ఆంధ్రప్రదేశ్‌లో గెలిచేదెవరు, ఎగ్జిట్ పోల్స్ ఏం చెబుతున్నాయి?

ఫొటో సోర్స్, FACEBOOK/TDP/JANASENA/YSRCP
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ వివరాలను పలు సంస్థలు విడుదల చేశాయి.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి గెలుస్తుందని పీపుల్స్ పల్స్ సంస్థ అంచనా వేసింది.
అయితే, ఈసారి కూడా అధికార వైసీపీ మరోసారి గెలుస్తుందని ఆరా సంస్థ చెబుతోంది.
175 అసెంబ్లీ నియోజక వర్గాలు ఉన్న ఏపీలో టీడీపీ సొంతంగా 95 నుంచి 110 స్థానాలు గెలిచే అవకాశం ఉన్నట్టు పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ తన పోస్ట్ పోల్ సర్వేలో వెల్లడించింది.
బీబీసీ న్యూస్ తెలుగు అందించే ఆసక్తికర కథనాలు ఇకపై నేరుగా మీ వాట్సాప్‌లో చూడండి. మా వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఈ లింక్‌పై క్లిక్ చేయండి.

ఫొటో సోర్స్, People's pulse
టీడీపీ కూటమికి 111 నుంచి 135 స్థానాలు రావొచ్చని ఈ సంస్థ సర్వే చెబుతోంది.
వైసీపీ 45 నుంచి 60 స్థానాల వరకు గెలిచే అవకాశం ఉన్నట్టు ఈ సర్వే పేర్కొంటోంది.
2024 సాధారణ ఎన్నికలకు ముందు తెలంగాణకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పీపుల్స్ పల్స్ సంస్థ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని అంచనా వేసింది.
ఈ సంస్థ అంచనాలకు తగ్గట్టు కాంగ్రెస్ పార్టీ గెలిచి, తెలంగాణలో అధికారంలోకి వచ్చింది.
ఇక తెలంగాణలో 17 పార్లమెంట్ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో, కాంగ్రెస్ 7 నుంచి 9 సీట్లు, బీజేపీ 6 నుంచి 8 సీట్లు, బీఆర్ఎస్ 0 నుంచి 1, ఎంఐఎం 1 సీటు గెలిచే అవకాశాలు ఉన్నాయని పీపుల్స్ పల్స్ సంస్థ అంచనా వేసింది.


ఫొటో సోర్స్, AARAA
ఆరా ఎగ్జిట్ పోల్ ఏం చెబుతోంది?
ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైసీపీ మరోసారి గెలుస్తుందని ఆరా సంస్థ నిర్వహించిన సర్వే అంచనా వేసింది.
వైసీపీకి 94 - 104 సీట్లు, టీడీపీ కూటమికి 71 నుంచి 81 సీట్లు వస్తాయని ఈ సంస్థ అంచనా వేసింది.
వైసీపీకి 49.41 శాతం, టీడీపీ కూటమికి 47.55 శాతం ఓట్లు వస్తాయని పేర్కొంది.
ఇక ఏపీలో లోక్‌సభ సీట్ల విషయానికొస్తే వైసీపీకి 13 నుంచి 15 సీట్లు, టీడీపీ కూటమికి 10 నుంచి 12 సీట్లు రావొచ్చని ఆరా తన సర్వే రిపోర్ట్‌లో పేర్కొంది.

ఫొటో సోర్స్, Chanakya X
చాణక్య ఎక్స్ ఎగ్జిట్ పోల్
ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ కూటమి అధికారం చేపడుతుందని చాణక్య ఎక్స్ అనే సంస్థ చెబుతోంది.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ కూటమి 78 స్థానాల్లో గెలుస్తుందని, 31 స్థానాల్లో గెలిచే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని, మొత్తంగా 109 స్థానాల్లో గెలిచే అవకాశాలు ఉన్నాయని చాణక్య ఎక్స్ సర్వే పేర్కొంది.
ఇక వైసీపీ 32 స్థానాల్లో గెలుస్తుందని, 15 స్థానాల్లో గెలిచే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని పేర్కొంటోంది. మొత్తంగా వైసీపీ 47 స్థానాల్లో గెలిచే అవకాశాలు ఉన్నాయని ఈ సంస్థ అంచనా వేసింది.
19 స్థానాల్లో పోటా పోటీ ఉండొచ్చని చెబుతోంది.
ఇక పార్లమెంట్ సీట్లలో టీడీపీ కూటమికి 18, వైసీపీకి 7 స్థానాలు రావొచ్చని అంటోంది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
పార్థ దాస్ అంచనాలు
వైసీపీకే అధిక సీట్లు వస్తాయని పార్థ దాస్ అంచనా వేశారు.
పార్థ దాస్ అంచనా ప్రకారం వైసీపీ 110 నుంచి 120 స్థానాల్లో, టీడీపీ కూటమి 55 నుంచి 65 స్థానాల్లో గెలుస్తుంది.
మహిళా ఓటర్లు వైసీపీకి ఓటేయగా.. పురుషులు టీడీపీ కూటమికి ఓటేసినట్లు పార్థ దాస్ పేర్కొన్నారు.
ఓటు షేరులో వైసీపీకి 50 శాతం, టీడీపీ కూటమికి 46 శాతం, కాంగ్రెస్ కూటమికి 2.5 శాతం, ఇతరులకు 1.5 శాతం వస్తుందని అంచనా వేశారు.

కూటమిగా టీడీపీ, జనసేన-బీజేపీ; ఒంటరిగా వైసీపీ పోటీ
మే 13న ఆంధ్రప్రదేశ్‌లో పోలింగ్ జరిగింది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా 81.86 శాతం పోలింగ్ నమోదైందని ఎన్నికల సంఘం వెల్లడించింది.
ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాలు, 25 లోక్‌సభ నియోజక వర్గాలు ఉన్నాయి.
సుమారు 4 కోట్ల 14 లక్షల మంది ఓటర్లు ఉండగా, 46 వేల 389 కేంద్రాల్లో పోలింగ్ జరిగింది. సుమారు 3,33,40,333 మంది ఓటు వేశారు. అంటే 80.66 శాతం ఓటింగ్ నమోదైంది. ఇది కాకుండా పోస్టల్ బ్యాలెట్, హోం ఓటింగ్ కలిపితే పోలింగ్ 81.86 శాతానికి పెరిగింది.

ఫొటో సోర్స్, INCTELANGANA/FACEBOOK
ఈ ఎన్నికలలో వైసీపీ ఒంటరిగా పోటీచేయగా.. గత ఎన్నికలలో వేర్వేరుగా పోటీ చేసిన బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీలు ఈసారి కూటమిగా బరిలోకి దిగాయి.
వైసీపీ 175 సీట్లలో పోటీ చేయగా.. ఎన్డీయే కూటమిలోని తెలుగుదేశం పార్టీ 144, జనసేన 21, బీజేపీ 10 అసెంబ్లీ సీట్లలో పోటీ చేశాయి.
మరో కూటమి ‘ఇండియా’లో భాగంగా కాంగ్రెస్ పార్టీ 159 సీట్లు, సీపీఎం 8, సీపీఐ 8 సీట్లలో పోటీ చేశాయి.
అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తమైంది. వాటిని స్ట్రాంగ్ రూముల్లో సీల్ చేసి భద్రంగా ఉంచారు. ఈ నెల 4వ తేదీన ఓట్ల లెక్కింపు జరగనుంది.
జూన్ 4న ఏపీ ఫలితాలు ప్రకటిస్తామని ఎన్నికల సంఘం చెప్పింది. ఓట్ల లెక్కింపు కోసం కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకుంది ఎన్నికల సంఘం.

ఫొటో సోర్స్, FACEBOOK
ఈ నాయకులపైనే అందరి దృష్టి
ప్రధాన పార్టీల నేతల్లో చాలావరకు గత ఎన్నికలలో పోటీ చేసిన స్థానాలలోనే ఈసారి కూడా పోటీ పడ్డారు.
వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పులివెందుల నుంచి పోటీ చేశారు. తన సొంత నియోజకవర్గంలోని భాకారపురంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇక్కడ టీడీపీ నుంచి మారెడ్డి రవింద్రనాథ్ రెడ్డి బరిలో ఉన్నారు.
కుప్పం అసెంబ్లీ నియోజకర్గం నుంచి టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు పోటీలో ఉన్నారు. వరుసగా తొమ్మిదోసారి ఆయన కుప్పం నుంచి బరిలో దిగారు.
ఆయనకు ప్రత్యర్థిగా ఎమ్మెల్సీగా ఉన్న భరత్‌ను తొలిసారి వైసీపీ పోటీలో దింపింది. దాంతో కుప్పం ఆసక్తికరంగా మారింది.
మంగళగిరి నుంచి టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పోటీ చేశారు. మంగళగిరిలో వైసీపీ తరఫున మురుగుడు లావణ్య పోటీలో ఉన్నారు.
పవన్ కళ్యాణ్ ఈసారి పిఠాపురం నుంచి పోటీ చేశారు. గత ఎన్నికల్లో గాజువాక నుంచి పోటీ చేసిన ఆయన గెలవలేదు. పవన్ కళ్యాణ్ ఈసారి పిఠాపురం నుంచి బరిలోకి దిగారు. సీనియర్ నాయకురాలు వంగా గీత ఇక్కడి నుంచి వైసీపీ తరపున పోటీలో ఉన్నారు.
బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురందేశ్వరి ఈసారి నియోజకవర్గం మారారు. గత ఎన్నికలలో రాజంపేట నుంచి పోటీ చేసి ఓటమి పాలైన ఆమె ఈసారి టీడీపీ, జనసేనల మద్దతుతో రాజమండ్రి పార్లమెంటు స్థానం నుంచి పోటీకి దిగారు. ఇక్కడ వైసీపీ నుంచి గూడూరి శ్రీనివాసులు పోటీ చేశారు.
కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారి ఎన్నికల బరిలో దిగారు. ఆమె ఒకప్పుడు తన తండ్రి, బాబాయి, సోదరుడు ప్రాతినిధ్యం వహించిన కడప పార్లమెంటు సీటులో పోటీ చేశారు.
ఇక్కడ వైసీపీ నుంచి వైఎస్. అవినాశ్ రెడ్డి పోటీకి దిగారు. టీడీపీ నుంచి చదిపిరాళ్ల భూపేష్ రెడ్డి బరిలో ఉన్నారు.

ఫొటో సోర్స్, VIZAG DPRO
ఏపీలో రికార్డు స్థాయిలో పోలింగ్
ఆంధ్రప్రదేశ్‌లో ఈ ఎన్నికల్లో పోలింగ్ శాతం గతంలో పోలిస్తే పెరిగింది. గడిచిన రెండు దశాబ్దాలుగా ఏపీలో ప్రతీ అసెంబ్లీ ఎన్నికల్లోనూ పోలింగ్ శాతంలో పెరుగుదల కనిపిస్తోంది. గడిచిన నాలుగు ఎన్నికలను పరిశీలిస్తే ఇది స్పష్టమవుతుంది.
ఆధికారిక లెక్కల ప్రకారం, 2004లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 69.9% మంది ఓటు వినియోగించుకున్నారు.
ఆ తర్వాత ఐదేళ్లకు 2009లో అది 72.7% కి పెరిగింది. అంటే, 2.8 శాతం మంది ఓటర్లు అదనంగా ఓటు వేశారు.
ఇక 2014 లెక్కల ప్రకారం పోలింగ్ శాతం 78.4 శాతంగా ఉంది. అంటే, అంతకుముందు ఎన్నికలతో పోలిస్తే ఒకేసారి అనూహ్యంగా 5.7 శాతం పెరుగుదల నమోదైంది.
ఆ తర్వాత జరిగిన 2019 ఎన్నికల్లో ఓటింగ్ శాతం 79.77 శాతానికి పెరిగింది. అంతకుముందు పదేళ్ల కిందట జరిగిన ఎన్నికలతో పోలిస్తే ఇది 7 శాతం అదనం.
ప్రస్తుత ఎన్నికల్లో 81.86 శాతం పోలింగ్ నమోదైంది.

ఫొటో సోర్స్, UGC
ఇవి కూడా చదవండి:
- ఏసీ పేలి ఇల్లంతా కాలిపోయింది.. అసలు ఏసీ ఎందుకు పేలుతుంది.. పేలకుండా ఏం చేయాలి?
- గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి: కొత్తగా తీసిన పాత కథ.. విశ్వక్సేన్ నటన మెప్పించిందా?
- స్కూటీ అంటే అమ్మాయి, బైక్ అంటే అబ్బాయి...హైదరాబాద్‌లో పిల్లల విక్రయ ముఠా గుట్టు ఎలా బయటపడిందంటే...
- ‘ఒక కూతురు నుంచి ఇలాంటి మాటలు వినడం అసాధారణంగా అనిపిస్తుంది...’
బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














