బీబీసీ ఇంపాక్ట్: సొంత పొలంలో కూలీగా మారిన గంగమ్మ మళ్లీ యజమాని ఎలా అయ్యారు?

- రచయిత, లక్కోజు శ్రీనివాస్
- హోదా, బీబీసీ కోసం
‘‘ఇప్పుడు నా పొలంలో నేను కూలీని కాదు’’ అని అంటున్నప్పుడు 55ఏళ్ల గంగమ్మ కళ్లలో మెరుపు కనిపించింది.
ఇప్పుడు ఆమె చాలా సంతోషంగా కనిపిస్తున్నారు.
దాదాపు ఏడాది కిందట గంగమ్మను కలిసినప్పుడు ఆమె ముఖంలో ఈ ఆనందం లేదు.
‘‘నా పొలంలో నేను కూలీగా పని చేస్తున్నా’’ అని బీబీసీతో చెబుతూ నాడు గంగమ్మ చాలా బాధపడ్డారు.
గంగమ్మ ఆదివాసీ. ఆమెది ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి జిల్లా, రావికమతం మండలంలోని రొచ్చుపనుకు గ్రామం.
ఆ ఊరికి చుట్టుపక్కల ఉండే మరో నాలుగు గ్రామాల్లోనూ గంగమ్మ వంటి బాధితులు ఉన్నారు. వారిలో చాలామందికి భూములు వెనక్కి వచ్చాయి. వీరంతా తమ పొలం వెనక్కి రావడానికి సహకరించిన బీబీసీకి ధన్యవాదాలు తెలిపారు.
ఇంతకీ అసలేం జరిగింది? వారి భూములు ఎందుకు పోయాయి? ఎలా వచ్చాయి?

సొంత పొలంలోనే కూలీగా...
అనకాపల్లి జిల్లా ఉద్యానశాఖ లెక్కల ప్రకారం, ఆర్వోఎఫ్ఆర్, డి-పట్టా భూములలో సుమారు 27,632 ఎకరాల్లో జీడి తోటలు ఉన్నాయి. ఇవి నాన్-షెడ్యూల్డ్ ఏరియాలో ఉన్నాయి.
ఈ తోటల్లో ఆదివాసీలు సాగు చేసుకునేందుకు ప్రభుత్వం అనుమతులిచ్చింది. రొచ్చుపనుకు గ్రామం ఉన్న కళ్యాణలోవ ప్రాంత పరిధిలో 10 వేల ఎకరాలలో జీడిమామిడి తోటలున్నాయి.
మైదాన ప్రాంతాలకు చెందిన కొందరు వ్యాపారులు రొచ్చుపనుకుతో పాటు చుట్టు పక్కలున్న తాటిపర్తి, రాయిపాడు, పెద్దగరువు వంటి గ్రామాల్లో జీడి పిక్కలను కొనేందుకు వస్తుంటారు. వీరు వడ్డీ వ్యాపారాలు కూడా చేస్తుంటారు.
నర్సీపట్నం వంటి పట్టణాలను కేంద్రంగా చేసుకుని చుట్టుపక్కల గ్రామాల్లో ఏజెంట్ల ద్వారా వ్యాపారం నడిపిస్తుంటారు. ఈ వడ్డీ వ్యాపారులను స్థానికులు ‘షావుకార్లు’ అని పిలుస్తుంటారు. ఈ షావుకార్లు సాధారణంగా సంపన్నులు. వీరికి ఆర్థిక బలంతో పాటు రాజకీయ అండదండలు ఉంటాయి.
సాగు పెట్టుబడి, ఇతర అవసరాల కోసం ఆదివాసీలకు షావుకార్లు అప్పులు ఇస్తుంటారు. బదులుగా ఆదివాసీల పొలాలను తనఖా పెట్టుకోవడం, లీజుకు రాయించుకోవడం చేస్తుంటారు. ఇలాంటి ఒక షావుకారు వద్ద అప్పు చేయడంతో గంగమ్మ జీవితం తలకిందులైంది. ఇల్లు కట్టుకోవడం కోసం ఆమె అప్పు చేశారు.
‘‘రూ.2 లక్షలు అప్పు తీసుకున్నాం. వడ్డీతో కలిపి రూ.7.5 లక్షలు అయిందని చెప్పారు. మా జీడితోట పట్టా తీసుకున్నారు. నా చేత, మా ఇంట్లో వాళ్ల చేత కాగితాల మీద సంతకాలు చేయించున్నారు.’’ అని 2023 మే నెలలో బీబీసీతో మాట్లాడుతూ గంగమ్మ చెప్పారు.
జీడితోటల నుంచి వచ్చే జీడి పిక్కలను షావుకార్లు వడ్డీ కింద జమ చేసుకునే వారు. తన తోటలో గంగమ్మ కష్టపడి పని చేస్తారు. తీరా పంట చేతికి వచ్చినప్పుడు దాన్ని షావుకారు తీసుకెళ్తారు. కూలీ కింద కాస్త గంగమ్మకు ఇస్తారు. అలా గంగమ్మ తన పొలంలోనే కూలీగా మారారు.

‘‘ఇప్పుడు కూలీ కాదు...’’
“నా భూమి, నా కాయితాలు నాకొచ్చేశాయి, నేనిప్పుడు కూలీని కాదు’’ అంటూ గంగమ్మ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
పోయిన ఏడాది బీబీసీ గంగమ్మ ఇల్లు చూసినపుడు ప్లాస్టరింగ్, గచ్చులు, తలుపులు, గుమ్మాలు లేకుండా ఎలాంటి స్థితిలో ఉందో ఇప్పుడు అలాగే ఉంది.
కానీ ఈసారి గంగమ్మ ముఖంలో గతంలో కానరాని ఒక ప్రశాంతత కనిపిస్తోంది. గంగమ్మ కూతురు, కొడుకు కూడా సంతోషంగా కనిపించారు. ఇటీవలే గంగమ్మ భర్త మరణించారు.
రిపోర్టర్: ఇంతకు ముందు ఎక్కడ ఉండేదమ్మా నీ పట్టా పుస్తకం?
గంగమ్మ: నర్సీపట్నం శ్రీను (షావుకారు) దగ్గర ఉండేది.
రిపోర్టర్: ఎందుకు అక్కడుంది?
గంగమ్మ: మా ఇంటిని కట్టుకునేందుకు కొంత డబ్బులు అప్పు తీసుకున్నాం. దానికి గానూ మా పట్టాపుస్తకాలను తీసుకున్నారు.
రిపోర్టర్: ఇప్పుడు పట్టా పుస్తకం వచ్చేసిందా మరి?
గంగమ్మ: వచ్చేసింది. పోలీసులు, మీడియా వాళ్లు, ఆఫీసర్లు, అజయ్ కుమార్ గారు కలిసి ఇప్పించారు.
రిపోర్టర్: ఇప్పుడు సంతోషంగా ఉందా?
గంగమ్మ: సంతోషంగా ఉంది బాబు. త్వరలోనే ఇల్లు పూర్తి చేస్తాను. మీరంతా భోజనాలకు రావాలి.
ఈ ఏడాది తన తోటలో సాగు చేసుకుంటే తనకు రూ. 50 వేలు ఆదాయం వచ్చిందని గంగమ్మ ఆనందంతో చెప్పారు.

బీబీసీ కథనంతో..
గంగమ్మ మాదిరిగానే అప్పులు చేసి తమ పొలాల్లో కూలీలుగా మారిన ఆదివాసీలు చాలా మందే ఉన్నారు. పెద్దగా చదువుకోని వీరు తమకు వడ్డీల లెక్కలు తెలియవని చెబుతున్నారు.
షావుకార్లు అప్పులు ఇచ్చినప్పుడు ప్రామిసరీ నోటు రాయించుకుంటారు. ఆ తరువాత మాత్రం వడ్డీ లెక్కలు అన్నీ తెల్ల కాగితాల మీద రాసి ఇస్తారు.
సాధారణంగా రూ.100కు రూ.2 వడ్డీకి అప్పులు ఇస్తుంటారు. ఒక్కోసారి అంతకంటే ఎక్కువే వసూలు చేస్తారని గ్రామస్తులు తెలిపారు. ఈ విషయాన్ని బీబీసీ ధ్రువీకరించడం లేదు.
రొచ్చుపనుకు, రాయపాడు, తాటిపర్తి, పెద్దగరువు గ్రామాల్లో 2023 మే 10వ తేదీన పర్యటించినప్పుడు ఆదివాసీల పరిస్థితిని బీబీసీ గమనించింది. నాడు ఆ పరిస్థితి మీద కథనాలు ప్రచురించింది.
రావికమతం మండలంలోని రొచ్చుపనుకు, రాయపాడు, తాటిపర్తి, పెద్దగరువు గ్రామాల్లో 1,000 నుంచి 1,200 మంది నివసిస్తుంటారు. ఆ ఊళ్లకు చెందిన ఆదివాసీలకు సుమారు 110 ఎకరాల భూములు తిరిగి సొంతం అయ్యాయి. ఈ ఏడాది వచ్చిన పంటను వారే అమ్ముకుని డబ్బులు తెచ్చుకున్నారు.

“నాలుగేళ్ల కిందట రూ.30 వేలు అప్పు చేశా. ఏటా నా తోటలో కూలీ పని చేసి షావుకార్లకు జీడి పిక్కలను పండించేదాన్ని. అయినా అప్పు తీరలేదు. అసలు, వడ్డీ కలిపి మొత్తం రూ.లక్ష అయ్యిందని చెప్పారు. బీబీసీ కథనాలతో అధికారులు స్పందించడంతో నా పత్రాలు నాకు వచ్చేశాయి’’ అని పెద్దగరువు గ్రామానికి చెందిన శాంతి చిన్నారి అన్నారు.
ఈ ఏడాది తనకు రూ.50 వేలు ఆదాయం వచ్చిందని ఆమె తెలిపారు.
ఇలా రొచ్చుపనుకు, రాయపాడు, తాటిపర్తి, పెద్దగరువు గ్రామాలకు చెందిన చాలామందికి పొలాలు వెనక్కి వచ్చాయి.
“110 ఎకరాల జీడి మామిడి తోటలు తిరిగి ఆదివాసీల స్వాధీనంలోకి వచ్చాయి. వారంతా తమ తోటల్లో సాగు చేసుకుని పంటను అమ్ముకున్నారు. 2024 ఏప్రిల్ 16 నుంచి మే 15 మధ్య 902 బస్తాల జీడి మామిడిని రూ. 76,46,960లకు అమ్ముకున్నారు. 94 కుటుంబాలకు సగటున రూ.80 వేల ఆదాయం వచ్చింది” అని అఖిల భారత వ్యవసాయ గ్రామీణ కార్మిక సంఘం జాతీయ కార్యదర్శి పీఎస్ అజయ్ కుమార్ చెప్పారు.
బీబీసీకి ఆయన ధన్యవాదాలు తెలిపారు.

స్పందించిన అధికారులు
2023 మే 10న బీబీసీ ప్రచురించిన కథనం మీద అప్పటి రావికమతం మండలం ఎమ్మార్వో ఉమామహేశ్వరరావు, కొత్తకోట సీఐ ఇలియాస్ అహ్మద్ స్పందించారు.
గంగమ్మతో పాటు మరికొందరికి రెండు రోజుల్లోనే షావుకార్ల వద్ద ఉన్న పట్టాలను వెనక్కి ఇప్పించారు. నర్సీపట్నం శ్రీను అనే షావుకారు వద్ద గంగమ్మ పత్రాలు ఉండగా ఆయన వాటిని తిరిగి ఇచ్చారు.
రొచ్చుపనుకు గ్రామంలో కిరణా దుకాణం నడుపుతూ అప్పులిచ్చే సంజీవరావు అనే వడ్డీ వ్యాపారి దగ్గర ఉన్న 9 మందికి చెందిన ఆదివాసీ కుటుంబాల భూమి పట్టాలు వెనక్కి వచ్చాయి.
“బీబీసీలో వచ్చిన కథనంతో రెవెన్యూ, పోలీసు విభాగాలు స్పందించి వెంటనే అందుబాటులో ఉన్న వ్యాపారుల వద్ద నుంచి పత్రాలను ఆదివాసీలకు ఇప్పించారు’’ అని రావికమతం మండలం తహశీల్దార్ ఎస్. రమణరావు తెలిపారు.

వడ్డీ వ్యాపారులు ఏమంటున్నారు?
రొచ్చుపనుకు గ్రామంలో కిరాణా దుకాణం నడుపుతూ వడ్డీ వ్యాపారం చేసిన గాలి సంజీవరావు ఇప్పుడు గ్రామానికి దూరంగా ఉంటున్నారు. ఆదివాసీలు ఆయన దుకాణాన్ని ఖాళీ చేయించి, గ్రామం నుంచి పంపించేశారు. సంజీవరావు ఇంటికి బీబీసీ వెళ్లింది.
“ఆదివాసీలు నా దగ్గర అప్పు తీసుకున్నారు. తీసుకున్న అప్పుని న్యాయంగా చెల్లిస్తే తీసుకుంటాం. లేకపోతే చేసేదేముంది. అక్కడి రైతులందరూ అప్పు తీసుకున్నారు. నా షాపు తీసేయమన్నారు. నేను మళ్లీ ఆ గ్రామంలోకి వెళ్లలేదు. నేను డబ్బులివ్వమనీ అడగలేదు” అని సంజీవరావు చెప్పారు.
మీరు ఎంత అప్పు ఇచ్చారు? వడ్డీ ఎంత ? అని సంజీవరావును బీబీసీ ప్రశ్నించింది.
“ఈ గొడవల తర్వాత నా బుర్ర పాడైపోయింది. ఎంత అప్పులిచ్చానో కూడా మర్చిపోయాను. నేను అప్పు చేసి మరీ వీళ్లకు అప్పులిచ్చాను. ఇప్పుడు నాకు ఏ పని లేదు. అందరి కాగితాలు తిరిగి ఇచ్చేశాను” అని సంజీవరావు చెప్పారు.
అయితే ఇంకా కొందరు ఆదివాసీలకు భూముల పత్రాలు ఇంకా వెనక్కి రాలేదు.
‘‘ఇంకా కొందరు ఇవ్వాల్సి ఉంది. వారు ఆదివాసీలకు ఏ విధమైన ఇబ్బంది కలిగించకుండా చూస్తాం. తమ వద్ద ఉన్న పత్రాలు చట్టం ముందు నిలుస్తాయని షావుకార్లు భావిస్తే వారు కోర్టులకు వెళ్లొచ్చు. కానీ ఆదివాసీల పొలాలు, తోటలను తీసుకుంటే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ఏదైనా సమస్య వస్తే ఆదివాసీలు పోలీసులకు ఫిర్యాదు చేయొచ్చు” అని రావికమతం మండలం తహాశీల్దార్ ఎస్. రమణరావు బీబీసీతో చెప్పారు.

‘‘ఆ చట్టాలు తీసుకురావాలి’’
పెద్దగరువు, రాయపాడు, తాటిపర్తి, రొచ్చుపనుకు గ్రామాల్లో వడ్డీలతో కలిపి రూ.2 కోట్ల వరకు అప్పులున్నాయని పీఎస్ అజయ్ కుమార్ తెలిపారు.
“శ్రీకాకుళం నుంచి కాకినాడ వరకు ఉన్న గిరిజన ప్రాంతాల్లోని జీడి తోటలున్న ప్రతి చోటా వాళ్లకు అడ్వాన్సుల పేరుతో అప్పులివ్వడం, పంటను పట్టుకుపోవడం చూస్తున్నాం. కాబట్టి ఇది రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సమస్య. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం అధ్యయనం కూడా చేయలేదు. ఆదివాసీల రక్షణ కోసం షెడ్యూల్డ్ ఏరియాలో వడ్డీ వ్యాపారుల నియంత్రణ చట్టం ఉంది. దాన్ని నాన్-షెడ్యూల్డ్ ఏరియాలోని ఆదివాసీ ప్రాంతాలకు వర్తింప చేయాలి” అని పీఎస్ అజయ్ కుమార్ కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ పంచాయత్స్ ఎక్స్‌టెన్సన్ టు షెడ్యూల్డ్ ఏరియాస్ (పీఈఎస్‌ఏ)-2011 నిబంధనల ప్రకారం షెడ్యూల్డ్ ప్రాంతాల్లో ప్రైవేటు సంస్థలు లేదా వ్యక్తులు వడ్డీ వ్యాపారం చేయడానికి వీలు లేదు.
ఇవి కూడా చదవండి:
- పపువా న్యూ గినియాలో విరిగిపడ్డ కొండచరియలు, 2,000 మందికి పైగా సజీవ సమాధి అయ్యుంటారని ఆందోళన
- లోక్‌సభ ఎన్నికలు: ఎల్జీబీటీక్యూ కమ్యూనిటీకి గుర్తింపు పెరిగినా రాజకీయాల్లో మాత్రం వారు ఎందుకు కనిపించడం లేదు
- తెల్ల గుడ్లు, ఎర్ర గుడ్లు: వేటిలో ఎక్కువ పోషకాలు ఉంటాయి?
- పురుగులు పట్టిన బియ్యం తింటే ఏమవుతుంది? పురుగులు పట్టకుండా ఉండాలంటే ఏం చేయాలి?
- ఆంధ్రప్రదేశ్: పింఛన్లు ఇంకా అందకపోవడానికి అసలు కారణమేంటి? ఈసీ ఏం చెప్పింది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














