారు. పన్నులు కట్టే వారిని ఇబ్బందిపెడుతున్నారు’’ అని బీబీసీతో అన్నారు మెహదీపట్నం దగ్గర హోటల్ నడుపుతున్న ఒక యజమాని.
‘‘మేం చెత్తకు కూడా అదనంగా వాణిజ్య పన్ను కడతాం. కరెంటు, వాటర్, గ్యాస్ అన్నీ వాణిజ్య చార్జీలు కడతాం. ఆఖరికి హోటెల్ పేరుతో బోర్డు పెడితే లక్ష రూపాయలు పన్ను అదనంగా కట్టించుకుంటున్నారు. జీఎస్టీ, ఇన్ కమ్ ట్యాక్స్ కడుతున్నాం. అన్ని నిబంధనలూ పాటిస్తున్నాం. ఆహారం నాణ్యంగా అందిస్తున్నాం. కానీ ఇవేవీ పాటించని చిరు వ్యాపారి మా హోటెళ్ళ ముందు వ్యాపారాలు నడుపుతున్నారు. వారిని ఎవరూ ప్రశ్నించరు. వారు రోడ్లపై చేతులు కడిగి ఆ నీళ్లు రోడ్లపై వదుల్తారు. సాయంత్రానికి చెత్త పట్టుకెళ్ళి రోడ్డు పక్కనే వేస్తారు. రోడ్ల మీద గెన్నెలు తోముతారు. మూతలు పెట్టరు. అసలు ప్రభుత్వానికి ఏ పన్నులూ కట్టరు. స్థానిక నాయకులకు డబ్బు ఇస్తారు అంతే. మేం పన్నులు కట్టి, చార్జీలు చెల్లించి వ్యాపారం చేస్తే ఇంతలా నిబంధనలు పెట్టేవారు, వీధి వ్యాపారులను శుభ్రత లేకపోయినా, లక్షల రూపాయల వ్యాపారం చేసినా ఒక్క రూపాయి పన్ను కట్టకపోయినా ప్రశ్నించరు?’’ అంటూ బీబీసీతో అన్నారు ఎస్ ఆర్ నగర్ కి చెందిన ఒక టిఫిన్ సెంటర్ యజమాని.
అయితే దీనిపై జీహెచ్ఎంసీ అధికారులు స్పందించారు. ‘‘మేం వీధి వ్యాపారులను మినహాయించబోం. వారికోసం మొబైల్ ఫుడ్ ల్యాబ్ ఉంది. బండి నిర్వాహకులను అందర్నీ పిలిచి వారికి అవగాహన కల్పిస్తాం. నూనె ఎన్నిసార్లు వాడవచ్చు, నీరు ఎలాంటిది వాడాలి వంటి విషయాలు చెబుతాం. ఈగలు వాలకుండా చూసుకోవడం వంటివి పక్కాగా పాటించాలని చెబుతాం. అలాగే వీధి వ్యాపారులు కూడా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. వీధి వ్యాపారులు ఎక్కువగా ఉండే ప్రదేశానికి వెళ్ళి, అక్కడే వారి ముందే ఆహార నాణ్యత పరీక్షించి, వారికి 30 రోజులు గడవు ఇస్తాం. ఆలోపు నాణ్యత సరిచేసుకోకపోతే, మొత్తానికి బండి తీయించేస్తాం’’ అని బీబీసీతో బాలాజీ రావు చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- ‘మా నాన్న సీఎం’
- రతన్ టాటాను పోలింగ్ కేంద్రానికి తీసుకెళ్లిన కుర్రాడు శంతను నాయుడు ఎవరు? వీరు క్లోజ్ ఫ్రెండ్స్ ఎలా అయ్యారు?
- తాడిపత్రి గ్రౌండ్ రిపోర్ట్: పోలింగ్ హింసకు ముందు, తర్వాత జరిగిన పరిణామాలు ఏంటి?
- బైకుల మీద వచ్చి ఒకే ఊరిలో 160 మంది కిడ్నాప్, 10 మంది కాల్చివేత... అక్కడేం జరిగింది?
- #UnseenLives: వెనక 40 మంది పురుషులున్నా, నేను ఆ మరకను దాచుకోలేదు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














