టీ20 మెన్స్ వరల్డ్ కప్: ఈసారి టోర్నీ ఫార్మాట్ ఎలా ఉంటుంది, షెడ్యూల్ ఏంటి?

టీ20 క్రికెట్ వరల్డ్ కప్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, జాహ్నవి మూలే
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ‌కప్ మరి కొద్దిరోజుల్లో మొదలవనుంది. ఈసారి కొన్ని మ్యాచ్‌లు సరికొత్త వేదికలపై నిర్వహిస్తున్నారు.

2024 జూన్ 1 నుంచి 29 వరకు జరిగే ఈ టోర్నీకి అమెరికా, వెస్టిండీస్‌లు వేదికలుగా ఉన్నాయి. ఇపుడు జరగబోయేది 9వ ఎడిషన్, ఈసారి టోర్నీలో 20 జట్లు పాల్గొంటున్నాయి.

టోర్నీలో మొత్తం 55 మ్యాచ్‌లు జరగనున్నాయి.

ఇంతకీ అమెరికాలో ఎన్ని స్టేడియాలున్నాయి? భారత జట్టు వాటిలో ఎక్కడ ఆడనుంది? ఏయే తేదీలలో ఆడనుంది? ఏ జట్లతో ఆడనుంది? అసలు ఈ టోర్నీ షెడ్యూల్ ఎలా ఉంది?.

టీ20 ప్రపంచకప్

ఫొటో సోర్స్, Getty Images

టీ20 ప్రపంచ కప్‌ ఫార్మాట్ ఎలా ఉంది?

టోర్నమెంట్ పాత ఫార్మాట్‌లో నిర్వహిస్తున్నారు, మూడు రౌండ్లలో టోర్నీ జరగనుంది. వీటిలో గ్రూప్ స్టేజ్, సూపర్ 8, నాకౌట్ (సెమీస్, ఫైనల్) ఉంటాయి.

మొత్తం 20 జట్లను ఐదు చొప్పున నాలుగు గ్రూపులుగా విభజించారు. రౌండ్ రాబిన్ ఫార్మాట్‌లో ఒకరినొకరు తలపడతారు. 4 గ్రూపుల నుంచి టాప్‌లో నిలిచిన రెండేసి జట్లు సూపర్ 8కి వెళ్తాయి. సూపర్-8లో టాప్ 4లో నిలిచిన జట్లు సెమీస్‌లో తలపడనున్నాయి.

ఏ గ్రూపులో ఏ జట్లు ఉన్నాయంటే..

  • గ్రూప్ ఏ: భారత్, పాకిస్తాన్, కెనడా, ఐర్లాండ్, అమెరికా
  • గ్రూప్ బి: ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, నమీబియా, ఒమన్, స్కాట్లాండ్
  • గ్రూప్ సి: అఫ్గానిస్తాన్, న్యూజీలాండ్, పపువా న్యూ గినియా, ఉగాండా, వెస్టిండీస్
  • గ్రూప్ డి: బంగ్లాదేశ్, నేపాల్, నెదర్లాండ్స్, దక్షిణాఫ్రికా, శ్రీలంక

ప్రపంచ‌కప్ ఎప్పుడు, ఎలా చూడాలి?

టోర్నీ గ్రూప్ దశ జూన్ 1న ప్రారంభమై జూన్ 18 వరకు కొనసాగుతుంది. జూన్ 19 నుంచి 25 వరకు సూపర్ 8 జరగనుంది.సెమీ ఫైనల్స్ 27న,ఫైనల్ జూన్ 29న ఆడనున్నారు.

అమెరికా వేళలకు ఇతర క్రికెట్ దేశాల సమయాలకు సారుప్యత కారణంగా కొన్ని మ్యాచ్‌లు ఉదయం, మరికొన్ని సాయంత్రం నిర్వహిస్తున్నారు.

గ్రూప్‌లో ఇండియా మొదటి మ్యాచ్ (భారత ప్రామాణిక కాలమానం ప్రకారం) రాత్రి 7:30 గంటలకు, మిగిలిన మూడు మ్యాచ్‌లు రాత్రి 8 గంటలకు మొదలవుతాయి.

ఒకవేళ భారత్ సెమీఫైనల్‌కు చేరితే రెండో మ్యాచ్‌గా ఆడించాలని ఇప్పటికే నిర్ణయించారు.

టోర్నీ ప్రత్యక్ష ప్రసారానికి డిస్నీ స్టార్ అధికారిక మీడియా హక్కులు సంపాదించింది. బీబీసీ వెబ్‌సైట్‌ కూడా టోర్నీపై ఎప్పటికప్పుడు అప్‌డేట్‌లను అందిస్తుంది.

టీమిండియా మ్యాచ్‌ల వివరాలు..

  • జూన్ 5, బుధవారం - ఇండియా vs ఐర్లాండ్ - న్యూయార్క్ - 7:30 pm IST
  • జూన్ 9, ఆదివారం - ఇండియా vs పాకిస్థాన్ - న్యూయార్క్ - 8:00 pm IST
  • జూన్ 12, బుధవారం -అమెరికా vs ఇండియా - న్యూయార్క్ - 8:00 pm IST
  • జూన్ 15, శనివారం - కెనడా vs ఇండియా - లాడర్‌హిల్ - 8:00 pm IST
టీ20 క్రికెట్ వరల్డ్ కప్

ఫొటో సోర్స్, Getty Images

ఆస్ట్రేలియా నుంచి పిచ్‌లు

వెస్టిండీస్‌లోని 6 స్టేడియాలు, అమెరికాలోని 3 స్టేడియాలలో మ్యాచ్‌లు జరుగుతాయి. ఇండియా గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌లు అన్నీ అమెరికాలో జరగనున్నాయి.

మూడు న్యూ‌యార్క్‌లోని నసావు కౌంటీ స్టేడియంలో, ఒకటి ఫ్లోరిడాలో లాడర్‌హిల్‌లోని సెంట్రల్ బ్రోవార్డ్ పార్క్‌ స్టేడియం వేదికగా జరగనుంది.

నసావు కౌంటీ స్టేడియం న్యూయార్క్‌లోని లాంగ్ ఐలాండ్‌లో గల ఈస్ట్ మెడోస్‌లో ఉంది. ఈ స్టేడియం టీ20 టోర్నమెంట్ కోసం ప్రత్యేకంగా ఏర్పాటుచేశారు.

స్టేడియంలో తాత్కాలిక సీటింగ్ ఏర్పాటు చేశారు. ఆస్ట్రేలియా నుంచి ప్రత్యేకంగా పిచ్‌లను తీసుకొచ్చి, మైదానం సిద్ధం చేశారు.

సెమీ ఫైనల్స్‌లో ఒకటి ట్రినిడాడ్‌లోని బ్రియాన్ స్టేడియంలో మరొకటి గయానాలోని గయానా నేషనల్ స్టేడియంలో జరుగుతాయి.

బార్బడోస్‌లో బ్రిడ్జ్‌టౌన్‌లోని కెన్సింగ్టన్ ఓవల్‌లో ఫైనల్ జరగనుంది.

టోర్నీ వేదికలు

వెస్టిండీస్‌లో...

1. ఆంటిగ్వా అండ్ బార్బుడాలోని సర్ వివియన్ రిచర్డ్స్ స్టేడియం

2. బార్బడోస్‌లోని కెన్సింగ్టన్ ఓవల్

3. గయానాలోని గయానా నేషనల్ స్టేడియం

4. సెయింట్ లూసియాలోని డారెన్ సామీ స్టేడియం

5. సెయింట్ విన్సెంట్ అండ్ గ్రెనడైన్స్‌లోని ఆర్నోస్ వేల్ స్టేడియం

6. ట్రినిడాడ్ అండ్ టొబాగోలోని బ్రియాన్ లారా క్రికెట్ స్టేడియం

అమెరికాలో..

7. ఫ్లోరిడాలో లాడర్‌హిల్‌లోని సెంట్రల్ బ్రోవార్డ్ పార్క్ కౌంటీ స్టేడియం

8. డల్లాస్-టెక్సాస్‌లోని గ్రాండ్ ప్రయరీ క్రికెట్ స్టేడియం

9. న్యూయార్క్‌లోని నసావు కౌంటీ ఇంటర్నేషనల్ స్టేడియం

టీ20 ప్రపంచకప్‌ నియమాలు ఏమిటి?

టోర్నీలో తొలిసారిగా 'స్టాప్-క్లాక్'ను ఉపయోగించనున్నారు. ఫీల్డింగ్ జట్టు ప్రతి ఓవర్‌ను మునుపటి ఓవర్ పూర్తి చేసిన 60 సెకన్లలోపు బౌలింగ్ చేయడానికి సిద్ధంగా ఉండాలి.

మ్యాచ్‌లు 3 గంటల 10 నిమిషాల్లో ముగియాలి. (అంటే ప్రతి ఇన్నింగ్స్‌ ఒక గంట 25 నిమిషాల పాటు జరగనుంది, 20 నిమిషాల విరామం ఉంటుంది).

మొదటి ఆరు-ఓవర్లు పవర్ ప్లే ఉంటుంది. ప్రతి జట్టుకు రెండు రివ్యూ ఉంటాయి. ఒకవేళ మ్యాచ్ టై అయితే, సూపర్ ఓవర్ ఫలితాన్ని నిర్ణయిస్తుంది. సూపర్ ఓవర్ టైగా ముగిస్తే, విజేతను నిర్ణయించే వరకు సూపర్ ఓవర్లు కొనసాగుతాయి.

టీ20 క్రికెట్ వరల్డ్ కప్

ఫొటో సోర్స్, Getty Images

వర్షం పడితే?

మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగిస్తే, ఫలితం నిర్ణయించడానికి DLS (డక్‌వర్త్-లూయిస్-స్టెర్న్) పద్ధతిని ఉపయోగిస్తారు.

కానీ DLS అమల్లోకి రావాలంటే, గ్రూప్ లేదా సూపర్ 8 దశలో ప్రతి జట్టు తప్పనిసరిగా 5 ఓవర్లు ఆడి ఉండాలి, నాకౌట్ దశలో 10 ఓవర్ల ఆట జరగాలి.

మొదటి సెమీ-ఫైనల్‌కు రిజర్వ్ డే ఉంది. ఫైనల్‌కు రిజర్వ్ డే ఉంటుంది. అయితే, రెండో సెమీ-ఫైనల్ మ్యాచ్‌కు రిజర్వ్ డే లేదు. గేమ్ పూర్తి చేయడానికి అదనంగా 250 నిమిషాల సమయం మాత్రమే ఇచ్చారు.

టీ20 క్రికెట్ వరల్డ్ కప్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఇంగ్లండ్ డిఫెండింగ్ ఛాంపియన్‌గా టోర్నీలో అడుగుపెట్టనుంది.

ఏ జట్టు ఆధిపత్యం ఎలా ఉంది?

ఇప్పటివరకు ఆరు జట్లు టీ20 ప్రపంచకప్ టైటిల్ సాధించాయి. రెండో సారి టైటిల్ గెలవాలని టీమిండియా అమెరికా పయనమైంది.

2007లో జరిగిన టోర్నమెంట్ ప్రారంభ ఎడిషన్‌లో మహేంద్ర సింగ్ ధోనీ నేతృత్వంలోని భారత జట్టు మంచి ఆటతీరు కనబరిచింది. ఫైనల్‌లో పాకిస్తాన్‌పై చిరస్మరణీయ విజయాన్ని సాధించింది.

2014లో భారత్ మళ్లీ ఫైనల్ చేరుకున్నప్పటికీ శ్రీలంకపై ఓడి, రన్నరప్ ట్రోఫీతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

2009లో ఒకసారి గెలిచిన పాకిస్తాన్, మూడుసార్లు ఫైనల్స్‌కు చేరుకుంది. డిఫెండింగ్ చాంపియన్‌గా ఇంగ్లండ్ టోర్నీలో అడుగుపెట్టనుంది.

2010, 2022లో టోర్నమెంట్ గెలిచిన ఇంగ్లండ్, మూడో టైటిల్ కోసం పోటీ పడుతోంది. ఆతిథ్య వెస్టిండీస్‌కు కూడా రెండు టైటిల్స్ (2012, 2016) ఉన్నాయి. 2021లో ఆస్ట్రేలియా విజేతగా నిలిచింది.

ఏ సంవత్సరం ఏ జట్టు విజేత?

  • 2007 - ఇండియా
  • 2009 - పాకిస్తాన్
  • 2010 - ఇంగ్లాండ్
  • 2012 - వెస్టిండీస్
  • 2014 - శ్రీలంక
  • 2016 - వెస్టిండీస్
  • 2021 - ఆస్ట్రేలియా
  • 2022 - ఇంగ్లాండ్

తదుపరి టోర్నీ ఎక్కడ జరగనుంది?

కోవిడ్ సమయంలో విరామం మినహా, పురుషుల టీ20 ప్రపంచకప్ క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నారు. ప్రతి రెండేళ్లకోసారి టోర్నీ జరుగుతుందని ఐసీసీ తెలిపింది.

టీ20 ప్రపంచకప్- 2026ను భారత్, శ్రీలంకలు సంయుక్తంగా నిర్వహించనున్నాయి. 2028 ఎడిషన్‌ను ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాలు సంయుక్తంగా నిర్వహిస్తాయి.

టీ20 ప్రపంచకప్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, విరాట్ కోహ్లీ

టీ20 ప్రపంచ‌కప్‌ రికార్డులివే..

  • అత్యధిక పరుగులు - విరాట్ కోహ్లీ (భారత్) 27 మ్యాచ్‌లలో 1,141 పరుగులు
  • ఒక టోర్నమెంట్‌లో అత్యధిక పరుగులు - విరాట్ కోహ్లీ (భారత్) 2014 టోర్నీలో 319 పరుగులు చేశాడు.
  • అత్యధిక వ్యక్తిగత స్కోరు - బ్రెండన్ మెకల్లమ్ (న్యూజిలాండ్) 2012లో బంగ్లాదేశ్‌పై 123 పరుగులు చేశాడు.
  • అత్యధిక సెంచరీలు - క్రిస్ గేల్ (వెస్టిండీస్) 2007, 2016లో రెండు సెంచరీలు చేశాడు.
  • అత్యధిక వికెట్లు - షకీబ్ అల్ హసన్ (బంగ్లాదేశ్) 36 మ్యాచ్‌ల్లో 47 వికెట్లు తీశాడు.
  • టోర్నమెంట్‌లో అత్యధిక వికెట్లు – 2021 టోర్నీలో వనిందు హసరంగా (శ్రీలంక) 16 వికెట్లు తీశాడు.
  • అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు - అజంతా మెండిస్ (శ్రీలంక) 2012లో జింబాబ్వేపై 8 పరుగులిచ్చి 6 వికెట్లు తీశాడు.
  • అత్యధిక అవుట్‌లు (వికెట్-కీపర్) - ఎంఎస్ ధోని (ఇండియా) - 33 మ్యాచ్‌ల్లో 32 అవుట్‌లు.
  • అత్యధిక క్యాచ్‌లు (ఫీల్డర్) - ఏబీ డివిలియర్స్ (దక్షిణాఫ్రికా) - 30 మ్యాచ్‌లలో 23 క్యాచ్‌లు.
  • అత్యధిక స్కోరు - శ్రీలంక vs కెన్యా – 2007, శ్రీలంక స్కోరు 260/6 .
  • అత్యల్ప స్కోరు - నెదర్లాండ్స్ vs శ్రీలంక – 2014, నెదర్లాండ్స్ 39 పరుగులకు ఆలౌట్.
టీ20 ప్రపంచకప్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, భారత ప్లేయర్ షెఫాలీ వర్మ

మహిళల టీ20 ప్రపంచకప్‌ ఎప్పుడు?

2016లో పురుషుల, మహిళల టోర్నమెంట్‌లు రెండూ ఒకేసారి జరిగాయి. కానీ ఈ సంవత్సరం మహిళల టీ20 ప్రపంచ కప్ వేరువేరుగా నిర్వహిస్తున్నారు.

మహిళల టీ20 ప్రపంచకప్ 2024 అక్టోబర్‌లో బంగ్లాదేశ్‌లో జరగనుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)