వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి: కనిపించని ప్రవాహంలో కొట్టుకుపోయిన కెరటం

ysjaganmohanreddy

ఫొటో సోర్స్, facebook/ysjaganmohanreddy

    • రచయిత, అరుణ్ శాండిల్య
    • హోదా, బీబీసీ ప్రతినిధి

జగన్మోహన్ రెడ్డి ఓడిపోయారు. 2019లో ఎంత బలంగానైతే తెలుగుదేశం పార్టీని ఓడించారో, ఇప్పుడు అదే బలమైన ఎదురుదెబ్బను ఎన్డీయే కూటమి నుంచి ఎదుర్కోవాల్సి వచ్చింది.

ఈ సమయంలో ఆయన ముఖ్యమంత్రి అయిన తొలినాళ్లను, ఆయన పాలన సాగిన తీరును ఒక్కసారి అవలోకిద్దాం.

అది 2019 మే 26. జగన్మోహన్‌రెడ్డి ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి సరిగ్గా నాలుగు రోజుల ముందు దిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్‌లో విలేఖరులతో మాట్లాడారు.

పార్టీ పెట్టిన ఎనిమిదేళ్లకే పెద్ద సంఖ్యలో అసెంబ్లీ స్థానాలు సాధించడమే కాకుండా.. 25 ఎంపీ సీట్లలో ఏకంగా 22 గెలుచుకున్న ఆయన, కాబోయే ముఖ్యమంత్రిగా ఏం మాట్లాడుతారు? విభజన తరువాత అనేక ఇబ్బందులలో ఉన్న రాష్ట్రాన్ని ముందుకు నడిపించడానికి కేంద్రంతో ఎలా వ్యవహరించబోతున్నారు? వంటి విషయాలన్నీ చెప్తారని జర్నలిస్టులంతా చెవులు రిక్కించి వింటున్నారు.

అప్పటి చీఫ్ సెక్రటరీ ఎల్‌వీ సుబ్రహ్మణ్యం, సీనియర్ ఐఏఎస్ పీవీ రమేశ్ చెరోవైపు కూర్చుండగా జగన్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వివరించుకుంటూ వెళ్లారు.

ఆ తరువాత జర్నలిస్టులు ప్రశ్నలడగడం ప్రారంభించారు. ప్రత్యేక హోదాపై అడిగిన ప్రశ్నలకు జగన్ తనదైన చిరునవ్వుతో సమాధానమిచ్చారు.

కానీ, ఆ సమాధానం చాలామంది కోరుకున్నట్లుగా లేదు. కారణం...జగన్ అంటే చాలామంది దృష్టిలో సోనియా గాంధీ వంటి బలమైన నేతను ధిక్కరించి ఓదార్పు యాత్ర చేసిన లీడర్.. వద్దన్న కాంగ్రెస్ పార్టీని ఇట్టే విడిచిపెట్టి సొంత పార్టీ పెట్టి ఏపీలో కాంగ్రెస్‌ను కనిపించకుండా చేసిన నాయకుడు.

అలాంటి వారందరికీ ఆ రోజు జగన్‌లో కొత్త మనిషి కనిపించాడు. ఆయన మాటలలో ఆ ధైర్యం, రాష్ట్రం కోసం ఏమైనా చేస్తాను అనే నైజం ఏ కోశానా కనిపించలేదు.

ప్రత్యేక హోదాపై ఆయన సమాధానం చెప్పడం ప్రారంభించారు. ‘‘ఎన్డీయేకు 250 సీట్లు మించకూడదు అని దేవుడిని కోరుకున్నాను. కానీ మన ఖర్మకొద్దీ వాళ్లుకు పూర్తి మెజారిటీ వచ్చింది. ఇప్పుడు మన సహాయం వాళ్లకు అవసరం లేదు. కానీ ముందుముందు ప్రధానిని కలిసిన ప్రతిసారీ ప్రత్యేక హోదా అడుగుతూనే ఉంటాను’’ అని చెప్పారు.

జగన్ సమాధానం విన్నవారంతా ఆయన ప్రత్యేక హోదా విషయంలో కాడి పక్కన పడేశారన్న అభిప్రాయానికి వచ్చారు.

కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వానికి తమ మద్దతు అవసరం లేదు కాబట్టి తాము ఇప్పుడు డిమాండ్ చేసే పొజిషన్‌లో లేమని చెప్తూ ప్రత్యేక హోదా విషయంలో అప్పుడే ఆయన మెత్తబడిపోయారు.

ఆ తరువాత కూడా జగన్ అనేకసార్లు ప్రధాని మోదీని కలిసినప్పటికీ ప్రత్యేక హోదాపై ఒత్తిడి చేసిన దాఖలాలు లేవు.

బీబీసీ వాట్సాప్ చానెల్
వై.ఎస్.జగన్

ఫొటో సోర్స్, facebook/ysjaganmohanreddy

2019లో తిరుగులేని విజయం

వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురించి చెప్పుకొనేటప్పుడు మొదట 2019 ఎన్నికలలో ఆయన సాధించిన తిరుగులేని విజయంతోనే ప్రారంభించాలి.

ఆ ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్‌లోని 175 సీట్లలో 151 సీట్లను సాధించి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నారు జగన్.

ఆ స్థానానికి చేరడానికి ఆయన ఎంతో శ్రమకోర్చారని, ఎన్నో ఒత్తిళ్లను ఒంటరిగా ఎదుర్కొన్నారని ఆయన వెన్నంటి ఉన్నవారు చెప్తుంటారు.

2009 సెప్టెంబరులో తన తండ్రి, అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో మరణించేటప్పటికి జగన్ వయసు 37 ఏళ్లు.

రెండోసారి ముఖ్యమంత్రి పదవి చేపట్టిన కొద్ది నెలలకే ప్రాణాలు కోల్పోయిన తండ్రి వారసత్వాన్ని కొనసాగించడానికి తాను ముఖ్యమంత్రి కావాలనుకున్నారు జగన్మోహన్ రెడ్డి. అప్పటికి ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు.

జగన్‌ను సీఎం చేయాలంటూ అప్పటి కాంగ్రెస్ ఎమ్మెల్యేలలో మెజారిటీ సభ్యులు సంతకాలు చేశారు. అయితే, అప్పటి పరిణామాలపై భిన్న వాదనలు వినిపిస్తుంటారు నాయకులు.

జగన్ తనకు తానుగా సంతకాల సేకరణ చేపట్టలేదని, అప్పటి ఎమ్మెల్యేలలో కొందరు చొరవ తీసుకుని సంతకాలు చేశారని జగన్ సోదరి షర్మిల, కేంద్ర మాజీ మంత్రి సాయిప్రతాప్, పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య వంటివారు వివిధ సందర్భాలలో చెప్పారు.

అదే సమయంలో ‘‘రాజశేఖర్ రెడ్డి శవాన్ని పక్కన పెట్టుకుని జగన్ సీఎం కావాలనుకుని సంతకాలు సేకరించారు’’ అంటూ వి.హనుమంతరావు వంటి కాంగ్రెస్ సీనియర్ నేతలు విమర్శించిన సందర్భాలున్నాయి.

సీఎం కుర్చీ దిశగా అక్కడ ప్రయాణం మొదలుపెట్టిన ఆయన కాంగ్రెస్ నుంచి వేరుపడి సొంత పార్టీ పెట్టుకుని పాదయాత్రగా వచ్చి అనుకున్న లక్ష్యం సాధించుకున్నారు.

ysjaganmohanreddy

ఫొటో సోర్స్, facebook/ysjaganmohanreddy

2009లో ఎలక్షన్ పాలిటిక్స్‌లోకి ఎంట్రీ

జగన్మోహన్ రెడ్డి ఎన్నికల అరంగేట్రం 2009లో కాంగ్రెస్‌తో మొదలైంది. ఆ ఎన్నికలలో జగన్ కడప లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి గెలిచారు.

జగన్ తండ్రి రాజశేఖర్ రెడ్డి కూడా 2009లో రెండోసారి ముఖ్యమంత్రి అయ్యారు. అక్కడికి కొద్ది నెలల్లోనే ఆయన మరణించడంతో జగన్ సీఎం కావాలనుకున్నారు.

కానీ, కాంగ్రెస్ అధిష్టానం మాత్రం కొణిజేటి రోశయ్యను ముఖ్యమంత్రిని చేసింది.

తన తండ్రి మరణాన్ని తట్టుకోలేక రాష్ట్రంలో అనేక మంది మరణించారని, వారి కుటుంబాలను కలిసి ఓదార్చాల్సిన బాధ్యత తనపై ఉందంటూ ఓదార్పు యాత్రను జగన్ చేపట్టగా యాత్రకు అనుమతి లేదని వెంటనే ఆపేయాలని అధిష్టానం సూచించింది.

కానీ, జగన్ అధిష్టానం మాటను కాదని యాత్ర కొనసాగించారు. ఇవన్నీ జగన్‌కు కాంగ్రెస్ అధిష్టానానికి దూరం పెంచాయి.

జగన్ కాంగ్రెస్ నుంచి పూర్తిగా దూరం కావడానికి ఎంతోకాలం పట్టలేదు. 2010 నవంబర్‌లో జగన్ తన తల్లి వైఎస్ విజయమ్మతో కలిసి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు.

అప్పటికి జగన్ కడప ఎంపీగా, విజయమ్మ పులివెందుల ఎమ్మెల్యేగా ఉన్నారు.

కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన సుమారు అయిదు నెలలకు 2011 మార్చి నెలలో జగన్ సొంత పార్టీ ప్రకటించారు.

జగన్‌కు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ నుంచి కొందరు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర నేతలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.

ఉప ఎన్నికలలో జగన్ కడప నుంచి ఎంపీగా, పులివెందుల నుంచి విజయమ్మ ఎమ్మెల్యేగా భారీ ఆధిక్యాలతో గెలిచారు.

వీడియో క్యాప్షన్, వైఎస్ జగన్ వైసీపీ 151 నుంచి 11 స్థానాలకు ఎలా పడిపోయింది? 5 ఏళ్లలో ఏం జరిగింది?
Vijayamma, Jagan

ఫొటో సోర్స్, YSRCP

కొత్త పార్టీ పెట్టిన ఏడాదికే..

కొత్త పార్టీ పెట్టిన ఏడాది కాలానికి జగన్‌ను సీబీఐ అరెస్ట్ చేసింది. తండ్రి రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన అధికారాలను అడ్డంపెట్టుకుని జగన్ అక్రమంగా ఆస్తులు కూడబెట్టారన్నది ఆయనపై ఉన్న ఆరోపణ.

అప్పటికి తెలంగాణ ఉద్యమం తీవ్రంగా సాగుతోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న యూపీఏ ప్రభుత్వం తెలంగాణ ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది.

జగన్మోహన్ రెడ్డి బెయిలుపై బయటకు రాగానే తెలంగాణ ఏర్పాటు కోసం రాష్ట్రాన్ని విభజించడాన్ని వ్యతిరేకిస్తూ 3 రోజుల బంద్‌కు పిలుపునిచ్చారు.

రాష్ట్ర విభజనను నిరసిస్తూ ఎమ్మెల్యే, ఎంపీ పదవులకు రాజీనామా చేశారు విజయమ్మ, జగన్.

అక్కడికి కొద్దిరోజుల్లో జరిగిన 2014 సార్వత్రిక ఎన్నికల్లో జగన్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్‌లోని 175 సీట్లలో 67 చోట్ల విజయం సాధించింది.

ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి సరిపడా బలం సమకూరనప్పటికీ ప్రధాన ప్రతిపక్షంగా నిలిచింది. అంతేకాదు, ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ స్థానాన్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ ఆక్రమించినట్లయింది.

ysjaganmohanreddy

ఫొటో సోర్స్, facebook/ysjaganmohanreddy

పాదయాత్ర....ప్రజలతో మమేకం

కొద్దిరోజులు అసెంబ్లీకి వెళ్లిన తరువాత జగన్ ఇక ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. సొంత జిల్లా కడపలోని ఇడుపులపాయలో ఉన్న తన తండ్రి రాజశేఖర్ రెడ్డి సమాధి నుంచి 2017 నవంబరు 6న జగన్ తన పాదయాత్ర ప్రారంభించారు.

‘అన్న వస్తున్నాడు.. మంచి రోజులొస్తున్నాయి’ అనే నినాదంతో రాష్ట్రంలోని అన్ని జిల్లాల మీదుగా ప్రజలను కలుస్తూ జగన్ చేసిన పాదయాత్రకు మంచి స్పందన వచ్చింది.

ముఖ్యంగా తండ్రి రాజశేఖర్ రెడ్డిలాంటి హావభావాలతో ఆయన పాదయాత్ర పొడవునా అన్ని వర్గాల ప్రజలతో కరచాలనం చేస్తూ, వారితో సెల్ఫీలు దిగుతూ.. చిన్నారులు, వృద్ధులు, మహిళల తలలు నిమురుతూ సాగిపోయారు.

ఇదంతా ప్రజలకు జగన్ తమవాడు అనిపించేలా చేశాయి. 2019 ఎన్నికలకు కొద్ది నెలల ముందు జనవరి 9న శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో జగన్ పాదయాత్ర ముగిసింది.

3,500 కిలోమీటర్లకు పైగా దూరం రాష్ట్రవ్యాప్తంగా జగన్ చేసిన పాదయాత్రలో ప్రజలకు అనేక హామీలిచ్చారు. వేర్వేరు సామాజిక వర్గాలు, కులవృత్తుల వారితో ఆత్మీయ సమావేశాలను నిర్వహించారు. ఆయా సామాజిక వర్గాలకు ప్రత్యేకంగా కార్పొరేషన్లను ఏర్పాటు చేస్తామని, నిధులను కేటాయిస్తామని హామీలిచ్చారు.

తాను సీఎం అయితే అమలు చేస్తానని చెప్పిన నవరత్నాల గురించి ప్రజలకు ప్రతి ఊళ్లో పూసగుచ్చినట్లు వివరించుకుంటూ వెళ్లారు.

పాదయాత్ర ముగింపు సందర్భంగా ఇచ్ఛాపురంలో భారీ బహిరంగ సభ నిర్వహించిన జగన్ ఎన్నికలలో విజయంపై విశ్వాసంతో కనిపించారు.

వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి

ఫొటో సోర్స్, YS Jagan Mohan Reddy/fb

ముఖ్యమంత్రిగా..

37 ఏళ్ల వయసులో ముఖ్యమంత్రి పదవి దిశగా పడిన తొలి అడుగులు పదేళ్ల తరువాత 2019లో అనుకున్న చోటికి చేరాయి.

2019 ఎన్నికలలో జగన్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ 151 సీట్లు సాధించి అధికారాన్ని అందుకుంది. తెలుగుదేశానికి 23, జనసేన పార్టీకి ఒక్క సీటు మాత్రమే వచ్చాయి.

2019 మే 30న జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. తెలుగు రాష్ట్రాల చరిత్రలోనే మునుపెన్నడూ లేనట్లుగా అయిదుగురు ఉప ముఖ్యమంత్రులను నియమించుకున్నారు.

అయితే, ఎంతమంది ఉప ముఖ్యమంత్రులున్నా అంతా తానే అయి జగన్ వ్యవహరించారన్న విమర్శలున్నాయి. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాక సంక్షేమ పథకాల అమలుతో వివిధ వర్గాలను జగన్ ఆకట్టుకోగలిగారు.

ఎన్నికలకు ముందు హామీ ఇచ్చినట్లుగా నవరత్నాల పేరుతో ఆయన సంక్షేమ పథకాలను అమలు చేశారు.

అయితే....మద్య నిషేధం, ప్రత్యేక హోదా వంటి విషయాలలో జగన్ వెనక్కు తగ్గడం విమర్శలకు దారి తీసింది.

జగన్మోహన్ రెడ్డి

ఫొటో సోర్స్, YS Jagan Mohan Reddy/fb

ప్రశంసలు, విమర్శలు

జగన్ అయిదేళ్ల పాలనలో ప్రశంసలు, విమర్శలు రెండూ ఎదుర్కొన్నారు. వలంటీర్ల వ్యవస్థ, గ్రామ-వార్డు సచివాలయాల ఏర్పాటుతో సామాన్య ప్రజలకు గవర్నెన్స్‌ను దగ్గర చేశారు. కానీ, అదే సమయంలో ఈ వ్యవస్థలను పార్టీ ప్రయోజనాలకు వాడుకుంటున్నారన్న విమర్శలూ జగన్ ఎదుర్కోక తప్పలేదు.

అమరావతిని ఏమాత్రం ముందుకు కదిలించకుండా మూడు రాజధానుల కాన్సెప్ట్ తీసుకురావడం కూడా చర్చకు దారితీసింది.

సంక్షేమ పథకాలకు జగన్ పెద్దపీట వేశారన్నది కాదనలేని సత్యం. అయితే, ఇది ఆ పథకాల లబ్ధిదారులలో ఎంత ఆదరణ పెంచిందో ఇతర వర్గాలలో వ్యతిరేకతనూ పెంచింది.

రాష్ట్ర ఖజానాలోని మొత్తం డబ్బంతా సంక్షేమ పథకాలకే జగన్ ఖర్చు చేస్తున్నారని, అభివృద్ధి పనులపై దృష్టి లేదన్న విమర్శలు ఎదురయ్యాయి.

అంతేకాదు.. మునుపెన్నడూ లేనట్లుగా ఉద్యోగుల జీతాలు, రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్లు ప్రతి నెలా వారాల తరబడి ఆలస్యం కావడం కూడా జగన్‌పై ఆ వర్గాలలో అసంతృప్తిని పెంచాయి.

పీఆర్సీ అమలులో జగన్ పిసినారితనం, సీపీఎస్(కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్) రద్దు చేస్తానన్న హామీని నెరవేర్చకపోవడం ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలలో జగన్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకతను పెంచాయి.

ఇవన్నీ ఆయన నేతృత్వంలోని వైసీపీని 151 సీట్ల నుంచి కిందకు దించాయి.

వీటితో పాటు ఎన్నికలకు ముందు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌ను తెలుగుదేశం, జనసేన పార్టీలు జగన్‌కు వ్యతరేకంగా బలంగా ప్రచారంలోకి తేగలిగాయి.

పట్టాదారు పాస్‌పుస్తకాలపై జగన్ ఫోటో ఉండడం, ప్రజల పొలాలు, స్థలాలలో వేసిన సరిహద్దు రాళ్లపైనా జగన్ బొమ్మ చెక్కి ఉండడాన్ని చూపిస్తూ ఇతర పార్టీలు ల్యాండ్ టైటిల్ యాక్ట్‌తో జనానికి నష్టమన్న ప్రచారాన్ని తీవ్రం చేయడం జగన్‌కు నష్టం తప్పలేదు.

జగన్మోహన్ రెడ్డి

ఫొటో సోర్స్, facebook/ysjaganmohanreddy

తెలంగాణ ఎన్నికల తరువాత..

పొరుగు రాష్ట్రం తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల తరువాత జగన్‌కు కొత్త కష్టాలు వచ్చిపడ్డాయి.

అప్పటివరకు తెలంగాణలో రాజకీయం చేసిన తన సోదరి వైఎస్ షర్మిల తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసి ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయం ప్రారంభించారు.

కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలి బాధ్యతలు చేపట్టిన ఆమె, తన పదునైన ప్రసంగాలతో నిత్యం తనపై విమర్శల దాడి చేయడం, బాబాయి వివేకా హత్య కేసును తనకు వ్యతిరేకంగా ప్రచారంలో ఉపయోగించడం వంటివన్నీ జగన్‌కు తలనొప్పులు తెచ్చాయి.

గత ఎన్నికలలో మంచిమెజారిటీతో అధికారం చేపట్టిన జగన్ అయిదేళ్లలోనే ఘోర పరాజయం పొందడంపై సీనియర్ జర్నలిస్ట్ కృష్ణారావు తన అభిప్రాయం పంచుకున్నారు.

బీబీసీ లైవ్ ప్రోగ్రాంలో మాట్లాడిన ఆయన.. ‘‘ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకొచ్చిన కొద్దిరోజుల నుంచే ఆయనలో మార్పు జనానికి అర్థమైంది.. భారీగా వచ్చిన మెజారిటీని సుపరిపాలనపై దృష్టిపెట్టకుండా నెగటివ్‌గా మళ్లించడం వల్ల అప్పటి నుంచే వ్యతిరేకత మొదలైంది. పవన్ వంటి నాయకుల క్యారెక్టర్‌ను దెబ్బతీయడం, రాజధాని విషయంలో నెగటివ్ యాటిట్యూడ్ ఆయనకు నష్టం చేశాయి’’ అన్నారు.

అభివృద్ధి విషయంలో తనకంటూ ఒక మార్క్ ఏపీలో చూపించలేకపోయారని, నిర్మాణాత్మక కార్యక్రమాలు చేయలేకపోయారని, అందుకే ఆయనకు వివేకవంతమైన దృష్టి లేదన్న అభిప్రాయం ప్రజలలో ఏర్పడిందని కృష్ణారావు అన్నారు.

వీడియో క్యాప్షన్, పులివెందుల ప్రజలు వైఎస్ జగన్ గురించి ఏమంటున్నారు?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)