'ఓ సార్, గూండాలను పంపకండి' అని ఎన్నికల ప్రచారంలో కన్హయ్య కుమార్ ఎందుకు అన్నారు?

ఎన్నికలు

ఫొటో సోర్స్, @kanhaiyakumar

దేశ రాజధాని దిల్లీలో షాకింగ్ ఘటన జరిగింది. ఈశాన్య దిల్లీ నుంచి లోక్ సభకు పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి కన్హయ్య కుమార్‌ ఎన్నికల ప్రచారంలో ఉండగా కొందరు ఆయనపై దాడి చేశారు.

దిల్లీలోని ఉస్మాన్‌పూర్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ స్థానిక కార్యాలయం బయట ఉన్న సమయంలో కొందరు వ్యక్తులు ఆయనపై తొలుత సిరా చల్లి, ఆ తర్వాత చెంప మీద కొట్టారు.

ఆమ్ ఆద్మీ పార్టీ కౌన్సిలర్ ఛాయా శర్మ ఫిర్యాదు మేరకు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు ఈశాన్య దిల్లీ డిప్యూటీ పోలీస్ కమిషనర్ తెలిపారు.

శుక్రవారం సాయంత్రం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బహిరంగ సభలో ఈ ఘటనపై కన్హయ్య కుమార్ స్పందించారు.

''ఓ సార్, గూండాలను పంపించకండి, మీ పోలీసులను చూశాం, మీ జైలు కూడా చూశాం, స్వతంత్ర సమరయోధుల రక్తం రంగులోనే మా రక్తం ప్రవహిస్తోంది. మేం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలం. మేం బ్రిటిష్ వాళ్లకే భయపడనప్పుడు, బ్రిటిష్ వాళ్ల భజనపరులకు ఎందుకు భయపడతాం?'' అని అంటున్న వీడియోను ఎన్‌ఎస్‌యూఐ ఎక్స్‌లో పోస్ట్ చేసింది.

ఈశాన్య దిల్లీ లోక్ సభ నియోజకవర్గం నుంచి రెండుసార్లు ఎంపీగా గెలిచిన బీజేపీ నేత మనోజ్ తివారిపై కన్హయ్య కుమార్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.

ఇండియా కూటమి సీట్ల పంపకాల ప్రకారం, దిల్లీలోని మొత్తం ఏడు లోక్‌ సభ స్థానాలకు గానూ మూడింటిలో కాంగ్రెస్, నాలుగు స్థానాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేస్తున్నాయి.

మే 25న ఆరో దశలో భాగంగా ఈ ఏడు స్థానాలకు పోలింగ్ జరగనుంది. జూన్ 4న ఓట్ల లెక్కింపు ఉంటుంది.

కన్హయ్య కుమార్

ఫొటో సోర్స్, ANI

ఘటనపై ఎవరేమన్నారు?

హిందూస్థాన్ టైమ్స్ వార్తాపత్రిక కథనం ప్రకారం, ఇది బీజేపీ నేత మనోజ్ తివారి కుట్ర అని పేరు బహిర్గతం చేయడానికి ఇష్టపడని కన్హయ్య కుమార్‌ కార్యాలయానికి చెందిన ఒక వ్యక్తి చెప్పారు.

దిల్లీ బీజేపీ నేత నీల్‌కాంత్ బక్షి ఈ ఆరోపణలను తోసిపుచ్చారు. సానుభూతి కోసం కన్హయ్య కుమార్ ఉద్దేశపూర్వకంగా తనపై తానే దాడి చేయించుకున్నారని ఆయన అన్నారు.

కాంగ్రెస్

ఫొటో సోర్స్, X/twitter

కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఈ ఘటనను ఖండిస్తూ, ''బీజేపీ చరిత్రాత్మక ఓటమి దిశగా వెళ్తోంది. అందుకే ఇలాంటి హింసాత్మక ఘటనలకు పాల్పడుతోంది'' అని ఎక్స్‌లో రాశారు.

''ఇలాంటి వాటికి భయపడని కాంగ్రెస్ సింహం కన్హయ్య కుమార్ అని వాళ్లు తెలుసుకోవాలి.'' అని ఆయన ఆ పోస్టులో వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్

ఫొటో సోర్స్, X/twitter

కన్హయ్య కుమార్‌పై దాడికి సంబంధించిన రెండు వీడియోలను యువజన కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు బీవీ శ్రీనివాస్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

రెండో వీడియోలో కన్హయ్యపై దాడి చేసిన వ్యక్తి ఒక సమావేశంలో బీజేపీ అభ్యర్థి మనోజ్ తివారి పక్కన కూర్చున్నట్లు చూపిస్తోంది.

కన్హయ్య కుమార్‌పై పిరికిపంద చర్యకు పాల్పడిన బీజేపీ గూండాలపై దిల్లీ పోలీసులు తక్షణమే చర్యలు తీసుకోవాలని బీవీ శ్రీనివాస్ కోరారు.

''ఓటమికి భయపడి బీజేపీ ఒక రైతు కొడుకుపై దాడి చేయడానికి గూండాలను పంపుతోంది'' అని పేర్కొంటూ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం ఎన్‌ఎస్‌యూఐ ఒక వీడియోను ఎక్స్‌లో పోస్ట్ చేసింది.

ఆ వీడియోలో కన్హయ్య కుమార్, ''ఓ సార్, గూండాలను పంపకండి, మీ పోలీసులను చూశాం. మీ జైలుని చూశాం. చేతనైంది చేసుకోండి, మేం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలం. బ్రిటిష్ వాళ్లకే భయపడలేదు, వ్యతిరేకంగా పోరాడాం, సైకోఫాంట్స్‌కి కూడా భయపడం'' అంటున్నట్లు ఉంది.

కాంగ్రెస్

ఫొటో సోర్స్, X/twitter

అసలేం జరిగింది?

బ్రహ్మపురికి చెందిన ఆమ్ ఆద్మీ పార్టీ కౌన్సిలర్ ఛాయా గౌరవ్ శర్మ ఆహ్వానం మేరకు కాంగ్రెస్ అభ్యర్థి కన్హయ్య కుమార్ ఉస్మాన్‌పూర్‌లోని కర్తార్ నగర్‌లో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ స్థానిక కార్యాలయానికి వచ్చారు.

సమావేశం అనంతరం కార్యాలయం నుంచి బయటికి వెళ్లి కొంతమందితో మాట్లాడుతుండగా కొందరు వ్యక్తులు ఆయన వైపు వచ్చారు.

వారిలో ఒకరు ముందుగా కన్హయ్యకు పూలమాల వేశారు, ఆ తర్వాత ఆయనపై సిరా చల్లి, అనంతరం దాడి చేశారు.

ఈ ఘటనలో ముగ్గురు, నలుగురు మహిళలు గాయపడ్డారని, ఒక మహిళ సమీపంలోని కాలువలో పడిపోయారని ఎన్డీటీవీ రిపోర్ట్ చేసింది.

ఛాయా శర్మ జోక్యం చేసుకునేందుకు ప్రయత్నించగా ఆమెపై కూడా దురుసుగా ప్రవర్తించి, బెదిరింపులకు పాల్పడ్డారని పోలీసులు చెబుతున్నారు.

తన దుపట్టా పట్టుకుని పక్కకు లాక్కెళ్లారని, తనను , తన భర్తను చంపేస్తామని బెదిరించారని ఛాయా శర్మ ఆరోపించారు.

పోలీసులు ఏం చెప్పారంటే..

ఈ ఘటనకు సంబంధించి శుక్రవారం సాయంత్రం 6.53 గంటలకు పోలీసులకు ఫోన్ కాల్ వచ్చిందని ఈశాన్య దిల్లీ డిప్యూటీ పోలీస్ కమిషనర్ జాయ్ తిర్కీ తెలిపారు.

ఇప్పటి వరకూ తెలిసిన సమాచారం ప్రకారం, ఆమ్ ఆద్మీ పార్టీ సమావేశానికి హాజరయ్యేందుకు న్యూ ఉస్మాన్‌పూర్‌లోని స్వామి సత్యనారాయణ భవన్‌కు కన్హయ్య కుమార్ వచ్చారని ఆయన చెప్పారు.

సమావేశం అనంతరం కన్హయ్య బయటకు వస్తుండగా ఛాయా శర్మ కూడా ఆయన కోసం బయటికి వచ్చారని, ఆ సమయంలో అక్కడున్న కొందరు వ్యక్తులు ముందుగా కన్హయ్య మెడలో పూలమాల వేసి, ఆ తర్వాత ఆయనపై సిరా చల్లి, దాడికి పాల్పడ్డారని డీసీపీ చెప్పారు.

"ఈ ఘటనపై ఛాయా శర్మ ఫిర్యాదు చేశారు. చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నాం." అని అన్నారు డీసీపీ.

ఈ కేసులో లభ్యమైన వీడియోను పరిశీలిస్తున్నట్లు పోలీసులు చెప్పారు. అయితే, దాడి చేసిన వ్యక్తి ఎవరనేది ఇప్పటి వరకూ పోలీసులు ధ్రువీకరించలేదు.

కాంగ్రెస్

ఫొటో సోర్స్, X/twitter

సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోలో ఏముంది?

దాడి తర్వాత విడుదల చేసిన ఒక వీడియోలో, తామే కన్హయ్య కుమార్‌పై దాడి చేసినట్లు ఇద్దరు వ్యక్తులు చెప్పారు.

వారిలో ఒకరు తన చేయి చూపిస్తూ, కన్హయ్య తలపై కొట్టినట్లు చెప్పారు. చెంపదెబ్బ కొట్టినట్లు వారిద్దరూ చెప్పారు.

''ఉస్మాన్‌పూర్‌లో ర్యాలీ జరిగింది, అక్కడ వాళ్ల ముఖాలపై సిరా చల్లి, చెంప చెళ్లుమనిపించాం. సనాతన ధర్మం బతికి ఉన్నంత కాలం భారతదేశాన్ని ఎవరూ ముక్కలు చేయలేరు. మేం ఏం చెప్పామో అదే చేశాం.'' అని వారు అన్నారు.

రెండు వీడియోల్లోనూ 2016లో దిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీలో జరిగిన ఒక సంఘటనను ప్రస్తావిస్తూ 'భారత్‌ను ఎవరూ ముక్కలు చేయలేరు' అన్నారు.

జేఎన్‌యూలో జరిగిన ఓ సమావేశంలో కన్హయ్య అలాంటి నినాదాలు చేశారని వారు ఆరోపించారు. అప్పట్లో కన్హయ్య విద్యార్థి సంఘం అధ్యక్షుడిగా ఉన్నారు.

కాషాయ క్రాంతి సేన జాతీయ అధ్యక్షులు సాధ్వి ప్రాచీ తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలో ఈ వీడియో పోస్టు చేశారు. ‘‘ద్రోహి కన్హయ్య కుమార్‌ని కొట్టిన ధైర్యశాలి బహదూర్ దక్ష్’’ అని ఆమె పేర్కొన్నారు.

ఆమె పోస్ట్ చేసిన వీడియోలో ఉన్న వ్యక్తి, దాడికి సంబంధించిన మరో వీడియోలో కనిపించారు. అందులో మొదట కన్హయ్య మెడలో పూలమాల వేసి, ఆ తర్వాత దాడి చేశారు.

ఇవి కూడా చదవండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)