వైసీపీ ఘోర పరాజయానికి ఐదు కారణాలు..

ఫొటో సోర్స్, ysrcpofficial
- రచయిత, జక్కుల బాలయ్య
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఆంధ్రప్రదేశ్ శాసన సభకు జరిగిన 2024 ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పాలైంది. ఓట్ల లెక్కింపు ప్రారంభమైనప్పటి నుంచి తెలుగుదేశం - జనసేన - బీజేపీ కూటమి స్పష్టమైన ఆధిక్యంలో కొనసాగింది.
ఏ దశలోనూ కూటమి ఆధిక్యాన్ని వైసీపీ నిలువరించలేకపోయింది.
ఈ ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వమని ప్రధాన ప్రతిపక్షాలు ప్రతినబూనడం, కూటమిగా పోటీ చేయడం భారీ విజయానికి బాటలు వేసింది.
నవరత్నాల వంటి ఎన్నో సంక్షేమ పథకాలు, నాడు - నేడు వంటి పథకాలతో ఎన్నో కార్యక్రమాలు అమలు చేశామని, వృద్ధులకు పెన్షన్లు ఇంటికే తీసుకెళ్లి ఇస్తున్నామని చెప్పిన వైసీపీ.. అవన్నీ ఓట్ల రూపంలో తిరిగొస్తాయని భావించింది.
కానీ, రాజకీయ వర్గాలను కూడా ఆశ్చర్యానికి గురిచేసేలా ప్రజాతీర్పు అందుకు భిన్నంగా వచ్చింది.
2019 ఎన్నికల్లో ఏకపక్ష విజయంతో అధికార పీఠాన్ని కైవసం చేసుకున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్‌సీపీకి ఐదేళ్లకే ఇలాంటి పరిస్థితి ఎందుకొచ్చింది? గతంలో ప్రధాన ప్రతిపక్షానికి వచ్చినన్ని సీట్లు కూడా పొందలేక వైసీపీ కుప్పకూలిపోవడానికి కారణాలేంటి?

1. ప్రతీకార రాజకీయాలు
2019లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి వైఎస్ జగన్ ప్రభుత్వం అనుసరించిన రాజకీయ కక్షపూరిత విధానాలే ఆ పార్టీ ఘోర ఓటమికి కారణమని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
అధికారం చేపట్టిన కొద్దిరోజులకే ఉండవల్లిలోని ప్రజా వేదికను కూల్చివేయడంతో వైసీపీ ప్రభుత్వ ధోరణి బహిర్గతమైందన్న అభిప్రాయాలు వినిపించాయి.
సొంత పార్టీ ఎంపీ రఘురామ కృష్ణం రాజు అరెస్టు, సీఐడీ కస్టడీలో ఆయన్ను కొట్టించారన్న ఆరోపణల వ్యవహారం చినికిచినికి గాలివానగా మారింది.
ఆయన వైసీపీలోనే ఉంటూ ముఖ్యమంత్రికి వ్యతిరేక వ్యాఖ్యలు, ఫిర్యాదులు చేయడంతో వివాదం మరింత ముదిరింది.
కనీసం అపాయింట్‌మెంట్ ఇచ్చేందుకు కూడా ఇష్టపడని సీఎం జగన్ ధోరణి, ఇగో కారణంగానే ఈ వివాదం తలెత్తిందని ఆయన ఆరోపిస్తూ వచ్చారు.
సోషల్ మీడియాలో పోస్టులపై కేసులు, ప్రతిపక్ష నేతలపై దాడులు వైఎస్ జగన్ ప్రభుత్వంపై నెగెటివ్ ముద్రను వేశాయి.
స్థానిక సంస్థల ఎన్నికల వేళ అప్పటి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌తో వివాదం, నిత్యం కోర్టు మొట్టికాయలతో వైఎస్ జగన్ ప్రభుత్వం జనంలో పలుచన అయిందన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టుతో వైసీపీ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందన్న అభిప్రాయాలు బలపడ్డాయి.

2. రాజధాని ఎక్కడో తెలియని పరిస్థితి
2014లో ఉమ్మడి ఆంధప్రదేశ్ పునర్విభజన అనంతరం అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అప్పటి ప్రభుత్వం ఎంపిక చేసింది. అప్పట్లో ప్రతిపక్ష నేతగా ఉన్న వైఎస్ జగన్ అమరావతికి తాను వ్యతిరేకం కాదని చెప్పుకొచ్చారు. అందుకే తాడేపల్లిలో ఇల్లు కూడా కట్టుకున్నానని బాహాటంగానే చెప్పారు.
అప్పటి ముఖ్యమంత్రికి ఇక్కడ ఇల్లు కూడా లేదని విమర్శలు కూడా చేశారు.
అయితే, అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు రాజధానుల ప్రతిపాదన తెరపైకి తెచ్చారు. అమరావతిని శాసన రాజధానిగా, విశాఖను ఎగ్జిక్యూటివ్ రాజధానిగా, కర్నూలును న్యాయ రాజధానిగా ఏర్పాటు చేస్తామంటూ జగన్ ప్రభుత్వం కొత్త ప్రతిపాదనలు చేసింది.
అమరావతి కోసం ల్యాండ్ పూలింగ్ కింద భూములిచ్చిన రైతులకు సరైన భరోసా కల్పించకపోగా, వారికి ఎలాంటి హామీ ఇచ్చే ప్రయత్నం చేయలేదనే విమర్శలు వచ్చాయి. అది అమరావతి రైతుల రాజధాని ఉద్యమానికి కారణమైంది. వందలాది మంది రైతులు, వారి కుటుంబాలు రోడ్డెక్కి నిరసనలు, ఆందోళనలు చేశారు.
ఈ మూడు రాజధానుల అంశం ఎటూకాకుండా ప్రతిపాదనల దశలోనే ఆగిపోవడం, రాజధాని ఎక్కడో తేలకపోవడంతో ఆంధ్రుల రాజధాని అగమ్యగోచరంగా తయారైందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
రాజధాని ఎక్కడంటే చెప్పుకోలేని దీనస్థితిలో ఉన్నామంటూ సోషల్ మీడియాలో యువత ప్రశ్నించే స్థాయికి అది చేరింది.

3. స్థిరత్వం లేకపోవడం
నవరత్నాల పేరుతో నగదు పంపిణీ పథకాలకే ప్రాధాన్యం ఇచ్చిన వైసీపీ ప్రభుత్వం ఇతర అంశాలకు ప్రాధాన్యం ఇవ్వలేదనే విమర్శలు వచ్చాయి. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, ప్రత్యేక హోదా, ఉద్యోగుల సీపీఎస్ రద్దు వంటి అంశాల్లో మాట నిలబెట్టుకోలేకపోవడం కూడా వైసీపీని దెబ్బతీసిందని విశ్లేషకులు అంటున్నారు.
పోలవరం తమ హయాంలోనే పూర్తి చేస్తామంటూ గంభీరమైన ప్రకటనలు చేసి, చివరకు పోలవరం నిర్మాణం ఎప్పటికి పూర్తవుతుందో చెప్పలేని పరిస్థితిని తీసుకొచ్చింది. రివర్స్ టెండరింగ్ పేరుతో కొంత హడావిడి చేసిన ప్రభుత్వం, కొత్త కాంట్రాక్టర్లకు పనులు అప్పగించింది. ఆ తర్వాత ప్రాజెక్టు పురోగతి గురించి స్పష్టత లేకుండాపోయింది.
ఇక ప్రత్యేక హోదా విషయాన్ని వైసీపీ దాదాపుగా మర్చిపోయిందన్న విమర్శలు వచ్చాయి.
2019 ఎన్నికల ఫలితాల అనంతరం కొద్దిరోజులకే వైసీపీ అధినేత వైఎస్ జగన్ మాట్లాడుతూ, బీజేపీ సొంతంగా మెజార్టీ సాధించడంతో మన అవసరం వారికి లేకుండా పోయిందన్న వ్యాఖ్యలు చేశారు. అలా ప్రత్యేక హోదా అంశం మరుగునపడింది.
వైసీపీ ప్రభుత్వం విమర్శలు ఎదుర్కొన్న మరో అంశం ఉద్యోగుల సీపీఎస్ రద్దు.
కొత్త పెన్షన్ విధానాన్ని రద్దు చేస్తామని 2019 ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారు. కానీ, అధికారంలోకి వచ్చిన తర్వాత అది సాధ్యం కాదన్నారు.
సీపీఎస్‌కి బదులు అందరికీ ఆమోదయోగ్యమైన విధానాన్ని తీసుకొస్తామని చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.
ఇది ప్రభుత్వ ఉద్యోగుల నుంచి తీవ్రమైన వ్యతిరేకతకు కారణమైంది. అలాగే, జీతాలు సకాలంలో ఇవ్వలేకపోవడం కూడా మరో ప్రధాన కారణంగా చెప్పవచ్చు.
అభివృద్ధి విషయంలోనూ వైసీపీ ప్రభుత్వం ఇదే ధోరణి అవలంబించిందని, కొన్ని కంపెనీలు ఏపీని వదిలి వెళ్లిపోతున్నా నివారించే ప్రయత్నం చేయలేదన్న అభిప్రాయాలు బలంగా ఉన్నాయి.
జగన్ ప్రభుత్వ మద్యం విధానం కూడా మద్యం అలవాటు ఉన్నవారి ఆగ్రహానికి కారణమైంది.
విడతలవారీగా మద్యనిషేధం అమలు చేస్తామని తొలుత చెప్పిన వైసీపీ.. ఆ తర్వాత మద్యం షాక్ కొట్టేలా ధరలు పెంచుతామంటూ మాటమార్చిందన్న అపవాదు ఉంది.
మద్యం దుకాణాలను తగ్గిస్తున్న పేరుతో మద్యం దుకాణాలు ప్రభుత్వమే నడపడం, అందులోనూ నాసిరకం మద్యం విక్రయించడం మద్యం తాగేవారి నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది.
కొత్త కొత్త బ్రాండ్ల పేరుతో నాసిరకం మద్యం విక్రయించి ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారన్న విమర్శలు కూడా వచ్చాయి.

ఫొటో సోర్స్, facebook/Sajjala Ramakrishna Reddy
4. సీఎం కోటరీ
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చుట్టూ అధికార కోటరీ ఏర్పడిందన్న విమర్శలున్నాయి. తాడేపల్లి ప్యాలస్‌తో పాటు కొందరి చేతికే అధికారం అప్పగించారని, పాలనలో జగన్ కోటరీ జోక్యం మితిమీరిందన్న అభిప్రాయాలూ ఉన్నాయి.
ఉత్తరాంధ్రకి ఒకరు, రాయలసీమకు ఒకరు, మధ్య ఆంధ్ర ప్రాంతానికి మరొకరు.. ఇలా రాష్ట్రాన్ని ముగ్గురు నేతల చేతుల్లో పెట్టారని, రాష్ట్రంలో ఏ పనైనా వారి కనుసన్నల్లోనే జరుగుతుందన్న వాదనలు బలపడ్డాయి. ఇంత ప్రచారం జరుగుతున్నా, దాని నివారణ చర్యలు మాత్రం శూన్యం.
ప్రభుత్వ సలహాదారుగా నియమితులైన సజ్జల రామకృష్ణా రెడ్డి సకల శాఖల మంత్రిగా మారారని, మంత్రులపై ఆయనే పెత్తనం చేస్తారన్న వాదనలను కూడా పట్టించుకోలేదు. అధికారుల బదిలీల దగ్గరి నుంచి మంత్రి పదవులు కేటాయింపుల వరకూ అన్నింటా ఆయన జోక్యం ఉంటుందన్న విమర్శలు కూడా ఉన్నాయి.
అందుకు తగ్గట్టుగానే, మంత్రులు సైతం జగన్ బాబాయి వైవీ సుబ్బారెడ్డి కాళ్లమీద పడడం వంటివి ఆ వాదనలకు బలం చేకూర్చాయి.
దిల్లీలో, పార్లమెంట్‌లోనూ పార్టీ పార్లమెంటరీ నేత విజయసాయి రెడ్డి, లోక్ సభలో ఫ్లోర్ లీడర్ పీవీ మిథున్ రెడ్డికి తెలియకుండా ఎక్కడికీ వెళ్లకూడదు, ఎవరినీ కలవకూడదన్న అంశాలూ పార్టీలో రెడ్ల పెత్తనం ఎక్కువైపోయిందని, ఇతర సభ్యులకు కనీస గౌరవం కూడా దక్కడం లేదన్న వాదనలకు బలం చేకూర్చాయి.

5. కనీస మౌలిక సదుపాయాలపై దృష్టి పెట్టకపోవడం
నేరుగా నగదు బదిలీ, పరోక్ష నగదు బదిలీ వంటి డబ్బు పంపిణీ పథకాలపైనే దృష్టి పెట్టిన వైసీపీ రోడ్ల వంటి కనీస మౌలిక సదుపాయాలపై దృష్టి పెట్టలేదు.
రోడ్లు ఘోరంగా పాడైపోయిన వీడియోలు సోషల్ మీడియాను ముంచెత్తాయి. రోడ్లు అధ్వానంగా మారడం, చిన్నచిన్న వర్షాలకే రోడ్లు చెరువులుగా మారిపోవడం వంటి సామాన్యులను ఇబ్బందులకు గురిచేశాయి.
ఏపీలో రోడ్లు, ఏపీ సరిహద్దుల్లోని ఇతర రాష్ట్రాల రోడ్లను పోలుస్తూ సోషల్ మీడియాలో విపరీతమై ప్రచారం జరిగినా ప్రభుత్వం పట్టించుకోలేదు. దానికి తోడు కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు 'బువ్వ కావాల్నా, రోడ్డు కావాల్నా', అంటూ చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వ బాధ్యతారాహిత్యాన్ని గుర్తుచేశాయి.
''భారీగా వచ్చిన మెజారిటీతో సుపరిపాలన దిశగా ముందుకు సాగకుండా జగన్‌మోహన్ రెడ్డి నెగెటివ్ యాటిట్యూడ్‌తో ముందుకు పోవడమే ఈ మార్పుకి కారణం. ఒకవర్గానికి వ్యతిరేకంగా దుష్ప్రచారం చేయడం, పవన్ కల్యాణ్ వంటి నేత క్యారెక్టర్‌ను దెబ్బతీసే ప్రయత్నం చేయడం వంటి నెగెటివ్ యాటిట్యూడ్‌తో ముందుకెళ్లారు'' అని సీనియర్ జర్నలిస్ట్ సీహెచ్ కృష్ణారావు బీబీసీతో చెప్పారు.
''ఎంప్లాయిమెంట్ గానీ, ధరల నియంత్రణ వంటివి చేయలేకపోయారు. పోలవరం వంటి నిర్మాణాత్మక చర్యలు తీసుకోలేకపోయారు. ఆయన విధ్వంసక పాలన అలానే కొనసాగింది. అదే ప్రజల విముఖతకు కారణం'' అన్నారాయన.
''వైసీపీలో కనీసం అపాయింట్‌మెంట్ కూడా దొరకడం లేదు. మీరు గ్రౌండ్‌లో ఉన్న నాయకులను కలవడం లేదు. గ్రౌండ్ రియాలిటీ మీ వరకూ రావడం లేదు. మీ ఫీడ్‌బ్యాక్ తప్పుగా వస్తోందని వైసీపీలో ఉన్నప్పుడు చెప్పా'' అని మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ అన్నారు.
''ముఖ్యమంత్రిని ఒక దేవుడిని చేసి, ఆయన చుట్టూ ఒక భజన బృందం చేరింది. టీవీల్లో కనిపించే వైసీపీ ప్రతినిధులు కూడా ఇతరులపై పరుష పదజాలంతో మాట్లాడేవారు. మనం గెలిచిపోతున్నాం, మిగిలిన వాళ్లంతా వర్గ శత్రువులు,పెత్తందారులు అనే అభిప్రాయం కల్పించారు.'' అని ఆయన అన్నారు.
ఈ ఓటమిని ఎలా విశ్లేషిస్తారని అడిగేందుకు వైసీపీ వర్గాలను సంప్రదించేందుకు బీబీసీ ప్రయత్నించింది. కానీ, వారు స్పందించలేదు.
ఇవి కూడా చదవండి:
బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













