‘సింగపూర్ ఎయిర్‌లైన్స్ విమానం 5 సెకన్లలో 178 అడుగులు కిందికి పడిపోయింది’

ఫొటో సోర్స్, Eva Khoo
- రచయిత, కెల్లీ ఎన్‌జీ, హన్నా రిచీ,
- హోదా, బీబీసీ ప్రతినిధులు
గత మంగళవారం (మే 21) ఆకాశంలో తీవ్ర కుదుపులకు గురైన విమానం 4.6 సెకన్లలో సుమారు 178 అడుగులు కిందికి పడిపోయిందని ప్రాథమిక దర్యాప్తులో తేలినట్టు సింగపూర్ ఎయిర్‌లైన్స్ వెల్లడించింది.
ఫ్లైట్ డేటా రికార్డర్, కాక్‌పిట్ వాయిస్ రికార్డర్ నుంచి సింగపూర్ దర్యాప్తు అధికారులు సమాచారం సేకరించారు. దాని ఆధారంగా ఈ అంచనాకు వచ్చారు.
ఈ విమానం లండన్ నుంచి సింగపూర్ వెళ్తుండగా తీవ్ర కుదుపులకు గురైంది.
ఆ విమానంలో ప్రయాణించిన వాళ్లు, వాళ్ల బంధువులు ఆ ఘటనను ఇంకా మర్చిపోలేకపోతున్నారు.
తన కుటుంబ సభ్యులు ప్రయాణిస్తున్న సింగపూర్ ఎయిర్‌లైన్స్ విమానం “ఒక అనుకోని అవాంతరాన్ని ఎదుర్కొంది” అని గత వారం ఎవా ఖూకు ఫోన్ కాల్ వచ్చింది. ఆమె భయపడాల్సిన అవసరం లేదని అవతలి వైపు ఫోన్‌లో ఉన్నవాళ్లు చెప్పారు.
సోదరుడు, గర్భవతి అయిన సోదరుని భార్య, నలుగురు బంధువులు, ఒక స్నేహితురాలు కలిసి సింగపూర్ వెళ్తున్న ఆ విమానం బ్యాంకాక్‌లో అత్యవసరంగా ల్యాండ్ అయిన కొన్ని గంటల తర్వాత కానీ 47 ఏళ్ల ఎవా వారితో మాట్లాడలేకపోయారు.
చివరికి ఆమె ఆ రోజు రాత్రి తన సోదరుడితో మాట్లాడినప్పుడు, వారంతా ఐసీయూలో ఉన్నారని తెలుసుకున్నారు.
“ఆ తర్వాత నాకు తన నుంచి ఏ కాల్ రాలేదు. అది నన్ను మరింత ఆందోళనకు గురిచేసింది” అని బీబీసీకి ఆమె తెలిపారు.
ఆ తర్వాత సోదరుని భార్య ఆమెకు ఫోన్ చేసి, తాను కూడా ఆసుపత్రిలోనే ఉన్నానని, అయితే మిగతా వారు ఎక్కడ ఉన్నారో తనకు తెలీదని చెప్పారు.
మే 21న సింగపూర్ ఎయిర్‌లైన్స్ విమానంలో తీవ్రమైన కుదుపుల కారణంగా ఇద్దరు సిబ్బంది, ఒక పసిబిడ్డ సహా దాదాపు 50 మంది ఆసుపత్రిలో చేరారు. తీవ్రంగా గాయపడిన 20 మందికి పైగా ప్రయాణికులను ఇంటెన్సివ్ కేర్‌లో చేర్చారు. ఈ ఘటనలో ఒక ప్రయాణికుడు మరణించారు.
"మా వాళ్లు చనిపోయారా లేదా సజీవంగా ఉన్నారా, వాళ్ల గాయాలు ఎంత తీవ్రంగా ఉన్నాయో నాకు తెలియలేదు" అని ఎవా అన్నారు.
మరుసటి రోజు, మొత్తం ఏడుగురు బ్యాంకాక్‌లోని ఆసుపత్రిలో ఉన్నట్లు ఆమెకు తెలిసింది. వాళ్లలో ఐదుగురు సమితివేజ్ శ్రీనకరిన్ ఆసుపత్రిలో ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో చికిత్స పొందుతున్నారు.
ఆమె తాను నివసించే కౌలాలంపూర్ నుంచి థాయ్‌లాండ్ వెళ్లాలని నిర్ణయించుకున్నారు.
"చివరకు నేను వాళ్లను కలుసుకున్నప్పుడు కానీ నాకు ఉపశమనం దొరకలేదు. కానీ వీపు, వెన్నెముకకు అయిన గాయాల కారణంగా వాళ్లలో చాలామంది వీపు, మెడకు పట్టీలు వేసుకోవడం చూసి నేను చాలా భయపడ్డాను’’ అని చెప్పారు ఎవా.
విమానంలో అసలు ఏం జరిగిందో తెలుసుకోవడానికి ఆమె మరికొన్ని రోజులు ఆగాల్సి వచ్చింది.

ఫొటో సోర్స్, Ali Bukhari
‘వస్తువులన్నీ గాలిలో తేలుతున్నాయి’
ఖూ బూ లియోంగ్, ఆయన భార్య సా రోంగ్ తమ రెండు వారాల స్విట్జర్లాండ్, లండన్ పర్యటన నుంచి మలేషియాకు తిరిగి వెళుతున్నారు.
వాళ్ల విమానం మధ్యలో సింగపూర్‌లో ఆగాల్సి ఉంది. విమానంలో 211 మంది ప్రయాణికులు, 18 మంది సిబ్బంది ఉన్నారు.
వాళ్లు మయన్మార్‌లోని ఇరావాడి బేసిన్ మీదుగా ప్రయాణిస్తున్నప్పుడు విమానంలో భారీ కుదుపులు వచ్చాయి.
విమానం కంపించడం మొదలైందని తన సోదరుడు గుర్తు చేసుకున్నారని ఎవా చెప్పారు.
"ఆయన తన సీటు బెల్టు పెట్టుకోవడానికి ప్రయత్నిస్తుండగానే, తల ఓవర్‌హెడ్ లగేజీ కంపార్ట్‌మెంట్‌ను కొట్టుకుంది. కొన్ని సెకన్ల తర్వాత ఆయన కింద పడిపోయారు. వాళ్ల వస్తువులన్నీ చిందరవందరగా పడిపోయాయి” అని ఆమె చెప్పారు.
సంఘటన జరిగినప్పుడు లియోంగ్, ఆయన భార్య విమానం మధ్యలో కూర్చున్నారు.
టర్బులెన్స్ కారణంగా రెండు నెలల గర్భిణి అయిన ఆయన భార్య సా సీటులోంచి ఎగిరిపడ్డారు. దీని ప్రభావంతో ఆమె వెన్నెముక ఫ్రాక్చర్ అయి, శస్త్రచికిత్స చేయాల్సి వచ్చింది.
తన భార్య కెర్రీ జోర్డాన్‌తో కలిసి కొన్ని వరుసల ముందు కూర్చున్న కీత్ డేవిస్, తమను "సున్నా-గురుత్వాకర్షణ స్థితి"లోకి విసిరేసినట్లు అనిపించిందని గుర్తు చేసుకున్నారు.
“మేం అంతరిక్షంలోకి దూసుకుపోతున్నట్లు, గాలిలో తేలుతున్నట్లు అనిపించింది” అని బ్యాంకాక్‌లోని ఆసుపత్రి నుంచి బీబీసీతో మాట్లాడిన డేవిస్ అన్నారు. ఆయన కంటికి, తలకు తీవ్ర గాయాలయ్యాయి.
“మేం చుట్టూ తేలుతున్న అన్నిటినీ చూస్తూ షాక్‌లో మునిగిపోయాం. ఆ మరుక్షణం, మేం పైనుంచి నిట్టనిలువుగా కిందికి జారిపడుతున్నట్లు అనిపించింది. అది ఒక భయంకరమైన అనుభవం” అని ఆస్ట్రేలియాకు చెందిన 59 ఏళ్ల కీత్ అన్నారు.
ఆయన భార్య జోర్డాన్ కిందపడటంతో ఆమె వెన్నెముకకు గాయమైంది. విమానం ల్యాండ్ అయ్యాక ఆమెను మోసుకుపోవాల్సి వచ్చింది.
"నేను ఆమె పైకి వంగి, 'నీకేం కాలేదుగా’ అని అడిగాను. ఆమె చాలా మెల్లగా సమాధానం ఇచ్చింది. ఇంతలోనే నేను నా ఒంటి మీది నుంచి ఆమె దుస్తుల మీదికి రక్తం కారుతున్నట్లు గమనించాను" అని డేవిస్ చెప్పారు.
“మా వెనుక ఉన్న అమ్మాయి విపరీతమైన నొప్పితో ఏడుస్తోంది. నాకు ఏం చేయాలో తోచలేదు. నేను నిస్సహాయుడిలా ఉండిపోయాను” అని అన్నారు.

ఫొటో సోర్స్, Eva Khoo
‘నిట్టనిలువుగా జారుతున్నట్టు అనిపించింది’
అదే విమానంలో తన భార్య రమీజాతో కలిసి ప్రయాణిస్తున్న అలీ బుఖారీ, విమానం "నిట్టనిలువుగా కిందికి దిగినట్లు అనిపించింది" అని చెప్పారు.
"అదొక భయంకరమైన అనుభవం. అది నిట్టనిలువుగా రోలర్ కోస్టర్ నుంచి కిందికి జారినట్లుంది. ఆక్సిజన్ మాస్క్‌లు అన్నీ బయటకు వచ్చాయి, విమానం లోపలి భాగాలు దెబ్బతిన్నాయి. టర్బులెన్స్ కారణంగా సీట్‌బెల్ట్ ధరించని వాళ్లు గాలిలోకి ఎగిరి పై కప్పును కొట్టుకున్నారు’’ అని సిడ్నీనుంచి బీబీసీతో మాట్లాడిన 27 ఏళ్ల ఆస్ట్రేలియా యువకుడు అలీ అన్నారు.
"మాకు పైకప్పుపై రక్తపు మరకలు కనిపించాయి. అంతా గందరగోళంగా అనిపించింది. చాలా మంది నేలపై పడిపోయారు” అని అలీ చెప్పారు.
అలీ, అతని భార్య సీటు బెల్టు పెట్టుకోవడం వల్ల వారికి పెద్దగా గాయాలు కాలేదు.
“సీట్‌బెల్ట్ లైట్లు ఆఫ్‌లో ఉన్నప్పుడు నేను సీట్‌బెల్ట్‌ను తీసేస్తాను. కానీ ఎందుకో తెలియదు, ఆ సమయంలో నేను బెల్టు కట్టుకుని ఉన్నాను” అని అలీ చెప్పారు.
విమాన ప్రయాణాలు అంటే భయపడే అలీ భార్య తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
"నేను నా భార్యను వీలైనంత ప్రశాంతంగా ఉంచడానికి ప్రయత్నించాను. మేం అప్పుడు దేవుడిని ప్రార్థించడం ప్రారంభించాం" అని అలీ అన్నారు.
కొన్ని నిమిషాల తర్వాత పైలట్ ఒక ప్రకటన చేశారు.
"ఏం జరిగిందో మాకు ఖచ్చితంగా తెలియదు. కానీ విమానం టర్బులెన్స్‌కు గురైనట్లు కనిపిస్తోంది. ఇది అనుకోని సంఘటన’ అని పైలట్ చెప్పారు.
పైలట్ గొంతులో నాకు చాలా ఆందోళన కనిపించింది. గాయపడిన ప్రయాణికులకు సహాయం చేస్తూ అటూఇటూ తిరుగుతున్న సిబ్బంది కూడా ఆందోళనగా కనిపించారు’’ అని అలీ గుర్తు చేసుకున్నారు.
డేవిస్ పక్కన కూర్చున్న వేల్స్‌కు చెందిన టోబీ పెర్ల్ అపస్మారక స్థితిలో ఉన్న ఓ ప్రయాణికుడికి సీపీఆర్ ఇస్తున్నారు.
73 ఏళ్ల ఆ బ్రిటీష్ వ్యక్తి, జియోఫ్ కిచెన్ సీపీఆర్‌కు స్పందించలేదు. కొద్దిసేపటి తర్వాత ఆయన మరణించారు.

ఫొటో సోర్స్, REUTERS
‘ల్యాండింగ్ అద్భుతం’
చివరకు విమానం ల్యాండ్ అయినప్పుడు డేవిస్ నమ్మలేకపోయారు.
“పైలట్‌కి హ్యాట్సాఫ్ చెప్పాలి. అతను విమానాన్ని సురక్షితంగా దించారు. అది రన్ వేను తాకినప్పుడు, 'అసలు మనం దిగామా?' అనిపించింది. అంత సున్నితంగా విమానాన్ని దించారు" అని ఆయన చెప్పారు.
వెంటనే బ్యాంకాక్‌లోని వైద్య బృందం విమానంలోకి వచ్చింది.
"మమ్మల్ని అందరినీ ట్యాగ్ చేసి, వివిధ రకాలుగా విభజించారు" అని డేవిస్ చెప్పారు. ఆ సమయంలో తన భార్య జోర్డాన్ అసౌకర్య స్థితిలోనే పడుకుని ఉందని అన్నారు.
ఆమెకు ఇప్పటికీ నడుం కింది భాగం నుంచి స్పర్శ తెలీడం లేదని, అయితే ఆసుపత్రిలో కొన్ని రోజులు ఉన్న తర్వాత ఆమె పరిస్థితి మెరుగుపడిందని డేవిస్ చెప్పారు. ఆసుపత్రి త్వరలో తమకు ఫిట్-టు-ఫ్లై సర్టిఫికేషన్ ఇస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
"మేం ఒకరినొకరు చూసుకోవడం, ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం వంటివి చేయగలుగుతున్నందుకు నిజంగా సంతోషంగా ఉంది. మేం విమానంలో చాలా భయానక దృశ్యాలను చూశాం కాబట్టి మేమెంత అదృష్టవంతులమో చెప్పలేను. విమానంలో జోర్డాన్ నా ముందే చనిపోయి ఉండేది” అని ఆయన తన అనుభవాన్ని వివరించారు.
ఎవా ఖూ కుటుంబం కూడా అలాగే భావిస్తోంది. వైద్యులు శస్త్రచికిత్స చేయించుకోవాలని ఎవా సోదరుని భార్య సా రోంగ్‌కు సలహా ఇచ్చారు. కానీ ఆమెకు పుట్టబోయే బిడ్డకు ప్రమాదం ఉందని హెచ్చరించారు.
"ఆమె బిడ్డకు ఏమైనా కావచ్చని, దానికి సిద్ధంగా ఉన్నారా అని ఒక వైద్యుడు అడిగారు. దాంతో నా సోదరుని భార్య ఆందోళనకు గురైంది" అని ఎవా చెప్పారు. కానీ 33 ఏళ్ల రోంగ్ చివరికి చికిత్సకు అంగీకరించి, ప్రస్తుతం దాని నుంచి కోలుకుంటున్నారు.
ఎవా కుటుంబానికి చెందిన ఐదుగురు మరికొంత కాలం ఆసుపత్రిలో ఉంటారు. వారిలో ఒక వృద్ధుడు తాను మళ్లీ నడవడం నేర్చుకుంటున్నట్లు తెలిపారు.
"నా సోదరుడు ఇంకా సరిగా నడవలేకపోతున్నాడు, అతనికి ఇంకా వీల్ చైర్ అవసరం" అని ఎవా చెప్పారు.
బాగా గాయపడి, తలకు, మెడకు పట్టీలను ధరించిన ఆమె సోదరుడి స్నేహితుడు మాత్రం కొంతకాలం మంచానికే పరిమితం అవుతాడని ఆమె అన్నారు.
“ఈ గాయాలు ఎంత కాలం ఉంటాయని అడిగే ధైర్యం మాకు లేదు. వైద్యులు కూడా దీనికి ఖచ్చితమైన సమాధానం ఇచ్చే పరిస్థితి లేదు" అన్నారు ఆమె.
"చివరికి ఇంటికి వెళ్లగలిగినా, వాళ్లు శారీరకంగా, మానసికంగా పూర్తిగా నయం కావడానికి బహుశా నెలలు పట్టవచ్చు"
"వాళ్లు క్రమంగా కోలుకుంటున్నారని, శస్త్రచికిత్సలు బాగా జరిగాయని తెలిశాకే చివరికి నేను ఊపిరి పీల్చుకుని, భోజనం చేయగలిగాను" అని చెప్పారు ఆమె.
ఇవి కూడా చదవండి:
- ఓవర్సీస్ హైవే: సముద్రంలో 182 కిలోమీటర్ల రోడ్డు.. ప్రపంచంలో 8వ వింత ఇదేనా?
- అంతరించి పోయిందనుకున్న ఈ ‘పర్వత రత్నం’ మళ్లీ కనిపించింది, ఎక్కడంటే..
- తుర్కియేలో మహిళల హత్యలు భారీగా పెరుగుతున్నాయి ఎందుకు? ఈ దేశంలో ఏం జరుగుతోంది?
- ‘మా నాన్న సీఎం’
- ఆంధ్రప్రదేశ్: సాయంత్రం 6 గం.లకు ముగియాల్సిన పోలింగ్ కొన్నిచోట్ల అర్ధరాత్రి దాటేదాకా ఎందుకు సాగింది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














