ఉత్తర కొరియా: చెత్తాచెదారాన్ని బెలూన్లకు కట్టి దక్షిణ కొరియాపై ఎందుకు వదులుతోంది?

తెల్ల బెలూన్లు

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, బయటికి వెళ్లొదంటూ ప్రజలను హెచ్చరించిన సియోల్ అధికారులు
    • రచయిత, కెల్లీ ఎన్గ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

దక్షిణ కొరియా వ్యతిరేక కరపత్రాలు, చెత్తా చెదారంతో కూడిన సుమారు 150 బెలూన్లను ఉత్తర కొరియా ఆ దేశంపైకి వదిలింది.

ఈ బెలూన్లను గుర్తించిన అధికారులు వీటికి దూరంగా ఉండాలని, కొంత సమయం ఇంటి నుంచి బయటకు రాకుండా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు.

తెల్ల బెలూన్లను, వాటికి తగిలించి ఉన్న ప్లాస్టిక్ బ్యాగ్‌లను ముట్టుకోవద్దంటూ ప్రజలకు దక్షిణ కొరియా సైన్యం హెచ్చరించింది. వాటిల్లో మురిగిపోయిన వ్యర్థాలు, చెత్తా చెదారం ఉన్నట్లు తెలిపింది.

దక్షిణ కొరియాలోని తొమ్మిది ప్రావిన్స్‌లలో ఎనిమిదింట్లో ఈ బెలూన్లను గుర్తించారు. వీటిని సంబంధిత అధికారులు పరిశీలిస్తున్నారు.

1950ల్లో కొరియన్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచీ ప్రాపగాండాలో భాగంగా దక్షిణ, ఉత్తర కొరియాలు ఒకరి దేశంలోకి ఇంకొకరు ఇలాంటి ఈ బెలూన్లను పంపుతున్నాయి.

తమ సరిహద్దు ప్రాంతాల్లో కరపత్రాలను, చెత్తా చెదారాన్ని వేస్తుండటంపై తాము ప్రతీకారం తీర్చుకుంటామని ఉత్తర కొరియా ప్రభుత్వ మద్ధతుదారులు హెచ్చరించిన కొన్ని రోజుల్లోనే ఈ తాజా ఘటన చోటు చేసుకుంది.

‘‘పాడైపోయిన పేపర్ కట్టలు, చెత్తను త్వరలోనే రిపబ్లిక్ ఆఫ్ కొరియా(ఆర్ఓకే) సరిహద్దు ప్రాంతాల్లో వెదజల్లుతాం. వాటిని తొలగించడానికి ఎంత శ్రమపడాలో మీకు అర్ధమవుతుంది.’’ అని ఉత్తర కొరియా రక్షణ శాఖ ఉప మంత్రి కిమ్ కాంగ్ Il ప్రభుత్వ మీడియాకు ఇచ్చిన ప్రకటనలో అన్నారు.

రిపబ్లిక్ ఆఫ్ కొరియా(ఆర్ఓకే) అనేది దక్షిణ కొరియా అధికారిక పేరు. ఉత్తర కొరియాను డీపీఆర్‌కే (డెమోక్రాటిక్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ కొరియా.)అంటారు.

దక్షిణ కొరియా రాజధాని సోల్‌కు ఉత్తర దిక్కున, సరిహద్దు ప్రాంతాల్లో నివసించే ప్రజలకు అధికారుల నుంచి మంగళవారం సాయంత్రం టెక్ట్స్ మెసేజ్‌లు వచ్చాయి.

ఇళ్లల్లోంచి కొంతసేపు బయటకు రావద్దన్నది ఆ మెసేజ్‌ల సారాంశం.

అనుమానిత వస్తువులు కనిపిస్తే సమీపంలోని మిలటరీ బేస్‌లో లేదా పోలీస్ స్టేషన్‌లో రిపోర్టు చేయాలని సూచించారు.

బ్యాగులలో చెత్తా చెదారం, మురికి వ్యర్థాలు ఉన్నాయని తెలిపిన దక్షిణ కొరియా అధికారులు

ఫొటో సోర్స్, South Korean military

ఫొటో క్యాప్షన్, బ్యాగులలో చెత్తా చెదారం, మురికి వ్యర్థాలు ఉన్నాయని తెలిపిన దక్షిణ కొరియా అధికారులు, వాటిని సంబంధిత అధికారులు పరిశీలిస్తున్నారు.

సోషల్ మీడియాలో షేర్ అవుతున్న ఫోటోలలో తెల్లని బెలూన్లకు కట్టిన తాడుకు బ్యాగులు తగలించి వాటిలో టాయిలెట్ పేపర్‌, నల్లటి మట్టి, పాత బ్యాటరీలు, ఇతర వస్తువులు ఉన్నట్లు కనిపిస్తున్నాయి.

ఇది కచ్చితంగా అంతర్జాతీయ చట్టాన్ని ఉల్లంఘించినట్టేనని దక్షిణ కొరియా సైన్యం ఖండించింది.

‘‘ఇది మా ప్రజల భద్రతకు తీవ్రమైన ముప్పు. బెలూన్ల వల్ల జరిగే ముప్పుకు ఉత్తర కొరియానే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంది. ఈ అమానవీయ, క్రాస్ యాక్షన్‌ను తక్షణమే ఆపివేయాలని ఉత్తర కొరియాను మేం గట్టిగా హెచ్చరిస్తున్నాం.’’ అని దక్షిణ కొరియా సైన్యం తెలిపింది.

మరోవైపు దక్షిణ కొరియాలోని కార్యకర్తలు కూడా ఉత్తర కొరియా రాజధాని ప్యాంగ్యాంగ్ వ్యతిరేక ప్రచారంలో భాగంగా బెలూన్లను ప్రయోగించారు.

ఈ బెలూన్లలో నగదు, నిషేధించిన మీడియా కంటెంట్, చాకో పైస్ వంటివి ఉన్నాయి. ఉత్తర కొరియాలో ఈ దక్షిణ కొరియా స్నాక్ ఐటమ్‌పై నిషేధం ఉంది.

ప్యాంగ్యాంగ్‌ వ్యతిరేకంగా ఉన్న కరపత్రాలను, కొరియన్ పాప్ మ్యూజిక్, మ్యూజిక్ వీడియోలున్న యూఎస్‌బీ స్టిక్‌లతో కూడిన 20 బెలూన్లను ఆ దేశంలోకి పంపినట్లు దక్షిణ కొరియా అనుకూల కార్యకర్తల గ్రూప్ ఈ నెల ప్రారంభంలో తెలిపింది.

ప్యాంగ్యాంగ్‌‌కు వ్యతిరేకంగా కరపత్రాలను పంపడం నేరపూరిత చర్యగా పేర్కొంటూ 2020 డిసెంబర్‌లో సోల్ పార్లమెంట్ ఒక చట్టాన్ని తీసుకొచ్చింది. భావ ప్రకటనా స్వేచ్ఛకు, మానవ హక్కులకు ఇది భంగకరమని విమర్శకులు ఆరోపిస్తున్నారు.

సోల్ నేతలపై దాడి చేసేందుకు దక్షిణం దిశగా కూడా ఉత్తర కొరియా బెలూన్లను లాంచ్ చేసింది.

బెలూన్లు టాయిలెట్ పేపర్‌ను, సిగరెట్ బడ్స్, చెత్తాచెదారాన్ని మోసుకెళ్తున్నాయి. వీటిని హానికరమైన జీవరసాయన పదార్థాలుగా సోల్ పోలీసులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)