బ్రెడ్, పాల కంటే ఆ దేశంలో ఐస్‌కే ధర ఎక్కువ.. ఎందుకిలా?

ఫొటో సోర్స్, YAMADA TARO/GETTY IMAGES
- రచయిత, ప్రియా సిప్పీ
- హోదా, బీబీసీ న్యూస్
ఇది వేసవి కాలం. భారత్‌లోనే కాదు, చాలా దేశాల్లోని ప్రజలు ఎండ వేడితో అల్లాడిపోతున్నారు.
పశ్చిమాఫ్రికాలోని మాలిలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అక్కడ ఎండ చాలా ప్రమాదకరంగా ఉంది.
దీంతో, బ్రెడ్, పాల కంటే ఐస్ క్యూబ్‌లే ఎక్కువ ధర పలుకుతున్నాయి.
మాలి రాజధాని బమాకోలో ఫాతుమా యతార అనే మహిళ ఒక దుకాణం బయట కనిపించారు.
‘‘చాలా వేడిగా ఉంది. ఐస్ కొనేందుకు ఇక్కడికి వచ్చాను’’ అని చెప్పారు. కరెంట్ కోతలతో ఫ్రిడ్జ్‌లు సైతం పనిచేయడం లేదని అన్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో, ఆహార పదార్థాలను నిల్వ ఉంచేందుకు, వడగాల్పుల సమయంలో చల్లగా ఉండేందుకు అవసరమయ్యే ఐస్ క్యూబ్‌లు కొనేందుకు తాను ఈ దుకాణానికి వచ్చినట్లు ఫాతుమా యతార చెప్పారు.
బమాకోలో ఉష్ణోగ్రతలు 48 డిగ్రీల సెల్సియస్‌ను దాటేశాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఐస్ క్యూబ్‌లు మాత్రమే కొంత మేరకు సాయం చేయగలవు. కానీ, వీటి ధరలు కూడా శరవేగంగా పెరుగుతూ, ప్రజల జీవితాలను మరింత క్లిష్టంగా మారుస్తున్నాయి.
‘‘కొన్ని ప్రాంతాల్లో ఐస్ క్యూబ్‌ల బ్యాగ్ ధర 300 నుంచి 500 ఫ్రాంక్స్ సీఎఫ్ఏకు (రూ.40 నుంచి రూ.68) చేరుకుంది. ఇది చాలా ఎక్కువ’’ అని ఫాతుమా చెప్పారు.
బమాకోలో బ్రెడ్ కంటే ఐస్ క్యూబ్‌లు ఖరీదైన వస్తువుగా మారిపోయాయి. బ్రెడ్ ధర అక్కడ సాధారణంగా 250 ఫ్రాంక్స్ సీఎఫ్ఏ వరకు ఉంటుంది.

ఫొటో సోర్స్, COURTESY OF FATOUMA YATTARA
నానా కొనాటే త్రవోరేకు ఈ వేసవిలో పెద్ద సమస్య వచ్చింది. అంతకుముందు ఈయన వారంలో ఒక్కసారి మాత్రమే వంట చేసేవారు. కానీ, ఇప్పుడు ప్రతి రోజూ వండుకోవాల్సి వస్తుంది.
‘‘కొన్నిసార్లు రోజంతా కరెంట్ కోతలు ఉంటున్నాయి. దీని వల్ల, ఫ్రిడ్జ్‌లో పెట్టినా ఆహారం పాడైపోతోంది. దాన్ని బయట పడేయాల్సి వస్తుంది’’ అని నానా కొనాటే చెప్పారు.
మాలిలో విద్యుత్ సమస్య గత ఏడాది క్రితమే ప్రారంభమైంది.
ప్రభుత్వ విద్యుత్ కంపెనీ కొన్నేళ్లుగా డిమాండ్ మేరకు విద్యుత్ సరఫరా చేయడంలో విఫలమవుతోంది.
మాలిలో చాలా మంది దగ్గర జనరేటర్ లేదు. ఎందుకంటే, దాన్ని పెట్రోల్ లేదా డీజిల్‌తో నింపడం వారి శక్తికి మించిన పని.
‘‘మేం చాలా ఇబ్బంది పడుతున్నాం. రాత్రిపూట కూడా ఉష్ణోగ్రత 46 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. భరించలేకపోతున్నాం. వేడి పెరుగుతుంటే నాకు మూర్ఛలాగా అనిపిస్తుంది. ఉపశమనం కోసం నాపై నేనే కాస్త నీళ్లు చల్లుకోవాల్సి వస్తోంది’’ అని బమాకో శివారుల్లో నివసించే సౌమైలా మాగా చెప్పారు.
మాలిలోని కొన్ని ప్రాంతాల్లో మార్చి నుంచి ఉష్ణోగ్రతలు 48 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకుంటున్నాయి. ఈ వేసవిలో వంద మందికి పైగా మరణించారు. పిల్లలు, పెద్ద వారు బాగా ఇబ్బంది పడుతున్నారు.
‘‘ఎండ వేడికి తట్టుకోలేక ప్రతిరోజూ 15 మంది ఆస్పత్రిలో చేరుతున్నారు. చాలా మంది రోగులు డీహైడ్రేట్ అయ్యారు. దగ్గు, ఇతర శ్వాస సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు’’ అని బమాకో విశ్వవిద్యాలయ ఆస్పత్రి ప్రొఫెసర్ యాకుబా టోలోబా చెప్పారు.
ముందస్తు జాగ్రత్తగా కొన్ని ప్రాంతాల్లో స్కూళ్లను మూసివేశారు.
ముస్లింలు అధికంగా ఉండే మాలిలో, ఉపవాసాలు ఉండొద్దని, ఎండ వేడికి తట్టుకోలేరని రంజాన్ మాసంలో ప్రజలకు సూచించారు.

‘‘ఈ పరిస్థితులను తట్టుకునేలా మరిన్ని ప్రణాళికలను సిద్ధం చేసుకోవాల్సి ఉంది. బహుశా ఇలాంటి పరిస్థితులు మళ్లీ రావొచ్చు. ఈసారి ఎండ వేడి మాకు షాకిస్తుంది’’ అని ప్రొఫెసర్ టోలోబా చెప్పారు.
కేవలం మాలిలో మాత్రమే కాక, సెనెగల్, గినియా, బర్కీనా ఫాసో, నైజీరియా, నైజర్, చాద్ వంటి సరిహద్దు దేశాలలో కూడా పరిస్థితులు ఇలానే ఉన్నాయి.
మానవ కార్యకలాపాల వల్ల తలెత్తే పర్యావరణ మార్పులు తీవ్రమైన ఈ వేడికి కారణమవుతున్నాయని వరల్డ్ వెదర్ అట్రిబ్యూషన్ శాస్త్రవేత్తలు చెప్పారు.
‘‘పెట్రోల్, డీజిల్, గ్యాస్ వంటి శిలాజ ఇంధనాలను ప్రజలు ఒకవేళ ఇంతలా ఉపయోగించకుండా, భూమి వేడక్కకుండా చూస్తే, మాలి బర్కీనా ఫాసోలలో సగటు ఉష్ణోగ్రతలు ఈ మేర ఉండేవి కావు’’ అని ఈ సంస్థ నివేదించింది.
బమాకోలో ఉష్ణోగ్రతలు రాబోయే రోజుల్లో కూడా 40 డిగ్రీల సెల్సియస్ పైననే ఉండే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితులకు ప్రజలు క్రమంగా అలవాటు పడుతున్నారు.
ఇవి కూడా చదవండి:
- మే డే ఎలా మొదలైంది? కార్మిక దినోత్సవం చరిత్ర ఏమిటి?
- దక్షిణ కొరియా: ప్రెప్పర్లు ఎవరు, ఉత్తర కొరియాతో యుద్ధం భయంతో ఎందుకు అన్నీ సర్దుకుంటున్నారు?
- మనలో ‘రెండో గుండె’ ఉందని మీకు తెలుసా? అది ఎలా పని చేస్తుందంటే...
- ప్రజ్వల్ రేవణ్ణ ‘సెక్స్ వీడియో’ కేసు: దేవెగౌడ మనవడిపై ఫిర్యాదు చేసిన పనిమనిషి ఏం చెప్పారు?
- అడాల్ఫ్ హిట్లర్ కోసం ఆ మహిళలు కన్న వేలమంది ‘ఆర్య పుత్రులు’ ఏమయ్యారు?
బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.














