టైటానిక్‌ మునగడానికి 25 ఏళ్ల ముందే భారత్‌లో ఘోర ప్రమాదం, సముద్రంలో మునిగిపోయిన 750 మంది.. అసలేం జరిగింది?

సముద్రంలో నావ ఫోటో

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం: 137 ఏళ్ళ కిందట సర్ జాన్ లారెన్స్ ఓడ సముద్రంలో మునిగిపోయింది
    • రచయిత, అమితాబ్ భట్టశాలి
    • హోదా, బీబీసీ ప్రతినిధి, కోల్‌కతా నుంచి

ఇది 137 సంవత్సరాల కిందట జరిగిన పెనుప్రమాదం. 1887 మే 25న జాన్ లారెన్స్ అనే ఓడ సముద్రంలో ఘోర ప్రమాదానికి గురైంది. ఈ ఓడ కలకత్తా (ఇప్పుడు కోల్‌కతా) నుంచి పూరీకి వెళుతుండగా భాగీరధి నదీ ముఖద్వారం వద్ద సాగర్ ద్వీప ప్రాంతంలో ప్రమాదానికి గురైంది.

ఈ ఓడకు సంబంధించిన కంపెనీ వెల్లడించిన సమాచారం ప్రకారం, మొత్తం 750 మంది ప్రయాణికులు ఓడలో ఉన్నారు. ఈ ప్రమాద వార్తను ఆనాటి దినపత్రికలు ప్రచురించాయి. ప్రయాణికుల్లో ఒక్కరు కూడా ప్రాణాలతో బయటపడలేదని రాశాయి.

అయితే ఈ ప్రమాదం చరిత్ర పుటలను తిరగేసిన బీబీసీకి ఆ ప్రమాదం నుంచి అనివార్య కారణాల వల్ల చివరి నిమిషంలో ఆ ఓడలో ప్రయాణం చేయని కొంతమంది పేర్లు, వారి సమాచారం తెలిసింది.

ఈ ఓడ ప్రమాదం జరిగిన పాతికేళ్ళకే టైటానిక్ ప్రమాదం చోటుచేసుకుంది. నిజానికి ఈ రెండు ప్రమాదాలు పోల్చదగినవి కాకపోయినా, జాన్ లారెన్స్ ఓడ ప్రమాదం ఆ సమయానికి చాలా ఘోరమైనది.

రబీంద్రనాథ్ ఠాగూర్ తాను రాసిన ‘సింధ్ తరంగ్’ కవితను లారెన్స్ ఓడ ప్రమాద మృతులకు అంకితమిచ్చారు.

‘‘ఇది కచ్చితంగా తూర్పు అర్ధగోళంలో జరిగిన ఓ దురదృష్టకర ప్రమాదం. ఒడిశా తీర ప్రాంతంలో మొత్తం 130 ఓడలు మునిగిపోయాయి. బ్రిటన్ అడ్మీరాల్టీ నుంచి ఈ సమాచారం పొందాను. అమెరికా నుంచి ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు బయల్దేరే ఓడల సమయాన్ని నిర్ణయించడం, వాటి ప్రయాణ మార్గం, మ్యాప్‌లను రూపొందించే బాధ్యత ఈ విభాగానిదే’’ అని ఒడిశా పరిశోధకుడు, రచయిత అనిల్ ధీర్ చెప్పారు.

పూరీ జగన్నాథుడి ఆలయం చిత్రలేఖన ఫోటో

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, పూరీ జగన్నాథుడి ఆలయం. (చిత్రలేఖనం)

పూరీ జగన్నాథుడి దర్శనం కోసం

ఈ ఓడ ప్రమాదం జరిగే సమయానికే హౌరా నుంచి దక్షిణ భారతానికి రైలు మార్గం పూర్తిగా అభివృద్ధి చెందలేదు. ఓడ ప్రమాదం జరిగిన 12, 13 ఏళ్ళ తరువాత హౌరా స్టేషన్ నుంచి కటక్‌కు రైలు ప్రయాణం 1899-1990 మధ్య ప్రారంభమైంది. కటక్ నుంచి పూరీకి మరో లైను ఉండేది.

అంతకుముందు బెంగాల్ ప్రజలు పూరీ జగన్నాథుడిని దర్శించుకోవాలంటే ఎడ్లబండ్లపై ప్రయాణించేవారు. లేదంటే కాలినడకన వెళ్ళేవారు. ఇలాంటి ప్రయాణికులను దృష్టిలో పెట్టుకుని అనేక షిప్పింగ్ కంపెనీలు ప్రత్యేక సర్వీసులను ప్రారంభించాయి.

ఓడలు, స్టీమర్ల సేవలు ప్రారంభమయ్యాక చాలామంది బెంగాలీలు మహిళలను, పిల్లలను స్టీమర్లలో, ఓడల్లో ఎక్కించి తాము కాలినడకనో, లేదంటే ఎడ్లబండిపైనో బయల్దేరేవారు.

‘‘వాటిలో చాలామటుకు పాతబడిపోయినవి, దాదాపుగా చివరిదశకు చేరుకున్నవే. ఇతర మార్గాలలో దీర్ఘకాలం పనిచేసిన వీటిని చివరిదశలో తక్కువ దూర ప్రయాణాలకు వినియోగించడానికి ఇక్కడకు పంపారు’’ అని అనిల్ ధీర్ చెప్పారు.

సర్ జాన్ లారెన్స్ ఓడ కూడా అటువంటిదే. ఇది కోల్‌కతాలోని గంగా ఘాట్ నుంచి ఒడిశాలోని చంద్‌బాలీ వరకు ప్రయాణించేది.

స్వామి వివేకానంద సోదరుడు మహేంద్రనాథ్ దత్తా రాసిన ‘అజాతశత్రు శ్రీమత్ స్వామి బ్రహ్మానంద’ పుస్తకంలో ఈ మార్గం గురించి వివరించారు.

ప్రస్తుతం ఇంటర్నెట్‌లో లభ్యమవుతున్న ఈ పుస్తకం చివరిసారిగా 1939-40లో ప్రచురితమైంది. ఆ పుస్తకంలోని 64వ పేజీలో ‘‘ఆ రోజులలో ప్రజలు పూరీకి వెళ్ళడానికి ఓడలో చంద్‌బాలీ చేరుకునేరువారు. అక్కడి నుంచి ఎడ్లబండ్లపై వెళ్ళేవారు’’ అని మహేంద్ర దత్తా రాశారు.

ఆ ఏడాది మే 25న సర్ జాన్ లారెన్స్ కలకత్తా (ప్రస్తుతం కోల్‌కతా)లోని దుర్గా ప్రసాద్ ఛోటాలాల్ ఘాట్ నుంచి బయల్దేరింది. కొన్ని రోజుల తరువాత అషాఢ మాసంలో పూరీ జగన్నాథుడి రథయాత్ర మొదలు కానుంది. ఈ ఉత్సవం చూసేందుకు బయల్దేరిన ప్రయాణికులతో ఓడ కిక్కిరిసిపోయింది.

ఆ రోజుల్లో ఏ ఓడ ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణిస్తుందనే వివరాలను ప్రకటనల రూపంలో ఇంగ్లీష్ మ్యాన్ పత్రికల్లో కలకత్తా నుంచి మధ్యధరా సముద్రం మీదుగా లండన్‌కు నేరుగా వెళ్ళే ఓడలు, కలకత్తా నుంచి దిబ్రూఘఢ్, బాంబే నుంచి లివర్‌పూల్‌కు వెళ్ళే ఓడల వివరాలు ప్రకటించేవారు.

ఆ ప్రకటనల్లోనే సర్ జాన్ లారెన్స్ కార్యకలాపాల గురించి ప్రచురించారు. అందులోనే చంద్‌బాలీ నుంచి కటక్‌కు మరో ఓడను కూడా నడుపుతున్నట్టు ప్రకటించారు.

సర్ జాన్ లారెన్స్ ఓడ మునిగిపోయిన సాగర్ ద్వీపం వద్ద లైట్ హౌస్ చిత్రం

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, సర్ జాన్ లారెన్స్ ఓడ మునిగిపోయిన సాగర్ ద్వీపం వద్ద లైట్ హౌస్ చిత్రం

తుపాను అంచనా

మే 25కు ముందు అనేక రోజులపాటు సర్ జాన్ లారెన్స్ టైమ్ టేబుల్ గురించి క్రమం తప్పకుండా ఇంగ్లీష్ మ్యాన్ పేపర్లో ప్రకటనలు వచ్చేవి. దీంతోపాటు సాగర్ ద్వీపం దిశగా ఓ పెద్ద తుపాను రాబోతోందని, దానివల్ల సముద్రం అల్లకల్లోలంగా మారుతుందనే వాతావరణ అంచనా కూడా ప్రచురితమైంది.

ఇంగ్లీష్ మ్యాన్ న్యూస్ పేపర్ మే 23వ తేదీ సంచికలో తుపానుకు సంబంధించిన వాతావరణ అంచనా నివేదికను ప్రచురించారు.

వివిధ వాతావరణ కేంద్రాలు మే 22న, డైమండ్ ద్వీపం, సాగర్ ద్వీపం ప్రాంతాల సహా సముద్రం అల్లకల్లోలంగా మారిందనే సమాచారాన్ని కలకత్తాకు అందించాయి.

అయితే సర్ జాన్ లారెన్స్, ఇతర ఓడలు మే 25న సముద్ర ప్రయాణానికి బయల్దేరడానికి ముందుగానీ, ఆ తరువాత కానీ డైమండ్ హార్బర్ నుంచి సముద్రం గురించిన ఎటువంటి సమాచారమూ కలకత్తాకు అందలేదు.

సర్ జాన్ లారెన్స్‌ ఓడ సహా అనేక ఓడలకు తుపాను కారణంగా జరిగిన నష్టం, చనిపోయిన ప్రయాణికుల వివరాలతో కలకత్తా పోర్టు అధికారి ఓ సవివరమైన నివేదికను బెంగాల్ ప్రభుత్వానికి సమర్పించారు.

అండమాన్‌లోని పోర్ట్‌బ్లెయిర్, కలకత్తా మధ్య టెలిగ్రాఫ్ సర్వీసు మొదలై ఉంటే తుపానుకు సంబంధించిన కచ్చితమైన అంచనా అంది ఉండేదని ఆ నాటి వార్తా పత్రికలు రాశాయి.

పత్రికా ప్రకటన ఫోటో

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఇంగ్లీషు‌మ్యాన్ పత్రికలో సర్ జాన్ లారెన్స్‌కు సంబంధించిన ప్రకటన

జాడ తెలియని ఓడలు

ఓడల సమాచారానికి సంబంధించి ఆ ఓడ చివరగా ఎక్కడుందనే సమాచారాన్ని వార్తా పత్రికల్లో ప్రచురించేవారు. మే 26న ఇంగ్లీష్‌ మ్యాన్ వార్తా పత్రికలో ప్రచురితమైన సమాచారం మేరకు అంతకుముందు రోజు రాత్రి సర్ జాన్ లారెన్స్ ఓడ కలకత్తాను వీడి సాగర్ ద్వీప్ సమీపంలో ఉంది.

ఆ తరువాత రోజు నుంచి ఆ ఓడకు సంబంధించిన ఎటువంటి సమాచారమూ లభించలేదు. కానీ మరోపక్క సర్ జాన్ లారెన్స్ తరువాతి ప్రయాణానికి సంబంధించి వార్తా పత్రికల్లో ప్రతిరోజూ ప్రకటనలు వెలువడుతూనే ఉన్నాయి.

మే 27న ఓడకు సంబంధించిన ఏజెంట్లు చంద్‌బలి నుంచి ఓడ తమ ప్రాంతానికి చేరలేదని కలకత్తాకు టెలిగ్రామ్ పంపారు. దీంతో తుపాను భారీ విధ్వంసం సృష్టించిందని బ్రిటిష్ ప్రభుత్వం తెలుసుకోగలిగింది.

దీంతో సహాయక చర్యలు చేపట్టేందుకు కలకత్తా నుంచి ప్రభుత్వ స్టీమర్ రిజల్యూట్, అద్దెకు తీసుకున్న ‘మద్రాస్’ అనే స్టీమర్ బయల్దేరాయి.

ఒకరోజు తరువాత 750 మంది ప్రయాణికులతో ఉన్న సర్‌జాన్ లారెన్స్ ఓడ మునిగిపోయి ఉంటుందనే భయాలు అంతటా అలముకున్నాయి.

మరోపక్క కలకత్తా వైపు వస్తున్న ‘నేపాల్ ’ అనే ఓడ పైలట్ కలకత్తాకు మే 27న టెలిగ్రామ్ సందేశం పంపారు. సాగర్ ద్వీప్ సమీపంలో అనేక చిన్నా పెద్ద ఓడల శకలాలు గమనించినట్టు తెలిపారు.

నేపాల్ ఓడలో ఉన్నవారు ఓ టోయింగ్ షిప్‌కు సంబంధించిన సరంగును రక్షించారు. ఆ సరంగు పేరు అబ్డుల్ లతీఫ్. ఆ రోజున జరిగిన విధ్వంసానికి సంబంధించి ప్రభుత్వ కమిటీకి వివరాలు అందించిన ప్రత్యక్ష సాక్షి ఆయనే. కానీ ఆయన ఆ వివరాలను ఇవ్వకముందే ఇంగ్లీష్ మ్యాన్ వార్తా పత్రిక ఆ సమాచారాన్ని ప్రచురించింది.

ఓ ఓడలోని స్తంభాన్ని పట్టుకుని దాదాపు 17 గంటలపాటు అల్లకల్లోలంగా ఉన్న సముద్రంలో గడిపానని, ఆ సమయంలో రెండుగంటలపాటు స్పృహ తప్పిపడిపోయినట్టు, తరువాత ‘నేపాల్’ ఓడ తనను రక్షించి కలకత్తాకు తీసుకువచ్చినట్టు లతీఫ్ చెప్పారు.

పత్రికా వార్త ఫోటో

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, మే 28, 1887 నాటి ఇంగ్లీషు‌మ్యాన్ పత్రికలో ఓడ ప్రమాదానికి సంబంధించిన వార్త

ప్రయాణికుల వివరాలేవీ?

ఓడ మునిగిపోవడం తీవ్ర ప్రభావం చూపడంతో, ఆ విషయాన్ని ఇంగ్లీషు, బెంగాలీ పత్రికలు ప్రతిరోజూ ప్రచురించేవి.

తుపానులో చిక్కుకుని మునిగిపోయిన ఓడ ప్రయాణికులలో ఎక్కువమంది భారతీయులే. అయితే వారిలో కొంతమంది బ్రిటిషు పౌరులు కూడా ఉన్నారు.

వార్తా పత్రికలలో ప్రచురితమైన కథనాల మేరకు నైపుణ్యం కలిగిన ఓడల కెప్టెన్లు సహా అనేకమంది ప్రాణాలు కోల్పోయారు. అనేక ఓడలకు, వ్యాపారవేత్తలకు జరిగిన నష్టం నాటి బ్రిటిష్ ప్రభుత్వాన్ని కూడా కుదిపేసింది.

కలకత్తా షరీఫ్, నిస్సహాయులైన భారతీయ కుటుంబాలకు ఆర్థిక సాయం అందించే కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఆయనకు వైస్రాయ్ అండదండలు కూడా ఉన్నాయి.

ఓడలు మునిగిపోవడంపై ప్రభుత్వం కూడా ఓ కమిటీని ఏర్పాటు చేసింది. మరోపక్క సర్ జాన్ లారెన్స్‌లో ప్రాణాలతో ఎవరైనా ఉన్నారా అనే పరిశోధనలో వార్తా పత్రికలు బిజీ అయిపోయాయి.

అయితే హుగ్లీలో కొంతమంది ప్రయాణికుల జాడను ‘రైస్ అండ్ రయత్’ అనే భారతీయ మ్యాగజైన్ కనిపెట్టింది. కానీ ‘ఇంగ్లీష్‌మ్యాన్’ న్యూస్ పేపర్ మాత్రం ఆ వివరాలు సరికావని పేర్కొంది.

సర్ జాన్ లారెన్స్ ఓడలోని ప్రయాణికుల వివరాలేవీ షిప్పింగ్ కంపెనీ వద్ద లేవని ఇంగ్లీషు పత్రిక రాసింది. భవిష్యత్తులోనైనా ప్రయాణికుల పూర్తి జాబితా లేకుండా ఓడలు ప్రయాణించకుండా చూసుకోవాలని అందులో రాశారు.

దుర్గా ప్రసాద్ ఘాట్ ఫోటో

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, ఓడ ప్రయాణం మొదలైన దుర్గా ప్రసాద్ చోటాలాల్ ఘాట్ ఇదే

బతికున్నవారి సమాచారం

సర్ జాన్ లారెన్స్ ఓడ నుంచి ఎవరూ ప్రాణాలతో బయటపడలేదని ప్రభుత్వ పత్రాలు, వార్తా పత్రికల కథనాలు పేర్కొనగా, స్వామి వివేకానంద సోదరుడు మహేంద్రనాథ్ దత్ మాత్రం ఆ ఓడ నుంచి ఇద్దరు ప్రయాణికులు ప్రాణాలతో తిరిగొచ్చారని రాశారు.

స్వామి వివేకానంద బాల్య మిత్రుడు బ్రహ్మానంద కూడా కొంతమందితో సర్ జాన్ లారెన్స్ ఓడలో ప్రయాణించారు. ఆయన రామకృష్ణ మఠానికి, మిషన్‌కు తొలి సంఘాధ్యక్షుడు. సన్యాసం స్వీకరించకముందు ఆయన పేరు రకల్.

‘‘బలరామ్ బాబు తండ్రి మరణించాకా, ఆయన శ్రాద్ధ కార్యక్రమం సందర్భంగా, తులసీరామ్ ఘోష్, రకల్ ఇంకా అనేక మంది, లగేజీతో పాటు కోటార్‌కు సర్ జాన్ లారెన్స్ ఓడలో బయల్దేరారు. అక్కడి ప్రజలకు ఆహారం అందించేందుకు వీరు బయల్దేరారు’’ అని మహేంద్ర నాథ్ రాశారు.

‘‘ఓడ డైమండ్ హార్బర్ చేరుకునేసరికి తుపానులో చిక్కుకుంది. అదృష్టవశాత్తు ఇద్దరు వ్యక్తులు మాత్రం సామాన్లన్నీ ఓడలోనే వదిలేసి డైమండ్ హార్బర్ నుంచి కలకత్తాకు వచ్చేశారు. కొన్ని రోజుల తరువాత సర్ జాన్ లారెన్స్ ఓడ మునిగిపోవడం వల్ల వందల మంది చనిపోయినట్టు తెలిసింది’’ అని దత్ రాశారు.

అయితే ఈ ప్రమాదంలో మరో వ్యక్తి కూడా ప్రాణాలతో బయటపడ్డారు. కానీ పూరీ మార్గంలో ఉన్న ఆ ఓడలోని తాను ఎందుకు మరణించలేదని ఆ వ్యక్తి చింతించారు.

పండిత్ శివానంద్ శాస్త్రి ఆ ఉదంతాన్ని ‘రామతాను లాహిరి అండ్ ది దెన్ బంగ్లా సొసైటీ’ పుస్తకంలో రాశారు.

బ్రహ్మ సమాజం మొదటి అధ్యక్షుడు మోహన్ బసు తల్లి ఉమా కిషోరి కూడా పూరీకి సర్ జాన్ లారెన్స్‌లో ప్రయాణించాల్సి ఉంది. కానీ ఓడ మునిగిపోయిన విషయాన్ని మనవళ్లు ఆమెకు తెలియజేశారు.

‘‘ఈ వార్త విని ప్రాణగండం తప్పినందుకు సంతోషించాల్సిందిపోయి, ఉమా కిషోరి ఏడవడం మొదలుపెట్టారు. నా గత జన్మలో ఏం పాపం చేశానో, నేనా ఓడలో ఎందుకు లేను? అని ఆమె రోదించారు’’ అని శివానంద్ శాస్త్రి రాశారు.

పూరీ జగన్నాథుడి రథయాత్ర ఫోటో

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, 1930లో పూరీ జగన్నాథుడి రథయాత్ర

రైలు మార్గం కోసం డిమాండ్

ఓడ ప్రమాదం అనంతరం భారతీయ వార్తా పత్రికలు ప్రభుత్వాన్ని ప్రతిరోజూ విమర్శిస్తుండేవి. మరోపక్క పూరీ, కలకత్తా హౌరా వయా కటక్ రైల్వే లైను కోసం డిమాండ్ ఊపందుకుంది.

అప్పటికే ఒడిశా ప్రజలు ఈ డిమాండ్ చేస్తున్నారు. 1866లో సంభవించిన కరవులో ఒడిశా జనాభాలో చాలా మంది చనిపోయారని ఒడిశా చరిత్రపై పరిశోధన చేసిన జ్ఞానేశ్వర్ నాయక్ తన పరిశోధనా పత్రాలలో రాశారు.

దీని తరువాత బ్రిటిష్ ప్రభుత్వం ఒడిశాపై తగిన శ్రద్ధ చూపడం లేదని గ్రహించింది. దీంతో 1867లో ఒడిశా అభివృద్ది కోసం రహదారులు, పోర్టులు, కాలువలు నిర్మించాలని కరువు కమిషన్ సిఫార్సు చేసింది. కానీ ఆ కమిషన్ రైల్వే లైను గురించి ప్రస్తావించలేదు.

1881లో ఒడిశాలో దుర్భిక్ష పరిస్థితులను ఎదుర్కోవాలంటే రైల్వే అనుసంధానత పెంచాల్సిన అవసరం ఉందని కరువు కమిషన్ సిఫార్సు చేసినట్టు డాక్టర్ నాయక్ రాశారు.

మొత్తానికి ‘సర్ జాన్ లారెన్స్’ మునగడానికి కొన్ని నెలల ముందు మార్చి9, 1887లో ప్రభుత్వం, బెంగాల్ నాగపూర్ కంపెనీ మధ్య ఓ ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం కింద నాగపూర్, చత్తీస్‌గఢ్ మధ్యనున్న రైల్వే లైనును ఒడిశా వరకు పొడిగించాలని నిర్ణయించారు.

ఓడ మునిగిపోయిన సంఘటన నేపథ్యంలో హౌరా, కటక్ మధ్యన రైల్వే లైను కోసం బెంగాల్ నుంచి తీవ్ర ఒత్తిడి మొదలైంది.

‘‘రైల్వే లైను కోసం ఓ పథకం సిద్దమైంది. కానీ ఆర్థిక అంశాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం చత్తీస్‌గఢ్, నాగ్‌పూర్ మధ్య రైల్వే అనుసంధానంపైనే ఎక్కువగా దృష్టిసారించింది. కానీ సర్ జాన్ లారెన్స్ మునిగిపోవడం, ఇతర ఓడలకు నష్టం వాటిల్లడాన్ని దృష్టిలో పెట్టుకుని కలకత్తా నుంచి కటక్‌కు రైల్వే లైనుతోపాటు తరువాత దశలో దక్షిణ భారతదేశంలోని ఏడు రైల్వే లైన్ల నిర్మాణంపై ప్రభుత్వం వేగం పెంచింది’’అని పరిశోధకుడు అనిల్ ధీర్ చెప్పారు.

హౌరా, కటకల్ రైల్వే లింక్ ను సర్వే చేయాలని 1892లో ఆదేశాలు జారీ అయ్యాయి.

ఆగ్నేయ రైల్వే వెబ్‌సైట్‌లోని సమాచారం మేరకు ఈ రూట్‌లో ట్రాక్ నిర్మాణం పూర్తయిన తరువాత 1899-90 మధ్యన రైళ్ళ రాకపోకలు మొదలయ్యాయి.

స్మృతి ఫలకం ఫోటో

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, ఓడ ప్రమాద వివరాలను తెలుపుతున్న ఫలకం

వీడని ‘స్మృతి’

ఏడేళ్ళ కిందట ఇంటర్నెట్‌లో మసకబారిన ఓ స్మృతి ఫలకం ఫోటోను చూశాను. దానిపై ఒక వ్యాసం కూడా ఉంది.

ఆ స్మృతి ఫలకాన్ని కొంతమంది ఇంగ్లీషు మహిళలు గంగ ఘాట్ వద్ద ప్రతిష్ఠించారు. మునిగిపోయిన సర్ జాన్ లారెన్స్ ఓడలో ప్రాణాలు పోగొట్టుకున్న మహిళలు చిన్నారుల స్మృత్యర్థం ఆ ఫలకాన్ని ప్రతిష్ఠించినట్టు ఉంది.

ఇప్పటికీ ఈ ఫలకాన్ని లాల్ ఘాట్ వద్ద చూడొచ్చు. నేనూ ఆ మసకబారిన ఫలకాన్ని చూశాను.

ఆ ఫలకంపై బెంగాలీ, ఇంగ్లీషులో ఇలా రాసి ఉంది ‘‘ ఈ ఫలకాన్ని కొంతమంది ఆంగ్ల మహిళలు 1887 మే 25న సముద్రంలో మునిగిపోయిన సర్ జాన్ లారెన్స్ ఓడలో మృతి చెందిన ప్రయాణికులు, ముఖ్యంగా మహిళల కోసం ప్రతిష్ఠించడమైనది’’

పీడకల లాంటి ఆనాటి కలకత్తా ఓడ ప్రమాదాన్ని నేటికీ గుర్తుచేస్తూ 137 సంవత్సరాల తరువాత కూడా ఆ ఫలకం దర్శనమిస్తోంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)