స్కూటీ అంటే అమ్మాయి, బైక్ అంటే అబ్బాయి...హైదరాబాద్‌లో పిల్లల విక్రయ ముఠా గుట్టు ఎలా బయటపడిందంటే...

- రచయిత, అమరేంద్ర యార్లగడ్డ
- హోదా, బీబీసీ ప్రతినిధి
మీరు స్కూటీ కావాలి అని అడిగి రెండు, మూడు లక్షల రూపాయలు ఇస్తే ఆడపిల్లను పెంచుకోవడానికి ఏర్పాటు చేస్తారు.
బైక్ కావాలని అడిగి.. నాలుగైదు లక్షలు ఇస్తే మగపిల్లాడిని దత్తత ఇచ్చేందుకు రెండు మూడు రోజుల్లో ఏర్పాటు చేస్తారు.
స్కూటీ, బైకు అని అడిగితే పిల్లలను ఇవ్వడం ఏంటని అనుకుంటున్నారా?
పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం పిల్లలను విక్రయించే ముఠా పెట్టుకున్న కోడ్ లాంగ్వేజ్ ఇది.
పసికందులను అంగట్లో సరుకుగా అమ్మేస్తున్న ముఠాను తెలంగాణ పోలీసులు పట్టుకున్నారు.
దిల్లీ, పుణెల నుంచి పిల్లలను తీసుకువచ్చి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో పిల్లలు లేని వారికి అమ్ముతున్నట్లు గుర్తించారు. ఈ ముఠాలోని 11 మందిని రాచకొండ కమిషనరేట్ పోలీసులు అరెస్టు చేశారు.
ఇప్పటివరకు 14 మంది పిల్లలను విక్రయించారని గుర్తించి, వారిని వెనక్కి తీసుకొచ్చారు.
వీరిని పెంచుకుంటున్న తల్లిదండ్రులు నిబంధనలు పాటించకుండా అడ్డదారిలో పిల్లలను కొనుగోలు చేసినట్లు పోలీసులు గుర్తించారు.

శిశువిహార్‌కు పిల్లల తరలింపు
పోలీసులు గుర్తించిన 14 మంది పిల్లలను హైదరాబాద్‌లోని శిశువిహార్‌కు తరలించారు. వారి ఆలనాపాలనా అక్కడే చూస్తున్నారు.
పిల్లలను తల్లిదండ్రుల నుంచి తీసుకెళ్లే సమయంలో హైడ్రామా నడిచింది.
తాము డబ్బులిచ్చి పిల్లలను కొన్నామని తల్లిదండ్రులు మీడియా ముందు ఒప్పుకొన్నారు.
కానీ వారిని అల్లారుముద్దుగా పెంచుకుంటున్నామని ఏడుస్తూ చెప్పారు.
పిల్లలను తమ నుంచి వేరు చేయొద్దంటూ తల్లిదండ్రులు, వారి బంధువులు ఏడుస్తూ మేడిపల్లి పోలీస్ స్టేషన్ వద్ద కనిపించారు.
అటు పిల్లలు కూడా ఏడుస్తూ కనిపించారు. కాస్త ఊహ తెలిసి రెండున్నర, మూడేళ్ల వయసున్న పిల్లలైతే తల్లిదండ్రులు, బంధువులను పట్టుకుని ఏడుస్తూ కనిపించారు.

ముఠా గుట్టు రట్టు ఇలా..
పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ శివారులోని పీర్జాదిగూడలో శోభారాణి అనే మహిళ ఫస్ట్ ఎయిడ్ క్లినిక్ నిర్వహిస్తున్నారు. ఆమె ఆర్ఎంపీ డాక్టర్.
ఆమె పిల్లలను విక్రయిస్తున్నట్లు అక్షరజ్యోతి ఫౌండేషన్‌తోపాటు లోకల్ మీడియా ప్రతినిధి మన్యం సాయికుమార్‌కు సమాచారం వచ్చింది.
వీరు రెండు టీములుగా ఏర్పడి.. మే 22వ తేదీన పాపను దత్తత తీసుకుంటామంటూ శోభారాణి వద్దకు వెళ్లారు.
అక్కడ పాపను దత్తత తీసుకుంటున్నట్లుగా నటించి ముఠా గుట్టును బయటపెట్టారు.
ఆ రోజు ఏం జరిగిందో అక్షర జ్యోతి ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు అనూష బీబీసీకి చెప్పారు.
‘‘శోభారాణి అనే డాక్టర్ మగ పిల్లాడిని దత్తత ఇస్తామని ప్రతిపాదన పెట్టారు.మేం కొంచెం ఆలస్యం చేసే సరికి ఆ పిల్లాడిని వేరొకరికి ఇచ్చామని చెప్పారు. ముందుగా రూ.10వేలు కట్టాం. తర్వాత ఆడపిల్ల ఉందని 20వ తేదీ కబురు వచ్చింది. ముందుగా విజయవాడ రమ్మని చెప్పారు. మాకు హైదరాబాద్‌లోనే కావాలని అడిగాం. అలా 22వ తేదీన పాప ఉందని చెప్పడంతో వెళ్లి ఈ పిల్లల విక్రయ ముఠాను పట్టుకుని పోలీసులకు సమాచారం ఇచ్చాం’’ అని చెప్పారు అనూష.
ఈ విషయంపై స్థానిక మీడియా ప్రతినిధి మన్యం సాయికుమార్‌తో మాట్లాడేందుకు బీబీసీ ప్రయత్నించింది. ఆయన అందుబాటులోకి రాలేదు.

దిల్లీ, పుణె నుంచి పిల్లల సరఫరా
ఈ కేసుతో సంబంధం ఉందని భావిస్తున్న 11మందిని పోలీసులు అరెస్టు చేశారు.
దిల్లీ, పుణె నుంచి పిల్లలను తీసుకువచ్చి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పిల్లలు లేనివారికి అమ్ముతున్నట్లు గుర్తించారు.
1.80 లక్షల రూపాయల నుంచి 5.50 లక్షల రూపాయల వరకు రేటు కట్టి పిల్లలను అమ్ముతున్నట్లు పోలీసు విచారణలో తేలింది.
గత రెండు, మూడేళ్లలో దాదాపు 50 మంది పిల్లలను విక్రయించినట్టు ప్రాథమిక సమాచారం ఉందని రాచకొండ పోలీసు కమిషనర్ తరుణ్ జోషి చెప్పారు.
‘‘ఈ కేసులో మొదట పీర్జాదిగూడలో ఫస్ట్ ఎయిడ్ క్లినిక్ నిర్వహిస్తున్న శోభారాణితోపాటు హేమలత (స్వప్న), షేక్ సలీంను అరెస్టు చేశాం.
వారు ఇచ్చిన సమాచారంతో ఘట్‌కేసర్‌కు చెందిన బండారి హరిహర చేతన్, బండారి పద్మ, విజయవాడకు చెందిన బలగం సరోజ, పఠాన్ ముంతాజ్, జగనడం అనూరాధ, మహబూబ్‌నగర్‌కు చెందిన ముదావత్ శారద, రాజును అరెస్టు చేశాం.
వీరు దిల్లీకి చెందిన కిరణ్, ప్రీతి, పుణెకు చెందిన కన్నయ్య అనే వ్యక్తుల నుంచి పిల్లలను కొంటున్నట్లు తెలిసింది’’ అని చెప్పారు తరుణ్ జోషి.
వీరందరిపై ఐపీసీ సెక్షన్ 370, 372, 373తోపాటు జువైనల్ జస్టిస్ యాక్టులో సెక్షన్ 81, 87, 88 కింద కేసు నమోదు చేశామని చెప్పారు తరుణ్ జోషి.
పిల్లలను కిడ్నాప్ చేస్తున్నారా.. కొంటున్నారా..?
అమ్మకానికి పెట్టిన పిల్లందరూ రోజుల వయసున్న పసికందులే.
వీరిని ఎక్కడి నుంచి తీసుకు వస్తున్నారనే విషయంపై స్పష్టత లేదని చెప్పారు రాచకొండ పోలీసు కమిషనర్ తరుణ్ జోషి.
‘‘దిల్లీ, పుణెకు చెందిన వ్యక్తులు పరారీలో ఉన్నారు. వారు దొరికితే ఈ విషయంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
పిల్లలకు జన్మనిచ్చిన తల్లిదండ్రులే అమ్ముతున్నారా.. లేదా ముఠా సభ్యులు కిడ్నాప్ చేసి తీసుకుని వస్తున్నారా.. అనే విషయంపై మరింత విచారణ జరుగుతోంది’’ అని చెప్పారు.
ప్రభుత్వ దత్తత ప్రక్రియ ద్వారా పిల్లలను తీసుకోవాలంటే ఏడాది నుంచి రెండేళ్ల సమయం పడుతున్నందునే త్వరగా పిల్లలు కావాలనే ఉద్దేశంతో కొందరు అడ్డదారులు తొక్కుతున్నారని చెప్పారు తరుణ్ జోషి.

ఫొటో సోర్స్, UGC
ఫేక్ పత్రాల తయారీ
పిల్లలను విక్రయిస్తున్న ముఠా సభ్యులే నకిలీ తల్లిదండ్రులను ఏర్పాటు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
దత్తత పత్రాలు, నకిలీ బర్త్ సర్టిఫికెట్లను తయారు చేయడానికి అదనంగా వసూలు చేసేవారని మేడిపల్లి పోలీసు ఇన్‌స్పెక్టర్ గోవింద్ రెడ్డి బీబీసీకి చెప్పారు.
‘‘పిల్లలను కొనడం చట్టవిరుద్దమని తెలిసి కూడా వారిని తల్లిదండ్రులు కొంటున్నారు’’
మేం గుర్తించిన 14 మందిలో 12 మంది చదువుకున్న వారే. వారిలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు కూడా ఉన్నారు’’ అని ఆయన చెప్పారు.
పిల్లలను అమ్మినవారిపైనే కాదు, కొన్న వారిపైనా జువైపల్ జస్టిస్ బోర్డు యాక్టు ప్రకారం కేసులు పెట్టినట్లు గోవింద్ రెడ్డి బీబీసీకి వివరించారు.

‘5.25 లక్షలు పెట్టి కొన్నాం’
పిల్లలను కొనుక్కున్న తల్లిదండ్రులదీ ఒకొక్కరిది ఒక్కో కథ. వారిలో కొందరితో బీబీసీ మాట్లాడింది.
ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్లకు చెందిన పెరుగు చక్రపాణి, దుర్గలకు పెళ్లయి 30 ఏళ్లు అయ్యింది. కానీ వారికి పిల్లలు పుట్టలేదు.
‘‘నాకు ఒక్కతే కూతురు. వారికి 30 ఏళ్లుగా పిల్లలు లేరు. ఎన్నో ఆసుపత్రుల చుట్టూ తిరిగి తిరిగి ఇంజెక్షన్లు చేయించినా పిల్లలు కలగలేదు. ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి అనురాధ అనే మహిళ ద్వారా బిడ్డను తెచ్చుకున్నాం.
ఇప్పటికీ రెండున్నరేళ్లు అయ్యింది. ఈ మధ్యే లక్షా యాభై వేలు ఖర్చు పెట్టి పుట్టిన రోజు చేశాం. బంగారు గొలుసు చేయించాం.ఇప్పుడు పిల్లను పోలీసులు తీసుకుని వెళ్లిపోయారు. అలా తీసుకుని వెళుతుంటే అమ్మమ్మ.. అమ్మమ్మ అని ఎంతగా ఏడ్చిందో. పాప లేకపోతే నేను నా కూతురు, అల్లుడు చచ్చిపోతాం’’ అంటూ దుర్గ తల్లి విజయలక్ష్మి బీబీసీ వద్ద వాపోయారు.
విజయవాడకు చెందిన దుర్గాప్రసాద్, అరుణ దంపతులు దత్తత తీసుకున్న పత్రాన్ని చూపించారు అరుణ సోదరుడు కోనేటి అఖిల్ తేజ. అందులో ఫరీనా, బాజీ అనే వారి నుంచి మగపిల్లాడిని దత్తత తీసుకున్నట్లుగా ఉంది.
ఈ విషయంపై బీబీసీతో అఖిల్ తేజ మాట్లాడారు.
‘‘మా సోదరికి నాలుగుసార్లు గర్భం వచ్చి పోయింది. ఐదోసారి ఆపరేషన్‌కు వెళుతూ బేబీ లేకపోతే తాను చనిపోతానని ఏడ్చింది. కానీ, ఐదోసారి పాప పుట్టి చనిపోయింది. నర్సింగ్ హోం వాళ్లు వచ్చి బేబీ దత్తత ఇచ్చేవారు ఉన్నారని చెప్పారు.
అలా అనురాధ అనే మహిళ ద్వారా 15 రోజుల బాబును దత్తత తీసుకున్నాం. అందుకు రూ.5.25 లక్షలు కట్టాం. దత్తత తీసుకుంటున్నట్లు నోటరీ చేశాం. 101 రకాల పరీక్షలు చేయించి, ఆరోగ్యంగా ఉన్నాడని తెలిసిన తర్వాతే తీసుకున్నాం. ఇప్పుడు చూస్తే ఆ తల్లిదండ్రులు, పేపర్లు అని ఫేక్ అని పోలీసులు చెబుతున్నారు’’ అని అఖిల్ తేజ అన్నారు.

శిశువిహార్‌లో పిల్లలు ఎలా ఉన్నారంటే..
దత్తత ప్రక్రియ పూర్తి కావడానికి ఏడాది నుంచి రెండేళ్లు పడుతుందని చెప్పారు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఛైర్ పర్సన్ ఎ.ఎంరాజారెడ్డి.
ప్రస్తుతం హైదరాబాద్‌లోని శిశువిహార్‌లో 14 మంది శిశువులను ఉంచి రాష్ట్ర విమెన్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్టుమెంట్ సిబ్బంది ఆలనాపాలనా చూసుకుంటున్నారు.
అక్కడ పరిస్థితిని గమనించి వచ్చారు రాజారెడ్డి.
దీనిపై ఆయన బీబీసీతో మాట్లాడారు.
‘‘పిల్లలందర్నీ అమీర్‌పేట శిశువిహార్‌లో ఉంచాం. అక్కడ వారికి కావాల్సిన పోషకాహారం, కేర్ అందిస్తున్నాం. 24 గంటలు ఆయాలు అందుబాటులో ఉంటారు. మా వద్దకు వచ్చిన వారిలో ఇద్దరు మగ పిల్లలు కాగా.. మిగిలిన 12 మంది ఆడపిల్లలే’’ అని చెప్పారు.
పిల్లలను తిరిగి ఇవ్వడం సాధ్యమేనా?
పిల్లలను తిరిగి అదే తల్లిదండ్రులకు ఇవ్వడం సాధ్యం కాదని చెప్పారు రాజారెడ్డి.
జువైనల్ జస్టిస్ బోర్డు నిబంధనల ప్రకారం దత్తత ప్రక్రియ ఉంటుంది. అంతేతప్ప ఇన్ని రోజులుగా పెంచుతున్నారు కాబట్టి పిల్లలను తిరిగి అదే తల్లిదండ్రులకు దత్తత ఇవ్వడం వీలవ్వదు.
‘‘సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ అథారిటీ వాళ్ల దగ్గర రిజిస్టర్ చేసుకోవాలి. అధికారికంగా దత్తత తీసుకోవడానికి అదొక్కటే మార్గం. అంతేతప్ప ఇన్ని రోజులు పెంచారని తిరిగి ఇవ్వడం కుదరదు. ఇప్పటికే సంవత్సరం నుంచి రెండేళ్లుగా ఎదురుచూస్తున్న వారు కూడా ఉన్నారు. ప్రస్తుతం ఎవరైనా పిల్లలు కావాలంటే కారా వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేసుకుని వాళ్ల వంతు (సీరియల్ నంబరు) వచ్చే వరకు వేచి చూడాలి’’ అని ఆయన చెప్పారు.

‘‘పిల్లలు లేకపోతే చిన్నచూపు చూస్తుంటారు. ఆస్తికి వారసులు ఉండాలని, సమాజంలో గుర్తింపు ఉండాలని.. ఇలా రకరకాల కారణాలతో పిల్లలను దత్తత తీసుకునేందుకు మొగ్గుచూపుతున్నారు’’ అని చెప్పారు హైదరాబాద్‌కు చెందిన కౌన్సిలింగ్ సైకాలజిస్టు డాక్టర్ ఆరె అనిత చెప్పారు.
నిబంధనలకు విరుద్ధంగా దత్తత తీసుకుని పెంచుకుంటున్నప్పటికీ.. తల్లిదండ్రుల వద్ద పెరిగి ఒక్కసారిగా దూరం కావడం వల్ల పిల్లలపై మానసికంగా ప్రభావం పడుతుందని చెప్పారు అనిత.
‘‘తల్లిదండ్రుల నుంచి దూరమైతే ఏదో కోల్పోయామనే భావనలోకి పిల్లలు వెళ్లిపోతుంటారు. తల్లిదండ్రులను మిస్ అవుతున్నామని రెండు, మూడేళ్ల పిల్లలు బయటకు చెప్పలేరు. దానివల్ల అగ్రెసివ్ బిహేవియర్(విపరీత ధోరణి)తో గిల్లడం, కొట్టడం వంటివి చేస్తుంటారు.’’ అని వివరించారు.
అలాంటి పిల్లలను ఎలా చూడాలనే విషయాలను ఆమె వివరించారు.
‘‘పిల్లలను ఒక తల్లి తండ్రి ఉంటే ఎంత అటెన్షన్ ఇస్తారో.. అలా ఇవ్వాలి. ఉయ్యాలలో వేసి వదిలేయకుండా నిరంతరం వారిని చూసుకుంటుండాలి.వారిని దగ్గరకు తీసుకుని ప్రేమగా చూసుకోవాలి. తల్లి ఏవైతే చేసి పెడుతుందో, వాటన్నింటినీ చేయడం ద్వారా తాను కోల్పోయినవి ఇక్కడ దొరుకుతున్నాయనే భావనలోకి తీసుకురావాలి. వారికి కావాల్సిన ఆహార అవసరాలు తీరకపోవడం వల్ల పిల్లలు డిప్రెషన్‌లోకి వెళ్లడం లేదా అగ్రెసివ్ చైల్డ్ కింద తయారయ్యే ప్రమాదం ఉంది’’ అని చెప్పారు అనిత.

శోభారాణి క్లినిక్ మూసివేత
ఈ కేసులో శోభారాణి కుటుంబ సభ్యుల స్పందన తెలుసుకునేందుకు శోభారాణి నడుపుతున్న ఫస్ట్ ఎయిడ్ క్లినిక్ వద్దకు బీబీసీ వెళ్లింది.
పీర్జాదిగూడలో ఒక వీధి లోపల ఆ క్లినిక్ ఉంది. కానీ ప్రస్తుతం అక్కడ క్లినిక్ ఉన్న ఆనవాళ్లు ఏవీ లేవు.
క్లినిక్ షట్టర్ మూసివేసి ఉంది. అదే భవనంలో ఆమె కుటుంబం అద్దెకు ఉండేది.
‘‘ఏడాది కాలంగా ఆమె క్లినిక్ నిర్వహిస్తోంది. ఆమె అరెస్టు అయ్యాక కుటుంబం ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోయింది. క్లినిక్ బోర్డులు కూడా తీసివేశారు’’ అని బీబీసీకి చెప్పారు పక్కనే ఉన్న టైలరింగ్ షాప్ నిర్వాహకులు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














