లోక్‌సభ ఎన్నికలు 2024: మీకు చికెన్ ఇష్టమా, మటన్ ఇష్టమా అన్నది కూడా రాజకీయ నాయకులకు తెలిసిపోతుంది, ఎలాగంటే...

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, మెరిల్ సెబాస్టియన్
- హోదా, బీబీసీ ప్రతినిధి
భారతీయుల స్మార్ట్‌ఫోన్‌లలో బోలెడన్ని యాప్స్ ఉంటాయి. టాక్సీలు, ఫుడ్ ఆర్డర్, డేటింగ్, సినిమా బుకింగ్‌లాంటి అనేక అవసరాల కోసం వీటిని ఉపయోగిస్తూ ఉంటారు.
కానీ, ఈ యాప్‌లకు మీరు ఇచ్చే సమాచారం రాజకీయ నాయకులకు చేరుకునే అవకాశం చాలా ఉంది. మీకు నచ్చినా, నచ్చకున్నా మీ గురించి వారికి ఏం కావాలో ఆ విషయాలు తెలుసుకుంటారు.
ఒక వ్యక్తి మతం, మాతృభాష, సోషల్ మీడియాలో తన స్నేహితులకు ఏ విధమైన మెసేజ్‌లు పంపుతుంటారు? ఇలాంటివన్నీ ఓ నాయకుడు తెలుసుకోవాలనుకునే డేటా. ఇవి తెలుసుకోవడం రాజకీయ నాయకులకు ఇప్పుడు చాలా సులువని ఎన్నికల వ్యూహకర్త రుత్విక్ జోషి అంటున్నారు.
ఈ ఎన్నికల్లో కనీసం డజను మంది ఎంపీలను మళ్లీ గెలిపించేందుకు రుత్విక్ కసరత్తు చేస్తున్నారు.
దేశంలో స్మార్ట్‌ఫోన్‌లకు ఆదరణ పెరుగుతుండటం, ప్రైవేట్ కంపెనీలకు డేటాను విక్రయించడానికి అనుమతించే నిబంధనలను సడలించడంతో చాలా రాజకీయ పార్టీలు ప్రతిదానికీ డేటాను సేకరిస్తున్నాయని రుత్విక్ పేర్కొన్నారు.
ఈ రోజు మీరు తినే ఆహార పదార్ధాల వివరాలు కూడా వారికి తెలుసుకోగలుగుతున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
నాయకులకు ఈ సమాచారం ఎందుకు?
రాజకీయ పార్టీలకు ఇవన్నీ ఎందుకు అవసరం? ఎందుకంటే ఈ సమాచారంతో తమకు ఎన్ని ఓట్లు వస్తాయో వాళ్లు అంచనా వేసుకుంటారని రుత్విక్ చెప్పారు. ఈ అంచనాలు ఎప్పుడూ తప్పవని ఆయన అంటున్నారు.
రాజకీయ నాయకులు ఈ డేటాతో తమ గెలుపోటములు తెలుసుకుంటే మనకేంటి నస్టం అంటారా?
మైక్రోటార్గెటింగ్ – అంటే మీకు మీ డివైజ్‌లో ప్రకటనలను చూపించడానికి, సమాచారాన్ని అందించడానికి వ్యక్తిగత డేటా ఉపయోగించడం.
ఎన్నికల సమయంలో ఈ మైక్రోటార్గెటింగ్ కొత్త విషయం కాదు. 2016లో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించిన తర్వాత ఇది వెలుగులోకి వచ్చింది. ఆ సమయంలో వ్యక్తులకు ట్రంప్ అనుకూల కంటెంట్ పంపడానికి ఫేస్‌బుక్ దగ్గర కొనుక్కున్న డేటాను వాడుకున్నారని పొలిటికల్ కన్సల్టెన్సీ కేంబ్రిడ్జ్ అనలిటికాపై ఆరోపణలు వచ్చాయి.
అయితే, కేంబ్రిడ్జ్ అనలిటికా ఈ ఆరోపణలను ఖండించింది. కానీ దాని సీఈవో అలెగ్జాండర్ నిక్స్‌ను సస్పెండ్ చేసింది.
2022లో ఈ డేటా ఉల్లంఘన విషయంలో పలువురు వేసిన దావాను సెటిల్ చేసుకొనేందుకు దాదాపు రూ. 6 వేల కోట్లు చెల్లించేందుకు మెటా అంగీకరించింది.
తాము చూసిన యాడ్ తమ ఓటుపై ఏమైనా ప్రభావం చూపిందా అని అప్పట్లో ప్రజలు ప్రశ్నించుకున్నారు.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలు ప్రజాస్వామ్యంపై డేటా ప్రభావం గురించి చాలా ఆందోళన చెందాయి. పలు దేశాలు వెంటనే చర్య తీసుకోవడం ప్రారంభించాయి.

ఫొటో సోర్స్, Getty Images
భారత్‌లో ఏం జరిగింది?
ఇండియాలో కేంబ్రిడ్జ్ అనలిటికాతో సంబంధం ఉన్న ఒక కంపెనీ బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ రెండూ తమ కస్టమర్లని పేర్కొంది. అయితే, దీనిని ఇరు పార్టీలూ ఖండించాయి.
భారత పౌరుల డేటాను దుర్వినియోగం చేసినందుకు కంపెనీ, ఫేస్‌బుక్‌పై చర్యలు తీసుకుంటామని అప్పటి భారత సమాచార, సాంకేతిక మంత్రి రవిశంకర్ ప్రసాద్ హెచ్చరించారు.
అయితే, ఓటర్లను టార్గెట్ చేయడాన్ని నిరోధించేందుకు ఇప్పటివరకు పెద్దగా చర్యలు తీసుకున్న దాఖలాలు లేవని డేటా అండ్ సెక్యూరిటీ రీసెర్చర్ శ్రీనివాస్ కొడాలి చెబుతున్నారు.
"బ్రిటన్, సింగపూర్‌లతో పాటు పలు దేశాల్లోని ఎలక్షన్ కమిషన్లు ఎన్నికల సమయంలో మైక్రో-టార్గెటింగ్ పాత్రను సమీక్షించాయి. కొన్ని చర్యలు తీసుకున్నాయి, ఇది ఎన్నికల సంఘం చేయవలసిన పని. కానీ ఇక్కడ అలాంటి చర్యలు లేవు" అని ఆయన అన్నారు.
"భారత్‌లో ఈ సమస్య మరింత క్లిష్టంగా మారింది, ఎందుకంటే ఎటువంటి భద్రతా చర్యలు లేకుండా ప్రభుత్వం రూపొందించిన డేటా ఇక్కడ ఉంది" అని శ్రీనివాస్ చెప్పారు.
వాస్తవానికి, దేశంలో 65 కోట్ల మందికి పైగా స్మార్ట్‌ఫోన్ వినియోగదారులున్నారు. ఈ స్మార్ట్ ఫోన్‌లన్నింటికీ మూడో పక్షాల(థర్డ్ పార్టీ)తో డేటాను షేర్ చేసే యాప్‌లు ఉన్నాయి.

ప్రభుత్వానిదీ బాధ్యతే
ప్రభుత్వం వ్యక్తిగత డేటాను కూడా పంచుకుంటుంది. అయితే మీ స్మార్ట్‌ఫోన్ వల్ల మాత్రమే మీరు టార్గెట్ కావడం లేదు. ప్రభుత్వం వద్ద వ్యక్తిగత డేటా భారీగా ఉంది. అది కూడా మీ సమాచారాన్ని ప్రైవేట్ కంపెనీలకు అందిస్తోంది.
"ప్రభుత్వం పౌరుల భారీ డేటాబేస్‌ను రూపొందించింది. దానిని ప్రైవేట్ రంగంతో పంచుకుంది" అని శ్రీనివాస్ అంటున్నారు.
ఇది పౌరులపై నిఘా ముప్పును పెంచిందని ఇంటర్నెట్ ఫ్రీడమ్ ఫౌండేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రతీక్ వాఘ్రే ఆరోపించారు. అలాగే, ఏ సమాచారం ప్రైవేట్‌గా ఉండాలనే దానిపై వారికి నియంత్రణ లేదని తెలిపారు.
గత ఏడాది ప్రభుత్వం డేటా రక్షణ చట్టాన్ని ఆమోదించిందని, అది ఇప్పటివరకూ అమలు కాలేదని నిపుణులు చెబుతున్నారు. నిబంధనలు పాటించకపోవడమే ఇందుకు కారణమని శ్రీనివాస్ అంటున్నారు.
ఈ భారీ డేటా లభ్యత ఫలితం ఏమిటి? ఈ ప్రశ్నకు రుత్విక్ జోషి స్పందిస్తూ.. ఇండియా "ప్రపంచంలోనే అతిపెద్ద డేటా మైన్"గా ఈ ఎన్నికల సంవత్సరంలోకి ప్రవేశించిందని, అయితే చట్టవిరుద్ధంగా ఎవరూ చేయడం లేదని అన్నారు.
"యాప్‌ని ఎంతమంది వినియోగదారులు ఉపయోగిస్తున్నారనే డేటాను నాకు ఇవ్వమని లేదా ఆ వినియోగదారుల కాంటాక్ట్ నంబర్ ఇవ్వమని నేను యాప్‌ని అడగడం లేదు. కానీ మీ ప్రాంతంలో ప్రజలు శాఖాహారం ఎక్కువ తింటారా? లేదా మాంసాహారమా? అని అడగగలను" అని ఆయన చెప్పారు.
అంతేకాదు, కస్టమర్ ఇప్పటికే అనుమతి ఇచ్చారు కాబట్టి, సదరు యాప్ ఈ డేటాను అందిస్తుంది. రుత్విక్ కంపెనీ ‘నీతి-ఐ’ పలు నియోజకవర్గాల్లో ఓటర్లను అర్థం చేసుకోవడానికి డేటాను ఉపయోగిస్తుంటుంది.
"ఉదాహరణకు మీ మొబైల్‌లో 10 భిన్న భారతీయ యాప్‌లు ఉంటే, ఆ యాప్‌లకు మీ కాంటాక్టులు, గ్యాలరీ, మైక్, స్పీకర్, లైవ్ లొకేషన్‌తో సహా అన్నింటికీ యాక్సెస్ ఇచ్చారు" అని రుత్విక్ అన్నారు.
పార్టీ కార్యకర్తలు సేకరించిన డేటాతో పాటు ఈ డేటాను ఉపయోగించి ఆ ప్రాంతంలో ఎటువంటి అభ్యర్థి ఉండాలి?, అభ్యర్థి భార్య పూజ చేయడానికి లేదా హారతి కోసం ఎక్కడికి వెళ్లాలి? ఎలాంటి ప్రసంగం చేయాలి? ఆమె ఎలాంటి దుస్తులు ధరించాలి? అనే విషయాలను నిర్ణయిస్తారు.
'ప్రజల ఆలోచన మారిందా?'
అయితే ఈ స్థాయిలో టార్గెట్ చేసి ప్రజల మనసు మార్చగలరా? అంటే దీనిపై స్పష్టత లేదు. అయితే ప్రాథమిక స్థాయిలో ఇది ప్రజల గోప్యతను ఉల్లంఘించడమేనని నిపుణులు అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు.
ఈ సమాచారం వినియోగం మరింత పెరిగితే, అది ప్రజలకు వ్యతిరేకంగా కూడా ఉపయోగించవచ్చని ఆందోళన చెందుతున్నారు. ఇలా ఇప్పటికే జరుగుతోందని, ఇదొక సమస్య అని కూడా అంటున్నారు ప్రతీక్ వాఘ్రే.
"ప్రభుత్వ పథకానికి లబ్ధిదారుని డేటా ఉపయోగించడం, అతని డేటాను మైక్రో-టార్గెట్ చేయడానికి ఉపయోగించడం మధ్య స్పష్టమైన వ్యత్యాసం లేదని గుర్తించాం" అని ప్రతీక్ చెప్పారు.
ప్రభుత్వం, ప్రభుత్వ సంస్థలకు వారి ఇష్టానుసారం చట్టం విస్తృతమైన మినహాయింపులను అందిస్తుంది. మూడో పక్షాలతో వ్యక్తిగత సమాచారాన్ని ఉపయోగించే, పంచుకునే అధికారం కూడా వారికి ఉంది.
‘’రాబోయే ప్రభుత్వాలు ఒక అడుగు ముందుకు వేసి, ఎవరు మాకు మద్దతు ఇస్తున్నారో చూద్దాం, వారికి మాత్రమే ప్రయోజనాలను అందిస్తాం, అని కూడా అనుకోవచ్చు" అని ప్రతీక్ ఆందోళన వ్యక్తంచేశారు.
ఈ రకమైన డేటా వినియోగం భారతదేశంలో 'తప్పుడు సమాచారం' సమస్యను మరింత పెంచుతుందని శ్రీనివాస్ చెప్పారు.
"మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, టార్గెట్ యాడ్స్, ఓటర్లను లక్ష్యంగా చేసుకోవడం వంటి వాటి గురించి మాట్లాడుతున్నప్పుడు, అవన్నీ కంప్యూటేషన్ ప్రాపగాండా కిందకే వస్తాయి." అని ఆయన అంటున్నారు.
"2016లో ట్రంప్ ఎన్నికల సమయంలో కూడా ఇటువంటి ప్రశ్నలు లేవనెత్తారు, ఆ ఎన్నికలపై విదేశీ ప్రభావం ఉందనే అనుమానం ఉంది" అని శ్రీనివాస్ అన్నారు.
ఇప్పుడు డబ్బు వినియోగం, ప్రకటనల ఖర్చులపై నియంత్రణ ఉన్నట్లే ఎన్నికల ప్రచారాల్లో డేటా, టెక్నాలజీపై కూడా నియంత్రణ ఉండాలని కొడాలి శ్రీనివాస్ డిమాండ్ చేస్తున్నారు. తద్వారా ఎన్నికలు నిష్పక్షపాతంగా నిర్వహించవచ్చంటున్నారు.
ఒకటి లేదా కొన్ని రాజకీయ పార్టీలకు లేదా గ్రూపులకు మాత్రమే అలాంటి సాంకేతికత అందుబాటులో ఉంటే ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగాయని ఎలా అనుకుంటామని శ్రీనివాస్ ప్రశ్నించారు.
ఇవి కూడా చదవండి:
- టైటానిక్ మునగడానికి 25 ఏళ్ల ముందే భారత్‌లో ఘోర ప్రమాదం, సముద్రంలో మునిగిపోయిన 750 మంది.. అసలేం జరిగింది?
- అంతరించి పోయిందనుకున్న ఈ ‘పర్వత రత్నం’ మళ్లీ కనిపించింది, ఎక్కడంటే..
- బెంగళూరు రేవ్ పార్టీ కేసు: పోలీసులు ఏం చెప్పారు? అసలు రేవ్ పార్టీ అంటే ఏంటి? అందులో ఏం చేస్తారు?
- ఓవర్సీస్ హైవే: సముద్రంలో 182 కిలోమీటర్ల రోడ్డు.. ప్రపంచంలో 8వ వింత ఇదేనా?
- #UnseenLives: వెనక 40 మంది పురుషులున్నా, నేను ఆ మరకను దాచుకోలేదు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














