హెర్నియా ఆపరేషన్‌: మెడికల్ బ్యాగును లోపలే వదిలి కుట్లు వేసిన సర్జన్

ఆపరేషన్ థియేటర్ ప్రతీకాత్మక చిత్రం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం
    • రచయిత, జో పైక్, చార్లొట్టే రౌలెస్
    • హోదా, బీబీసీ ప్రతినిధులు

హెర్నియా సర్జరీ తర్వాత తన పొట్టలో మెడికల్ స్పెసిమన్ బ్యాగు ఉన్నట్లు ఓ వ్యక్తి కనుగొన్న విషయం బీబీసీ దృష్టికి వచ్చింది.

2016లో బ్రిటన్‌లోని రాయల్ ససెక్స్ కౌంటీ ఆసుపత్రిలో టామ్ హాడ్రిస్‌కు హెర్నియా ఆపరేషన్‌ జరిగింది. అయితే, సర్జరీ తర్వాత ఆయన శరీరంలో కట్ చేసిన పేగు భాగాన్ని లోపలే వదిలేశారు.

బీబీసీ న్యూస్ ‌నైట్ ప్రతినిధి పరిశీలించిన ఆసుపత్రి రిపోర్ట్‌ ప్రకారం, ఆ డాక్టర్ ఇంటికి వెళ్లే సమయంలో తాను చేసిన పొరపాటును గుర్తించారు.

ససెక్స్ ఎన్‌హెచ్‌ఎస్ ఫౌండేషన్ ట్రస్ట్‌కు చెందిన యూనివర్సిటీ ఆసుపత్రుల్లో రెండు సర్జరీ బృందాలు నిర్లక్ష్యంగా వ్యవహరించారనే ఆరోపణలతో నమోదైన 105 కేసులను పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సర్జరీ టీంల పని తీరును “నిరంతరంగా, నిశితంగా పరిశీలిస్తున్నట్లు” ట్రస్ట్ చెబుతోంది.

“రోగుల సంక్షేమం విషయంలో మా ఉన్నత ప్రమాణాలు పడిపోయినట్లు అనిపిస్తే, మేము తక్షణం స్పందిస్తాం” అని తెలిపింది.

ఇక హాడ్రిస్ విషయానికొస్తే, రికవరీ వార్డులో బెడ్‌పై ఉన్న ఆయనకు ఆపరేషన్‌లో భాగంగా ఇచ్చిన మత్తు వదిలిన తర్వాత తాను డాక్టర్‌తో మాట్లాడానని చెప్పారు.

“నేను అప్పుడు స్పృహలోనే ఉన్నాను. ఆ సర్జన్ నా దగ్గరికి వచ్చి, నన్ను క్షమించండి అని చెవిలో చెప్పారు. మేము ఒక తప్పు చేశాం. నేను మిమ్మల్ని మళ్లీ ఆపరేషన్ థియేటర్‌కు తీసుకెళ్లాలి” అని అన్నారని హాడ్రిస్ చెప్పారు.

డాక్టర్ కారులో ఇంటికి వెళుతున్నప్పుడు సర్జరీ సమయంలో చేసిన పొరపాటును గుర్తు చేసుకున్నారనే విషయం హాడ్రిస్‌కు తర్వాత తెలిసింది.

“ఆయన కారును వెనక్కి తిప్పి ఆసుపత్రికి వచ్చారు” అని హాడ్రిస్ చెప్పారు.

“ఇలా ఇంతకు ముందెన్నడూ జరగలేదు” అని ఆసుపత్రి మేనేజర్లు చెప్పారు. ఈ సంఘటనపై దర్యాప్తు జరిగింది.

శస్త్ర చికిత్స సమయంలో జరిగిన తప్పుల వల్ల హాడ్రిస్ కోలుకోవడానికి చాలా కాలం పట్టిందని ఆసుపత్రి ట్రస్ట్ అంగీకరించింది. అందుకు గాను ఆయనకు 2020లో క్షమాపణలు చెబుతూ 15 వేల పౌండ్లు చెల్లించింది.

అయితే ఆపరేషన్ చేసిన డాక్టర్ (చట్టపరమైన కారణాల రీత్యా బీబీసీ ఆయన పేరును బహిర్గతం చెయ్యడం లేదు) మాత్రం ఇప్పటికీ ట్రస్ట్ ఆసుపత్రిలో ఆపరేషన్లు చేస్తున్నారు.

తగిన అర్హతలు లేవని ఆయన సహచరులు భావిస్తున్నప్పటికీ తర్వాతి కాలంలో ఆ డాక్టర్‌ను కన్సల్టెంట్ల జాబితాలో చేర్చారు.

దీంతోపాటు “పోటీ విషయంలో ఆందోళనలు” పేరుతో ఆ డాక్టర్ గురించి సీనియర్ సిబ్బంది మధ్య ఈ మెయిల్స్‌లో ప్రముఖంగా ప్రస్తావించారు. ఆ డాక్టర్ మీద 2019లోనూ మరో ఫిర్యాదు వచ్చింది.

దీనిపై బ్రిటన్‌లోని జనరల్ మెడికల్ కౌన్సిల్‌కు సమాధానం ఇచ్చిన ట్రస్టు ఇది రోగి భద్రతకు సంబంధించిన అంశం కాదని అందుకే “సమాధానం చెప్పడం, ఆయనపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేదు’’ అని తెలిపింది.

బ్రిటన్, ఆసుపత్రి, హెర్నియా ఆపరేషన్, డాక్టర్
ఫొటో క్యాప్షన్, 2016లో హెర్నియా శస్త్ర చికిత్స తర్వాత తన ఆరోగ్యం క్షీణించడంపై న్యూస్‌నైట్‌తో చెప్పిన టామ్ హాడ్రిస్

బ్రిటన్‌ స్వతంత్ర ఆరోగ్య నియంత్రణ సంస్థ కేర్ క్వాలిటీ కమిషన్ (సీక్యూసీ) 2022లో అదే డాక్టర్‌కు సంబంధించి ట్రస్ట్‌ను సంప్రదించింది. “ట్రస్టు అందించిన వివరాల ప్రకారం ఆ సందర్భానికి సంబంధించి కేర్ క్వాలిటీ కమిషన్- సీక్యూసీ ఎలాంటి చర్య తీసుకోవాల్సిన అవసరం లేదు” అని చెప్పినట్లు సీక్యూసీ బీబీసీతో చెప్పింది.

సాధారణ రోగుల భద్రతతోపాటు హాడ్రిస్‌కు సర్జరీ చేసిన డాక్టర్ గురించి ఆసుపత్రిలోని జూనియర్ డాక్టర్లు ఆసుపత్రి చీఫ్ ఎగ్జిక్యూటివ్, మెడికల్ ఆఫీసర్‌ ఎదుట లేవనెత్తారు.

“కొన్నేళ్లుగా పెరుగుతున్న మరణాల సంఖ్య గురించి కూడా జూనియర్ డాక్టర్లు ఆందోళన వ్యక్తం చేశారని హెల్త్ ఎడ్యుకేషన్ ఇంగ్లండ్ నివేదిక వెల్లడించింది.

“సవాళ్లు ఎదురైన పరిస్థితుల్లో మా పేషంట్ల భద్రత విషయంలో ఉత్తమ సేవలు అందించేందుకు మా సర్జరీ స్టాఫ్ కట్టుబడి ఉన్నారు” అని ట్రస్టు చీఫ్ మెడికల్ ఆఫీసర్ ప్రొఫెసర్ కేటీ అర్చ్ చెప్పారు.

“సర్జన్లు విడివిడిగా పని చెయ్యరు. వాళ్లంతా ఒక టీమ్‌గా పని చేస్తారు. వాళ్లంతా అత్యుత్తమ నైపుణ్యం కలవారు. కష్టమైన ఆపరేషన్లను కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చేస్తారు. వారి సేవలను ఆసుపత్రి లోపల నుంచి, బయట నుంచి నిరంతరం పర్యవేక్షిస్తూ ఉంటాం. రోగుల సేవ విషయంలో ఏదైనా పొరపాటు జరిగితే తక్షణమే చర్యలు తీసుకుని దానిని మెరుగు పరుస్తాం” అని అర్చ్ తెలిపారు.

ట్రస్టు ఆసుపత్రిలో రోగుల భద్రత గురించి బీబీసీ పది నెలలుగా పరిశోధిస్తోంది.

ఈ ఆసుపత్రిలో రోగులు అకారణంగా చనిపోతున్నారని, మరి కొంతమంది వికలాంగులయ్యారని 2023లో కొంతమంది విజిల్ బ్లోయర్స్ బీబీసీ దృష్టికి తీసుకువచ్చారు. ఆసుపత్రి యాజమాన్యం మాఫియాలా మారిందని వారు ఆరోపించారు.

“భద్రత, అత్యుత్తమ సంరక్షణ” తమ ప్రథమ ప్రాధాన్యతలను ట్రస్టు గతంలోనూ చెప్పింది.

అయితే ఆసుపత్రిలో రోగులు అకారణంగా చనిపోతున్నారన్న ఆరోపణలకు సంబంధించి ఆసుపత్రి డేటాలో ఎలాంటి ఆధారాలు లేవు. అలాగే ఉన్నత స్థాయిలో పాతుకుపోయిన విష సంస్కృతి గురించి ఆధారాలు లభించలేదు.

ఎనిమిదేళ్లు గడిచిన తర్వాత కూడా హెర్నియా ఆపరేషన్ తన ఆరోగ్యం మీద వ్యతిరేక ప్రభావం చూపించిందని హాడ్రిస్ న్యూస్‌నైట్‌తో చెప్పారు.

“ఏది ఏమైనప్పటికీ నేను బాధ పడుతున్నాను. అందులో సందేహం లేదు. అది నన్ను బాధించింది. ప్రస్తుతం నా పొట్ట బలహీనంగా మారింది. బరువులేవీ ఎత్తలేను” అని ఆయన అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)