జైలులో ఉండి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయవచ్చా? గతంలో అలా ఎప్పుడైనా జరిగిందా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, మార్క్ షేయా
- హోదా, బీబీసీ ప్రతినిధి
హష్-మనీ కేసులో అమెరికా మాజీ అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్‌ను దోషిగా గుర్తిస్తూ న్యూయార్క్‌లోని మన్‌హటన్ న్యాయస్థానం తీర్పు చెప్పింది.
తనతో సెక్స్‌లో పాల్గొన్న విషయం బయటపెట్టకుండా ఉండేందుకు 2016నాటి అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో ఒక పోర్న్‌స్టార్‌కు ట్రంప్ డబ్బులు చెల్లించారని, అయితే ఆ చెల్లింపులను కప్పిపుచ్చేందుకు తన బిజినెస్ లెక్కల్లో తప్పుడు వివరాలు చూపించారని ట్రంప్‌పై అభియోగాలు నమోదయ్యాయి.
మొత్తం 34 అభియోగాల్లో కోర్టు ఆయనను దోషిగాతేల్చింది. అయితే ఆయనకు జైలు శిక్ష పడే అవకాశం లేదని నిపుణులు భావిస్తున్నారు.
మన్‌హటన్ కోర్టు నిర్ణయంపై అప్పీలు చేస్తానని ట్రంప్ ఇప్పటికే ప్రకటించారు. ఈ కేసులో ట్రంప్‌కు జరిమానా విధించే అవకాశం ఉంది.
ఒకవేళ ట్రంప్‌కు జైలు శిక్ష పడినా ఆయన జైలు నుంచే అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చెయ్యవచ్చు. అంతేకాదు జైలు నుంచే అధ్యక్షుడిగా అమెరికాను పాలించవచ్చు.

ఫొటో సోర్స్, REUTERS/Andrew Kelly
అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థికి ఏ అర్హతలు ఉండాలి?
జార్జ్ వాషింగ్టన్ 1789లో అమెరికా అధ్యక్షుడు అయినప్పటి నుంచి అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడానికి సంబంధించిన చట్టపరమైన అర్హతలు, నియమాలలో ఎలాంటి మార్పులు జరగలేదు.
“అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి అమెరికాలో జన్మించి ఉండాలి. ఒక నిర్దిష్ట వయస్సు(35 ఏళ్ల కంటే ఎక్కువ) ఉండాలి. ఒబామా అధ్యక్షుడిగా పోటీ చేసిన సమయంలో ఆయన అమెరికా పౌరుడా కాదా అనే దానిపై చర్చ జరిగింది” అని యూనివర్శిటీ కాలేజ్ లండన్‌లో అమెరికన్ హిస్టరీ మాజీ ప్రొఫెసర్ ఇవాన్ మోర్గాన్ బీబీసీతో చెప్పారు.
అంతర్యుద్ధం తర్వాత, అమెరికాపై తిరుగుబాటులో పాల్గొన్న వ్యక్తులను నిరోధించేందుకు 14 ఏళ్లు అమెరికాలో ఉండాలనే నిబంధన అమలులోకి వచ్చింది.
అయితే డోనల్డ్ ట్రంప్‌కు వ్యతిరేకంగా ఈ నిబంధనను ఉపయోగించే అవకాశం లేదని సుప్రీంకోర్టు ప్రకటించింది.
దోషిగా తేలిన వ్యక్తిని అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయకుండా నిరోధించే నిబంధన కూడా ఏదీ లేదు.
“విప్లవంలో నుంచి అమెరికా పుట్టింది. రాచరికానికి వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొని జైలుశిక్ష అనుభవించిన వారు అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హులవుతారు” అని ప్రొఫెసర్ మోర్గాన్ చెప్పారు.
1787లో అమెరికన్ రాజ్యాంగ సభ సభ్యులలో ఎవరినీ బ్రిటిషర్లు జైలులో పెట్టలేదు. అయితే కొంతమంది జైలుశిక్షకు దగ్గరగా వచ్చారు.
“విప్లవం విజయవంతం కాకపోతే, వారు రాచరికంపై తిరుగుబాటు చేసినట్లుగా ఆరోపించి నేరస్తులుగా ముద్ర వేసి ఉండేవారు” అని మోర్గాన్ తెలిపారు.
''అందుకే అమెరికన్ రాజ్యాంగ రచయితలు అధ్యక్షుడయ్యే అభ్యర్థికి సంబంధించిన అర్హతల విషయంలో ఎక్కువ ఆంక్షలు పెట్టలేదు. దీంతో ముగ్గురు అభ్యర్థులు జైలు నుంచి అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి ప్రచారం చేశారు'' అని చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
జైలు నుంచి పోటీ చేసిన విక్టర్ డెబ్స్
“1920లో జైలు శిక్ష అనుభవిస్తూ అధ్యక్ష అభ్యర్థిగా పోటీ చేశారు యూజీన్ విక్టర్ డెబ్స్” అని ప్రొఫెసర్ మోర్గాన్ చెప్పారు.
డెబ్స్ 1984లో ట్రేడ్ యూనియన్ నాయకుడిగా ఉన్న సమయంలో తొలిసారి జైలుకు వెళ్లారు. రైల్వే కంపెనీకి వ్యతిరేకంగా సమ్మె చేస్తున్న సమయంలో రైలును ఆపినందుకు ఆయనపై కేసు నమోదైంది. ఈ కేసులో కోర్టు ఆయనను దోషిగా తేల్చి జైలు శిక్ష విధించింది.
సమ్మెను సైన్యం అణచివేసింది. డెబ్స్‌కు ఆరు నెలలు జైలుశిక్ష పడింది. ఇది ఆయన రాజకీయ అభిప్రాయాలపై తీవ్ర ప్రభావం చూపింది.
“20వ శతాబ్ధం తొలినాళ్లలో ఆయన సోషలిస్ట్ పార్టీ ఆఫ్ అమెరికాలో కీలక సభ్యుడిగా మారారు. 1904, 1908, 1912, 1920లో ఆయన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేశారు.
1900లో సోషల్ డెమోక్రాటిక్ పార్టీ తరపున డెబ్స్ ఎన్నికల్లో పోటీ చేశారు.
“1912 అధ్యక్ష ఎన్నికల్లో నలుగురు అభ్యర్థులు పోటీ పడ్డారు. డెమోక్రాట్ల తరపున ఉడ్రో విల్సన్, రిపబ్లికన్ల తరపున విలియం హోవార్డ్ టఫ్ట్, ద ప్రోగ్రెసివ్ పార్టీ అభ్యర్థిగా మాజీ అధ్యక్షుడు థియోడర్ రూజ్‌వెల్ట్, డెబ్స్ పోటీ పడ్డారు”
ఆ ఎన్నికల్లో డెబ్స్ గట్టి పోటీ ఇచ్చారు. ఆయనకు దాదాపు పది లక్షల ఓట్లు వచ్చాయి. మొత్తం ఓట్లలో 6శాతం ఓట్లను ఆయన గెలుచుకున్నారు. అధ్యక్ష ఎన్నికల్లో సోషలిస్ట్ పార్టీ అభ్యర్థి ఒకరు అధిక మొత్తంలో ఓట్లు సంపాదించుకున్న సందర్భం అదే.
“అయితే మొదటి ప్రపంచ యుద్ధం అమెరికన్లలో అయోమయాన్ని సృష్టించింది. దేశభక్తి ఆధారంగా ఓట్లు వేయాలా లేక పెట్టుబడుదారులకు వ్యతిరేకంగా ఓటు వేయాలా అని ఓటర్లు ఆలోచించారు” అని ప్రొఫెసర్ మోర్గాన్ చెప్పారు.
డెబ్స్ మొదటి నుంచి యుద్ధానికి వ్యతిరేకంగా ఉన్నారు. అమెరికన్లు యుద్ధంలోకి దిగడాన్ని ఆయన మొదట నుంచి వ్యతిరేకించారు.
“యుద్ధం దాదాపు ముగిసిపోయింది. అయితే 1918లో ఆయన యుద్ధ ముసాయిదాను వ్యతిరేకించాలని అమెరికన్లకు పిలుపిచ్చారు” అని ప్రొఫెసర్ మోర్గాన్ చెప్పారు.
1919 ఏప్రిల్‌లో డెబ్స్ మీద దేశ ద్రోహం నేరం మోపి ఆయనను అట్లాంటాలోని కేంద్ర కారాగారానికి పంపించారు. ఆ ఏడాది అధ్యక్ష ఎన్నికల సమయంలో ఆయన జైలులోనే ఉన్నారు. సోషలిస్ట్ పార్టీ ఆఫ్ అమెరికా ఆయనను తమ అభ్యర్థిగా ప్రకటించింది.
ఆ ఎన్నికల్లో డెబ్స్ 1912లో గెలుచుకున్న దాని కంటే ఎక్కువ ఓట్లు సాధించారు. అయితే మొత్తం ఓట్లలో ఆయనకు 3 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. అప్పటికి అమెరికాలో మహిళలకు ఓటు హక్కు ఇంకా రాలేదు.
అయితే ప్రస్తుతం అమెరికా జైళ్లలో నేరస్తులకు ఉన్న వసతులు అప్పటి అట్లాంటా కేంద్ర కారాగారంలో లేవు. దాని ప్రభావం డెబ్స్‌పై పడింది. జైల్లో ఆయన ఆరోగ్యం దెబ్బ తింది.
మూడేళ్లు జైల్లో ఉన్న తర్వాత ఆయన విడుదలయ్యారు. అయితే ఆయన అనారోగ్యం నుంచి కోలుకోలేదు. 1926లో ఆయన చనిపోయారు.
డెబ్స్ మరణం తర్వాత జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో సోషలిస్టు పార్టీలు ఎన్నడూ ప్రభావం చూపలేకపోయాయి.

ఫొటో సోర్స్, Getty Images
'ఎన్నికల్లో పోటీ చేయడం లిండన్ లౌరూష్‌కు హాబీ'
అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి జైలు నుంచే ప్రచారం నిర్వహించారు లిండన్ లౌరూష్. అధ్యక్ష ఎన్నికల్లో గెలిచేందుకు ఎక్కువసార్లు ప్రయత్నించిన నేతగా ఆయనకు గుర్తింపు ఉంది.
“కొన్నిసార్లు ఆయన డెమోక్రాట్‌గా పోటీ చేసారు. ఎక్కువసార్లు మూడో పార్టీ అభ్యర్థిగా ఉన్నారు. 1976 నుంచి 2008 వరకు ప్రతీ అధ్యక్ష ఎన్నికలోనూ ఆయన పేరు బ్యాలెట్ పేపర్ మీద ఉండేది.
“అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడం ఆయనకు హాబీ” అని ప్రొఫెసర్ మోర్గాన్ చెప్పారు.
1940ల్లో వామపక్ష పార్టీల్లో రాజకీయంగా క్రియాశీలకంగా ఎదిగిన లౌరీష్ 1970ల నాటికి పెట్టుబడిదారుల వైపు వచ్చారు.
“ఆయన డెమోక్రాటిక్, రిపబ్లికన్ వ్యక్తిత్వాల మధ్య ఉన్న లింక్ ఏంటంటే ఆయన చాలా ప్రమాదకరం అని. ఆయనకు విపరీతమైన కుట్ర ఆలోచనలు ఉన్నాయి. క్వీన్ ఎలిజబెత్ ఆయన్ను పొందడానికి సిద్ధంగా ఉన్నారని ఆయన నమ్ముతారు” అని ప్రొఫెసర్ మోర్గాన్ చెప్పారు.
ప్రజల మీద గూఢచర్యం చేయని ప్రభుత్వం, తక్కువ పన్నులు లాంటి ప్రజాకర్షక విధానాలకు తన విచిత్రమైన ప్రపంచ కోణాన్ని జోడించి లౌరీష్ ఒక రాజకీయ ఉద్యమాన్ని నిర్మించారు.
అయితే ఆ ఉద్యమంలో ఎన్నడూ 2 వేల మందికి మించి చేరలేదు అని ప్రొఫెసర్ మోర్గాన్ చెప్పారు.
అయితే 1986లో ఇల్లినాయిస్ రాష్ట్రంలో ఆయన బలపరిచిన డెమోక్రాట్ అభ్యర్థులు విజయం సాధించారు. (వారిలో ఒకరైన జానిస్ ఏ హర్ట్ యుద్ధ ట్యాంకుని వీధుల్లోకి తీసుకొస్తానని బెదిరించారు) అంతే కాకుండా భారీగా నిధులు పోగు చేశారు.
“ఎంత పోగు చేశారో తెలియదు. అయితే అది1600 కోట్ల రూపాయలకు పైన ఉండచ్చు. ఆ సొమ్ముని ఆయన స్థానిక, రాష్ట్ర స్థాయి ఎన్నికల్లో ఖర్చు పెట్టారు. అయితే ఆయనకు పెద్దగా విజయాలు దక్కలేదు” అని ప్రొఫెసర్ మోర్గాన్ చెప్పారు.
1989లో మెయిల్ ఫ్రాడ్ కేసులో ఆయనకు 15 సంవత్సరాలు జైలుశిక్ష పడింది.
“1992 అధ్యక్ష ఎన్నికల విషయానికొస్తే, ఎన్నికల్లో పోటీ చేయాలని లౌరూష్ అనుకున్నారు. కొన్ని రాష్ట్రాల్లో పోటీ చేశారు. అయితే ఆ ఎన్నికల్లో ఆయనకు 27వేల ఓట్లు మాత్రమే వచ్చాయి. అవి మొత్తం ఓట్లలో ఒక్క శాతమే” అని మోర్గాన్ అన్నారు.
లౌరూష్‌కు శిక్ష తగ్గడంతో 1994లో జైలు నుంచి విడుదలయ్యారు. 1996, 2000, 2004, 2008లో కూడా ఆయన అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేశారు.
ఎన్నికల ప్రచారం కోసం నిధులు సేకరించడంలో లౌరూష్‌కున్న సామర్థ్యం, ప్రచారంలో పట్టుదల లాంటివి అధ్యక్ష ఎన్నికల్లో ప్రభావం చూపించలేకపోయాయని ప్రొఫెసర్ మోర్గాన్ అభిప్రాయపడ్డారు.
లిండన్ లౌరూష్ చరిత్రలో చిరు జ్ఞాపకంగా మిగిలిపోయారు. ఆయన 2019లో మరణించారు.

ఫొటో సోర్స్, Getty Images
జోసెఫ్ స్మిత్
మోర్మానిజం వ్యవస్థాపకుడు జోసెఫ్ స్మిత్ 1844లో జైలు నుంచి ప్రచారం చేస్తున్న సమయంలో జరిగిన కాల్పుల్లో మరణించారు.
మోర్మానిజాన్ని ఆయనే స్థాపించారు. ఇది క్రీస్తు కేంద్రంగా ఏర్పాటైన మతం. అయితే విశ్వాసాల విషయంలో ఈ మతానికి కేథలిక్కులు, ప్రొటెస్టెంట్లు సంప్రదాయ చర్చ్‌కు మధ్య తేడాలున్నాయి. ఉద్యమంలో తనకు సన్నిహితంగా ఉన్న వారికి బహు భార్యత్వ పద్దతిని ప్రవేశ పెట్టారు.
“జోసెఫ్ ఉద్యమాన్ని అమెరికా ప్రాథమిక విలువలకు ముప్పుగా చాలా మంది చూశారు. బహు భార్యత్వాన్ని నేరంగా పరిగణించారు. స్మిత్‌కు 20 మంది భార్యలు ఉన్నారనే ఆరోపణలు వచ్చాయి” అని ప్రొఫెసర్ మోర్గాన్ అన్నారు.
జోసెఫ్ స్మిత్ వాస్తవంగా మసాచూసెట్స్‌కు చెందినవారు. అయితే ఆయన కార్యక్రమాలకు, అనుచరులకు సురక్షితమైన ఇంటి కోసం ఇల్లినాయిస్‌కు మారారు.
అక్కడ1840లో మోర్మాన్స్ తమ సొంత నగరాన్ని నిర్మించుకున్నారు. మిసిసిపీ నది ఒడ్డున ఉన్న ‘నౌవూ’ తాము ఉండటానికి, ప్రశాంతంగా ధ్యానం చేసుకోవడానికి అనువైన నగరం అని వారు భావించారు.
స్మిత్ మేయర్‌గా విజయం సాధించిన తర్వాత మోర్మాన్ సైన్యాన్ని సృష్టించారు.
అయితే బహు భార్యత్వం వల్ల ఆయనకు అనేక మంది శత్రువులు తయారయ్యారు.
తనకు వ్యతిరేకంగా వార్తలు రాస్తున్న ఓ పత్రిక కార్యాలయాన్ని ధ్వంసం చేయాలని స్మిత్ తన సైనికులను ఆదేశించారు. దీంతో ఆయనకు శిక్ష విధించి కార్తేజ్‌లోని జైలుకు పంపారు.
1844 అధ్యక్ష ఎన్నికల్లో ఆయన రిఫామ్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఆయన పార్టీ బహుభార్యత్వాన్ని, మనిషి దేవుడనే సిద్ధాంతాన్ని ప్రచారం చేసింది.
ఆయన సిద్ధాంతాలను వ్యతిరేకించే వారి సంఖ్య పెరిగింది. దీంతో కార్తేజ్ జైలు బయట నుంచి పెద్ద గుంపు దాడి చేసింది. ఆ సమయంలో ఆయన జైల్లోనే దాక్కున్నారు. ఆయనతో పాటు దాక్కున్న మరో ఖైదీ ఆయన్ని కాల్చి చంపారు.
స్మిత్ మరణించిన తర్వాత ఆయన స్థానంలో రిఫామ్ పార్టీ మరో అభ్యర్థిని ఎన్నికల్లో పోటికి దింపలేదు.
అమెరికా చరిత్రలో ఇప్పటి వరకు ముగ్గురు నాయకులు జైల్లో ఉండి అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేశారు. ఈ ఏడాది జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రాట్ తరపున పోటీ చేస్తానని ప్రస్తుతం జైల్లో ఉన్న జోసెప్ మల్డోనాడో పాసేజ్ ఇప్పటికే ప్రకటించారు. దీంతో ఈయన జైలు నుంచి అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే నాలుగో వ్యక్తిగా గుర్తింపు పొందుతారు.
తన ప్రత్యర్థి జూ యజమానిని చంపేందుకు కుట్ర పన్నినందుకు, జంతువుల పట్ల క్రూరంగా ప్రవర్తించినందుకు ఆయనకు కోర్టు 20 సంవత్సరాల జైలుశిక్ష విధించింది.
ఇక ట్రంప్ విషయానికికొస్తే ఆయన జైలుకు వెళతారా?. జైలు నుంచి అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తారా అనేది కాలమే నిర్ణయిస్తుంది.
ఇవి కూాాడా చదవండి:
- ఏసీ పేలి ఇల్లంతా కాలిపోయింది.. అసలు ఏసీ ఎందుకు పేలుతుంది.. పేలకుండా ఏం చేయాలి?
- గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి: కొత్తగా తీసిన పాత కథ.. విశ్వక్సేన్ నటన మెప్పించిందా?
- స్కూటీ అంటే అమ్మాయి, బైక్ అంటే అబ్బాయి...హైదరాబాద్‌లో పిల్లల విక్రయ ముఠా గుట్టు ఎలా బయటపడిందంటే...
- ‘ఒక కూతురు నుంచి ఇలాంటి మాటలు వినడం అసాధారణంగా అనిపిస్తుంది...’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














