'ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ: ‘ఏ తప్పూ చేయని నాపై దొంగ అని ముద్ర వేశారు, ఇక నా జీవితం ఇంతేనా?’

- రచయిత, జేమ్స్ క్లేటన్
- హోదా, బీబీసీ ప్రతినిధి
సారాకు చాక్లెట్ తినాలనిపించి, ఓ షాప్‌కు వెళ్లారు.
"నిమిషంలోపే స్టోర్‌లో పనిచేసే వ్యక్తి ఒకరు నా దగ్గరకు వచ్చి, 'నువ్వు దొంగవి, నువ్వు ఇక్కడి నుంచి వెళ్లిపో' అన్నాడు" అని సారా చెప్పారు.
తన అసలు పేరును రహస్యంగా ఉంచాలని కోరిన సారా – ‘ఫేస్‌వాచ్’ అనే ఫేషియల్-రికగ్నిషన్ సిస్టమ్ తనను దొంగగా చూపించిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
తన బ్యాగ్‌ని చెక్ చేసిన తర్వాత తనను దుకాణం బయటకు తీసుకువెళ్లారని, అదే టెక్నాలజీ కారణంగా వారి మిగతా స్టోర్లకు రాకుండా తనపై నిషేధం విధించారని ఆమె చెప్పారు.
"నేను ఏడుస్తూనే ఇంటికి వెళ్లాను. నా జీవితాంతం ఇంతేనా? నేనేం దొంగిలించకున్నా, నన్ను దొంగగానే చూస్తారా' అనుకున్నాను"
తర్వాత ఫేస్‌వాచ్ సారాకు లేఖ రాసి పొరపాటు జరిగినట్లు అంగీకరించింది.
యూకేలో బడ్జెన్స్, స్పోర్ట్స్ డైరెక్ట్, కాస్ట్‌కట్టర్‌తో సహా అనేక దుకాణాలలో ఇప్పుడు వస్తువులను దొంగలించే వారిని గుర్తించడానికి ఫేస్‌వాచ్‌ని ఉపయోగిస్తున్నారు.
సారా కేసుపై వ్యాఖ్యానించడానికి ఫేస్‌వాచ్ నిరాకరించింది. అయితే, నేరాలను నిరోధించడానికి తమ సాంకేతికత సహాయపడుతుందని చెప్పింది. ఆమెను దొంగ అంటూ ముద్ర వేసిన స్టోర్ దీనిపై వ్యాఖ్యానించడానికి నిరాకరించింది.
బ్రిటన్‌లో ఇలాంటి సాంకేతికత వైపు మొగ్గు చూపుతున్నది కేవలం చిల్లర వ్యాపారులు ఒక్కరే కాదు.
తూర్పు లండన్‌లోని బెత్నాల్ గ్రీన్‌లో నిలబడిన ఒక తెల్లటి వ్యాన్‌లో ఉన్న పోలీసులను మేం కలిసినప్పుడు, వ్యాన్ పైకప్పుకు అమర్చిన కెమెరాలు వేలమంది ప్రజలను స్కాన్ చేస్తున్నాయి.
వాళ్ల ముఖాలు పోలీసుల వాంటెడ్ లిస్టులో ఉన్న వ్యక్తులతో సరిపోలితే అధికారులు వాళ్లతో మాట్లాడతారు. అరెస్టు చేసే అవకాశమూ ఉంటుంది.
ఈ సాంకేతిక ప్రక్రియను సూపర్ మార్కెట్ చెక్అవుట్‌తో పోల్చవచ్చు.
ఇక్కడ మనుషుల ముఖమే బార్‌కోడ్ అవుతుంది. మేము మెట్రోపాలిటన్ పోలీసులతో మాట్లాడిన రోజున, అదే టెక్నాలజీ సాయంతో ఆరుగురిని అరెస్టు చేసినట్లు వాళ్లు చెప్పారు.
ఇలా అరెస్టైనవారిలో లైంగిక దాడి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు ఇద్దరు, భౌతిక దాడులకు పాల్పడిన వ్యక్తి ఒకరు, పోలీసులపై దాడికి దిగిన మరొక వ్యక్తి ఉన్నారు.

మెట్రోపాలిటన్ పోలీస్ సర్వీస్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ లిండ్సే చిస్విక్, ఈ టెక్నాలజీ తమకు చాలా సహాయపడుతోందని బీబీసీకి చెప్పారు.
"ఒక వ్యక్తి ముఖం బయోమెట్రిక్ చిత్రాన్ని రూపొందించడానికి ఈ టెక్నాలజీకి ఒక సెకను కంటే తక్కువ సమయం పడుతుంది. దాన్ని మా నిఘా జాబితాలో ఉన్న వ్యక్తుల ముఖాలతో పోల్చి, పోలిక సరిపోనప్పుడు దాన్ని ఆటోమేటిక్‌గా తొలగిస్తుంది" అని అన్నారు.
పోలీసులు సంప్రదించిన అనేక మంది వ్యక్తులతో బీబీసీ మాట్లాడింది.
ఆ టెక్నాలజీ తమను సరిగ్గా గుర్తించిందని వాళ్లు ధృవీకరించారు. ఈ సంవత్సరం ఇప్పటి వరకు అలాంటి 192 అరెస్టులు జరిగాయి.
కానీ పౌర హక్కుల బృందాలు ఈ సాంకేతిక పరిజ్ఞానం ఖచ్చితత్వం ఇంకా పూర్తిగా నిర్ధరణ కాలేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దీనికి ఉదాహరణగా వారు షాన్ థాంప్సన్ వంటి కేసులను చూపుతున్నారు.
స్ట్రీట్‌ఫాదర్స్ అనే సహాయక సంస్థలో పనిచేస్తున్న థాంప్సన్, ఫిబ్రవరిలో లండన్ బ్రిడ్జ్ దగ్గర పోలీసుల వ్యాన్ పక్కనుంచి వెళుతుండగా, పోలీసులు అతని దగ్గరకు వచ్చి నువ్వు మా వాంటెడ్ జాబితాలో ఉన్నావని చెప్పారు.
వేలిముద్రలు ఇవ్వాలంటూ 20 నిమిషాలు అతణ్ని అక్కడే ఆపారు. పాస్‌పోర్ట్ కాపీ ఇచ్చాకే తనను వదిలిపెట్టారని థాంప్సన్ చెప్పారు.
కానీ ఈ గుర్తింపులో పొరపాటు జరిగింది. "ఇది చాలా అనుచితమైన పని. నేను నిర్దోషినని తేలేవరకు నన్ను దోషిగా చూశారు" అని అతను చెప్పాడు.
మెట్రోపాలిటన్ పోలీసులు దీనిపై వ్యాఖ్యానించడానికి నిరాకరించారు.
డిజిటల్ నిఘా
పోలీసులు ఫేషియల్-రికగ్నిషన్ సాంకేతికతను ఉపయోగించేటప్పుడు బిగ్ బ్రదర్ వాచ్ సంస్థ డైరెక్టర్ సిల్కీ కార్లో ఆ పోలీసులను చిత్రీకరించారు.
షాన్ థాంప్సన్‌ను పోలీసులు తీసుకెళ్లిన రాత్రి ఆమె అక్కడే ఉన్నారు.
" నేను చాలా సంవత్సరాలుగా లైవ్ ఫేషియల్ రికగ్నిషన్ వ్యవస్థలను గమనిస్తున్నాను. చాలామందికి ప్రజలకు ఇదేంటో తెలియదు." అని ఆమె చెప్పారు.
స్కాన్ చేసిన ఎవరి ముఖమైనా డిజిటల్ పోలీసు లైనప్‌లో భాగమేనని ఆమె చెప్పారు.
"వాళ్ల ముఖం మ్యాచ్ అయి అలర్ట్ వస్తే, పోలీసులు రంగంలోకి దిగుతారు. వారిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తారు. నిర్దోషిత్వాన్ని నిరూపించుకొమ్మని అడుగుతారు" అని తెలిపారు.
ఫేషియల్ రికగ్నిషన్ వాడకాన్ని పోలీసులు ఈ మధ్య కాలంలో పెంచారని ఆమె చెప్పారు.
2020 మరియు 2022 మధ్య మెట్రోపాలిటన్ పోలీసులు లైవ్ ఫేషియల్ రికగ్నిషన్‌ని తొమ్మిది సార్లు ఉపయోగించారు.
మరుసటి సంవత్సరం ఆ సంఖ్య 23కి చేరింది. 2024 లో ఇప్పటికే దీన్ని 67 సార్లు ఉపయోగించుకున్నారు.
ఈ సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా వ్యక్తులను గుర్తించడంలో తప్పులు జరగడం చాలా అరుదని దీనిని సమర్థించేవారు అంటున్నారు.
తమ కెమెరాల ముందు నడిచే ప్రతి 33,000 మందిలో ఒకరిని తప్పుగా గుర్తిస్తాయని మెట్రోపాలిటన్ పోలీసులు చెప్పారు.
ఈ సాంకేతికత చాలా కొత్తదని, చట్టాలకు ఇంకా దీనిపై సరైన అవగాహన లేదని అడా లవ్‌లేస్ ఇన్‌స్టిట్యూట్ రీసెర్చ్ గ్రూప్‌కు చెందిన రీసెర్చ్ హెడ్ మైఖేల్ బర్ట్‌విజిల్ అభిప్రాయపడ్డారు.
"ప్రస్తుతానికి పరిస్థితి చాలా అనిశ్చితంగా ఉందని భావిస్తున్నాను. అందుకే దానిని ఉపయోగించుకోవడం చట్టబద్ధమైనదా కాదా అనే విషయంలో చాలా సందేహాలున్నాయి" అని ఆయన చెప్పారు.
బీబీసీ మాట్లాడిన కొంతమంది వ్యక్తులు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం గురించి ఆందోళన వ్యక్తం చేసినా, చాలా మంది దానిని సమర్థించారు. ఇది నేరాలను పరిష్కరించడానికి సహాయపడుతుందని అన్నారు.

ఈ సాంకేతికత దీర్ఘకాలంలో సహాయపడుతుందా?
రద్దీగా ఉండే వీధుల్లో తెల్లటి వ్యాన్‌లు కనిపించడం పెరిగినందున, పోలీసులు వెదుకుతున్న వ్యక్తులు కెమెరాల నుంచి తప్పించుకోలేరా? దుకాణాలలో దొంగతనాలు చేసేవాళ్లు ముఖాలను దాచుకోలేరా?
ఫేషియల్ రికగ్నిషన్ అనేది అలవాటుగా మారకుండా సమాజం జాగ్రత్త వహించాలని కార్లో చెప్పారు. ఇది అలవాటైతే ప్రమాదమని ఆమె అన్నారు.
ఇది చైనా తరహా సామూహిక నిఘాకు దారి తీయవచ్చని పౌర హక్కుల బృందాలు ఆందోళన వ్యక్తం చేస్తుండగా, న్యాయకోవిదులు మాత్రం ఈ భయం నిరాధారమంటున్నారు.
అయితే దీని వల్ల వీధుల్లో సురక్షితంగా తిరగవచ్చంటే తమ ముఖాలను స్కానింగ్ చేయించుకోవడానికి సిద్ధంగా ఉన్న ప్రజలు కూడా చాలామందే ఉన్నారని తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి:
- అంతరించి పోయిందనుకున్న ఈ ‘పర్వత రత్నం’ మళ్లీ కనిపించింది, ఎక్కడంటే..
- బెంగళూరు రేవ్ పార్టీ కేసు: పోలీసులు ఏం చెప్పారు? అసలు రేవ్ పార్టీ అంటే ఏంటి? అందులో ఏం చేస్తారు?
- ఓవర్సీస్ హైవే: సముద్రంలో 182 కిలోమీటర్ల రోడ్డు.. ప్రపంచంలో 8వ వింత ఇదేనా?
- #UnseenLives: వెనక 40 మంది పురుషులున్నా, నేను ఆ మరకను దాచుకోలేదు
- చంద్రుడి మీద బతకాల్సి వస్తే అక్కడ తినడానికి ఏముంటుంది, సైంటిస్టులు చేస్తున్న ప్రయోగాలేంటి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














