గాలి నుంచి నీటిని తయారు చేయొచ్చా?

ఉరవు ల్యాబ్స్

ఫొటో సోర్స్, Uravu

ఫొటో క్యాప్షన్, ఉరవు వ్యవస్థాపకులు గోవింద బాలాజీ, స్వప్నిల్ శ్రీవాస్తవ్, వెంకటేష్ రాజా
    • రచయిత, సూసీ బేర్న్
    • హోదా, బీబీసీ టెక్నాలజీ రిపోర్టర్

కేరళలోని కోజికోడ్‌లో 2016లో తీవ్రమైన కరువు వచ్చింది.

అప్పుడు విద్యార్థిగా ఉన్న స్వప్నిల్ శ్రీవాస్తవ్‌తో సహా స్థానికులు నీటి కోసం చాలా ఇబ్బంది పడ్డారు.

"మేం రోజుకు రెండు బకెట్ల నీటిని మాత్రమే వాడేవాళ్లం. నీటి ట్యాంకర్ల దగ్గరి నుంచి నీళ్లు తెచ్చుకునే వాళ్లం" అని శ్రీవాస్తవ్ చెప్పారు.

నీటి సమస్యలు దేశంలోని కొన్ని ప్రాంతాలపై ప్రభావం చూపడం అసాధారణం కాదని శ్రీవాస్తవ్ చెప్పారు. కానీ ఆయనతో పాటు ఆ ప్రాంతంలోని వారికి ఇది కఠినమైన నెల.

స్థానికంగా ఉన్న పరిస్థితి, ఆయనకు ఉన్న ఆసక్తి కలిసి నీటి కొరత సమస్యకు పరిష్కారం దిశగా ఆయన ఆలోచించేలా చేసింది.

'స్టార్ వార్స్‌' సినిమాలో గాలి నుంచి నీటిని సృష్టించే విధానం ఒకటి ఉంటుందని, దాన్ని మనం ఎందుకు ప్రయత్నించకూడదని అనుకున్నానని శ్రీవాస్తవ్ గుర్తు చేసుకున్నారు.

నీరు

ఫొటో సోర్స్, Getty Images

ప్రాజెక్టు ఎలా పట్టాలెక్కింది?

కొన్నేళ్ల తర్వాత అంటే 2019లో ఆ ఆలోచన శ్రీవాస్తవ్‌తో పాటు గోవింద బాలాజీ, వెంకటేష్ రాజాలు బెంగుళూరులో ఉరవూ ల్యాబ్స్‌ అనే స్టార్టప్ కంపెనీ స్థాపించడానికి దారితీసింది.

ఉరవూ ల్యాబ్స్ వ్యవస్థాపకులు చెప్పిన దాని ప్రకారం.. వాళ్ల సిస్టం అట్మాస్పియరిక్ వాటర్ జనరేటర్స్‌ను ఉపయోగించి గాలిని నీరుగా మారుస్తుంది. ఇది గాలి నుంచి తేమను గ్రహిస్తుంది. ఆ జనరేటర్లలో లిక్విడ్ డెసికాంట్ ఉంటుంది.

సూర్యరశ్మి లేదా పునరుత్పాదక విద్యుత్తును ఉపయోగించి ఆ డెసికాంట్‌ను 65C ఉష్ణోగ్రతకి వేడి చేస్తారు. ఇది తేమను విడుదల చేస్తుంది, తాగునీటిలో ఘనీభవిస్తుంది. ఈ మొత్తం ప్రక్రియకు దాదాపు 12 గంటలు పడుతుందని శ్రీవాస్తవ్ చెప్పారు.

నేడు ఒక్కో యూనిట్ నుంచి దాదాపు 2 వేల లీటర్ల తాగునీటిని తయారు చేస్తున్నారు.

నీటి కొరతను ఎదుర్కొంటున్న కమ్యూనిటీలకు తాగునీటిని సరఫరా చేయడమే ఉద్దేశమయితే, అది ఆర్థికంగా లాభదాయకం కాదని ఆయన అంటున్నారు.

"సాంకేతికత పెరిగి, ఖర్చు తగ్గడానికి ఇంకా ఎక్కువ సమయం పడుతుంది. లేదంటే ఎవరైనా దీనికి నిధులు ఇవ్వాలి. కానీ, ఇండియాలో మాకు తగిన మద్దతు లభించలేదు" అని శ్రీవాస్తవ్ అన్నారు.

అందుకే, ప్రస్తుతం ఆతిథ్య రంగంలోని 40 మంది కస్టమర్లకు ఉరవూ కంపెనీ నీటిని విక్రయిస్తోంది.

“మేం లాభాపేక్ష లేని సీఎస్‌ఆర్ (కార్పొరేట్ సామాజిక బాధ్యత) విభాగాల ద్వారా ప్రయత్నించాం. కానీ చాలా కంపెనీలు ఈ టెక్నాలజీని పట్టించుకోలేదు. ఇది పని చేయదని వారు భావించారు. అందుకే మేం కమర్షియల్ విభాగానికి మారాల్సి వచ్చింది’’ అని శ్రీవాస్తవ్ అన్నారు.

నీటి తయారి

ఫొటో సోర్స్, Getty Images

నీటి కొరతకు ఇది పరిష్కారమా?

నీటి కొరత కొత్తది కాదు కానీ అనేక దేశాల్లో వాతావరణ మార్పుల కారణంగా తీవ్రమైన కరువు, వరదలు నీటి వనరులను కలుషితం చేస్తున్నాయి.

ఐక్యరాజ్యసమితి ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ప్రకారం.. ప్రపంచ జనాభాలో 50 శాతం కంటే ఎక్కువ మంది ప్రజలు (400 కోట్ల మంది ప్రజలు) కనీసం నెలకు ఒకసారైన నీటి కొరతను అనుభవిస్తున్నారు. 2025 నాటికి 180 కోట్ల మంది ప్రజలు సంపూర్ణ నీటి కొరత ఉన్న దేశాలు లేదా ప్రాంతాలలో నివాసం ఉంటారని అంచనా.

దీనంతటికి అట్మాస్పియరిక్ వాటర్ జనరేషన్ టెక్నాలజీ సమాధానం కాగలదా? సంప్రదాయ నీటి సదుపాయాల అవసరం లేకుండా తాజా నీటిని అందించడానికి ఇదొక మార్గం.

ఈ టెక్నాలజీకి మార్కెట్ కనిపిస్తోంది. గ్లోబల్ మార్కెట్ ఇన్‌సైట్‌ రిపోర్టుల ప్రకారం, 2022లో ఈ మార్కెట్ విలువ రూ. 28 వేల కోట్లు.

2032లో ఈ అట్మాస్పియరిక్ వాటర్ జనరేషన్ మార్కెట్ విలువ రూ. 1.12 లక్షల కోట్లకు చేరుతుందని అంచనా వేస్తున్నారు.

కెన్యాలో నీటి తయారీ

ఫొటో సోర్స్, Majik Water

కెన్యాలో 'మ్యాజిక్ వాటర్'

బెత్ కోయిగి, మ్యాజిక్ వాటర్ అనే సామాజిక సంస్థ సహ వ్యవస్థాపకురాలు, చీఫ్ ఎగ్జిక్యూటివ్.

ఆ సంస్థ ద్వారా కోయిగి కెన్యా అంతటా సుమారు 40 అట్మాస్పియరిక్ వాటర్ జనరేటర్ యూనిట్‌లను ఏర్పాటుచేశారు. వీటిలో గాలి నుంచి తేమను సంగ్రహించడానికి శీతలీకరణ, సంగ్రహణ పద్ధతులను ఉపయోగిస్తున్నారు.

2016లో నైరోబీలో కోయిగి చదువుతున్నప్పుడు కరువు రావడంతో, మొదటిసారిగా నీటి కొరతను ఎదుర్కొన్నారు. దీంతో 2017లో మ్యాజిక్ వాటర్‌ను స్థాపించారు.

తాగడానికి, ఇతర అవసరాలకు నీటిని తీసుకురావడానికి చాలామంది సమీపంలోని నదికి వెళ్లగా, అలా కలుషితమైన నీటిని తీసుకురాలేనని కోయిగి చెప్పారు. ఆ ఘటన తనను ఆలోచనలో పడేసిందని ఆమె అన్నారు.

అనంతరం, కోయిగి ఇతర నీటి వనరులపై ఆలోచనలు మొదలుపెట్టారు. గాలి నుంచి నీటిని అభివృద్ధి చేయడానికి ముందు వాటర్ ఫిల్టర్ కంపెనీని ఏర్పాటు చేశారు. మ్యాజిక్ వాటర్ సంస్థ ఎన్జీవోలు, మానవతా సంస్థలతో కలిసి పని చేస్తుంది, అలాగే స్టోర్లలో నీటిని విక్రయిస్తుంది.

మ్యాజిక్ అతిపెద్ద యూనిట్ 24 గంటల్లో 500 లీటర్ల నీటిని ఉత్పత్తి చేస్తుంది. వాటిని పాఠశాలలు, చిన్న కమ్యూనిటీలకు సరఫరా చేస్తారు. ఆ కంపెనీకి డిమాండ్ ఉన్నప్పటికీ, కోయిగి దానిని శాశ్వత పరిష్కారంగా చూడలేదు.

"నిజాయితీగా చెప్పాలంటే, నీటి కొరతకు ఇది పరిష్కారం కాదనుకుంటున్నా. ఇది తాత్కాలిక పరిష్కారమే, ఇదంత చౌక కూడా కాదు" అని కోయిగి అంటున్నారు.

గాలి నుంచి నీటి ఉత్పత్తి వ్యవస్థలను మరింత శక్తిమంతం చేయడంపై తయారీదారులు దృష్టి సారించారని గ్లోబల్ మార్కెట్ ఇన్‌సైట్స్‌లో పరిశోధన, కన్సల్టింగ్ అసోసియేట్ డైరెక్టర్ అవినాష్ సింగ్ చెప్పారు.

"ఉదాహరణకు కంప్రెషర్‌లు, ఉష్ణ వినిమాయకాలు (హీట్ ఎక్చేంజర్స్), డెసికాంట్‌లలోని ఆవిష్కరణలు అటువంటి వ్యవస్థల సామర్థ్యాన్ని మెరుగుపరిచాయి" అని ఆయన అన్నారు.

ప్రభుత్వ మద్దతు, సబ్సిడీలు ఇలాంటి టెక్నాలజీ వినియోగానికి ప్రోత్సాహం ఇవ్వగలవని అవినాష్ అభిప్రాయపడ్డారు.

డిజిటల్ చెల్లింపులతో ఊపు..

డిజిటల్ చెల్లింపులు ఈ వాటర్ సిస్టం అమలు చేయడానికి సాయపడింది. వెరాగాన్ అనే కంపెనీకి మిడిల్ ఈస్ట్, ఆసియా, ఆఫ్రికా, దక్షిణ అమెరికా అంతటా నీటి ఉత్పత్తి యూనిట్లున్నాయి. దాని ప్రధాన కార్యాలయం ఇటలీలో ఉంది.

"మేం వాస్తవానికి ఆఫ్-గ్రిడ్ కమ్యూనిటీలకు సరఫరా ప్రారంభించినప్పుడు నగదు ద్వారానే నడిచేది, ఇప్పుడంతా డిజిటలైజ్ అవుతోంది" అని వెరాగన్ గ్లోబల్ బిజినెస్ డైరెక్టర్ స్టీఫెన్ వైట్ అన్నారు.

"ఉదాహరణకు కంబోడియాలో ఎక్కువగా 4జీ అందుబాటులో ఉంది. కోవిడ్ కారణంగా ఇ-వాలెట్లు పెరిగాయి. మెరుగైన ప్రైవేట్ మౌలిక సదుపాయాలు, భాగస్వామ్యమూ ఉంది. ప్రభుత్వం ప్రమేయం అవసరమే లేదు, నీటిని చాలా తక్కువ ధరకు విక్రయిస్తాం’’ అని స్టీఫెన్ అంటున్నారు.

రాబోయే కొద్ది నెలల్లో అన్ని యూనిట్లను డిజిటల్‌కి మారుస్తామని ఆయన చెప్పారు.

అయితే, యూనిట్ల ధరలు చౌకగా లేవని, కూలింగ్, కండెన్సింగ్ సిస్టమ్‌ని ఉపయోగించే దాని యూనిట్ల ధర రూ. 49 లక్షల నుంచి రూ. 58 లక్షల మధ్య ఉంటుందని వెరాగన్ కంపెనీ అంటోంది. తమ పెద్ద యూనిట్ ధర దాదాపు రూ. 14,97,000 అని కోయిగి చెప్పారు.

అయితే, నీటిని తయారు చేసి, ఇతర ప్రాంతాలకు రవాణా చేయడం సులభం కాదు కాబట్టి ఎక్కడికక్కడే తయారు చేస్తే ప్రయోజనం ఉంటుందని శ్రీవాస్తవ్ అభిప్రాయపడ్డారు.

డేటా సెంటర్ల వద్ద ప్రయోగం..

మెటీరియల్ సైన్స్‌లో పురోగతి అనేది డెసికాంట్‌ల సామర్థ్యాన్ని ఎలా మెరుగుపరుస్తుంది లేదా గాలి నుంచి ఎక్కువ తేమను గ్రహించడం కోసం వేరొక పదార్థాన్ని ఉపయోగించే ప్రక్రియను మరింత ప్రభావవంతంగా చేయడంపై ఉరవూ ల్యాబ్స్ పరిశోధనలు చేస్తోంది.

ఈ పురోగతుల వల్ల అవసరమైన వేడిని 60 C నుంచి 40Cకి తగ్గించవచ్చని శ్రీవాస్తవ్ అభిప్రాయపడ్డారు.

ఇండియా, సింగపూర్‌లోని డేటా సెంటర్లలో ఉరవూ ల్యాబ్స్ యూనిట్లను ఏర్పాటుచేసి, అక్కడ పైలట్ ప్రాజెక్ట్‌లను చేపట్టాలని అనుకుంటున్నారు.

డేటా సెంటర్‌లు చాలా వేడిని ఉత్పత్తి చేస్తాయి, అయితే ఉరవూ అక్కడ మంచినీటిని సృష్టించాలని యోచిస్తోంది.

"ఈ ప్రక్రియతో డేటా సెంటర్ల మంచినీటి వినియోగం 95 శాతం వరకు తగ్గుతుంది, ఎందుకంటే ఉరవూ వ్యవస్థ చాలా వ్యర్థ వేడిని సంగ్రహిస్తుంది. చల్లటి నీటిని తిరిగి ఇస్తుంది, తద్వారా చాలా తక్కువ మంచినీరు అవసరమవుతుంది" అని చెప్పారు శ్రీవాస్తవ్.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)