ఎండాకాలంలో కేవలం నీళ్లు తాగితే సరిపోదు.. ఈ జాగ్రత్తలు కూడా అవసరం

ఎండాకాలంలో నీళ్లు తాగుతున్న అమ్మాయి

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఉదయం నుంచే ఎండ మండిపోతోంది. వడగాలులు మొదలైపోతున్నాయి.

వేసవిలో ఈ తిప్పలు తప్పవు. కానీ ఇటీవల కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు తగ్గడం లేదు.

గొంతు తడారిపోవడం, కళ్ళు తిరగడం, కళ్ళు ఎర్రబడటం, మూత్రం పసుపురంగులో రావడం వంటి లక్షణాలు మీలో తరచూ కనిపిస్తుంటే మీరు మంచినీళ్ళు తక్కువగా తాగుతున్నారని అర్థం.

ఇతర ఆరోగ్య సమస్యలు ఏమీ లేకుండా ఎండాకాలంలో ఈ లక్షణాలు కనిపిస్తే, ఇది మీ ఆరోగ్యానికి సంబంధించి ఓ ప్రమాద ఘంటిక.

ప్రస్తుతం వేసవి తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఉక్కపోతతో పాటు చెమట ఇబ్బంది పెడుతోంది. తరచూ చెమట పట్టడం వల్ల శరీరంలోని నీటి పరిమాణం, ఉప్పు శాతం తగ్గిపోతాయి.

శరీరంలో నీటి శాతం, ఎలక్ట్రోలైట్స్ తగ్గిపోవడం తీవ్ర పరిణామాలకు దారితీస్తుంది. దీన్నే డీహైడ్రేషన్ అంటారు.

డీహైడ్రేషన్ తీవ్రత పెరిగితే, అది మరణానికి కూడా దారితీయవచ్చని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మహారాష్ట్ర విభాగం మాజీ అధ్యక్షుడు అవినాష్ బాంద్వే చెప్పారు.

ఏసీ రూమ్‌లో ఉంటే చెమట పట్టదు కదా అని మీకు అనిపించొచ్చు. కానీ ఎప్పుడూ ఏసీలోనే ఉంటే మీకు దాహం వేయదు. ఇది దీర్ఘకాలంలో మీ శరీరంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని నిపుణులు చెబుతున్నారు.

డీహైడ్రేషన్ సమస్యపై బీబీసీ ఆరోగ్య నిపుణులతో మాట్లాడింది.

ఏప్రిల్ మొదటి నుంచి చాలా రాష్ట్రాలలో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటిపోయాయి. కొన్ని ప్రాంతాలలో వడగాడ్పులు వీస్తున్నాయి.

వేడి వాతావరణంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం ఉంది. అందుకే తగిన జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి అని ఆరోగ్యరంగ నిపుణులు అంటున్నారు.

మంచినీరు తాగుతున్న యువతుల ఫోటో

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, వేసవిలో తగినంత నీరు తాగడం అవసరం.

డీహైడ్రేషన్ ఎప్పుడొస్తుంది?

ఎండలో ఎక్కువసేపు ఉంటే వడదెబ్బ తగిలి డీహైడ్రేషన్ వస్తుంది.

ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్న సమయంలోనూ రావచ్చు.

డయేరియా, ఇతర అనారోగ్య కారణాల వల్ల డీహైడ్రేషన్ రావచ్చు.

అతిగా మద్యంసేవించడం, కెఫిన్ ఉండే ద్రవాలు తీసుకోవడం వల్ల శరీరంలో నీరు తగ్గిపోతుంది.

చెమట ఎక్కువగా పట్టినప్పుడు, ఎక్కువగా కసరత్తులు చేశాకా డీహైడ్రేషన్ వచ్చే అవకాశం ఉంది.

మూత్రవిసర్జన కోసం ఇచ్చే మందుల వల్ల కూడా డీహైడ్రేషన్ రావచ్చు.

గుర్తించడం ఎలా, లక్షణాలేంటి?

  • దాహం ఎక్కువగా ఉండటం
  • వాసనతో కూడిన ముదురు పసుపురంగులో మూత్రం రావడం
  • సాధారణం కంటే తక్కువగా మూత్రవిసర్జన చేయడం
  • కళ్ళు తిరిగినట్టు అనిపించడం
  • అలసటగా ఉండటం
  • పెదవులు, నాలుక పిడచకట్టుకుపోవడం
  • కళ్ళు పీక్కుపోవడం లాంటి లక్షణాలు కనిపిస్తే, డీహైడ్రేషన్ ఉన్నట్టే.

అటువంటి సమయంలో నీళ్లు తాగడంతో పాటు శరీరానికి అవసరమైన ఇతర మినరల్స్ తీసుకోవాలి. అలాగే డాక్టర్‌ దగ్గరికి వెళ్లండి.

మంచినీటి తాగుతున్న యువతి

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, ఎండలో ఎక్కువ సేపు తిరిగితే డీహైడ్రేషన్ కలిగే అవకాశం ఎక్కువ.

నీరు తక్కువైతే ఏమవుతుంది?

శరీరంలో నీరు తగ్గిపోయిన విషయాన్ని గుర్తించడమెలా అని చాలామందికి సందేహం వస్తుంది.

నీరు తగ్గిందనడానికి మొదటి సూచిక మూత్రం. మూత్రం పసుపు రంగులో రావడం, కొద్దిగా మాత్రమే విసర్జన అవడం, ఒక్కోసారి మూత్రం ఎరుపు రంగులోకి మారడం అనేవి డీహైడ్రేషన్‌కు సంకేతాలు.

‘‘ఎండలో ఎక్కువసేపు నడవడం, లేదంటే ఏదైనా వేడి వాతావరణంలో పనిచేయడం అనేది శరీరంలో నీటిశాతాన్ని మాత్రమే కాకుండా, ఇతర లవణాలు అంటే సోడియం, పొటాషియం, క్లోరైడ్, బైకార్బోనేట్ శాతాన్ని తగ్గిస్తుంది. ఈ పరిస్థితి దీర్ఘకాలం ఉంటే శరీరంలోని మెగ్నీషియం, కాల్షియం నిల్వలు కూడా తగ్గిపోతాయి’’ అని డాక్టర్ అవినాష్ బాంద్వే చెప్పారు.

పెద్దవాళ్ల శరీరంలో 60 నుంచి 70 శాతం నీరు ఉంటుంది.

‘‘ఈ నీటి స్థాయిలో పెద్ద ఎత్తున తేడా వస్తే అప్పుడు శరీర జీవక్రియలు దెబ్బతింటాయి. అంటే ఆహారం తింటే అరగకపోవడం, కొంతమందికి మూర్ఛ కూడా రావచ్చు. కొందరికి ఊపిరి ఆడదు’’ అని చెప్పారు.

ఈ పరిస్థితి ఎక్కువ కాలం ఉంటే ఆ వ్యక్తి శ్వాస వ్యవస్థ, మెదడు దెబ్బతిని మరణించే ప్రమాదం ఉందని బాంద్వే వివరించారు.

నీటి శాతం తగ్గడం వల్ల చర్మం పొడిబారుతుందని చెప్పారు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం కేవలం నీరు తాగకపోవడం వల్లే డీహైడ్రేషన్ సంభవించదు. డయేరియా కూడా శరీరంలో నీరు తగ్గిపోవడానికి కారణమవుతుంది. డయేరియా ఉన్నప్పుడు శరీరంలో నీరు, లవణాల శాతం తగ్గిపోతుంది.

ఇలాంటి సందర్భాలలో బాధితులు నీరసపడిపోతారు. స్పృహ కోల్పోతారు. కళ్ళు పొడిబారతాయి. నీరు తాగబుద్ధి కాని పరిస్థితులు ఎదుర్కొంటారు.

డీహైడ్రేషన్‌లో ఇవి తీవ్ర పరిణామాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది.

నీరు తాగుతున్న మహిళ ఫోటో

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, వయోజనుల శరీరంలో 60 నుంచి 70 శాతం నీరు ఉంటుంది.

‘‘నీరు మాత్రమే తాగితే సరిపోదు’’

‘‘వేసవిలో డీహైడ్రేషన్ బారిన పడకూడదనుకుంటే కేవలం మంచినీరు తాగితే సరిపోదు. ఆ నీటికి ఇతర ద్రవాల సాయం కూడా అవసరం’’ అని డాక్టర్ రేవత్ కనికండే చెప్పారు.

ఆయన ముంబాయిలోని జేజే హాస్పిటల్‌లో పనిచేస్తున్నారు.

‘‘వేసవిలో తరచూ మంచినీరు తాగాలి. కానీ అది శరీర దాహాన్ని తీర్చలేదు. శరీరంలో డీహైడ్రేషన్ స్థితిని నివారించడానికి పండ్ల రసాలు, మజ్జిగ, చెరకు రసాలు తాగాలి. కొబ్బరి నీరు కూడా శరీరానికి మంచిది.

‘‘వేసవిలో శరీరంలో నీరు తగిన మోతాదులో ఉండేలా చూసుకోవడం చాలా అవసరం. సహజంగా మన శరీరం 70 శాతం నీటితోనే నిండి ఉంటుంది’’ అని చెప్పారు.

అయితే శరీరానికి నీరు అవసరం కదా అని ఒకేసారి పెద్ద ఎత్తున మంచినీరు తాగడం సరికాదంటున్నారు నిపుణులు. దాహం వేసినప్పుడు నీరు తాగాలనే విషయాన్ని గుర్తుంచుకోవాలని చెబుతున్నారు.

‘‘ప్రస్తుతం ఎక్కడ చూసినా ఏసీల వాడకం పెరిగింది. ఆఫీసులు, ఇళ్ళు, హోటళ్ళు ఎక్కడ చూసినా ఏసీలు ఉన్నాయి. దీనివల్ల దాహం వేయడం తగ్గిపోయి, అవసరానికన్నా తక్కువ నీరు తాగుతున్నాం. ఇలాంటి తప్పులను నివారించాల్సి ఉంది’’ అని డాక్టర్ అవినాష్ బాంద్వే చెప్పారు.

ఇక దాహం వేసినప్పుడు ఒకేసారి రెండు మూడు గ్లాసుల నీటిని తాగకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మంచినీరు మెల్లిగా తాగడం ఉత్తమం. ఒకేసారి ఎక్కువ నీరు తాగితే, కడుపు నిండిపోయి మీ ఆకలిపై ప్రభావం చూపుతుంది.

డాక్టర్ కనిండే వేసవి ఆహారం ఎలా ఉండాలో చెప్పారు.

  • వేసవిలో నూనె పదార్థాలకు దూరంగా ఉండాలి. అన్నం తిన్నాకే బయటకు వెళ్లండి. లేదంటే మీతోపాటు బాక్స్ తీసుకెళ్ళండి.
  • విటమిన్ సీ కోసం పులుపు ఉండే పండ్లను తినండి. మీ ఆహారంలో పుచ్చకాయ, కమలా, బత్తాయి, ద్రాక్ష, మామిడి, దానిమ్మ లాంటి పండ్లు ఉండేలా చూసుకోండి.
  • ఉసిరి, కోకుమ్ పండ్లలో కూడా విటమిన్ సీ, సోడియం, పొటాషియం, మెగ్నిషియం ఉంటాయి.
ఎండలో తండ్రీ కొడుకుల ఫోటో

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, వేసవిలో పిల్లల పట్ల పెద్దలు జాగ్రత్త వహించాలి.

పిల్లల పరిస్థితేంటి?

వేసవి కాలంలో పెద్దలే కాదు, పిల్లలూ బాధితులుగా మారతారు. ఏప్రిల్, మే నెలల్లో వేసవి సెలవుల కారణంగా ఇంటిపట్టునే ఉండే పిల్లలు ఎండలో ఆడటం మొదలుపెడతారు. దీనివల్ల వారు కూడా ఎండదెబ్బకు గురయ్యే అవకాశం ఉంటుంది.

పిల్లలు ఆటల్లో పడితే వారికి ఆకలి, దాహం గుర్తుండవు. అందుకే తల్లిదండ్రులు పిల్లల విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని ఫరీదాబాద్‌లోని అమృతా హాస్పిటల్ డాక్టర్ హేమంత్ తహిల్రామణి చెప్పారు.

పిల్లల్లో డీహైడ్రేషన్ నివారించడానికి డాక్టర్ హేమంత్ కొన్ని జాగ్రత్తలు చెప్పారు.

  • పిల్లలు రోజంతా నీరు తాగేలా తల్లిదండ్రులు కనిపెట్టుకుని ఉండాలి. ఆడుకోవడానికి బయటకు వెళ్ళే పిల్లలకు వాటర్ బాటిల్ ఇచ్చి పంపాలి. ఎండగా ఉన్నప్పుడు ఆడుకోవడానికి వారిని బయటకు పంపకపోవడమే మంచిది.
  • ఆహారంలో పండ్ల రసాలు, ఆకుకూరలు, కీరదోస, నారింజ, స్ట్రాబెర్రీలు ఉండేలా చూడాలి.
  • పిల్లలను ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు ఎండలో ఆడకుండా చూడాలి.
  • పిల్లలు కాస్త వదులుగా ఉండే, లైట్ కలర్ దుస్తులు ధరించేలా చూడాలి.
  • పిల్లలు నీరసపడితే వారికి వెంటనే ఓఆర్ఎస్ (ఓరల్ రీహైడ్రేషన్ సాల్ట్) ఇవ్వాలి.

పిల్లల శరీరంలో నీరు తగ్గకుండా చూసుకోవడం ముఖ్యమని డాక్టర్ అమృత్ వివరించారు.

(గమనిక - ఇది అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య సమస్యలు, సందేహాలు ఉంటే వైద్యులను సంప్రదించండి.)

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)