అమెరికా ఎన్నికలు 2020: 'డోనల్డ్ ట్రంప్ లాంటి ఓ అన్నయ్య మాకు కావాలి'

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ఆండ్రియాస్ ఇల్‌మెర్
- హోదా, బీబీసీ ప్రతినిధి
డోనాల్డ్ ట్రంప్ అంతర్జాతీయంగా మద్దతు పొందిన అమెరికా అధ్యక్షుడు కాలేకపోయారు. 'అమెరికా ఫస్ట్' అనే జాతీయ విధానంతో ఆయన సగం ప్రపంచాన్ని బహిరంగంగానే అవమానించారు.
ఐరోపా నేతలను బలహీనులుగా, మెక్సికన్లను రేపిస్టులుగా వర్ణించడమే కాదు, మొత్తం ఆఫ్రికా ఖండాన్నే పక్కకుపెట్టేశారు.
కానీ, అమెరికాలాగే.. చైనాను తమ శత్రువుగా భావిస్తున్న కొన్ని ఆగ్నేయాసియా దేశాలు ఇప్పటికీ ఆయనకు అండగా ఉండాలని, మద్దతుగా నిలవాలని కోరుకుంటున్నాయి.

ఫొటో సోర్స్, EPA
హాంకాంగ్: కమ్యూనిస్ట్ పార్టీని ఎదుర్కొనే 'ఒకే ఒక్కడు'
భారీ ప్రజాస్వామ్య అనుకూల, చైనా వ్యతిరేక నిరసనల నేపథ్యంలో హాంకాంగ్.. చైనా నుంచి తీవ్ర అణచివేతను ఎదుర్కొంది.
వేర్పాటువాదులుగా, బీజింగ్ పాలనకు వ్యతిరేకంగా కనిపించిన అందరినీ శిక్షించడానికి హాంకాంగ్‌లో కొత్త భద్రతా చట్టాన్ని కూడా అమలు చేశారు.
"నాలుగేళ్ల క్రితం డోనల్డ్ ట్రంప్ ఎన్నికైనప్పుడు అమెరికాకు అసలు ఏమైంది అనుకున్నా. నేను ఎప్పుడూ డెమాక్రట్లకు మద్దతిచ్చేదాన్ని. అయితే, ఇప్పుడు నేను మిగతా హాంకాంగ్ నిరసనకారుల్లాగే ట్రంప్‌కు మద్దతిస్తున్నాను" అన్నారు ఎరికా యూన్.
చైనా కమ్యూనిస్ట్ పార్టీని బలంగా ఎదుర్కోగల అమెరికా అధ్యక్షుడికే తాము మద్దతిస్తామని, హాంకాంగ్‌లో నిరసనకారుల ఆశ అదేనని కార్యకర్త, వ్యాపారవేత్త ఎరికా చెప్పారు.
చైనాతో మాటల యుద్ధానికి దిగుతూ, ముఖ్యంగా హాంకాంగ్‌కు సంబంధించి అమెరికా అధ్యక్షుడు చేస్తున్న వ్యాఖ్యలు వారి ఆశలను సజీవంగా ఉంచుతున్నాయి.
హాంకాంగ్ ప్రత్యేక హోదాను కొనసాగించేలా ట్రంప్ పాలనలో కాంగ్రెస్ ఒక చట్టాన్ని ఆమోదించింది.
హాంకాంగ్‌కు స్వయం ప్రతిపత్తి అనేదే లేకుండా పోయిందని భావించిన అమెరికా ఈ చట్టం ద్వారా దానికి అత్యుత్తమ ఆర్థిక సాయాన్ని అందింస్తుంది.
హాంకాంగ్, చైనాకు చెందిన చీఫ్ ఎగ్జిక్యూటివ్ కారీ లామ్, మరో పది మంది ఉన్నతాధికారులపై అమెకితా ఆంక్షలు కూడా విధించింది.
ట్రంప్ ప్రత్యర్థి జో బైడెన్ కూడా హాంకాంగ్‌కు వ్యతిరేకంగా చర్యలు చేపట్టిన చైనాను శిక్షిస్తామని మాట ఇచ్చారు. చైనా అధినేత షీ జిన్‌పింగ్‌ను 'దోపిడిదొంగ'గా వర్ణించారు.
కానీ, ట్రంప్ ప్రస్తుత ప్రభుత్వం మాత్రమే సీసీపీ ప్రపంచానికే ముప్పు అని ఆలోచించిందని యూన్ చెప్పారు.
"ఒబామా, క్లింటన్ పాలనలో వారికి అలా ఎందుకు అనిపించలేదో నాకు తెలీదు. వాళ్లు మరీ అమాయకులు, సీసీపీ ప్రజాస్వామ్య మార్గాన్ని ఎంచుకుని ఒక ఆధునిక సమాజంగా మారుతుందని అనుకున్నారు. కానీ అది నిరూపితం కాలేద"ని ఆమె అన్నారు.

ఫొటో సోర్స్, Reuters
వాషింగ్టన్ బీజింగ్ మధ్య ఘర్షణల ఆర్థిక పరిణామాలతో హాంకాంగ్‌కు ప్రమాదం ఉంటుందనే విషయం ఆమెకు తెలుసు.
"హాంకాంగ్‌కు దెబ్బ తగలకుండా సీసీపీని దెబ్బ కొట్టడం కుదరదు. కానీ ఎలాంటి స్వల్ప కాలిక బాధలనైనా భరించడానికి, త్యాగాలకు మేం సిద్ధంగా ఉన్నాం" అని ఆమె అంటున్నారు.
హాంకాంగ్‌లో చాలా మంది కార్యకర్తలు, ముఖ్యంగా యువత ఓపీనియన్ పోల్‌లో తమ అభిప్రాయాలు పంచుకున్నారని, అందులో ట్రంప్ పాలనపై మిశ్రమ స్పందన వ్యక్తమైందని ఆమె చెప్పారు.
"ఇటీవల జరిగిన సర్వేలో దాదాపు సగం మంది ఆయనకు పూర్ రేటింగ్ ఇచ్చారు. అమెరికాలో కరోనాను నియంత్రించలేకపోవడం వల్ల ఆయన ప్రతిష్ఠ దెబ్బతిందని చాలా మంది అనుకున్నారు"

ఫొటో సోర్స్, Reuters
తైవాన్: మాకు ఆధారంగా నిలిచే మా అన్నయ్య
చైనా, తైవాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. 1940లో అంతర్యుద్ధం సమయంలో రెండూ విడిపోయాయి.
కానీ, అవసరమైతే బలవంతంగా అయినా దానిని తిరిగి సొంతం చేసుకోవాలని చైనా భావిస్తోంది. అమెరికా మాత్రం రెండు దేశాల విభజనకు సంబంధించి ఏ తీర్మానం అయినా శాంతియుతంగా ఉండాలని చెబుతోంది.
చైనాపై ట్రంప్ విధించిన వాణిజ్య సుంకాలు, ఆంక్షలు కూడా తైవాన్‌లో కొందరిని ఆకట్టుకున్నాయి.
"డోనల్డ్ ట్రంప్ వైఖరి మాకు మంచిదే. అలాంటి ఒక మిత్రుడు ఉండడం మంచిదే. విదేశీ వ్యవహారాలు, సైన్యం, వాణిజ్యం విషయంలో అది మాకు మరింత ఆత్మవిశ్వాసం అందిస్తుంది. మాకొక అన్నయ్య ఉన్నాడు. మేం ఆయనపై ఆధారపడవచ్చ"ని ఈ-కామర్స్ లో పనిచేసే విక్టర్ లిన్ బీబీసీతో అన్నారు.
ట్రంప్ తైవాన్ దిశగా చేయందిస్తున్నారు. ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందానికి తుది రూపం ఇచ్చే దిశగా రెండు దేశాలూ గత కొన్ని నెలలుగా చర్యలు చేపట్టాయి.
చైనాపై ఎక్కువ ఆధారపడకుండా తైవాన్‌కు సాయం చేసేందుకు అమెరికాతో జరిగే ఈ వాణిజ్య ఒప్పందం ఉపయోగపడుతుందని లిన్ భావిస్తున్నారు.
"బహుశా, ఇది తైవాన్‌లోని పెద్ద కంపెనీలను అమరికాలో పరిశ్రమలు ఏర్పాటు చేయాలని ఆహ్వానించేవరకూ వెళ్లచ్చు" అంటున్నారు.
చైనా 'రెచ్చగొట్టే చర్యలపై' బైడెన్ తగిన చర్యలు తీసుకోకపోవచ్చని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. చైనాతో చర్చలకు అనుకూలంగా ఉండే నేతగా బైడెన్‌కు పేరుంది.
ఇటీవల ఆయన తన స్వరం మార్చినా, చైనా ఎప్పుడు ఆక్రమణకు పాల్పడుతుందేమోనని ఆందోళనలో ఉన్న చాలామంది తైవాన్ ప్రజలకు అది వినిపించలేదు.
సైనికపరంగా మద్దతిచ్చేందుకు ట్రంప్ చేపట్టిన చర్యలు కూడా తైవాన్‌లో ఆయనకు మద్దతు పెంచాయి.
నిజానికి బైడెన్ విజయం కోరుకునేవారికంటే, ట్రంప్ మరోసారి గెలవాలని కోరుకునేవారు బలంగా ఉన్న దేశం తైవాన్ మాత్రమేనని ఇటీవలి సర్వేలో తేలింది.
రెండు దేశాల బంధంపై, చైనా ఘాటుగా స్పందించింది. చైనా-అమెరికా సంబంధాలకు తీవ్ర నష్టం జరగకుండా ఉండాలంటే, తైవాన్ స్వతంత్రం గురించి తప్పుడు సంకేతాలు పంపించవద్దని అమెరికాను అది హెచ్చరించింది.

ఫొటో సోర్స్, Getty Images
వియత్నాం: ధైర్యంగా ఉండాలంటే అండ కావాలి
అమెరికా - చైనా రెండూ వియత్నాం భూభాగంలో గత 50 ఏళ్లుగా యుద్ధాలు చేశాయి. కానీ, అమెరికాను చాలావరకూ క్షమించేసిన ఆ దేశాన్ని ఇప్పుడు ఎక్కువగా భయపెడుతున్న ఆగ్నేయాసియా దేశం చైనా.
వియత్నాంలో ట్రంప్ అభిమానులు రెండు గ్రూపులుగా ఉన్నారని రాజకీయ విశ్లేషకులు వ్లాగర్ లిన్ న్వెన్ చెబుతున్నారు.
కొందరు ఎంటర్‌టైన్‌మెంట్, గ్లామర్ కోసం ఆయన్ను ఇష్టపడితే, అమెరికా రాజకీయాలను గమనించే మిగతావారు హాంకాంగ్, తైవాన్‌లో లాగే ట్రంప్‌కు బలమైన మద్దతుదారులుగా నిలిచారు.
చైనా, తైవాన్ కమ్యూనిస్ట్ ప్రభుత్వాల మధ్య ఆయన ఒక బలమైన గోడలా నిలుస్తారని ఆ దేశ ప్రజలు భావిస్తున్నారు.
వియత్నాం వ్యూహం గురించి ట్రంప్, బైడెన్ ఎవరూ ఇంకా వివరించలేదు. ఇతర దేశాల ఘర్షణలు, వివాదాల్లో జోక్యం చేసుకోడానికి తొందరపడనని ట్రంప్ చాలా స్పష్టంగా చెప్పారు.
కానీ, ధైర్యంగా, నిర్లక్ష్యంగా, దూకుడుగా ఉండే ట్రంప్ వైఖరి ఆయన్ను మిగతా అమెరికా అధ్యక్షుల కంటే భిన్నంగా నిలిపిందని, చైనాను ఎదుర్కోవాలంటే అలాంటి వారు అవసరమని న్వెన్ లాంటి రాజకీయ కార్యకర్తలు అంటున్నారు.
"డోనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చినపుడు చైనా ప్రమాదాల నుంచి, దాని కమ్యూనిస్ట్ పెట్టుబడిదారీ విధానం నుంచి ప్రపంచం మొత్తం మేల్కొన్నట్లు తనకు అనిపించిందని" న్వెన్ చెప్పారు
కానీ, వియత్నాంలో కమ్యూనిస్టుల ఏకపక్ష పాలనకు అతీతంగా రాజకీయ, ఆర్థిక సంస్కరణలు కూడా జరగాలనే కోరికలు ఉన్నాయి.
సీసీపీకి వ్యతిరేకంగా దృఢమైన అమెరికా వైఖరి మొత్తం ఆ ప్రాంతమంతటా ప్రభావం చూపిస్తుందని, చివరికి అది తమ రాజధాని హనోయ్‌ను కూడా చేరుతుందని ఆయన ఆశిస్తున్నారు.

ఫొటో సోర్స్, Reuters
జపాన్: మా దేశ భద్రతే మాకు ముఖ్యం
జపాన్‌ను చాలా కాలంగా అమెరికాకు ఒక విలువైన భాగస్వామిగా, మిత్రుడుగా భావిస్తున్నారు.
కానీ, ట్రంప్ మొదట ఎన్నికైనప్పుడు, ఆయన 'అమెరికా ఫస్ట్' పాలసీతో తమ సంబంధాలపై పడిన ప్రభావం గురించి జనం ఆందోళనకు గురయ్యారు.
ఆయన అధికారంలోకి రాగానే 'ట్రాన్స్-పసిఫిక్' వాణిజ్య ఒప్పందాన్ని రద్దు చేశారు. ఆ దేశంలోని అమెరికా దళాలకు సాయంగా ఎక్కువ మొత్తం చెల్లించాలని పట్టుబట్టారు.

ఫొటో సోర్స్, Andreas Illmer
"డోనాల్డ్ ట్రంప్ మా మిత్రుడు. జపాన్‌లో మేం ఆయనకు మద్దతివ్వడానికి అతిపెద్ద కారణం మా దేశ భద్రతే" అని యోకో ఇషి అన్నారు. ఆమె ఒక యూట్యూబర్. వ్లాగ్స్ పెడుతుంటారు.
జపాన్ గగనతలం, జలాల్లోకి తరచూ చైనా యుద్ధ విమానాలు, నౌకలు రావడం గురించి ఆమె చెప్పారు. రెండు దేశాల మధ్య వివాదానికి వివాదిత డియాయూ దీవులు కేంద్రంగా నిలిచాయి.
"మేం అమెరికా నుంచి చైనాతో దూకుడుగా పోరాడగల ఒక నేతను కోరుకుంటున్నాం. ట్రంప్ మినహా, దాపరికం లేకుండా మాట్లాడే, అంత బలమైన నేత ఎవరైనా ఉంటారని నాకు అనిపించడం లేదు" అన్నారు.
చైనాకు వ్యతిరేకంగా అమెరికా మద్దతు కోసం చూస్తున్న మిగతా ఆసియా దేశాల పాక్షిక కూటమిలో ఆమె జపాన్‌ను కూడా చూస్తున్నారు.
ట్రంప్ అధ్యక్షుడు కావాలని ఆమె బలంగా కోరుకుంటున్నా, ఇషి లాంటి మద్దతుదారులు జపాన్‌లో మైనారిటీలుగా ఉన్నారు. సాధారణంగా మెజారిటీల్లో అమెరికాపై సానుకూల దృక్పథం మాత్రమే ఉంది. జపనీయుల్లో నాలుగో వంతు మాత్రమే అధ్యక్షుడు ట్రంప్‌పై తమ విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.
మిగతా ఆసియా దేశాలకు భిన్నంగా జపాన్‌లో చాలా మంది జో బైడెన్‌పై ఆశలు పెట్టుకున్నారు. ట్రంప్‌లా కాకుండా, ఆయన తన మిత్రులకు దగ్గరవుతారని, తిరిగి ట్రాన్స్-పసిఫిక్ భాగస్వామ్య ప్రక్రియలోకి వస్తారని, ఆర్థికంగా, సైనికపరంగా జపాన్‌కు సన్నిహితంగా ఉంటారని వారు భావిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
- ప్రపంచంలో విదేశాలపై ఆధారపడని ఏకైక ‘దేశం’ ఇదేనా?
- పాకిస్తాన్: నిన్నటి దాకా అక్కా చెల్లెళ్లు... ఇప్పుడు అన్నాతమ్ముళ్లు
- మహిళల శరీరాలు ఎప్పుడంటే అప్పుడు సెక్స్‌కు సిద్ధంగా ఉంటాయా?
- సిబ్బంది బాగోగులు చూడటం భారతదేశంలో ఒక వ్యాపారంగా మారనుందా?
- కరోనావైరస్ - రంగస్థల కళాకారులు: "నాటకాలు వేయకపోతే మేం శవాలతో సమానం"
- యూరప్ అణు కేంద్రంలో నటరాజ విగ్రహం ఎందుకుంది, సోషల్ మీడియా దాని గురించి ఏమంటోంది?
- ఇల్లు, ఫర్నీచర్ అమ్మేసి ఓ వ్యాన్ కొనుక్కున్నారు... ఇప్పుడు ఆ వ్యానే వారి ఇల్లు
- టైటానిక్ ప్రమాదంలో 700 మంది ప్రాణాలను ఆ రేడియో ఎలా కాపాడిందంటే...
- ఘోస్ట్ ఐలాండ్: 'మానవజాతి అంతమైపోయాక భూమి ఇలాగే ఉండొచ్చు'
- వీరప్పన్ కేసుల్లో 31 ఏళ్లుగా శిక్ష అనుభవిస్తున్నవారి కథేమిటి.. గంధపు చెక్కల స్మగ్లర్ నేరాల్లో వారి పాత్రేమిటి
- చైనా టిబెట్ ఆక్రమణకు 70 ఏళ్లు: అసలు హిమాలయాల్లో ఘర్షణ ఎందుకు మొదలైంది?
- ప్రపంచంలో అత్యంత అరుదైన కోతుల్ని కాపాడిన ఒక చిన్న ఐడియా
- ఇంగువ.. అనాదిగా భారతీయ వంటల్లో భాగం.. కానీ నేటివరకూ భారతదేశంలో పండలేదు...
- ‘బందిపోటు’ పోలీసులు.. హత్యలు, దోపిడీలతో చెలరేగిపోతున్నారు
- బెంగళూరులో పది లక్షల బావులు ఎందుకు తవ్వుతున్నారు?
- కరోనావైరస్: ప్రధాని మోదీ భారత్‌లో కోవిడ్ పరిస్థితిపై చెప్పిందంతా నిజమేనా? - BBC FactCheck
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








