గౌతమ్ గంభీర్: కోల్‌కతాను ఐపీఎల్ చాంపియన్ చేసిన ఈయన, టీమిండియా కోచ్ అవుతారా?

ఫొటో సోర్స్, Getty Images
మే 26న రాత్రిపూట చెన్నైలో ఉష్ణోగ్రతలు సుమారు 35 డిగ్రీల సెల్సియస్ వరకు ఉన్నాయి. చెపాక్ స్టేడియంలో జరిగే ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌ను చూసేందుకు వేల మంది జనం వచ్చారు. చెమటతో ఆటగాళ్ల షర్ట్‌లు తడిసిపోయాయి.
హైదరాబాద్ సన్‌రైజర్స్ నిర్దేశించిన స్వల్ప లక్ష్యాన్ని 10.3 ఓవర్లలో కేవలం 2 వికెట్లు కోల్పోయి చేరుకున్న కోల్‌కతా మూడోసారి ఐపీఎల్ ట్రోఫీని అందుకుంది.
ఈ టోర్నమెంట్‌లో ఎక్కువగా సోషల్ మీడియా, స్పోర్ట్స్ చానల్ కెమెరాల్లో కనిపించిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ సీఈవో కావ్య మారన్...బై చెబుతూ, కొంత సమయం పాటు కెమెరా ఫోకస్ నుంచి పక్కకు వెళ్లారు.
టోర్నమెంట్‌లో విధ్వంసక బ్యాటింగ్ చేస్తూ వచ్చిన సన్‌రైజర్స్, ఈ మ్యాచ్‌లో తడబడింది. కప్‌ను చేజార్చుకుంది. ఆ బాధతో వచ్చిన కన్నీళ్లను దిగమింగేందుకు కావ్య మారన్ ప్రయత్నించిన తీరు, సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
కోల్‌కతా జట్టు ఆటగాళ్లందరూ సంతోషంగా కనిపించారు. గ్యాలరీలో కూర్చున్న కోల్‌కతా టీమ్ ఓనర్ షారుఖ్ ఖాన్ ఇంకా ఆనందంగా కనిపించారు.
కానీ, ఒక వ్యక్తి మాత్రం ఏం మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఉన్నాడు. పూర్తిగా సంతృప్తికరంగా అనిపించిన తర్వాతనే తన ముఖంలో సంతోషం, ఆనందం బయటికి రావాలని అనుకుంటున్నాడు.
కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కొట్టిన షాట్‌కు అప్పటి వరకు నిశ్శబ్దంగా కూర్చున్న స్కోర్ సమం కావడంతో గౌతమ్ గంభీర్ ఒక్కసారిగా తన కూర్చీలో నుంచి లేచి, ఇతర ఆటగాళ్లను సంతోషంగా హత్తుకున్నారు. ఆ తర్వాత బంతికి వెంకటేశ్ కొట్టిన షాట్‌తో 2024 ఐపీఎల్ చాంపియన్‌గా కోల్‌కతా అవతరించింది.
కోల్‌కతా టీమ్ మెంటార్ గౌతమ్ గంభీర్‌ను సునీల్ నరేన్ హత్తుకుని ఆయన్ను పైకి ఎత్తారు. టపాసులు పేలాయి. కోల్‌కతా జట్టు ఈ రకమైన వేడుకను ఇప్పటి వరకు మూడుసార్లు జరుపుకుంది.
అయితే, కోల్‌కతా జట్టు మూడుసార్లు చాంపియన్‌గా నిలవడంలో ఉన్న ఒకే ఒక్క కామన్ పాయింట్ గౌతమ్ గంభీర్. టైటిల్ గెలిచిన సంతోషంతో వెంటనే గంభీర్ ఎక్స్ వేదికగా ఒక ట్వీట్ చేశారు.
‘‘ఎవరి ఆలోచనలు, చర్యలు సత్యంపై ఆధారపడి ఉంటాయో, వారి రథాన్ని నేటికీ శ్రీ కృష్ణుడు నడుపుతాడు’’ అని రాశారు.
ఐపీఎల్ 2024లో కోల్‌కతా నైట్ రైడర్స్ చాంపియన్‌గా నిలిచేందుకు గౌతమ్ గంభీర్ మెంటార్‌గా ఎలాంటి పాత్రను పోషించారు?

ఫొటో సోర్స్, ANI
కోల్‌కతా, గౌతమ్ గంభీర్, టీమిండియా
కోల్‌కతా తొలిసారి 2012లో ఐపీఎల్ చాంపియన్‌గా నిలిచింది. ఆ సమయంలో గౌతమ్ గంభీర్ టీమ్ కెప్టెన్.
2014లో రెండోసారి కోల్‌కతా నైట్ రైడర్స్ చాంపియన్ అయినప్పుడు, అప్పుడు కూడా ఆయనే కెప్టెన్.
ఇక మూడోసారి కోల్‌కతా టీమ్ ఐపీఎల్ ట్రోఫీ గెలిచిన ఈ సమయంలో, ఈ జట్టుకు గౌతమ్ గంభీర్ మెంటార్‌గా పని చేశారు.
గంభీర్ కెప్టెన్సీలో జట్టు మూడుసార్లు ప్లేఆఫ్‌లకు వెళ్లింది. 2022, 2023లలో గౌతమ్ గంభీర్ మెంటార్‌గా లఖ్‌నవూ జట్టు గ్రూప్ స్టేజీలో మూడో స్థానంలో నిలిచింది.
టీమిండియా హెడ్ కోచ్ పోస్టుకు గౌతమ్ గంభీర్ పోటీ పడుతున్నారని వార్తలు వస్తున్న సమయంలోనే కోల్‌కతా టీమ్ ఐపీఎల్ 2024లో చాంపియన్‌గా నిలిచింది.
ఐపీఎల్‌లో కోల్‌కతా గెలుపు తర్వాత చాలామంది గంభీర్ సక్సెస్‌ను గుర్తు చేసుకుంటున్నారు.
2007లో టీ20 ప్రపంచ కప్‌లో గౌతమ్ గంభీర్ ముఖ్యమైన పాత్రను పోషించారు. ఆ టోర్నమెంట్‌లో భారత్‌కు అత్యధిక పరుగులను అందించిన ఆటగాడిగా నిలిచారు.
2011లో టీమిండియా వన్డే ప్రపంచ చాంపియన్‌గా నిలిచినప్పుడు కూడా గంభీర్ సహకారం ఎనలేనిది. వరల్డ్ కప్‌లో తొమ్మిది మ్యాచ్‌లలో 9 ఇన్నింగ్స్‌లో 43.66 సగటు, 85.06 స్ట్రయిక్ రేటుతో 393 పరుగులు చేశాడు గంభీర్. దీనిలో 4 అర్థ సెంచరీలు కూడా ఉన్నాయి.
ఫైనల్ మ్యాచ్‌లో తొలి ఓవర్ నుంచి 42వ ఓవర్ వరకు గంభీర్ క్రీజ్‌లోనే ఉన్నాడు. 97 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్‌ను ఆడి జట్టును గెలుపు దిశకు చేర్చారు.
ఈ విజయానికి కొందరు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి క్రెడిట్ ఇవ్వగా, గంభీర్ తన అసంతృప్తిని బహిరంగంగానే వ్యక్తం చేశాడు. ఆ మ్యాచ్‌లో ధోనీ 91 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.

ఫొటో సోర్స్, Getty Images
కోల్‌కతా జట్టుకు తిరిగి వచ్చిన గంభీర్
అంతకు ముందు లఖ్‌నవూ టీమ్‌కు మెంటార్‌గా పని చేసిన ఆయన, 2023 చివరిలో కోల్‌కతా టీమ్ మెంటార్ అయ్యారు. వచ్చీ రావడంతోనే కోల్‌కతా టీమ్‌లో మార్పులు చేశారు.
ఫిల్ సాల్ట్‌తో కలిసి సునీల్ నరేన్ ఇన్నింగ్స్ ప్రారంభించేలా గంభీర్ స్ట్రాటజీని రూపొందించారు. ఇది జట్టుకు ఎంతో సహకరించింది.
తొలుత బ్యాటింగ్ చేసినప్పుడు, టీమ్ ఎనిమిది సార్లు 200కి పైగా పరుగులు చేసింది.
మెంటార్‌గా గంభీర్ వైఖరిని జట్టు ఆటగాడు నితీష్ రాణా ‘‘గౌతమ్ గంభీర్ మాకు మెంటార్ అని తెలిసినప్పుడు, ఆయనకు ఒక పెద్ద మెసేజ్ పంపాను. నా సంతోషాన్ని వ్యక్తం చేశాను. పోడియంలో ట్రోఫీని ఎత్తుకున్నప్పుడు మాత్రమే తనకు సంతోషం కలుగుతుందని గంభీర్ సమాధానమిచ్చారు. ఇవాళ ఆరోజు వచ్చేసింది. ఎప్పటికీ నేను ఆ మెసేజ్‌ను గుర్తుంచుకుంటాను’’ అన్నాడు.
గౌతమ్ గంభీర్ వ్యూహాన్ని తెలుసుకోవాలనుకుంటే, మనం కొన్ని నెలలు వెనక్కి వెళ్లాలి.
2023 డిసెంబర్‌లో ఐపీఎల్ కోసం ఆటగాళ్ల వేలం జరుగుతున్నప్పుడు, వేలం జరిగే టేబుల్ వద్ద గౌతమ్ గంభీర్ కూర్చుని ఉన్నారు.
ఆ తర్వాత, ఆస్ట్రేలియా ఆటగాడు మిచెల్ స్టార్క్‌ను కోల్‌కతా రూ.24 కోట్ల 75 లక్షలకు కొనుగోలు చేసింది. ఇంత భారీ ధరకు ఒక ఆటగాడిని ఏదైనా టీమ్ కొనుగోలు చేయడం ఐపీఎల్ చరిత్రలోనే తొలిసారి.
అప్పుడు ఈ నిర్ణయాన్ని ప్రశ్నించిన కొందరు వ్యక్తులు, ఇప్పుడు కోల్‌కతా చాంపియన్ కావడంతో ప్రశంసిస్తున్నారు.
మిచెల్ స్టార్క్‌ను కొన్నందుకు గౌతమ్ గంభీర్‌కు సోషల్ మీడియాలో కొందరు ధన్యవాదాలు తెలియజేయగా...మరికొందరు స్టార్క్ ఫోటోలను షేర్ చేస్తూ ఆ రూ.24 కోట్లు వేస్ట్ అయ్యాయని ఎవరంటున్నారు? అంటూ సోషల్ మీడియాలో మీమ్స్ సర్క్యూలేట్ చేశారు.
ఈ టోర్నమెంట్‌లో స్టార్క్ 17 వికెట్లు తీశారు.

ఫొటో సోర్స్, Getty Images
కేకేఆర్‌లో గౌతమ్ గంభీర్ నాయకత్వం
చాలా మంది క్రికెటర్లు చెప్పినట్లు, గౌతమ్ గంభీర్ దగ్గర మంత్రదండం ఏమీ లేదు. ఆయన ఆట కోసం అవలంభించే వ్యూహామే దీనిలో కీలకం.
ఏడు సీజన్లలో కోల్‌కతా కెప్టెన్‌గా గంభీర్ నాయకత్వాన్ని అభిమానులు చూశారు.
కొన్ని క్లిష్టమైన పరిస్థితులు తలెత్తినప్పుడు వాటికి సమర్థవంతంగా గంభీర్ పరిష్కారాలను కనుగొన్నారని స్పోర్ట్స్‌స్టార్ పత్రిక పేర్కొంది.
ఏదైన సమస్య వచ్చినప్పుడు గౌతమ్ గంభీర్ ఉంటే ఈ సమస్య పరిష్కారమవుతుందని జట్టు మేనేజ్‌మెంట్, ఆటగాళ్లు భావించే పరిస్థితి ఉండేది.
సునీల్ నరేన్, ఆండ్రీ రస్సెల్‌కు గంభీర్ ప్రాధాన్యం ఇచ్చేవారు. దీని ఫలితంగా ఈ టోర్నీలో కనిపించింది. సునీల్ ఈ టోర్నమెంట్‌లో 488 పరుగులు చేశారు. టీమ్ మేనేజ్‌మెంట్ కూడా జట్టు గెలుపులో కీలక పాత్ర పోషించింది.
తన తల్లి అఫ్గానిస్తాన్‌లోని ఆస్పత్రిలో అడ్మిట్ అయినప్పుడు రెహ్మనుల్లా గుర్బాజ్ భారత్‌లో కోల్‌కతా టీమ్ కోసం ఆడుతున్నారు. ఈ సమయంలో టీమ్ నుంచి ఆయనకు ప్రోత్సాహం, ధైర్యవచనాలు అందాయి.
‘‘కేకేఆర్ లాంటి మేనేజ్‌మెంట్ ఉంటే, మీరు దేనికి ఆందోళన చెందాల్సినవసరం ఉండదు. ఎందుకంటే, గౌతమ్ సార్, షారుఖ్ ఖాన్ సార్, హెడ్ కోచ్ చంద్రకాంత్ పండిట్ మేనేజ్‌మెంట్‌లో ఉన్నారు. వీరు కుటుంబం లాంటివారు’’ అని రెహ్మనుల్లా గుర్బాజ్ అన్నారు.
గౌతమ్ గంభీర్ కాస్త దూకుడు వ్యక్తి అని, వెంటనే కోపం వస్తుందనే తరుచూ కొందరు అంటుంటారు. మైదానంలో విరాట్ కోహ్లీతో జరిగిన వాగ్వాదాన్ని అభిమానులు మర్చిపోరు.
ఐపీఎల్‌లో ఈ ఇద్దరు ఆటగాళ్లు ఎదురుపడి నవ్వుకున్న సందర్భం కూడా ఉంది.
గౌతమ్ గంభీర్‌ను చాలామంది అపార్ధం చేసుకుంటారని ఓ యూట్యూబ్ షోలో బౌలర్ రవిచంద్రన్ వ్యాఖ్యానించారు.
‘‘నేను దూకుడుగా ఉండాలనుకుంటాను. దీనిలో తప్పేం ఉంది? ఇది నా స్వభావం. గెలవడం నా అభిరుచి. గెలుపు కోసం నేను తాపత్రయపడతాను’’ అని అదే షోలో గౌతమ్ గంభీర్ అన్నారు.
‘‘నాతో మాట్లాడే వారు చాలాసార్లు నేను నవ్వడం లేదని అంటుంటారు. నా ముఖంపై ఎప్పుడూ ఆటే ఉంటుంది. జనం నేను నవ్వుతుంటే చూసేందుకు . గెలిస్తే చూడటానికి వస్తారు. నేను బాలీవుడ్ నటుడినో, కార్పొరేటర్‌నో కాదు. క్రికెటర్‌ని. డ్రెస్సింగ్ రూమ్‌లో గడపాలనుకుంటా. ఆ తర్వాత తిరిగి వెళ్లిపోతా. మంచి లేదా చెడు అని ఏదైనా మీరు అనుకోండి...’’ అని ఆ షోలో గంభీర్ అన్నారు.
తనకు గణాంకాలన్నా, గంటల తరబడి మీటింగులన్నా నచ్చవని గంభీర్ అంటారు.
‘‘క్లిష్టపరిస్థితి వచ్చినప్పుడు ఏ ఆటగాడు మంచి ఫలితాలను తెస్తాడో గంభీర్‌కు తెలుసు. గేమ్‌ను బాగా అర్థం చేసుకుని, స్పందిస్తారు’’ అని గంభీర్ కెప్టెన్‌గా ఉన్నప్పుడు ఆడిన పీయూష్ చావ్లా చెప్పారు.

ఫొటో సోర్స్, ANI
గంభీర్ కోల్‌కతా టీమ్‌తోనే ఉంటారా?
ఐపీఎల్ చాంపియన్‌గా కోల్‌కతా విజయం సాధించిన తర్వాత, మెంటార్‌గా టీమ్‌తోనే గంభీర్ ఉంటారా? లేదా టీమిండియా హెడ్ కోచ్‌గా వెళ్తారా? అన్న ప్రశ్న వినిపిస్తోంది.
‘‘నా అభిప్రాయం ప్రకారం, గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్ అవుతారని అనిపిస్తుంది. ఐపీఎల్ గెలవడం దీన్ని కన్ఫర్మ్ చేసింది.’’ అని ఈఎస్‌పీఎన్ క్రిక్‌ఇన్ఫో షోలో మాజీ క్రికెటర్ వాసిమ్ జఫర్ అన్నారు.
అయితే, ఈ ప్రశ్నకు సమాధానం గౌతమ్ గంభీర్ దగ్గరే ఉంది. త్వరలోనే దీని సమాధానం దొరకబోతోంది.
ఇవి కూడా చదవండి:
- అంతరించి పోయిందనుకున్న ఈ ‘పర్వత రత్నం’ మళ్లీ కనిపించింది, ఎక్కడంటే..
- బెంగళూరు రేవ్ పార్టీ కేసు: పోలీసులు ఏం చెప్పారు? అసలు రేవ్ పార్టీ అంటే ఏంటి? అందులో ఏం చేస్తారు?
- ఓవర్సీస్ హైవే: సముద్రంలో 182 కిలోమీటర్ల రోడ్డు.. ప్రపంచంలో 8వ వింత ఇదేనా?
- #UnseenLives: వెనక 40 మంది పురుషులున్నా, నేను ఆ మరకను దాచుకోలేదు
- చంద్రుడి మీద బతకాల్సి వస్తే అక్కడ తినడానికి ఏముంటుంది, సైంటిస్టులు చేస్తున్న ప్రయోగాలేంటి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














