‘బాయ్‌కాట్ బాలీవుడ్’ పదం ఎందుకు ట్రెండ్ అయింది? బాలీవుడ్ నటులు ఏం చేశారు?

అలియా,కరీనా తదితరుల ఫోటో

ఫొటో సోర్స్, GETTY IMAGES

‘బాయ్‌కాట్ బాలీవుడ్’ పదం మరోసారి ‘ఎక్స్’ (ట్విటర్‌)లో ట్రెండయింది.

అనేక మంది బాలీవుడ్ నటులు ‘ఆల్ ఐస్ ఆన్ రఫా’ అనే పోస్టర్‌ను సామాజిక మాధ్యమాలలో షేర్ చేశాక ఈ ట్రెండ్ మొదలైంది.

రఫాలో పాలస్తీనీయుల శరణార్థి శిబిరంపై ఆదివారం నాడు ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసింది. సుమారు 45 మంది చనిపోయారు.

దీని తరువాత ప్రపంచం నలుమూలల నుంచి గాజాలో తక్షణం కాల్పుల విరమణ పాటించాలనే వినతులు రావడం మొదలైంది.

‘ఆల్ ఐస్ ఆన్ రఫా’ అనే పోస్టర్‌ను సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున షేర్ చేయడం మొదలైంది. పలువురు బాలీవుడ్ నటులు కూడా ఇందులో పాలుపంచుకున్నారు.

అక్టోబర్ 7న హమాస్ దాడి తరువాత గాజాలో ఇజ్రాయెల్ సైన్యం భూతల ఆపరేషన్ మొదలుపెట్టింది. ఇప్పుడీ దాడులు లక్షలాది మంది పాలస్తీనీయులు శరణార్థులుగా ఉన్న రఫాలోనూ సాగుతున్నాయి.

ఆల్ ఐస్ ఆన్ రఫా

ఫొటో సోర్స్, GETTY IMAGES

బాలీవుడ్ నటులు ఏం రాశారు?

బాలీవుడ్ నటి అలియా భట్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో హ్యాష్‌టాగ్ ‘ఆల్ ఐస్ ఆన్ రఫా’తోపాటు ఓ చిత్రాన్ని షేర్ చేశారు.

'పిల్లలందరూ ప్రేమ, శాంతి, భద్రతకు అర్హులు. తమ పిల్లలకు ఇవ్వన్నీ ఇచ్చే హక్కు ప్రతి తల్లికి ఉంది' అని రాశారు.

మరో నటి కరీనా కపూర్ యూనిసెఫ్ పోస్టును షేర్ చేశారు.

‘రఫాలో శరణార్థి శిబిరాలపై బాంబు దాడులు, కాలిన చిన్నారులు, కుటుంబాల చిత్రాలు అందరినీ దిగ్భ్రాంతికి గురిచేశాయి’ అని ఆ పోస్టులో ఉంది.

తక్షణ కాల్పుల విరమణ పాటించాలని ఆ పోస్టులో యూనిసెఫ్ డిమాండ్ చేసింది. కరీనా‌కపూర్ యూనిసెఫ్‌కు ఇండియాలో బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నారు.

‘ఆకలితో అలమటిస్తూ గాజాలో చిక్కుకుపోయిన ప్రజలపై ఇజ్రాయెల్ మారణహోమానికి పాల్పడుతోంది. పిల్లలను, మహిళలను, గర్భవతులను, అమాయక పౌరులను, జర్నలిస్టులను, డాక్టర్లను చంపుతోంది. ఇది మారణహోమమే. దీనికి వేరే పదం లేదు. దీనిని కచ్చితంగా ఖండించాలి. ప్రపంచం కేవలం దీనిని గమనిస్తే అందులో భాగస్వామి అయినట్టే’ అంటూ రిచాచద్దా స్పందించారు.

ప్రియాంక చోప్రా, సోనమ్ కపూర్, మలైకా అరోరా, త్రిప్తి దిమ్రి, సోనాక్షి సిన్హా, భూమి ఫడ్నేకర్, రష్మిక మందన్న, స్వరభాస్కర్ కూడా ఆల్ ఐస్ ఆన్ రఫా’ చిత్రాన్ని షేర్ చేశారు.

బాలీవుడ్ నటి

ఫొటో సోర్స్, GETTY IMAGES

‘బాయ్‌కాట్ బాలీవుడ్’ ట్రెండ్

బాలీవుడ్ సెలబ్రిటీలు రఫాపై దాడులు ఆపాలనే పోస్టులు పెట్టాక ఎక్స్‌లో ‘బాయ్‌కాట్ బాలీవుడ్’ ట్రెండింగ్ మొదలైంది.

బాలీవుడ్ నటులు హమాస్ హింసను ఎందుకు చూడలేకపోతున్నారని ఈ ట్రెండ్‌కు మద్దతు ఇచ్చిన నెటిజన్లు ప్రశ్నించారు.

పాలస్తీనాలో హింసకు వ్యతిరేకంగా బాలీవుడ్ ముక్తకంఠంతో మాట్లాడినందుకు మూల్యం చెల్లించుకుంటోంది’ అని ‘బాయ్‌కాట్ బాలీవుడ్’ స్క్రీన్ షాట్‌ను షేర్ చేస్తూ పూజాభట్ రాశారు.

మీడియా కథనాల ప్రకారం భారత క్రికెట్ కెప్టెన్ రోహిత్ శర్మ భార్య రితికా సజ్దె కూడా ‘ఆల్ ఐస్ ఆన్ రఫా’ చిత్రాన్ని షేర్ చేసి తరువాత డిలీట్ చేశారు.

దీని తరువాత ఎక్స్’లో రోహిత్ శర్మ పేరు ట్రెండింగ్‌లోకి వచ్చింది. రితిక సజ్దే రోహిత్ శర్మ కెరీర్‌ను నాశనం చేస్తోందని రాయగా, మరికొందరు రోహిత్‌కు అండగా నిలబడ్డారు.

క్రికెటర్ యజువేంద్ర చాహాల్ భార్య ధనశ్రీ కూడా ‘ఆల్ ఐస్ ఆన్ రఫా’ ఫోటోను తన ఇన్‌స్టా స్టోరీలో పోస్టు చేశారు.

ఆల్ ఐస్ ఆన్ రఫా

ఫొటో సోర్స్, SOCIALMEDIA

ఇజ్రాయెల్ ఎంబసీ ఏం చెప్పింది?

'ఆల్ ఐస్ రఫా' ప్రచారంపై భారత్‌లోని ఇజ్రాయెల్ ఎంబసీ స్పందించింది.

హమాస్ బందీలుగా పట్టుకుపోయిన ఇజ్రాయెలీలను ఈ ప్రచారం చేసే వాళ్లు చూడటం లేదని పేర్కొంది.

‘‘హమాస్ వద్ద బందీలుగా ఉన్న 125 మంది పురుషులు, మహిళలు, పిల్లలు, వృద్ధులను మీ కళ్ళు చూడలేవు. ఇదే సంఘర్షణను ప్రారంభించింది. కామెంట్లు చేసే ముందు విషయం పూర్తిగా తెలుసుకోవాలి. ప్రతి బందీ తిరిగొచ్చేదాకా మేం విశ్రాంతి తీసుకోం’’ అని ఇండియాలోని ఇజ్రాయెల్ ఎంబసీ తన పోస్టులో రాసింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)