రఫా: ఇజ్రాయెల్ చేసిన భీకర దాడిలో 45 మంది మృతి, ఇది భూమి మీద నరకం అంటున్న బాధితులు

రఫాలో ఇజ్రాయెల్ వైమానిక దాడి

ఫొటో సోర్స్, Getty Images

గాజా స్ట్రిప్‌లోని దక్షిణ నగరం రఫాలో పాలస్తీనీయులు ఆశ్రయం పొందుతున్న క్యాంపుపై ఇజ్రాయెల్ సైన్యం వైమానిక దాడులు చేసింది.

ఈ దాడిలో మహిళలు, పిల్లలతో సహా 45 మంది చనిపోయినట్లు హమాస్‌కు చెందిన ఆరోగ్య శాఖ మంత్రి తెలిపారు. సంఘటన ప్రాంతం నుంచి వచ్చిన వీడియోల్లో తల్ అల్ సుల్తాన్ ప్రాంతంలో ఆదివారం రాత్రి భీకర దాడి జరిగిందని తెలిసింది.

అయితే, శరణార్ధులపై జరిగిన దాడి విచారకరమని, అలాగని మా లక్ష్యాలు నెరవేరకుండా యుద్ధాన్ని ఆపుతామని అనుకోవద్దని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు పార్లమెంటులో ప్రకటించారు. సామాన్యుల ప్రాణాలకు ప్రమాదం లేకుండా ఇజ్రాయెల్ సైన్యం అన్ని రకాల రక్షణ చర్యలను చేపడుతుందని ఆయన స్పష్టం చేశారు.

ఈ దాడిలో ఇద్దరు హమాస్ సీనియర్ అధికారులు చనిపోయారని, పౌరులు మరణాలపై వస్తున్న నివేదికలను పరిశీలిస్తున్నట్లు ఇజ్రాయెల్ రక్షణ దళాలు (ఐడీఎఫ్) పేర్కొన్నాయి.

‘‘ముగ్గురు పిల్లలకి గాయాలయ్యాయి. ఇదేం నీతి, ఇదేం మానవత్వం? ప్రపంచం ఎక్కడుంది?.’’ అని ఒక మహిళ కన్నీరుమున్నీరయ్యారు.

‘‘వారు మనుషుల్ని తగలబెట్టారు. తల్ అల్ సుల్తాన్‌లో మా పొరుగున ఉన్న వారందర్ని మంటల్లో కాల్చేశారు. ప్రజలు ఇంకా మంటల్లోనే ఉన్నారు. ఇప్పుడు భగవంతుడే కాపాడగలడు. హఠాత్తుగా ఒక క్షిపణి మాపై పడింది. మరొకటి మా పక్క ప్రాంతంపై పడింది. ప్రజలందరూ మంటల్లో కాలిపోతున్నారు. వెళ్లి వారికేమైందో చూడండి’’ అని ఆమె అన్నారు.

ఈ దాడి జరిగినప్పుడు తాను క్యాంపులోనే ఉన్నట్లు ఆ మహిళ తెలిపారు.

‘‘ మేం అప్పుడే నమాజ్ పూర్తి చేసుకుని కూర్చుని ఉన్నాం. పిల్లలు నిద్రపోతున్నారు. నిశ్శబ్దంగా ఉంది. ఆ సమయంలో అకస్మాత్తుగా ఒక పెద్ద శబ్ధం విన్నాం. మా చుట్టూ మంటలు చెలరేగాయి. పిల్లలు అరుస్తున్నారు. మేం ఉంటున్న గదులకు అన్నివైపుల మంటలు చెలరేగాయి. భయంకరమైన శబ్దాలు వచ్చాయి’’ అని ఆదివారం రాత్రి జరిగిన ఘటనను ఆమె గుర్తుకు చేసుకున్నారు.

క్షిపణి పేలినప్పుడు తాను అక్కడే ఉన్నట్లు ఫాది దుఖన్ అనే వ్యక్తి తెలిపారు.

‘‘మేం ఇంటి తలుపు వద్ద కూర్చుని ఉన్నాం. హఠాత్తుగా క్షిపణి పేలిన శబ్దాన్ని విన్నాం. వెంటనే పరిగెత్తాం. రోడ్డంతా పొగతో నిండి ఉంది. మాకేమీ కనిపించ లేదు. ఇంట్లోకి వెళ్లాం. అక్కడ ఎవరూ కనిపించలేదు. మరో ప్రాంతాన్ని చెక్ చేశాం. ఒక బాలిక, ఒక యువకుడు చనిపోయి కనిపించారు. వారి మృతదేహాలు మంటల్లో కాలి ఉన్నాయి.’’ అని చెప్పారు.

చెలరేగిన మంటలు

ఫొటో సోర్స్, REUTERS

ఇజ్రాయెల్ సైన్యం ఏం చెప్పింది?

హమాస్ సీనియర్ నేతలు సమావేశమైన కాంపౌండ్‌ను లక్ష్యంగా చేసుకుని వైమానిక దాడి జరిపినట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది.

కానీ, ఈ దాడి తర్వాత భారీ ఎత్తున మంటలు చెలరేగినట్లు తమకు తెలిసిందని, దీంతో ఆ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలు చాలామంది తీవ్ర గాయాలపాలయ్యారని ఇజ్రాయెల్ సైన్యం పేర్కొంది.

ఈ దాడి చాలా తీవ్రమైనదని, దాడి తీరును పరిశీలిస్తున్నామని ఇజ్రాయెల్ మిలటరీ ప్రాసిక్యూటర్ యిఫత్ తోమర్ అన్నారు.

‘‘సాధారణంగా, ఈ విధమైన తీవ్రతతో కూడిన యుద్ధంలో జరగకూడని ఇలాంటి ఘటనలు కొన్ని జరుగుతూ ఉంటాయి. రఫాలో ఆదివారం రాత్రి జరిగిన ఘటన ఇలాంటిదే. వివరాలు తెలుసుకుంటున్నాం. యుద్ధంలో భాగంకాని వారికి ఏదైనా హాని కలిగితే దానికి ఐడీఎఫ్ చింతిస్తుంది.’’ అని అన్నారు.

హమాస్ కాంపౌండ్‌పై వైమానిక దాడి జరిగిందని, ఇద్దరు హమాస్ కమాండర్లు చనిపోయారని ఇజ్రాయెల్ ప్రభుత్వ అధికార ప్రతినిధి హైమన్ బీబీసీతో అన్నారు.

‘‘మేం రెండు అతిపెద్ద హమాస్ బేస్‌ల వెనుకాల ఉన్నాం. తొలుత వచ్చిన నివేదికల్లో మంటలు చెలరేగాయని తెలిసింది. ప్రమాదవశాత్తు ఇతరులు కూడా ప్రాణాలు కోల్పోయారు’’ అని చెప్పారు.

‘‘ ఐడీఎఫ్ దీనికి అన్ని కోణాలలో విచారిస్తుంది. అసలు ఈ ప్రమాదం ఎలా జరిగిందనేది తెలుసుకోకుండా ఏమీ చెప్పలేం. తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసేందుకు మీడియాలో హమాస్ దీనిపై ఒక కథానాన్ని అల్లింది’’ అని హైమన్ పేర్కొన్నారు.

ఈ దాడిపై వస్తున్న నివేదికలలో పాలస్తీనా శరణార్థుల ఐక్యరాజ్య సమితి ఏజెన్సీ యూఎన్ఆర్‌డబ్ల్యూఏ దీన్ని షాకింగ్‌గా పేర్కొంది. రఫాలో ఉన్న తమ బృందాన్ని సంప్రదించలేకపోతున్నామని తెలిపింది.

‘‘భూమిపై ఉన్న నరకం గాజా. ఆదివారం రాత్రి ఘటనకు సంబంధించి వస్తోన్న ఫోటోలు దీనికి మరో ఆధారం.’’ అని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో ఈ ఏజెన్సీ పేర్కొంది.

ఇజ్రాయెల్ దాడి

ఫొటో సోర్స్, Getty Images

హమాస్ ఏం చెప్పింది?

ఇజ్రాయెల్ ద్వంద్వ ప్రమాణాలను పాటిస్తోందని గాజాలోని హమాస్ మీడియా కార్యాలయం డైరెక్టర్ జనరల్ ఇస్మాయిల్ అల్ తౌబ్తా ఆరోపించారు.

‘‘ఇజ్రాయెల్ సైన్యం ఈ ప్రాంతాలను సురక్షితమైన జోన్లుగా పేర్కొంది. ప్రజలను అక్కడకు తరలివెళ్లాలని తెలిపింది. శరణార్ధులు చాలామంది ఈ ప్రాంతాలకు తరలివెళ్లారు. శరణార్థులు వెళ్లిన తర్వాత, ఇజ్రాయెల్ సైన్యం ఈ మారణహోమానికి పాల్పడింది. ప్రజల ప్రాణాలను బలిగొంది’’ అని ఆయన అన్నారు.

‘‘సైన్యం అబద్ధాలు చెబుతోంది. గాజాలో ఎవరూ సురక్షితంగా లేరు. కనీసం పిల్లలు, పెద్దలు, మహిళలు ఎవరూ కూడా సురక్షితంగా లేరు. నా సోదరుడు, భార్య చనిపోయారు. ఇజ్రాయెల్ సైన్యం చేస్తున్న పనికి పిల్లలు అనాథలు అవుతున్నారు’’ అని చెప్పారు.

‘‘ఇది భయంకరమైన దాడి. బ్రిక్సాట్(ఎస్‌పీ) అని పిలిచే ప్రాంతంలో పలు క్షిపణులతో ఫైటర్ జెట్లు దాడులు చేసినట్లు తెలుస్తోంది. గాజాలో ఇతర ప్రాంతాల్లో నిరాశ్రయులైన ప్రజలు ఇక్కడ గుడారాలు వేసుకుని ఆశ్రయం పొందుతున్నారు.’’ అని సౌత్ సెంట్రల్ గాజాలో 100 మందికి పైగా డాక్టర్లు, నర్సులతో మెడికల్ చారిటీ నిర్వహిస్తున్న మెడ్‌గ్లోబల్ సంస్థ హెడ్ డాక్టర్ జషేర్ సహలౌల్ అన్నారు.

‘‘ప్రజలు ఇక్కడ క్యాంపింగ్ వేసుకుని ఉన్నారు. ప్రమాదం నుంచి బయటపడ్డట్లు వారు అనుకున్నారు. కానీ, అమాయక ప్రజలు చాలామంది చనిపోతున్నారు. ఎంతోమంది పిల్లలు చనిపోవడాన్ని మేం చూస్తున్నాం. పిల్లలు చనిపోతున్న, సజీవంగా కాలిపోతున్న పరిస్థితులను ఎవరూ పట్టించుకోవడం లేదు.’’ అని అన్నారు.

హమాస్ చేతిలో బందీలుగా ప్రజలు

ఫొటో సోర్స్, Getty Images

విచారం వ్యక్తం చేసిన ఖతార్

రఫా నుంచి టెల్ అవీవ్‌ వైపు ఆదివారం ఉదయం హమాస్ ఎనిమిది రాకెట్లను ప్రయోగించింది. గత నాలుగు నెలల్లో ఇదే తొలి అతిపెద్ద దాడి.

కొన్ని క్షిపణులను ధ్వంసం చేసినట్లు ఇజ్రాయెల్ చెప్పింది. దీని తర్వాత, సెంట్రల్ ఇజ్రాయెల్‌లోని నగరాల్లో రాకెట్ల సైరన్లు మోగాయి.

మరోవైపు లెబనాన్ నుంచీ ఉత్తర ఇజ్రాయెల్ వైపుకు రాకెట్లు దూసుకొచ్చాయి. ఈ రాకెట్లలో కొన్నింటిన్నీ కూల్చేశామని ఇజ్రాయెల్ సైన్యం చెప్పింది.

రఫాలో ఇజ్రాయెల్ తాజాగా చేసిన ఈ వైమానిక దాడులు గాజాలో కాల్పుల విరమణ ఒప్పందానికి, బందీల విడుదలకు చేపడుతున్న మధ్యవర్తిత్వ ప్రయత్నాలకు ఆటంకం కలిగిస్తుందని ఖతార్ చెప్పింది.

రెండు రోజుల క్రితమే రఫాలో సైనిక దాడులను ఆపాలని ఇంటర్నేషనల్ కోర్టు ఆఫ్ జస్టిస్(ఐసీజే) ఇజ్రాయెల్‌కు ఆదేశాలు జారీ చేసింది.

ప్రాణాలు కాపాడుకునేందుకు ఉత్తరం నుంచి లక్షల మంది ప్రజలు ఇక్కడికి వచ్చి శరణార్థం పొందుతున్నారు. కానీ, రఫాపై దాడులకు ప్రణాళికలు వేస్తున్నారన్న ఆరోపణలను ఇజ్రాయెల్ ఖండించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)