ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్ వైపు రాకెట్లను ప్రయోగించిన హమాస్

ఫొటో సోర్స్, Handout
సెంట్రల్ ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్ దిశగా రాకెట్లను ప్రయోగించినట్లు హమాస్ చెప్పింది. దాదాపు నాలుగు నెలల తాము చేసిన తొలి దాడి ఇదేనని హమాస్ వెల్లడించింది.
దక్షిణ గాజాలోని రఫా ప్రాంతం నుంచి 8 రాకెట్లను ప్రయోగించారని, వాటిలో చాలావాటిని మధ్యలోనే అడ్డుకున్నామని ఇజ్రాయెల్ సైన్యం చెప్పింది. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు.
ఇజ్రాయెల్ ఆర్మీ, రఫాలో మిలిటరీ ఆపరేషన్ చేస్తోంది.
ఇజ్రాయెల్‌లోని హెర్జ్‌లియా, పెటా టిక్వాతో సహా ఇతర పట్టణాలు, నగరాల్లో రాకెట్ సైరన్ల శబ్దాలు వినిపించాయి.
హెర్జ్‌లియా నగరంలోని ఒక భవనం పెరటి తోటలో పడిన క్షిపణి శకలాల ఫుటేజీని ఇజ్రాయెల్ మీడియా ప్రసారం చేసింది.
కేఫర్ సబా పట్టణానికి సమీపంలోని బహిరంగ ప్రదేశంలో రాకెట్ పడటంతో ఏర్పడిన భారీ బిలానికి సంబంధించిన మరో వీడియో కూడా సోషల్ మీడియాలో కనిపిస్తోంది.
టెల్ అవీవ్ మీద ఒక పెద్ద క్షిపణి దాడి చేసినట్లు హమాస్ సైనిక విభాగం ఇజ్జెడిన్ అల్- ఖాసమ్ బ్రిగేడ్స్ తమ టెలిగ్రామ్ చానెల్‌లో పేర్కొంది.

ఫొటో సోర్స్, Reuters
ఇజ్రాయెల్‌లో వ్యాపార కేంద్రంగా ఉన్న టెల్ అవీవ్, ఆ దేశంలో అతిపెద్ద నగరం.
గాజాలో విధ్వంసక దాడులను ఆపాలని ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ (ఐసీజే) ఇటీవలే ఇజ్రాయెల్‌ను ఆదేశించింది. తమను హమాస్‌తో పోల్చుతారా? అంటూ ఐసీజేను ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తప్పుబట్టారు. ఇజ్రాయెల్ సైన్యం కూడా ఆ ఆదేశాలను పట్టించుకోకుండా రఫాలో దాడులను తీవ్రతరం చేసింది.
ఇప్పుడు ఇజ్రాయెల్ మీద హమాస్ రాకెట్లతో దాడులు చేసింది.
2023 అక్టోబర్ 7న హమాస్‌కు చెందిన సాయుధులు ఇజ్రాయెల్‌లోకి చొరబడి దాదాపు 1,200 మంది ఇజ్రాయెల్ వాసులను చంపారు. 252 మందిని బందీలుగా గాజాకు తీసుకెళ్లారు.
అనంతరం హమాస్ లక్ష్యంగా గాజాపై ఇజ్రాయెల్ భీకర దాడులు ప్రారంభించింది. ఈ యుద్ధంలో 35,800 మందికి పైగా పాలస్తీనియన్లు చనిపోయారని గాజాలో హమాస్ నేతృత్వంలోని ఆరోగ్య శాఖ తెలిపింది.
ఇవి కూడా చదవండి:
- రాజ్‌కోట్: మాల్లోని గేమ్ జోన్లో భారీ అగ్నిప్రమాదం, చిన్నారులు సహా 24మంది మృతి
- బెంగళూరు రేవ్ పార్టీ కేసు: పోలీసులు ఏం చెప్పారు? అసలు రేవ్ పార్టీ అంటే ఏంటి? అందులో ఏం చేస్తారు?
- మద్యం తాగడం ఒక్కసారిగా మానేస్తే ఏమవుతుంది?
- సుభాష్ చంద్రబోస్ 'ద గ్రేట్ ఎస్కేప్': బ్రిటిష్ వాళ్ల కళ్లుగప్పి నేతాజీ దేశం ఎలా దాటారు?
- సల్తనత్ నుకెనోవా: ఒక సెలబ్రిటీ హత్య ఆ దేశ చట్టాలను ఎలా మార్చిందంటే...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














