దిల్లీలో 52.3 డిగ్రీలు నమోదు, ఈ వేడిని మన శరీరం తట్టుకోగలదా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, మెరిల్ సెబాస్టియన్, క్యాథరిన్ ఆర్మ్‌స్ట్రాంగ్
- హోదా, బీబీసీ న్యూస్
దిల్లీలో బుధవారం 52.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. దీన్ని ప్రభుత్వం ధ్రువీకరిస్తే, భారత్‌లో ఇప్పటివరకు నమోదైన గరిష్ఠ ఉష్ణోగ్రతగా ఇది రికార్డులకు ఎక్కుతుంది.
దిల్లీలోని ముంగేశ్‌పూర్ ప్రాంతంలో ఈ స్థాయి ఉష్ణోగ్రత నమోదుకావడంతో ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్‌మెంట్ (ఐఎండీ) అధికారులు దీనిపై స్పందించారు.
నగరంలోని ఇతర ప్రాంతాల్లో 42.5 నుంచి 49.1 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని, వీటితో పోల్చితే ముంగేశ్‌పూర్ ఉష్ణోగ్రత లెక్కలు భిన్నంగా కనిపిస్తున్నాయని ఐఎండీ పేర్కొంది.
‘‘ఇది సెన్సర్‌లో లోపం కావచ్చు లేదంటే స్థానిక పరిస్థితుల ప్రభావం కావచ్చు. మేం ఈ డేటాపై విశ్లేషణ జరుపుతున్నాం’’ అని ఐఎండీ ఒక ప్రకటనలో తెలిపింది.
ముంగేశ్‌పూర్ ప్రాంతంలో నమోదైన 52.3 డిగ్రీల ఉష్ణోగ్రతను ధ్రువీకరించడానికి ఒక బృందాన్ని అక్కడికి పంపినట్లు ఐఎండీ అధికారి సోమసేన్ రాయ్ చెప్పారు.
సెన్సర్‌లో లోపాలు ఉన్నాయా లేవా అన్నది పక్కనబెట్టినా ఉత్తర, మధ్య భారతంలోని కొన్ని ప్రాంతాలు తీవ్రమైన హీట్‌వేవ్‌తో సతమతం అవుతున్నాయి.
ఈ వారంలో దేశంలోని 37కు పైగా నగరాల్లో 45 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ఎండలు మండిపోతుండటంతో వడదెబ్బ వంటి అనారోగ్యాల బారిన పడకుండా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పటివరకు ముగ్గురు చనిపోయినట్లు నివేదికలు వచ్చాయి.

ఫొటో సోర్స్, Getty Images
కార్లు కడిగితే ఫైన్
దిల్లీ నగరంలో నీటి ఎద్దడి ఉన్నందున ఎవరైనా నీటిని వృథా చేస్తున్నట్లు తేలితే జరిమానాలు విధిస్తామని నగర పాలక అధికారులు హెచ్చరించారు. కొన్ని ప్రాంతాల్లో నీటి సరఫరా నిలిచిపోయింది.
పైపులతో కార్లు కడగటం, నీటి ట్యాంకులు నిండిపోతున్న పట్టించుకోకపోవడం వంటి వాటిని నిరోధించేందుకు 200 బృందాలను మోహరిస్తామని జల వనరుల మంత్రి అతిషి ప్రకటించారు.
‘‘గత రెండు రోజులుగా వేడి బీభత్సంగా ఉంది. రోజులు గడుస్తున్నకొద్ది ఇది మరింత దారుణంగా మారింది’’ అని దిల్లీ నివాసి, బీబీసీ బిజినెస్ ప్రతినిధి అరుణోదయ్ ముఖర్జీ అన్నారు.
వేడి కారణంగా సరిగ్గా తినలేకపోతున్నాని, కనీసం బయట నిలబడలేకపోతున్నామని ఏఎన్‌ఐ వార్తా సంస్థతో దిల్లీకి చెందిన ఒక వ్యక్తి అన్నారు.
‘‘గతంలో కూడా ఎండలు ఉండేవి. కానీ, ఈసారి వేడిని తట్టుకోలేకపోతున్నాం’’ అని ఆయన అన్నారు.
వేడికి తాళలేక ప్రజలంతా ఏసీలు, కూలర్లు, ఫ్యాన్ల వాడకం పెంచడంతో నగరంలో విద్యుత్ డిమాండ్ ఆల్‌టైమ్ గరిష్ఠానికి చేరుకుంది.
ఎండ కారణంగా ఏసీ లేకుండా పని చేయడం కష్టంగా ఉందని న్యాయమూర్తి చెప్పడంతో ఒక వినియోగదారుల కోర్టు మంగళవారం కేసుల విచారణను నిలిపేసింది.

ఫొటో సోర్స్, Getty Images
రెడ్ అలర్ట్
దిల్లీతో సహా భారత్‌లోని అనేక ప్రాంతాల్లో రెడ్ అలర్ట్స్‌ను జారీ చేశారు. అంటే, ఈ ప్రాంతాల్లో నివసించే ప్రజలు వడదెబ్బ, ఎండకు సంబంధించిన ఇతర అనారోగ్యాల బారిన పడే ప్రమాదం చాలా ఎక్కువ.
హీట్‌వేవ్ సమయంలో వైద్యుల వద్దకు ప్రజల రాకపోకలు పెరిగాయని బీబీసీతో దిల్లీకి చెందిన ఫ్యామిలీ డాక్టర్ చంద్రకాంత్ లహరియా చెప్పారు.
నిర్మాణ రంగంలో పనిచేసే వలస కూలీలు, దినసరి కార్మికులతో పాటు వృద్ధులపై ఈ అధిక ఉష్ణోగ్రతలు ప్రభావం దారుణంగా ఉంటుందని ఆయన అన్నారు.
నిర్మాణ కార్మికులకు వేతనంతో కూడిన మూడు గంటల విరామం ఇవ్వాలని, తాగునీరు అందుబాటులో ఉంచాలని దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ఆదేశించారు.
బస్టాండ్లలో కూడా మంచినీటి కుండలను ఏర్పాటు చేయాలని కోరారు.
రాజస్థాన్ నుంచి వేడి గాలులు రావడమే దిల్లీలో ఉష్ణోగ్రతలు పెరగడానికి కారణమని ఐఎండీ రీజినల్ హెడ్ కుల్దీప్ శ్రీవాస్తవ చెప్పారు.
రాజస్థాన్‌లోని చురు, హరియాణాలోని సిర్సా ఏరియాలో 50 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
మంగళవారం వడదెబ్బ కారణంగా రాజస్థాన్‌లోని జైపూర్‌లో ముగ్గురు చనిపోయారు.
బిహార్‌లోని షేక్‌పురాలో ఎండ వేడికి తాళలేక పలువురు విద్యార్థులు స్పృహతప్పి పడిపోయారని స్థానిక మీడియా నివేదించింది.
ఎండలు ఎక్కువగా ఉండటంతో బిహార్ ప్రభుత్వం స్కూళ్లకు జూన్ 8 వరకు సెలవులు ప్రకటించినట్లు ఎన్డీటీవీ రిపోర్ట్ చేసింది.

ఫొటో సోర్స్, Getty Images
వడగాల్పులు
ఐఎండీ చీఫ్ మృత్యుంజయ్ మొహాపాత్ర ప్రకారం, జూన్‌లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువ నమోదయ్యే అవకాశం ఉంది. వాయువ్య భారతంలో నాలుగు నుంచి ఆరు రోజుల వరకు వడగాల్పులు వీచే అవకాశం ఉందని అన్నారు.
భారత్‌లో సాధారణంగా వేసవి కాలమైన మార్చి నుంచి సెప్టెంబర్ వరకు వేడి, ఉక్కపోత వాతావరణం ఉంటుంది.
అయితే, ఈ ఏడాది దేశంలో మరింత తీవ్రంగా, ఎక్కువ కాలం పాటు వడగాల్పులు వీస్తాయని వాతావరణ శాఖ చెప్పింది.
ఈ నెలలో రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లో 9 నుంచి 12 రోజుల వరకు హీట్‌వేవ్ కొనసాగిందని, అక్కడ 45-50 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని తెలిపింది.
గ్లోబల్ వార్మింగ్ కారణంగా భారత్‌లో తీవ్రమైన హీట్‌వేవ్‌లు తరచుగా మారాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
దిల్లీలో పచ్చదనం లేకపోవడం, ట్రాఫిక్, నిర్మాణ రంగం ఈ సమస్యకు అదనంగా తోడయ్యాయని చెప్పింది.
విపరీతమైన వేడిని తట్టుకోవడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ? ప్రాణాల మీదకు రాకుండా ఎలా కాపాడుకోవాలి?
ఈ అంశాలను బీబీసీ సైన్స్ అండ్ హెల్త్ కరస్పాండెంట్ జేమ్స్ గళ్లఘర్ వివరిస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
మన శరీరాన్ని వేడి ఎలా ప్రభావితం చేస్తుంది?
మన శరీర సాధారణ ఉష్ణోగ్రత 37.5 డిగ్రీల సెల్సియస్. ఈ ఉష్ణోగ్రత వద్ద మానవ శరీరం ఏ ఇబ్బంది లేకుండా సక్రమంగా పని చేస్తుంది.
మంచు తుఫాను లేదా వడగాడ్పుల్లో చిక్కుకున్నప్పుడు ఈ సాధారణ ఉష్ణోగ్రతను మెయింటెయిన్ చేయడానికి శరీరం సతమతమవుతుంటుంది.
బయట వాతావరణంలో వేడి పెరిగిపోతుంటే శరీరంలో 37.5 డిగ్రీల సెల్సియస్ కొనసాగించడానికి లోపల్లోపల యుద్ధం జరుగుతూ ఉంటుంది.
ఫలితంగా, అధిక వేడిని బయటకు విడుదల చేయడం కోసం చర్మంలో ఉన్న రక్తనాళాలు మరిన్ని తెరుచుకుంటాయి. అందుకే మనకు చెమట పడుతుంది. చెమట పడుతున్నకొద్దీ శరీరంలో వేడి తగ్గుతుంటుంది.

ఫొటో సోర్స్, Getty Images
సమస్య ఎప్పుడు మొదలవుతుంది?
బయట ఉష్ణోగ్రతలు పెరుగుతున్నకొద్దీ శరీరంపై ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది. రక్తనాళాలు ఎక్కువగా తెరుచుకుంటూ ఉంటే రక్తపోటు (బీపీ) తగ్గుతుంటుంది. దీనివల్ల గుండెపై భారం పెరుగుతుంది. శరీరానికి కావలసిన రక్తాన్ని సరఫరా చేయడానికి గుండె వేగం పెరుగుతుంది.
దీంతో చిన్నచిన్న సమస్యలు మొదలవుతాయి. చెమట పొక్కులు రావడం, కాళ్ల వాపులాంటివి ఏర్పడతాయి. రక్తనాళాల్లోంచి నీరు కూడా విడుదల అవుతుంటుంది కాబట్టి కాళ్లల్లో నీరు చేరి వాచినట్టు ఉంటుంది.
రక్తపోటు బాగా తగ్గిపోతే, అవయవాలకు కావలసిన రక్తం చేరుకోదు. హార్ట్ అటాక్ వచ్చే ప్రమాదం ఉంటుంది.
మరోపక్క, చెమటలు ఎక్కువగా పట్టడం వలన, శరీరం నుంచి ద్రవాలు, లవణాలు ఎక్కువగా బయటకి వెళిపోతాయి. శరీర సమతౌల్యం దెబ్బతింటుంది. దాంతో పాటు బీపీ బాగా పడిపోతే వడదెబ్బ తగులుతుంది.
వడదెబ్బ లక్షణాలు:
- మైకం కమ్మడం
- మూర్ఛ రావడం
- గందరగోళం
- అనారోగ్యం
- కండరాలు తిమ్మిరెక్కడం
- తలనొప్పి
- విపరీతమైన చెమట
- అలసట, నీరసం

ఫొటో సోర్స్, Getty Images
వడదెబ్బ తగిలితే ఏం చేయాలి?
వడదెబ్బ తగిలిన వ్యక్తులు అరగంటలో తేరుకుని, లేచి కూర్చోగలిగితే పెద్ద ప్రమాదం ఉండదు.
ఆరోగ్య నిపుణులు ఇచ్చే సలహాలు:
వడదెబ్బ తగిలిన వ్యక్తిని వెంటనే నీడలోకి లేదా చల్లని ప్రదేశానికి తరలించాలి.
వారిని పడుకోబెట్టి కాళ్లు కాస్త పైకి ఉండేలా చూడాలి.
బాగా నీరు లేదా చల్లని పానీయాలు తాగించాలి.
శరీరాన్ని చల్లబరిచేందుకు నీళ్లు చిలకరించడం లేదా తడిబట్ట/స్పాంజితో తుడవాలి
శరీర ఉష్ణోగ్రతను తగ్గించేందుకు మెడ కింద, చంకల్లో ఐసు ముక్కలు లేదా కోల్డ్ కంప్రెస్ పెట్టడం కూడా మంచిదే.
అయితే, వడదెబ్బ తగిలిన అరగంటలో ఆ వ్యక్తి కోలుకోకపోతే గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి, వెంటనే డాక్టర్ దగ్గరకి తీసుకెళ్లాలి
వడదెబ్బ తగిలినవారికి ఒక్కోసారి చెమటలు పట్టకపోవచ్చు. శరీరం మరీ వేడెక్కిపోతే చెమటలు పట్టవు. అంటే శరీర ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్ దాటిపోతే మూర్ఛ రావొచ్చు లేదా స్పృహ కోల్పోవచ్చు.

ఫొటో సోర్స్, Getty Images
వడదెబ్బ తగిలే ప్రమాదం ఎవరికి ఎక్కువగా ఉంటుంది?
ఆరోగ్యంగా ఉన్నవారికి ఉష్ణోగ్రతలు పెరిగినా వడదెబ్బ తగలకపోవచ్చు. కానీ, వృద్ధులకు, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు, గుండె జబ్బులతో బాధ పడేవారికి వడదెబ్బ తగిలే ప్రమాదం ఎక్కువ.
వాతావరణంలో వేడి, శరీరంపై పెంచే ఒత్తిడిని వీరు తట్టుకోలేకపోవచ్చు.
డయాబెటిస్ టైప్1, టైప్ 2 ల వల్ల శరీరం వేగంగా నీటిని కోల్పోతుంది. దీర్ఘకాలిక వ్యాధుల కారణంగా రక్తనాళాల్లో మార్పులు వచ్చి చెమట పట్టే సామర్థ్యం తగ్గిపోవచ్చు.
ముందుగా, శరీరంలో ఉష్ణోగ్రత అధికంగా ఉందని, చల్లబరచుకోవడానికి ఏదైనా చేయాలని గ్రహించగలగడం చాలా ముఖ్యం.
మనలో చాలామంది దీన్ని గుర్తించరు. సర్దుకుంటుందిలే అనుకుంటాం. అదే పొరపాటు. వేడి చేసిందని తెలియగానే నీరు ఎక్కువగా తాగుతూ, నీడలో ఉంటూ విశ్రాంతి తీసుకోవాలి.
పసి కందులకు, పిల్లలకు కూడా వడదెబ్బ తగిలే అవకాశాలు ఎక్కువే.
డెమెంటియా లాంటి మెదడుకు సంబంధించిన వ్యాధులతో బాధపడేవారు శరీర ఉష్ణోగ్రతల్లో మార్పులు గుర్తించలేరు. వీరికి కూడా వడదెబ్బ తగిలే అవకాశాలు అధికంగా ఉంటాయి.
సరైన వసతి లేనివారు, ఇల్లు లేక రోడ్ల మీద ఉండేవారికి వేడి తాకిడి ఎక్కువగా ఉంటుంది.
భవనాల పై అంతస్తుల్లో నివసించేవారు చాలా జాగ్రత్తగా ఉండాలి.
కొన్ని మందులు ప్రమాదాన్ని పెంచుతాయా?
నిజమే. కానీ, వైద్యుల సలహా తీసుకోకుండా మందులు ఆపేయకూడదు. నీరు ఎక్కువగా తాగుతూ, ఎండకు దూరంగా ఉంటూ జాగ్రత్తగా ఉండాలి.
డైయూరెటిక్స్ అంటే మూత్ర విసర్జన పెంచే మందుల వల్ల శరీరంలోని నీరు అధికంగా బయటకు పోతుంటుంది. ఈ మందులను అధిక రక్తపోటు తగ్గించేందుకు, గుండె జబ్బులను నివారించేందుకు కూడా వాడతారు.
కానీ, వీటి వల్ల డీహైడ్రేషన్ కూడా అవ్వొచ్చు, శరీరంలో లవణాల సమతౌల్యం దెబ్బతినొచ్చు.
రక్తపోటును తగ్గించే యాంటీ హైపర్‌టెన్సివ్ మందుల వలన కూడా సమస్యలు రావొచ్చు. వాతావరణంలో అధిక ఉష్ణోగ్రతలు ఉన్నప్పుడు శరీరంలో బీపీ తగ్గుతుంటుంది. ఈ మందులు బీపీ స్థాయిని మరింత తగ్గించేస్తే ప్రమాదం ముంచుకొస్తుంది.
ఎపిలెప్సీ, పార్కిన్సన్స్‌లకు వాడే మందులు చెమట పట్టకుండా నిరోధించవచ్చు. ఫలితంగా, శరీరం చల్లబడే అవకాశాలు తగ్గిపోతాయి.
శరీరం ఎక్కువగా ద్రవాలు, లవణాలను కోల్పోయినప్పుడు లిథియం, స్టాటిన్స్ లాంటి ఇతర ఔషధాలు రక్తంలో సాంద్రతను పెంచి మరిన్ని సమస్యలకు దారి తీయవచ్చు.

ఫొటో సోర్స్, Getty Images
వడగాడ్పులు ప్రాణాంతకమా?
అవును. ప్రతి సంవత్సరం అధిక ఉష్ణోగ్రతల వలన వేలమంది ప్రాణాలు కోల్పోతున్నారు. శరీర ఉష్ణోగ్రతలను స్థిరంగా ఉంచే ప్రయత్నంలో గుండె పోటు, స్ట్రోకులు వస్తాయి.
అయితే, మండు వేసవిలో కన్నా వసంతంలో లేదా గ్రీష్మం ఆరంభంలో వచ్చే అధిక ఉష్ణోగ్రతల కారణంగానే ఎక్కువమంది చనిపోతున్నారని డాటా సూచిస్తోంది.
దీనికి కారణం వాతావరణంలో వచ్చే ఆకస్మిక మార్పులే కావొచ్చు. వేసవి పెరుగుతున్నకొద్దీ ఎండలతో ఎలా వేగాలో మనం నేర్చేసుకుంటాం. గతంలో జరిగిన పరిణమాలను గమనిస్తే వడగాడ్పులు వీచడం ప్రారంభమైన మొదటి 24 గంటల్లో అధిక మరణాలు సంభవించాయని తెలుస్తోంది.
మంచు తుఫానులు వచ్చినప్పుడు దీనికి వ్యతిరేకంగా జరుగుతుంది. ఆరంభంలో బాగానే ఉంటుంది. చలి పెరుగుతున్నకొద్దీ ప్రాణాంతకం అవుతుంది.
పగలు, రాత్రి ఉష్ణోగ్రతల్లో మార్పులు
సాధారణంగా పగటి ఉష్ణోగ్రతలే అధికంగా ఉంటాయిగానీ రాత్రి ఉష్ణోగ్రతలు కూడా కీలకమే. ఎందుకంటే శరీరానికి విశ్రాంతి కావాలి. శరీరం ఉష్ణోగ్రతను స్థిరంగా నిలపడానికి పగలనక, రాత్రనక కుస్తీ పడుతుంటే అనారోగ్య సమస్యలు పెరుగుతాయి.
రాత్రయినా ఈ పని నుంచి శరీరానికి విశ్రాంతి కావాలి.

ఫొటో సోర్స్, Getty Images
వడగాడ్పులను ఎలా ఎదుర్కోవాలి?
ఒక్కటే మార్గం..నీడ పట్టున ఉండాలి, బాగా నీరు తాగాలి. వేసవి సెలవులను ఆహ్లాదంగా గడపాలంటే మన అలవాట్లను కొద్దిగా మార్చుకోవాలి.
10 కి.మీ. మారథాన్ పరిగెత్తాలనిపిస్తే, పగలో, మిట్ట మధ్యాహ్నమో పరిగెత్తడం అవసరమా లేక సాయంత్రం చల్లబడ్డాక పరిగెత్తడమా అనేది మీరే నిర్ణయించుకోవాలి.
బాగా నీరు తాగుతూ ఉండాలని గుర్తు పెట్టుకోండి. పాలు, టీ, కాఫీలైనా తాగొచ్చు. కానీ ఆల్కాహాల్ మాత్రం బాగా తగ్గించాలి. ఆల్కాహాల్ శరీరాన్ని డీహైడ్రేట్ చేస్తుందని గుర్తుంచుకోవాలి.
మీ చుట్టూ చల్లగా ఉండేలా చూసుకోండి. బయట ఎండ మండిపోతుంటే ఇంట్లోనే ఉండండి. తలుపులు, కర్టెన్లు వేసుకుని చల్లగా ఉండేలా చూసుకోండి.
లేదూ, బయటకి వెళ్లాల్సిందే అనుకుంటే పార్కుకు వెళ్లి చెట్ల కింద నీడ పట్టున కూర్చోండి. కాస్త చల్లగాలి తగిలేలా చూసుకోండి.
ఇవి కూడా చదవండి:
- వాజ్‌పేయికి ఇచ్చిన మాట తప్పామని నవాజ్ షరీఫ్ ఎందుకు అన్నారు?
- అంతరించి పోయిందనుకున్న ఈ ‘పర్వత రత్నం’ మళ్లీ కనిపించింది, ఎక్కడంటే..
- బెంగళూరు రేవ్ పార్టీ కేసు: పోలీసులు ఏం చెప్పారు? అసలు రేవ్ పార్టీ అంటే ఏంటి? అందులో ఏం చేస్తారు?
- ఓవర్సీస్ హైవే: సముద్రంలో 182 కిలోమీటర్ల రోడ్డు.. ప్రపంచంలో 8వ వింత ఇదేనా?
- #UnseenLives: వెనక 40 మంది పురుషులున్నా, నేను ఆ మరకను దాచుకోలేదు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














