‘ఒక కూతురు నుంచి ఇలాంటి మాటలు వినడం అసాధారణంగా అనిపిస్తుంది...’

    • రచయిత, సునేత్ పెరీరా
    • హోదా, బీబీసీ వరల్డ్ సర్వీస్
ఆవేదనలో ఉన్న యువతి ఫోన్‌లో మాట్లాడుతున్న ఫోటో

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం

‘‘నా తల్లిదండ్రులు నన్ను కుంగిపోయేలా చేశారు. నేను దాదాపు ప్రతిరోజూ ఏడ్చేదానిని. అందుకే వాళ్ళను పట్టించుకోకూడదని నిర్ణయించుకున్నాను’’

ఓ కూతురు నుంచి ఇలాంటి మాటలు వినడం అసాధారణంగా అనిపించవచ్చు. అది కూడా ఆమె తల్లి అయిన తరువాత.

కానీ తన తల్లిదండ్రుల ‘టాక్సిక్ బిహేవియర్’ పతాకస్థాయికి చేరి, తన మానసిక ఆరోగ్యం దెబ్బతిన్నాక, వారితో బంధాన్ని ముగించుకున్నట్టు సారిక చెప్పారు.

‘‘అది నాపైన తీవ్ర ప్రభావం చూపింది. ప్రత్యేకించి గర్భవతిగా ఉన్నప్పుడు. కడుపులోని బిడ్డ కూడా నా ఏడుపు విని ఉంటుంది’’ అని 30 ఏళ్ళ సారిక మలేసియా నుంచి బీబీసీకి చెప్పారు.

సారిక తన తల్లిదండ్రులతో సంబంధాలను తగ్గించుకున్నారు.

కానీ తల్లిదండ్రులకు దూరంగా ఉండాలని ఆమె తీసుకున్ని నిర్ణయం అంత సులువైనది కాదు.

‘‘అపరాధ భావం ఎప్పడూ ఉంటుంది’’ అని ఆమె చెప్పారు.

సారిక ఒక్కరే ఇలా అనుకోవడం లేదు.

‘‘మా నాన్నను కచ్చితంగా స్వార్థపరుడిగానే అభివర్ణిస్తాను. ఆయన నా స్కూల్ కార్యక్రమాలకు రాలేదు. కనీసం నా గ్రాడ్యుయేషన్‌కూ రాలేదు. ఎప్పుడు అడిగినా ఆయన ఏదో ఒక సాకు చెబుతారు’’ అని చెప్పారు కెన్యా నుంచి అష్లే.

తన తండ్రి పట్టించుకోకపోవడం సంగతి పక్కనపెడితే, ఆయన తరచూ తన గురించి ప్రతి విషయంలోనూ ఫిర్యాదులు చేసేవారని పాతికేళ్ళ అష్లే తెలిపారు.

‘‘మా నాన్న టాక్సిక్ బిహేవియర్ నుంచి నన్ను నిజంగా కాపాడింది మా అమ్మే. తను నా కోసం ఎంత చేయగలదో అంతా చేసింది’’ అని అష్లే బీబీసీకి చెప్పారు.

‘‘వారి వివాహ బంధం చాలా కాలం కిందటే ముగిసింది. కానీ మా అమ్మ దానిని కొనసాగించింది. ఎందుకంటే ఆఫ్రికన్ సంస్కృతిలో విడాకులు అనేవి పాశ్యాత్య సంస్కృతులతో పోలిస్తే భిన్నమైనవి’’ అని ఆమె తెలిపారు.

‘‘ఇప్పుడాయన తరచూ ఫోన్లు చేసి నాకేదైనా ఉద్యోగం వచ్చిందా అని అడుగుతుంటారు. నేను ఆయనకు ఏదైనా కొనిపెట్టగలనని అలా అడుగుతుంటారు’’ అని అష్లే చెప్పారు.

నిరాశలో ఉన్న ఆఫ్రికన్ బాలిక ఫోటో

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ‘టాక్సిక్ పేరెంటింగ్’ పిల్లలు పెద్దవారయ్యాక ప్రతికూల ప్రభావం చూపుతుంది.

అష్లే, సారిక ఇద్దరూ వేలాది కిలోమీటర్ల దూరంలో నివసిస్తూ ఉండొచ్చు. కానీ వారిద్దరి మధ్య చాలా సారూప్యత ఉంది.

అవసరంలో ఉన్నప్పుడు తమ తల్లిదండ్రులు ఏనాడూ తమను పట్టించుకోలేదని వీళ్లు చెబుతున్నారు. తమను ఇంకా తమ చెప్పుచేతల్లో పెట్టుకోవాలని, ఉద్యోగం, సామాజిక జీవితం, బంధాలు, పెళ్ళి తదితర నిర్ణయాల్లో తల్లిదండ్రులు జోక్యం చేసుకుంటున్నారని వాళ్లు చెప్పారు.

తమ తల్లిదండ్రుల టాక్సిక్ బిహేవియర్ కారణంగా వారితో తమ బంధాన్ని ఎలా తెంచుకున్నారో చాలామంది టిక్‌టాక్, ఇతర సామాజిక మాధ్యమ వేదికలపై వీడియో పోస్టులలో వివరిస్తున్నారు. తల్లిదండ్రుల ‘టాక్సిక్ బిహేవియర్’ చిన్నప్పటి నుంచి నిరంతర అపరాధభావం, భయానికి కారణమైందని వారు తెలిపారు.

తల్లిదండ్రుల విషపూరిత ప్రవర్తన కారణంగా వృత్తి నిపుణుల సాయం కోరే పిల్లల సంఖ్య పెరుగుతోందని’’ బ్రిటిష్ అసోసియేషన్ ఫర్ కౌన్సెలింగ్ అండ్ సైకో థెరపీ (బీఏసీపీ)లో రిజిస్టర్డ్ సైకోథెరపిస్ట్ అయో అడేసియోయ్ చెప్పారు.

‘టాక్సిక్ పేరెంట్’ అంటే ఏమిటి?

‘టాక్సిక్’ అనే పదం విస్తృతంగా వాడుతున్నారు. ఇంతకీ దీని అర్థం ఏమిటి?

ఐక్యరాజ్యసమితి చిల్ట్రన్స్ ఏజెన్సీ యూనిసెఫ్ ప్రకారం ‘పాజిటివ్ పేరెంటింగ్’ అనేది ఓ పద్ధతికి, కొన్ని నిబంధనలకు, లేదంటే ఒక విధానానికి లోబడింది కాదు. అదో నమ్మకం. ఓ జీవన విధానం. పిల్లలను గౌరవంగా, హింస, అవమానాలకు దూరంగా, ప్రేమతో వారికి దారిచూపుతూ ప్రోత్సహించడం’’

కానీ ‘టాక్సిక్ పేరేంట్’ కు అధికారిక నిర్వచనం లేకపోయినా, దానిని ప్రతికూల లక్షణాల సమాహారంగా వర్ణిస్తున్నారు. ఇది పాజిటివ్ పేరెంటింగ్’కు పూర్తి విరుద్ధమైనది.

‘‘మనం సాధారణంగా పదే పదే పునరావృతమయ్యే ప్రవర్తనకు టాక్సిక్ అనే ముద్ర వేస్తాం’’

ఉదాహరణకు మీ బిడ్డకు భాగస్వామి ఉన్నారా అని అడిగితే సమస్య కాదు. కానీ గట్టిగా ప్రశ్నిస్తే నియంత్రణ కిందికి రావొచ్చు. ఆ ప్రశ్న పిల్లవాడికి చాలా ప్రాముఖ్యమైపోతుంది.

‘‘కొన్నిసార్లు తల్లిదండ్రులు తామేం చేస్తున్నామో తమకు తెలియకుండానే అలా చేస్తారు. వారికి అవగాహన, జ్ఞానం, చదువు లేకపోవడంతో ఇలా చేస్తారు’’ అని గృహ హింస విషయాలలోనూ నైపుణ్యం ఉన్న అడేసియోయ్ చెప్పారు.

బాల్యంలో తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొన్నవారికి యుక్తవయసులో ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని 2013 నాటి యూసీఎల్‌ఏ అధ్యయనం తెలిపింది. అధిక రక్తపోటు, చక్కెర వ్యాధుల బారిన పడే ముప్పు వీరికి ఎక్కువ ఉంటుందని పేర్కొంది.

తల్లిదండ్రుల గొడవ, ఏడుస్తున్న చిన్నారి ఫోటో

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

నియంత్రణ, స్వార్థం, మరికొన్ని...

తన కన్సల్టింగ్ రూమ్‌లో టాక్సిక్ పేరేంటింగ్‌లో తరచూ రెండు సాధారణ పద్ధతులను గమనిస్తూ ఉంటానని చెప్పారు అడేసియోయ్.

వీటిల్లో మొదటి దాంట్లో అవాస్తవిక అంచనాలు, ప్రమాణాలతో తమ పిల్లల చదువులో, ఉద్యోగ జీవితంలో లేదంటే బంధాల విషయంలో జోక్యం చేసుకునే తల్లిదండ్రులు ఉన్నారు.

రెండో కేటగిరీలోకి స్వార్థపూరిత తల్లిదండ్రులు వస్తారు. వీరు పిల్లలకు కాకుండా తమకు తామే మొదటి ప్రాధాన్యం ఇచ్చుకుంటారు.

ఈ రెండు లక్షణాలు తరచూ ఒకదానిపై ఒకటి ప్రభావం చూపుతాయని ఆమె చెప్పారు.

అయితే ఇటువంటి జాబితా కొనసాగుతూనే ఉంటుందని యూకేకు చెందిన కన్సల్టెంట్ క్లినికల్ సైకాలజిస్ట్ అలిసన్ కార్నర్ చెప్పారు.

యూకే నేషనల్ హెల్త్ సర్వీస్ (ఎన్‌హెచ్‌ఎస్) నుంచి రిటైరయ్యాక ఆమె మైహరీడ్‌పేరెంట్.కామ్ ( myhorridparent.com) ప్రారంభించారు. తల్లిదండ్రుల టాక్సిక్ బిహేవియర్ నుంచి బయటపడటమెలా అనే విషయంలో సాయం చేస్తున్నారు.

  • ఆధిపత్య తల్లులు – వీరు పిల్లలను అడగకుండానే వారి కోసం నిర్ణయాలు తీసుకుంటారు.
  • కోపిష్టి తల్లులు : పిల్లలు ఏం చేసినా తప్పు పడుతుంటారు.
  • అసూయపడే తల్లులు : తమ జీవితంలో ఏదో లోపం ఉండి, పిల్లల ద్వారా జీవించాలనుకునేవారు.
  • పోటీ తండ్రులు : తమ కంటే బాగా ప్రతిభ చూపే పిల్లలను చీటికిమాటికి విమర్శించేవాళ్లు.
  • కోపిష్టి తండ్రులు : ప్రతి చిన్న విషయానికి కోపంతో రగిలిపోయేవారు.
  • లొంగుబాటు స్వభావం ఉన్న తండ్రులు : ప్రతి నిర్ణయాన్ని, బాధ్యతను తల్లికే వదిలేసే తండ్రులు

మనసు తరుక్కుపోయే, విషాదగాథలను విన్నప్పుడు కొన్నిసార్లు బాధితులకు సాయం చేస్తుంటానని అలిసన్ కార్నర్ చెప్పారు.

In this photo illustration the logo of US online social media and social networking site 'X' (formerly known as Twitter) is displayed centrally on a smartphone screen alongside that of Threads (L) and Instagram (R).

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

సాంస్కృతిక చట్రం

సారిక తన సమస్య గురించి తమ కుటుంబానికి సన్నిహితుడైన ‘‘ తీర్పరి మనస్తత్వం లేని వ్యక్తితో చర్చించడానికి ప్రయత్నించారు. కానీ అంతిమంగా వారందరూ ఆమెనే నిందించారు.

‘‘మన సంస్కృతి పిల్లలదే తప్పు , తల్లిదండ్రులు ఎప్పుడూ కరెక్టే అనేలా చేసింది. నిప్పులేనిదే పొగరాదని ప్రజలు తరచూ చెపుతుంటారు’’ అని ఆమె చెప్పారు.

వివిధ సామాజిక, ఆర్థిక అంశాలు ఈ భావనకు తోడవుతాయని హాంగ్‌కాంగ్ యూనివర్సిటీకి చెందిన సామాజిక నిపుణురాలు ప్రొఫెసర్ చెరిస్ షున్-చింగ్ చాన్ చెప్పారు.

ఉదాహరణకు చైనాలో చాలా కుటుంబాలను ఒకే బిడ్డను కలిగి ఉండటానికి పరిమితం చేసిన వన్ చైల్డ్ పాలసీ పిల్లలపై ఒత్తిడి తెస్తుందని, ఎందుకంటే తల్లిదండ్రులకు ఆధారపడేందుకు మరొకరు లేకపోవడమే దీనికి కారణమని ఆమె చెప్పారు.

‘‘నిజానికి పిల్లలు తమ తల్లిదండ్రుల అంచనాలను అందుకోవడానికి ఇంకా ఎక్కువ ఒత్తిడిని ఎదుర్కొంటూ ఉంటారు. ఎందుకంటే తమ తల్లిదండ్రులు ఎన్నో త్యాగాలు చేసి, వారి కోసం ఎన్నో చేసి ఉంటారు’’ అని ఆమె బీబీసీకి చెప్పారు.

దీనితోపాటు చాలామంది తల్లిదండ్రులు పిల్లలపై భావోద్వేగ పరంగా ఆధారపడటాన్ని కోరుకుంటారు. వారి గురించి ఎప్పుడూ ఆందోళన చెందుతుంటారు. ముఖ్యంగా వివాహ బంధం విచ్ఛిన్నమైనవారు, లేదంటే వివాహేతర సంబంధాలున్న తండ్రి ఉన్నవారు ఇలా చేస్తుంటారు'' అని ప్రొఫెసర్ చాన్ వివరించారు.

‘‘ఇది కూడా ఒకరకమైన టాక్సిక్ పేరేంటింగే. పైగా దాని గురించి బయటకు మాట్లాడటం పిల్లలకు మరి కష్టంగా ఉంటుంది’’ అని ఆమె చెప్పారు.

‘‘ఇలాంటి పరిస్థితుల్లో కొందరు పిల్లలు తమ తల్లులకు కౌన్సెలర్లుగా మారతారు’’ అని తెలిపారు.

టాక్సిక్ పేరేంటింగ్ దీర్ఘకాలిక ప్రభాబాలను చూపుతుంది. ఇది వయోజన రోగులలో ఆత్మగౌరవ సమస్యలు, విపరీతమైన సిగ్గు, కఠినమైన స్వీయ-విమర్శ, స్వీయ కరుణ లేకపోవడం, సహాయం అడగడంలో ఇబ్బంది వంటి సమస్యలు వస్తాయని అయో అడెసియోయే చెప్పారు.

తల్లిబిడ్డల ఫోటో

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

బయటపడటం ఎలా?

తన తల్లిదండ్రులకు ఇష్టం లేని పెళ్ళి చేసుకున్నాక వారి ప్రవర్తన మరింత ‘టాక్సిక్’గా మారిందని సారిక చెప్పారు.

‘‘నా తల్లిదండ్రులు నాకోసం అన్నీ చేశారు. నేను వారి కోసం ఏమీ చేయలేదు.

‘‘నువ్వు కుటుంబానికి అప్రతిష్ఠ అని ఎప్పుడూ మా నాన్న చెప్పేవారు. ఒక దశలో నాదే తప్పేమో అనిపించేది’’ అని ఆమె తెలిపారు.

‘‘మీకు టాక్సిక్ పేరెంట్స్ ఉన్నారని అంగీకరించడానికి అపరాధభావం అడ్డొస్తుంది. కానీ మీ స్వీయ శ్రేయస్సుకు ప్రాధాన్యమీయడం ముఖ్యం’’ అంటారు డాక్టర్ ఆశా పటేల్.

ఆమె ఓ క్లినికల్ సైకాలజిస్ట్. ఇన్నోవేటింగ్ మైండ్స్ వ్యవస్థాపకురాలు. యూకేలో ఈ సంస్థ చిన్నపిల్లలకు, యువతకు మానసిక ఆలంబనను అందిస్తుంది.

‘‘మీ మానసిక ఆరోగ్యాన్ని ఎవరూ పట్టించుకోరు. ఆ పనిచేయగలిగింది మీరే ’’ అని ఆమె చెప్పారు.

పిల్లలు ఎదిగిన తర్వాత వారు ఇక చిన్న పిల్లలు కాదని తల్లిదండ్రులు గుర్తించి, కొన్ని హద్దులు ఏర్పాటు చేసుకోవాలని అయో అడెసియోయే చెప్పారు.

‘‘కచ్చితంగా ఇదే లోపిస్తున్నట్టుగా కనిపిస్తోంది. నా ప్రాక్టీసులో నేను ఇలాంటివి చాలా చూస్తాను. మీరు పెద్దవారయ్యారనే విషయాన్నే మరిచిపోయి పిల్లల్లానే చూస్తారు’’ అని చెప్పారు.

అష్లే ఈ సలహాను అనుసరించి తన తండ్రితో స్పష్టమైన హద్దులు పెట్టుకున్నారు. తన మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యమిచ్చారు.

ఇక సారిక ప్రస్తుతం కొత్తగా పుట్టిన తన బిడ్డకు మంచి తల్లిగా ఉండాలని అనుకుంటున్నారు.

‘‘నేను నా తల్లిదండ్రుల్లా ఉండాలనుకోవడం లేదు. నేను ఆమెకు మద్దతుగా నిలుస్తాను. ఉన్నంతలో ఉత్తమమైన వాటినిఇస్తాను. తన జీవితాన్ని తానే నిర్ణయించుకునేలా చేస్తాను’’ అని ఆమె చెప్పారు.

అయితే, కొన్ని సందర్భాల్లో తల్లిదండ్రుల కోపానికి పిల్లల ప్రవర్తన కూడా కారణం అవుతుందనే మరో వాదన కూడా ఉంది.

తల్లిదండ్రులు, ఎదిగిన పిల్లల మధ్య సంబంధాలు ఎలా ఉంటాయన్న విషయం వారిద్దరి ప్రవర్తనపై ఆధారపడి ఉంటుందని మానసిక నిపుణులు చెబుతుంటారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)