దక్షిణ కొరియా అధ్యక్షుడి సహాయ సిబ్బంది ఈమెయిళ్లను ‘తొలిసారి’ హ్యాక్ చేసిన ఉత్తర కొరియా

దక్షిణ కొరియా మెయిల్ హ్యాక్

ఫొటో సోర్స్, REUTERS

ఫొటో క్యాప్షన్, దక్షిణ కొరియా అధ్యక్షుడి బృందంలోని ఒకరి ఈమెయిళ్లను ఉత్తర కొరియా హ్యాక్ చేయడం ఇదే తొలిసారని చెబుతున్నారు.
    • రచయిత, జీన్ మెకెంజీ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

దక్షిణ కొరియా అధ్యక్షుడు యాన్ సుక్ యోల్ సహాయ సిబ్బందిలో ఒకరి ఈమెయిళ్లను ఉత్తర కొరియా హ్యాక్ చేసింది. ఈ విషయాన్ని బీబీసీకి దక్షిణ కొరియా ధ్రువీకరించింది.

అధ్యక్షుడు యాన్ సుక్ యోల్ 2023 నవంబర్‌లో యూకే పర్యటనలో ఉండగా ఈ ఘటన జరిగింది.

అధికారిక పని కోసం సిబ్బందిలో ఒకరు వ్యక్తిగత ఈమెయిల్ వాడటంతో ఈ హ్యాక్ జరిగినట్లు దక్షిణ కొరియా అధ్యక్ష కార్యాలయం తెలిపింది.

యాన్ షెడ్యూల్‌ను హ్యాకర్లు యాక్సెస్ చేశారని దక్షిణ కొరియా స్థానిక వార్తాపత్రిక కుక్మిన్ ఇల్బో ఒక ఉన్నత స్థాయి ప్రభుత్వ అధికారిని ఉటంకిస్తూ రాసింది.

అధ్యక్షుడు పంపిన సందేశాలను కూడా తస్కరించారని తెలిపింది.

అయితే ఎలాంటి సమాచారం చోరీకి గురైందనే విషయాన్ని యోల్ కార్యాలయం వెల్లడించలేదు.

దక్షిణ కొరియా అధ్యక్షుడి బృందంలోని ఒకరి ఈమెయిళ్లను ఉత్తర కొరియా హ్యాక్ చేయడం ఇదే తొలిసారని చెబుతున్నారు. అయితే, తన భద్రతా వ్యవస్థను ఉత్తర కొరియా హ్యాక్ చేయలేదని యోల్ కార్యాలయం ఒక ప్రకటనలో చెప్పింది.

హ్యాకింగ్

ఫొటో సోర్స్, Getty Images

హ్యాకింగ్‌తో రూ.25 వేల కోట్ల ఆర్జన!

''నియమాలను పాటించడంలో సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఈ ఘటన జరిగింది. సదరు వ్యక్తి అధికారిక కార్యకలాపాలకు వ్యక్తిగత ఈమెయిల్ వాడారు" అని బీబీసీకి దక్షిణ కొరియా అధ్యక్ష కార్యాలయం తెలిపింది.

డబ్బు, సమాచారం రెండింటినీ దొంగిలించడానికి ఉత్తర కొరియా సైబర్ హ్యాకింగ్‌ను ఉపయోగిస్తుంది, దాని మార్గాలు మరింత అధునాతనంగా ఉంటున్నాయి.

ఉత్తర కొరియాపై తీవ్రమైన అంతర్జాతీయ ఆంక్షలున్నాయి.

పాలన, అణ్వాయుధాలకు నిధుల కోసం దాని సైబర్‌హ్యాకర్‌లు క్రిప్టోకరెన్సీలో పెద్ద మొత్తంలో డబ్బును దొంగిలించడానికి తరచూ ప్రయత్నిస్తుంటారు. 2016 నుంచి ఇప్పటివరకు దాదాపు రూ. 25 వేల కోట్లు (మూడు బిలియన్ల డాలర్ల) వరకు దొంగిలించారని అంచనా.

అధునాతన ఆయుధ సాంకేతికత వివరాలు సహా దేశ రహస్యాలను దొంగిలించే ఉద్దేశంతో ఉత్తర కొరియా ఇలా హ్యాక్‌లు చేస్తుందని భావిస్తున్నారు.

దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్

అధ్యక్షుడి భద్రతకు సమస్యేనా?

కుక్మిన్ ఇల్బో వార్తాపత్రికతో దక్షిణ కొరియా ప్రభుత్వ అధికారి ఒకరు మాట్లాడుతూ-హ్యాకైందని తెలిసి షాక్‌ అయ్యామన్నారు.

విదేశాలలో అధ్యక్షుడి భద్రతకు ఇది సమస్యలను కలిగించవచ్చని అనుమానం వ్యక్తంచేశారు.

దక్షిణ కొరియా అధ్యక్షుడు నవంబర్‌లో మూడు రోజుల యూకే పర్యటన కోసం లండన్‌లో దిగారు. ఆయన కింగ్ చార్లెస్, క్వీన్ కెమిల్లాతో పాటు బ్రిటన్ ప్రధాని రిషి సునక్‌ను కలిశారు.

అధ్యక్షుడి పర్యటన ప్రారంభానికి ముందే ఈ హ్యాక్ గుర్తించామని, దాన్ని పరిష్కరించడానికి అవసరమైన చర్యలు తీసుకున్నామని దక్షిణ కొరియా ప్రభుత్వం తెలిపింది.

అలాంటి ఘటన మరొకటి జరగకుండా తమ బృందంలో అవగాహన పెంపొందించడం సహా భద్రతను పటిష్ఠం చేసేందుకు చర్యలు తీసుకున్నట్లు వివరించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)