పపువా న్యూ గినియాలో విరిగిపడ్డ కొండచరియలు, 2,000 మందికి పైగా సజీవ సమాధి అయ్యుంటారని ఆందోళన

పపువా న్యూ గినియీాలో విరిగిపడ్డ కొండచరియలు

ఫొటో సోర్స్, Reuters

పపువా న్యూ గినియాలో భారీగా కొండచరియలు విరిగిపడటంతో 2,000 మందికి పైగా సజీవ సమాధి అయ్యుంటారని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అంతకుముందు దాదాపు 670 మంది సజీవ సమాధి అయ్యుంటారని ఐక్యరాజ్య సమితి అంచనా వేసింది. మొత్తం ఎంతమంది ప్రాణాలు కోల్పోయారన్న కచ్చితమైన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం (మే 24) తెల్లవారుజామున 3 గంటలప్పుడు ఇక్కడి ఎంగా ప్రావిన్సులో కొండచరియలు విరిగిపడ్డాయి.

వందల ఇళ్లను మట్టి పెళ్లలు కప్పేశాయని పపువా న్యూ గినియాలోని ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ హెడ్ సెర్హన్ అక్టోప్రక్ తెలిపారు.

ఇంకా మట్టి పెళ్లలు కూలుతుండటంతో సహాయక చర్యలు చేపట్టడం కష్టంగా మారిందని ఆయన చెప్పారు.

దాదాపు కిలోమీటర్ దూరం దాకా మట్టిపెళ్లలు పడ్డాయి.

‘‘ఎవరూ మిగల్లేదు. ఎంతమంది చనిపోయారో లెక్కపెట్టడం కూడా కష్టంగా ఉంది. ఇళ్లు, సామాగ్రి, పత్రాలు ఏమీ మిగల్లేదు. అన్నీ మట్టికిందే ఉన్నాయి’’ అని సమీపంలోని గ్రామానికి చెందిన జాకోబ్ సోవాయి ఏఎఫ్‌పీ వార్తా సంస్థతో చెప్పారు.

‘‘మా కుటుంబంలో 18 మంది మట్టి పెళ్లల కింద సజీవ సమాధి అయ్యారు. నేను ఇప్పుడు ఆ మట్టి మీదే ఉన్నాను. ఇంకా అనేక కుటుంబాలవారు పూర్తిగా మట్టికిందే పడిపోయారు. మా ఊరిలో మొత్తం ఎంతమంది చనిపోయారో తెలియట్లేదు. మేమంతా నిస్సహయులుగా మిగిలిపోయాం’’ అని ఎవిట్ కంబు అనే మహిళ వార్తా సంస్థ రాయిటర్స్‌తో చెప్పారు.

వీడియో క్యాప్షన్, మారుమూల ప్రాంతం కావడంతో సహాయ చర్యలకు తీవ్ర ఆటంకాలు

కొండచరియలు విరిగిపడిన ప్రాంతంలో దాదాపు 3,800 మంది నివసిస్తున్నారు.

ఈ భారీ విపత్తుతో 1,000 మందికి పైగా నిరాశ్రయులయ్యారు.

ఆహార పదార్థాలు, సామాగ్రి ఏమీ మిగల్లేదు. ఇక్కడి ప్రజలకు జీవనాధారమైన తోటలు తుడిచిపెట్టుకుపోయాయి.

ఇప్పుడు ఇక్కడ తాగేందుకు నీళ్లు కూడా లేవని సహాయకచర్యలను పర్యవేక్షిస్తున్న అక్టోప్రక్ చెప్పారు.

మట్టి పెళ్లల కింద ఉన్న శవాలను వెలికితీసేందుకు స్థానికులు పారలు, గడ్డపారలతో మట్టిని తవ్వుతున్నారు.

పపువా న్యూ గినియీాలో విరిగిపడ్డ కొండచరియలు

ఫొటో సోర్స్, Reuters

ప్రధాన రహదారులు దెబ్బతినడంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది. దీంతో, కొన్ని ప్రాంతాలకు హెలికాప్టర్ సహాయంతో మాత్రమే వెళ్లే వీలుంది.

అయితే, సహాయక సిబ్బందితో కూడిన ఒక బృందం ప్రభావిత ప్రాంతానికి చేరుకుందని హ్యుమానిటేరియన్ ఏజెన్సీ కేర్ ఆస్ట్రేలియా తెలిపింది.

శిథిలాల కింద ఎంతమంది చిక్కుకున్నారన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు.

శిథిలాల నుంచి ప్రాణాలతో బయటపడిన ఒక చిన్నారి సహా ఆరుగురికి స్థానిక అత్యవసర సేవల బృందం వైద్య సహాయాన్ని అందించిందని పపువా న్యూ గినియాలోని యూఎన్ రెసిడెంట్ కోఆర్డినేటర్ కార్యాలయం బీబీసీకి చెప్పింది.

కొండచరియలు విరిగిపడటం కొనసాగితే చుట్టుపక్కల ఇతర గ్రామాలు కూడా ప్రమాదంలో పడొచ్చని కేర్ ఆస్ట్రేలియా సంస్థ హెచ్చరించింది.

ప్రభావిత యంబాలి గ్రామాన్ని, రాజధానిని కలిపే ప్రధాన రహదారి మట్టి పెళ్లలతో మూసుకుపోవడంతో సహాయక చర్యలకు ఆటంకం కలిగిందని ది గార్డియన్‌ వార్తా సంస్థతో ఎంగా ప్రావిన్సు ఎంపీ అమోస్ అకీమ్ చెప్పారు.

ఎంగా ప్రావిన్సుకు ఒకే హైవే ఉంది. కొండచరియలు విరిగి పడటంతో అది మూసుకుపోయిందని కేర్ ఆస్ట్రేలియా వెల్లడించింది.

మూడు లేదా నాలుగు ఫుట్‌బాల్ మైదానాల విస్తీర్ణంలో కొండచరియలు విరిగి పడ్డాయని ఏపీ న్యూస్ ఏజెన్సీతో యూఎన్ అధికారి సెహ్రాన్ అక్టోప్రాక్ చెప్పారు.

‘‘మట్టిపెళ్లలు ఇంకా కూలుతూనే ఉన్నాయి. దీంతీ సహాయక కార్యక్రమాల్లో ఉన్న వారికి ఆందోళనకరంగా మారింది’’ అని ఏఎఫ్‌పీ న్యూస్ ఏజెన్సీతో అక్టోప్రాక్ అన్నారు.

పపువా న్యూ గినియీాలో విరిగిపడ్డ కొండచరియలు

ఫొటో సోర్స్, Reuters

‘ఒక్క ఇల్లు కూడా మిగల్లేదు’

సమీపంలోని ఒక గ్రామానికి చెందిన ఒక వ్యక్తి మాట్లాడుతూ, తాను కొండచరియలు విరిగిపడిన ప్రాంతానికి చేరుకున్నప్పుడు అక్కడ ఒక్క ఇల్లు కూడా మిగల్లేదని అన్నారు.

‘‘అక్కడంతా నేలమట్టం అయింది. ఏమీ మిగల్లేదు. కేవలం రాళ్లు, మట్టి మాత్రమే ఉంది. మనుషులు లేరు, ఇళ్లు కూడా లేవు’’ అని ఆస్ట్రేలియా బ్రాడ్‌కాస్టర్ ఏబీసీతో డొమినిక్ లౌ చెప్పారు.

అనూహ్యంగా సంభవించిన ఈ ప్రకృతి విపత్తులో దాదాపు ఆరు గ్రామాలు ప్రభావితమయ్యాయని ఏఎఫ్‌పీతో ఎంగా ప్రావిన్సు గవర్నర్ పీటర్ చెప్పారు.

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)