బంగ్లాదేశ్ ఎంపీ అజీమ్‌ హత్య కేసు: తప్పించుకునేందుకు నిందితులు ఎలా పథకం రచించారు?

ఎంపీ అన్వరుల్ అజీమ్ హత్య
ఫొటో క్యాప్షన్, సీన్ రీకన్‌స్ట్రక్షన్ కోసం బంగ్లాదేశ్ ఎంపీ అన్వరుల్ అజీమ్ హత్య జరిగిన ప్రాంతానికి ప్రధాన నిందితుడు జిహాద్‌ను తీసుకెళ్లిన కోల్‌కతా పోలీసులు
    • రచయిత, అమితాబ్ భట్టాశాలి
    • హోదా, బీబీసీ ప్రతినిధి, కోల్‌కతా

హెచ్చరిక: ఈ కథనంలో కొన్ని అంశాలు కలవరపరిచేవిగా ఉండొచ్చు.

బంగ్లాదేశ్ ఎంపీ అన్వరుల్ అజీమ్ హత్య కేసులో అరెస్ట్ అయిన జిహాద్ హవల్దార్ ద్వారా ఈ సంఘటన ఎలా జరిగిందో పోలీసులు తెలుసుకున్నారు.

అజీమ్ దుస్తులు, మొబైల్ ఎక్కడున్నాయో పశ్చిమ బెంగాల్ పోలీసులు గుర్తించారు. అలాగే, చంపిన తర్వాత ఆయన చర్మం తొలగించి, మృతదేహాన్ని ముక్కలుగా చేసి ఎక్కడెక్కడ పడేశారో కూడా పోలీసులకు తెలిసింది.

ఎంపీని ఎలా హత్య చేశారో పూసగుచ్చినట్లు నిందితుడు జిహాద్ వివరించాడని ఢాకా మెట్రోపాలిటన్ పోలీసు అడిషనల్ పోలీసు కమిషనర్(ఇంటెలిజెన్స్ డిపార్ట్‌మెంట్) మహ్మద్ హరున్ ఉర్ రషీద్ తెలిపారు.

‘‘సీన్ రీకన్‌స్ట్రక్షన్‌లో భాగంగా, ఎంపీ అజీమ్ బస చేసిన కోల్‌కతా న్యూ టౌన్ ఏరియాలోని ఫ్లాట్‌కు జిహాద్‌ను పశ్చిమ బెంగాల్ సీఐడీ బృందం తీసుకెళ్లింది.’’ అని ఆయన చెప్పారు.

ఆ సమయంలో తాము కూడా ఘటనా ప్రాంతానికి వెళ్లినట్లు రషీద్ తెలిపారు.

బంగ్లాదేశ్ ఎంపీ అన్వరుల్ అజీమ్
ఫొటో క్యాప్షన్, కోల్‌కతాలో హత్యకు గురైన బంగ్లాదేశ్ ఎంపీ అన్వరుల్ అజీమ్

‘‘ఆ ఫ్లాట్‌లో జరిగిన ప్రతి విషయాన్ని జిహాద్ పూసగుచ్చినట్లు చెప్పారు. కానీ, ఈ కేసులో అమానుల్లాతో పాటు అరెస్ట్ అయిన ఇతర నిందితులు చెబుతున్న సమాచారానికి, జిహాద్ చెప్పిన విషయాలకు పొంతన కుదరడం లేదు. అమానుల్లాను ఢాకాలో అరెస్ట్ చేశాం. ఢాకా, కోల్‌కతాలలో అరెస్ట్ అయిన నిందితులను ఆ ఫ్లాట్ నుంచి వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా పలుమార్లు విచారించాం’’ అని రాష్ట్ర పోలీసులకు చెందిన ఇంటెలిజెన్స్ డిపార్ట్‌మెంట్ అధికారులు తెలిపారు.

ఇంటెలిజెన్స్ డిపార్ట్‌మెంట్ కస్టడీలో ఉన్న ప్రధాన నిందితుడు జిహాద్‌ను ఆదివారం సాయంత్రం ధాకా పోలీసు అధికారి మహ్మద్ హరున్ ఉర్ రషీద్ స్వయంగా విచారించారు.

జిహాద్ ప్రస్తుతం ఇంటెలిజెన్స్ డిపార్ట్‌మెంట్ ప్రధాన కార్యాలయం భవాని భవన్‌లో ఉన్నారు. ఆయన్ను అక్కడే విచారిస్తున్నారు.

ఎంపీ హత్య అయిన న్యూ టౌన్ ఏరియాలోని ఫ్లాట్‌ను ధాకా నుంచి ఇంటెలిజెన్స్ డిపార్ట్‌మెంట్ అధికారులు కూడా పరిశీలించారు.

భవాని భవన్‌లో మాత్రమే కాక, ఢాకా పోలీసుల కస్టడీలో ఉన్న మరో నిందితుడిను కూడా ఇదే ఫ్లాట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పలుమార్లు రషీద్ విచారించారు.

భవనం
ఫొటో క్యాప్షన్, ఫ్లాట్‌లో అన్వరుల్ అజీమ్‌ను చంపిన తీరును, మృతదేహాన్ని ఎలా ముక్కలు చేశారో సీఐడీ అధికారులు, ధాకా ఇంటెలిజెన్స్ అధికారుల ముందు వివరించిన జిహాద్

‘ఎంపీ స్పృహ తప్పేలా చేసి, గొంతు నులిమి చంపేశాం’

ఇద్దరు నిందితులు ఫైసల్, అమానుల్లాతో కలిసి మే 13న మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఎంపీ అజీమ్ ఈ ఫ్లాట్‌కు వచ్చినట్లు పోలీసు అధికారులకు తెలిపారు నిందితుడు జిహాద్.

ఆ సమయంలో డూప్లెక్స్ ఫ్లాట్‌లో పైఅంతస్థులో మూడవ నిందితురాలు సెలెస్టీ రెహ్మాన్ ఉన్నారు. జిహాద్, సియామ్ ఆ ఫ్లాట్‌లో కింద ఉన్నట్లు తెలిపారు.

జిహాద్‌ను ఇంటెలిజెన్స్ డిపార్ట్‌మెంట్ అరెస్ట్ చేసింది. కానీ, సియామ్ ఇప్పటికీ తప్పించుకుని తిరుగుతున్నారు. ఆయన నేపాల్ పారిపోయి ఉండొచ్చని విచారణ అధికారులు భావిస్తున్నారు.

‘‘ఫ్లాట్‌లోకి వెళ్లిన తర్వాత, క్లోరోఫామ్‌ రాసిన ఒక వస్త్రాన్ని ఎంపీ ముక్కు దగ్గర పెట్టి స్పృహ తప్పేలా చేశాం. ఆ తర్వాత, ఫ్లాట్‌లోని కిచెన్ దగ్గరకు తీసుకెళ్లి గొంతు నులిమి చంపాం’’ అని జిహాద్ తన స్టేట్‌మెంట్‌లో చెప్పారు.

‘‘ఫ్లాట్ డ్రాయింగ్-డైనింగ్ రూమ్ ఏరియాలో సీసీటీవీ కెమెరా ఉంది. ఈ హత్య జరగడానికి వారం ముందు మే 7న సెలెస్టీ రెహ్మాన్ దీనికి టేప్‌తో ఒక గుడ్డను చుట్టారు’’ అని ఇంటెలిజెన్స్ అధికారులు చెప్పారు.

ఇంట్లో పని మనుషులపై నిఘా ఉంచేందుకు సంపన్నులు కొందరు ఇళ్లల్లో సీసీటీవీ కెమెరాలను ఇన్‌స్టాల్ చేస్తుంటారు.

విచారణ అధికారులు
ఫొటో క్యాప్షన్, ఢాకా మెట్రోపాలిటన్ పోలీసు అడిషనల్ పోలీసు కమిషనర్(ఇంటెలిజెన్స్ డిపార్ట్‌మెంట్) మహ్మద్ హరున్ ఉర్ రషీద్

మృతదేహాన్ని ఎక్కడ పడేశారు?

హత్య తర్వాత ఎంపీ మృతదేహాన్ని ఎలా పడేయాలో కూడా అప్పటికే ప్రణాళిక వేసుకుని ఉంచుకున్నామని బంగ్లాదేశ్‌తోపాటు, పశ్చిమబెంగాల్ రాష్ట్ర పోలీసు విభాగానికి నిందితులు చెప్పారు.

పోలీసులకు జిహాద్ తెలిపిన వివరాల ప్రకారం, ‘‘కిచెన్‌కు దగ్గరగా ఎంపీని హత్య చేసిన తర్వాత, ఎంపీ మృతదేహాం నుంచి చర్మాన్ని తొలగించారు . ఆ తర్వాత శరీర భాగాలను వేరువేరు చేశారు. మొండెం, తలను నిందితులు వేరు చేశారు’’

ఎంపీ శరీరాన్ని తాను ముక్కలు చేసినట్లు జిహాద్ చెప్పారు. ఆయన తలను పదునైన ఆయుధంతో పగలగొట్టారు. తను వాడిన ఆయుధాన్ని అమానుల్లా కోల్‌కతా నుంచి తీసుకొచ్చినట్లు జిహాద్ చెప్పారు. ఆ తర్వాత అజీమ్ మృతదేహాన్ని చిన్న ప్యాకెట్లలో చుట్టినట్లు నిందితుడు తెలిపారు.

‘‘ఎంపీ అజీమ్‌ను ఎంత క్రూరంగా హత్య చేశారో అదే ఫ్లాట్‌లో ఉన్న జిహాద్ వెల్లడించారు. కేవలం ఆయన్ను హత్య చేయడమే కాదు. మృతదేహాన్ని ముక్కలుముక్కలుగా ఎలా కోశారు, మాంసాన్ని శరీర భాగాల నుంచి ఎలా వేరు చేశారో ప్రతి విషయాన్ని తెలుసుకున్నాం. నేను పోలీసు అధికారి అయినప్పటికీ, అంత క్రూరంగా, అమానవీయంగా నిందితుడు ఎలా ప్రవర్తించాడు అన్నది ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను’’ అని హరున్ ఉర్ రషీద్ అన్నారు.

ఆ తర్వాత మృతదేహాన్ని, హత్య ఆధారాలు కనిపించకుండా చేసినట్లు కూడా నిందితులు తెలిపారు.

‘‘ఫ్లాట్‌లోకి వెళ్లడానికి ముందు, ముగ్గురు నిందితులు వారి షూలను బయటనే వదిలారు. తలుపుకు పక్కనే ఉన్న షూ ర్యాక్‌లో వాటిని పెట్టారు. కానీ, ఫ్లాట్ తలుపు ముందు ఉన్న సీసీటీవీ కెమెరా ఫుటేజీలో మే 13 సాయంత్రం ఒక నిందితుడు ఫ్లాట్ తలుపు తీసి, షూ లోపలికి తీసుకెళ్లినట్లు తెలిసింది. జిహాద్ కూడా దీన్ని ధ్రువీకరించారు’’ అని ఆ అధికారి వెల్లడించారు.

విచారణ అధికారులు

అజీమ్ దుస్తులు ఎక్కడ పారేశారు?

‘‘ఎంపీ అజీమ్ మృతదేహాన్ని ముక్కలుగా చేసిన తర్వాత చిన్న ప్యాకెట్లలో వాటిని చుట్టినట్లు సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేసే సమయంలో జిహాద్ తెలిపారు. ఆ తర్వాత ఆ భాగాలను తీసుకుని భంగడ్‌లోని కృష్ణమతి వంతెనపైకి వెళ్లినట్లు చెప్పారు. ఆయన వద్ద మృతదేహాన్ని ముక్కలుగా చేసే ఆయుధం, అన్వరుల్ అజీమ్ దుస్తులు, మొబైల్ ఉన్నట్లు తెలిపారు’’ అని బెంగాళ రాష్ట్ర పోలీసుకు చెందిన ఇంటెలిజెన్స్ విభాగపు అధికారులు చెప్పారు.

కృష్ణమతి వంతెనపైకి వెళ్లే సమయంలో అజీమ్ దుస్తులు, మొబైల్‌ను గాబ్తలా బజార్‌లో పడేసినట్లు జిహాద్ పోలీసులకు తెలిపారు. అక్కడే బాగ్జోలా కాలువ ప్రవహిస్తుంది.

శరీర భాగాలను, హత్య చేసిన ఆయుధాలను ఆ కాలువలో పడేసినట్లు ఢాకా పోలీసుల ఇంటెలిజెన్స్ విభాగపు హెడ్‌కు జిహాద్ చెప్పారు.

ఇంటెలిజెన్స్ విభాగం గత మూడు రోజులుగా బోట్లు, గజ ఈతగాళ్ల సాయంతో సెర్చ్ ఆపరేషన్ చేపట్టింది. రషీద్‌తో పాటు రాష్ట్ర ఇంటెలిజెన్స్ డిపార్ట్‌మెంట్ అధికారులు కూడా అక్కడికి వెళ్లారు.

‘‘జిహాద్‌తో కలిసి కాలువ ప్రాంతానికి వచ్చాం. మృతదేహాన్ని ఆయన ఎక్కడ పడేశాడో తెలుసుకుంటున్నాం. దీంతో, శరీర భాగాలను వెలికితీయొచ్చు. త్వరలోనే ఎంపీ మృతదేహాన్ని లేదా శరీర భాగాలను వెలికితీస్తామని ఆశిస్తున్నాం’’ అని రిపోర్టర్లతో రషీద్ చెప్పారు.

అన్వరుల్ అజీమ్ మృతదేహం వెతుకుతున్న బోట్లు, గజ ఈతగాళ్లు

తల భాగాలను మరో ప్రాంతానికి తీసుకెళ్లి పడేసిన ఫైసల్

ఎంపీ శరీర భాగాలను, చేతి కంకణాలు, మొబైల్‌ను తీసుకుని జిహాద్ భంగడ్‌కు వెళ్లిన సమయంలో, ఫైసల్ అనే నిందితుడు కూడా ఎంపీ తల భాగాలతో నార్త్ 24 పరగణాలకు వెళ్లారు. అక్కడ ఓ ప్రదేశంలో ఆయన తలభాగాలను పడేశారు.

అంటే, ఎంపీ మృతదేహాన్ని వివిధ ప్రాంతాల్లో పడేసినట్లు తెలిసింది. ఇతర ఆధారాలను పూర్తిగా ధ్వంసం చేశారు.

అజీమ్ మొబైల్‌ను తీసుకుని మరో నిందితుడు సియామ్ అన్వరుల్ బిహార్ మీదుగా నేపాల్ వెళ్లారు. ఆయన పలుమార్లు మొబైల్‌ను ఆన్ చేసి, కోల్‌కతాలో ఉంటున్న అజీమ్ స్నేహితుడు గోపాల్ విశ్వాస్‌కు అదే ఫోన్ వాడుతూ మెసేజ్‌లు పంపారు.

ఇది మాత్రమే కాక, అదే ఫోన్‌ నుంచి బంగ్లాదేశ్‌లో ఉంటున్న ఎంపీ పర్సనల్ అసిస్టెంట్‌కు కూడా కాల్ చేశారు. ఎంపీ అజీమ్ కనిపించకుండా పోయిన తర్వాత, ఆయన మొబైల్ లొకేషన్‌ను బిహార్‌లోని ముజాఫర్‌పూర్‌లో కనుగొన్నట్లు బీబీసీకి కోల్‌కతాలోని బంగ్లాదేశ్ హైకమిషన్ అధికారులు తెలిపారు. అప్పటి వరకు, ఎంపీ హత్యకు గురైనట్లు ఎవరికీ తెలియలేదు.

ఇది కూడా హత్య పథకంలో ఒక భాగమని విచారణ అధికారులు చెప్పారు. ఆయన కనిపించకుండా పోయిన విషయాన్ని అజీమ్ కుటుంబం కానీ లేదా స్నేహితులకు కానీ తెలియకూడదని ఇలా చేసినట్లు తెలిపారు.

పక్కా ప్రణాళికతో హత్య చేసి, ఆయన మృతదేహాన్ని మాయం చేసి, ఆ తర్వాత సురక్షితంగా తప్పించుకునేందుకు ఎంపీ మొబైల్ ఫోన్‌ను నిందితులు కొంత సమయం పాటు వాడినట్లు అధికారులు చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)