టీ20 వరల్డ్‌కప్: ఆస్ట్రేలియా నుంచి అమెరికాకు పిచ్ తరలింపు, ఎలా సాధ్యమైంది?

ఫొటో సోర్స్, ICC
- రచయిత, మార్క్ హిగ్గిన్సన్
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఐసీసీ టీ20 ప్రపంచకప్ ఈ ఏడాది వెస్టిండీస్‌తో పాటు అమెరికాలో జరుగుతున్నాయి. ఈ నిర్ణయం చాలామందిని ఆశ్చర్యానికి గురి చేసింది. అంతేకాదు, దానికోసం వాడబోతున్న క్రికెట్ పిచ్‌లు మరింత ఆసక్తి కలిగిస్తున్నాయి.
టీ20 ప్రపంచ కప్ జరిగే అమెరికా క్రికెట్ మైదానాలను ప్రత్యేకంగా రూపొందిస్తున్నారు.
ఇతర నగరాల్లో శాశ్వతంగా నిర్మించిన క్రికెట్ గ్రౌండ్ మాదిరి కాకుండా ఆస్ట్రేలియా నుంచి దాదాపు 22 వేల కిలోమీటర్ల దూరంలో అమెరికాకు పిచ్‌లను తరలించారు.
ప్రపంచకప్ టోర్నీ కోసం పిచ్‌లను అడిలైడ్ నుంచి ఫ్లోరిడా మీదుగా ఓడలో అమెరికాకు తీసుకొచ్చారు.
అమెరికాలోని న్యూయార్క్, టెక్సస్, ఫ్లోరిడా రాష్ట్రాలలోని క్రికెట్ స్టేడియాలలో ఈ మ్యాచ్‌లు జరుగుతాయి.
అమెరికా, కెనడాల మధ్య ప్రారంభ మ్యాచ్, భారత్, పాకిస్తాన్ మధ్య ముఖ్యమైన గ్రూప్ దశ మ్యాచ్ రెండూ అమెరికాలోనే జరుగుతాయి.
ఓవరాల్‌గా అమెరికాలో 16 మ్యాచ్‌లు, వెస్టిండీస్‌లో 39 మ్యాచ్‌లు జరగనున్నాయి. ఇందుకోసం అమెరికాలో క్రికెట్ మైదానాలను సిద్ధం చేసే పనులు జోరుగా సాగాయి.

ఫొటో సోర్స్, Getty Images
'పేస్, బౌన్స్ పిచ్'
అయితే, అసలు క్రికెట్ స్టేడియాలు లేని దేశంలో ప్రపంచకప్ లాంటి టోర్నీ కోసం పిచ్‌లను నిర్మించే పని పెద్ద సవాలే. ఈ నేపథ్యంలో ప్రపంచకప్ కోసం పిచ్‌లను తయారుచేసిన క్యూరేటర్ బీబీసీతో మాట్లాడారు.
"మా లక్ష్యం పేస్, స్థిరమైన బౌన్స్ ఉన్న పిచ్‌లను సిద్ధం చేయడం, అదేవిధంగా ప్లేయర్స్ షాట్‌లను ఆడగలగాలి." అని అడిలైడ్ ఓవల్ పిచ్ క్యూరేటర్ డామియన్ హాగ్ చెప్పారు.
ఈ ప్రపంచ కప్ కోసం అమెరికాలో పిచ్‌లను డామియన్ సిద్ధం చేశారు.
"మేము అభిమానులకు క్రికెట్ వినోదాన్ని పంచాలనుకుంటున్నాం. అది అంత ఈజీ కాదు." అని ఆయన అన్నారు.
2023 అక్టోబర్ నుంచి 10 పిచ్‌ల తయారీ పని మొదలైంది. ప్రతి పిచ్‌ను రెండు ట్రేలుగా విభజించి తయారు చేస్తారు. మ్యాచ్‌లు ఆడేందుకు 4, ప్రాక్టీస్ కోసం 6 పిచ్‌లను నిర్మించడం వీరి లక్ష్యం.

ఫొటో సోర్స్, Getty Images
'వెచ్చని వాతావరణానికి సరిపోయేలా'
యూఎస్‌లోని బేస్‌బాల్ వేదికలలో వాడే బంకమట్టి లాంటి మట్టిని, గడ్డితో కలిపి ఈ క్రికెట్ స్టేడియాలకూ ఉపయోగిస్తున్నారు. ఇది వెచ్చని వాతావరణాలకు అనువుగా ఉంటుంది. అలాగే పిచ్ రోలింగ్, ఎక్కువ వాడకాన్ని కూడా తట్టుకోగలదు.
పిచ్ ట్రేలు ఈ ఏడాది జనవరిలో అడిలైడ్ నుంచి ఫ్లోరిడాకు వచ్చాయి. వాటిని అక్కడ వేడి వాతావరణంలో పెంచారు. కానీ, ఆ సమయంలో న్యూయార్క్‌లో గడ్డకట్టే చలి ఉంది, దీంతో వాటిని రోడ్డు మార్గంలో స్టేడియాలకు వేగంగా తీసుకువచ్చారు.
ఆలస్యమైతే నాణ్యత తగ్గే అవకాశముండటంతో రెండు లారీల ద్వారా వేగంగా ఈ పిచ్‌లను తరలించారు.
టీ20 ప్రపంచకప్ తొలి దశ గ్రూప్ దశ మ్యాచ్‌లు జూన్ 1న ప్రారంభమవుతాయి, పిచ్‌లు అప్పటికే సిద్ధమై ఉండాలి కాబట్టి, ఇలా చలిలోనైనా వాటిని తరలించారు.
‘భయంగానూ ఉంది’
స్టేడియంలో పిచ్‌ను సిద్ధం చేయడానికి డామియన్, ఆయన బృందానికి 12 గంటల సమయం పట్టింది. వీటిలో కొన్ని పిచ్‌లను ఈ టోర్నీ కోసమే ప్రత్యేకంగా సిద్ధం చేస్తున్నారు.
ఇటీవల బీబీసీతో డామియన్ మాట్లాడుతూ " నేను నిజంగా ఉత్సాహంగా ఉన్నాను, అదే సమయంలో ఏం జరుగుతుందో నాకు తెలియదు కాబట్టి కొంచెం భయపడ్డాను" అని అన్నారు.
"ఇది చాలా పెద్ద పని. మాకు తెలిసినంత వరకు బాగా చేశాం" అని ఆయన అన్నారు.
"మేము ఎదుర్కోబోయే అన్ని సవాళ్లు, ఆ పిచ్‌లు ప్రతిస్పందించే తీరుపై ఆలోచించాం, ఇవి మంచి పిచ్‌లుగా ఉంటాయని మేము ఆశిస్తున్నాం" అని డామియన్ ఆశాభావం వ్యక్తంచేశారు.
టోర్నీ వేదికలు
అమెరికాలో..
1. ఫ్లోరిడాలో లాడర్‌హిల్‌లోని సెంట్రల్ బ్రోవార్డ్ పార్క్ కౌంటీ స్టేడియం
2. డాలస్-టెక్సాస్‌లోని గ్రాండ్ ప్రయరీ క్రికెట్ స్టేడియం
3. న్యూయార్క్‌లోని నసావు కౌంటీ ఇంటర్నేషనల్ స్టేడియం
వెస్టిండీస్‌లో...
4. ఆంటిగ్వా అండ్ బార్బుడాలోని సర్ వివియన్ రిచర్డ్స్ స్టేడియం
5. బార్బడోస్‌లోని కెన్సింగ్టన్ ఓవల్
6. గయానాలోని గయానా నేషనల్ స్టేడియం
7. సెయింట్ లూసియాలోని డారెన్ సామీ స్టేడియం
8. సెయింట్ విన్సెంట్ అండ్ గ్రెనడైన్స్‌లోని ఆర్నోస్ వేల్ స్టేడియం
9. ట్రినిడాడ్ అండ్ టొబాగోలోని బ్రియాన్ లారా క్రికెట్ స్టేడియం

ఫొటో సోర్స్, Getty Images
భారత జట్టు ఇదే..
టీ20 ప్రపంచకప్ టోర్నీకి 15 మందితో కూడిన భారత జట్టును గత నెలలోనే బీసీసీఐ ప్రకటించింది. ఈసారి జట్టులో స్పిన్నర్లకు పెద్దపీట వేసింది.
భారత జట్టు:
రోహిత్ శర్మ (కెప్టెన్)
హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్)
విరాట్ కోహ్లీ,
సూర్యకుమార్ యాదవ్
యశస్వి జైస్వాల్
రిషబ్ పంత్
సంజూ శాంసన్,
శివం దూబే
రవీంద్ర జడేజా,
అక్షర్ పటేల్
కుల్దీప్ యాదవ్
యజువేంద్ర చాహల్,
అర్షదీప్ సింగ్
జస్‍ప్రీత్ బుమ్రా
మొహమ్మద్ సిరాజ్
వీరితో పాటు మరో నలుగురిని రిజర్వ్ ఆటగాళ్లుగా ఎంపిక చేసింది.
రిజర్వ్ ప్లేయర్లు:
శుభ్‍మన్ గిల్
రింకూ సింగ్
ఖలీల్ అహ్మద్
ఆవేశ్ ఖాన్
ఇవి కూడా చదవండి:
- ‘స్టార్ వార్ సినిమాలో చూపించినట్టు గాలి నుంచి నీటిని తయారు చేస్తున్నాం...’
- అంతరించి పోయిందనుకున్న ఈ ‘పర్వత రత్నం’ మళ్లీ కనిపించింది, ఎక్కడంటే..
- బెంగళూరు రేవ్ పార్టీ కేసు: పోలీసులు ఏం చెప్పారు? అసలు రేవ్ పార్టీ అంటే ఏంటి? అందులో ఏం చేస్తారు?
- ఓవర్సీస్ హైవే: సముద్రంలో 182 కిలోమీటర్ల రోడ్డు.. ప్రపంచంలో 8వ వింత ఇదేనా?
- #UnseenLives: వెనక 40 మంది పురుషులున్నా, నేను ఆ మరకను దాచుకోలేదు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














