యుద్ధం తర్వాత గాజాలో అదృశ్యమైన ఆ 13,000 మంది ఏమయ్యారు?

గాజా

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, అమీరా ఎంహద్బి
    • హోదా, బీబీసీ ప్రతినిధి

గాజాలో హత్యకు గురైన వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. ఆ ప్రాంతంలో 13,000 మందికి పైగా అదృశ్యమయ్యారని ఒక అంచనా. వీరిలో చాలామంది చనిపోయి, శిథిలాల కింద ఉండి ఉంటారని భావిస్తున్నారు.

అయితే వారందరినీ ఎక్కడికో బలవంతంగా తీసుకుపోయారని మానవ హక్కుల సంస్థలు అంటున్నాయి.

అహ్మద్ అబు డ్యూక్ తన సోదరుడు ముస్తఫా కోసం నెలలుగా వెతుకుతున్నారు. దాడుల కారణంగా ఈ కుటుంబం దక్షిణ నగరంలో ఖాన్ యూనిస్‌లోని నాజర్ హాస్పిటల్ ప్రాంగణంలో ఆశ్రయం పొందింది. సమీపంలోనే ఉన్న తమ ఇల్లు కాలిపోయిందని తెలుసుకున్న ముస్తఫా, ఇంకా అక్కడేమైనా మిగిలి ఉందేమో చూసేందుకు అక్కడికి వెళ్లారు. ఇప్పటి వరకు ఆయన తిరిగి రాలేదు.

‘అనేక మార్గాల్లో వెతికా, కానీ ఎక్కడా కనిపించలేదు’ అని అహ్మద్ అబు అంటున్నారు. ఒకప్పుడు వారి ఇళ్లు ఉన్నచోట, ఇప్పుడు కాలిన అవశేషాలు ఉన్నాయి.

"ఇంటి పరిసరాలు ధ్వంసమయ్యాయి, భారీ భవనాలు నేలమట్టమయ్యాయి" అని అహ్మద్ తెలిపారు.

అంబులెన్స్ డ్రైవర్ గా పనిచేసిన ముస్తఫా కోసం కుటుంబ సభ్యులు చాలా వెతికారు. గాజాలో శిథిలాల నుంచి హమాస్ నేతృత్వంలోని సివిల్ డిఫెన్స్ బృందం స్వాధీనం చేసుకున్న మృతదేహాలలో ఆయన మృతదేహం కుటుంబ సభ్యులకు కనిపించలేదు.

"ఆసుపత్రికి వచ్చే అంబులెన్సులలో ఎప్పుడో ఒకప్పుడు ముస్తాఫాను చూస్తామని ఆశతో ఉన్నాం" అని అహ్మద్ చెప్పారు.

ఈ సంఘర్షణలో ఇప్పటివరకు 35,000 మందికి పైగా చనిపోయారని గాజాలో హమాస్ ఆధ్వర్యంలో నడిచే ఆరోగ్య మంత్రిత్వ శాఖ అంటోంది. ఈ సంఖ్య ఆసుపత్రులు నమోదు చేసిన మరణాలు మాత్రమేననీ పేర్కొంది.

గత ఏడు నెలలుగా తప్పిపోయిన తమ వారికి ఏం జరిగిందనేది తెలియని పరిస్థితిలో ఉన్న ముస్తఫా వంటి అనేక కుటుంబాలు గాజాలో ఉన్నాయి.

గాజా

ఫొటో సోర్స్, COURTESY OF THE FAMILY

ఆ రోజు నుంచి మొదలు..

అక్టోబరు 7న, హమాస్ ఇజ్రాయెల్‌పై దాడి చేసింది, ఇందులో దాదాపు 1,200 మంది మరణించారు. హమాస్ ఫైటర్లు 252 మందిని బందీలుగా తీసుకెళ్లారు. దీంతో హమాస్‌ను తుదముట్టించడమే లక్ష్యంగా గాజాపై ఇజ్రాయెల్ దాడి మొదలుపెట్టింది.

అప్పటి నుంచి గాజాలోని దాదాపు 13,000 మంది ఆచూకీ తెలియడం లేదని జెనీవాలో ఉన్న యూరో-మెడ్ హ్యూమన్ రైట్స్ మానిటర్ అనే స్వచ్ఛంద సంస్థ వెల్లడించింది.

వారిలో 10 వేలమందికి పైగా శిథిలాల కింద ఖననం అయిండొచ్చని పాలస్తీనా అథారిటీ భద్రతా సేవల్లో భాగమైన గాజా సివిల్ డిఫెన్స్ అంచనా వేసింది.

గాజాలోని శిథిలాల పరిమాణం దాదాపు 3.7 కోట్ల టన్నులు ఉంటుందని ఐక్యరాజ్యసమితి భావిస్తోంది.

వాటి కింద చాలా మృతదేహాలు, సుమారు 7,500 టన్నుల పేలని ఆయుధాలు మిగిలి ఉన్నాయని భావిస్తోంది ఐరాస. అక్కడ సహాయ కార్యక్రమాల్లో పాల్గొనేవారికి ఇది అదనపు ప్రమాదమని ఐరాస ఆందోళన చెందుతోంది.

గాజా

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, అక్టోబర్ 7 తర్వాత హమాస్‌ను తుదముట్టించడమే లక్ష్యంగా గాజాపై ఇజ్రాయెల్ దాడి మొదలుపెట్టింది.

వచ్చే రోజుల్లో కొత్త ప్రమాదం..

శిథిలాల కింద నుంచి మృతదేహాలను వెలికితీసేందుకు వలంటీర్లతో కలిసి సివిల్ డిఫెన్స్ పనిచేస్తోంది. అయితే తమ వద్ద సరైన సాధనాలు లేవని, మృతదేహాలు ఎక్కడున్నాయో గుర్తించడం చాలా కష్టంగా ఉందని ఆ సంస్థ చెబుతోంది.

గాజాలో ఎండలు పెరుగుతుండటంతో అక్కడి మృతదేహాలను వెలికితీయకపోతే, అవి కుళ్ళిపోతాయని, దీంతో ఇది ఆరోగ్య సమస్యకు దారితీస్తుందనే ఆందోళన కూడా ఉంది.

శిథిలాల నుంచి బంధువులను వెతికే ప్రయత్నంలో ఉన్నవారిలో అబ్దుల్ రెహమాన్ యాగీ ఒకరు. ఆయన చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

సెంట్రల్ గాజాలోని డీర్ అల్-బలా నగరంలో అబ్దుల్ ఫ్యామిలీకి మూడంతస్తుల భవనం ఉంది. ఫిబ్రవరి 22న కుటుంబంలోని 36 మంది సభ్యులు ఆ భవనం లోపల ఉన్నప్పుడు క్షిపణి దాడి జరిగింది.

17 మృతదేహాలను వెలికి తీశారని, అయితే శరీర భాగాలు గుర్తుపట్టలేనట్లుగా ఉన్నాయని ఆయన చెప్పారు.

"ఇంట్లో ఉన్న చాలామంది పిల్లల మృతదేహాలు దొరకలేదు" అని అబ్దుల్ అన్నారు.

అంతర్జాతీయ సాయం కోసం పిలుపు..

మృతదేహాలను వెలికితీసేందుకు ఐక్యరాజ్యసమితి, అనుభవజ్ఞులైన సిబ్బంది ఉన్న దేశాల మద్దతును సివిల్ డిఫెన్స్ కోరింది. "తక్షణమే జోక్యం చేసుకోవాలని" అంతర్జాతీయ సంస్థలను కోరింది.

ఇదే సమయంలో రెస్క్యూ కోసం భారీ పరికరాలను గాజాలోకి అనుమతించేలా అంతర్జాతీయ సంస్థలు ఇజ్రాయెల్‌పై ఒత్తిడి తేవాలని కోరింది. అయితే దానికి ఇంకా స్పందన రాలేదని సివిల్ డిఫెన్స్ అంటోంది.

గాజాలో యుద్ధం

ఫొటో సోర్స్, EPA

మనుషులను మాయం చేస్తున్నారు: ఆమ్నెస్టీ

కనిపించకుండా పోయిన వ్యక్తులను ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్) నిర్బంధించి ఉండవచ్చని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ భావిస్తోంది. దీనిని బలవంతపు అదృశ్యంగా అది అభివర్ణించింది.

గాజాకు చెందిన వందలమంది పాలస్తీనియన్లు ఐడీఎఫ్ ఆధీనంలో ఉన్నారని, ఈ విషయంపై వారి కుటుంబాలకూ సమాచారం లేదని యూరో-మెడ్ హ్యూమన్ రైట్స్ మానిటర్ ఆరోపిస్తోంది.

ఇజ్రాయెల్ సంతకం చేసిన జెనీవా ఒప్పందం...నిర్బంధంలోని పౌరుల ఐడెంటిటీ, లొకేషన్‌లను తప్పనిసరిగా చెప్పాలని ఈ ఒప్పందం నిర్దేశిస్తుంది.

అక్టోబరు 7 దాడుల తర్వాత అంతర్జాతీయ రెడ్‌క్రాస్ కమిటీ (ఐసీఆర్సీ)కి నిర్బంధ కేంద్రాల సందర్శనలను కూడా ఇజ్రాయెల్ అధికారులు నిలిపివేశారు.

‘పాలస్తీనా ఖైదీలను కలవాలని చాలాసార్లు కోరినా, కమిటీకి ఇంకా ప్రవేశాన్ని అనుమతించలేదు’ అని గాజాలోని ఐసీఆర్సీకి చెందిన హిషామ్ ముహన్నా అంటున్నారు.

అయితే, హమాస్ ఆధీనంలోని ఇజ్రాయెల్ బందీలను సందర్శించడానికి కూడా తమకు అనుమతి లేదని ఐసీఆర్సీ అంటోంది. దీనిపై ఐడీఎఫ్‌ను బీబీసీ సంప్రదించింది. కానీ, స్పందించలేదు.

"హమాస్ వద్ద ఉన్న బందీల సమాచారాన్ని పొందేంత వరకు ఇజ్రాయెల్‌లో ఖైదు అయిన హమాస్ ఫైటర్ల గురించి రెడ్‌క్రాస్ సమాచారం పొందలేదు. ఇది మానవతావాదం వర్సెస్ మానవతావాదం మాత్రమే!" అని ఇజ్రాయెల్ జాతీయ భద్రతా మంత్రి ఇటమార్ బెన్-గ్విర్ ఎక్స్‌లో పోస్టు చేశారు.

చేతిలో కొడుకు ఫోటోతో తల్లి..

సెంట్రల్ గాజా పట్టణం అల్-జవైదాలో ఓ తల్లి కనిపించకుండా పోయిన కొడుకు మొహమ్మద్ అలీ కోసం వెతుకుతోంది.

"బలవంతంగా అదృశ్యమైన" వారిలో తన కొడుకు ఒకరు కావచ్చునని ఆమె భయపడుతున్నారు.

మొహమ్మద్ అలీ తల్లి తన చేతిలో కొడుకు ఫోటో పట్టుకొని వెతుకుతున్నారు. ఆయనను ఐడీఎఫ్ తీసుకెళ్లినట్లు ఎవరో ఒకరు చెప్పే వరకు వెతుకుతూనే ఉన్నారు. చివరిసారిగా చూసినప్పుడు తన కొడుకు బతికే ఉన్నాడని, అయితే అప్పటి నుంచి ఏం జరిగిందో తెలియదని ఆమె చెప్పారు.

డిసెంబర్ 23న భారీ బాంబు పేలుళ్ల సమయంలో కుటుంబం తమ ఇంటిని విడిచిపెట్టాల్సి వచ్చింది.

ఉత్తర గాజాలో జబాలియాలోని ఒక పాఠశాలలో ఈ కుటుంబం ఆశ్రయం పొందింది. అప్పటి నుంచి మొహమ్మద్ కనిపించకుండా పోయారు. ఆ రోజు ఇజ్రాయెల్ సైన్యం పాఠశాలలోకి ప్రవేశించి మహిళలు, పిల్లలను మాత్రం విడిచిపెట్టాలంటూ తోటి సైనికులకు ఆదేశించారని మొహమ్మద్ భార్య అమానీ అలీ గుర్తుచేసుకున్నారు.

అయితే, మొహమ్మద్ మినహా పురుషులందరూ ఆ రాత్రి వారి కుటుంబాల దగ్గరికి తిరిగి వచ్చారు.

తన భర్త చనిపోయాడా లేక ఐడీఎఫ్ నిర్బంధించిందో తనకు తెలియదని, ఆయన బతికే ఉన్నాడని తనకు కొంత ఆశ ఉందని అమానీ చెప్పారు.

"ఆయన బయట ఉంటే మా కోసం వెతికి ఉండేవారు" అని అమానీ అంటున్నారు. ఆయనను బంధించి ఉంచారన్నది ఆమె అనుమానం.

హమాస్ ఆధ్వర్యంలో నడిచే ఆరోగ్య మంత్రిత్వ శాఖ మరణించిన, తప్పిపోయిన వారి కుటుంబాల కోసం ఆన్‌లైన్ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చింది. తద్వారా ఇది అక్టోబర్ 7 నుంచి అదృశ్యమైన వారికి ఏం జరిగిందో మరింత పూర్తి రికార్డును సంపాదించగలదు.

అప్పటి వరకు, చాలా కుటుంబాలు తమవారి కోసం అన్వేషణను కొనసాగిస్తాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)