ఏసీ పేలి ఇల్లంతా కాలిపోయింది.. అసలు ఏసీ ఎందుకు పేలుతుంది.. పేలకుండా ఏం చేయాలి?

ఫొటో సోర్స్, ANI
తీవ్రమైన వేడి కారణంగా, కొన్నిచోట్ల ఇళ్లలోని ఎయిర్ కండీషనర్లు (ఏసీలు) పేలిపోతున్నాయి.
ఇలాంటి ఘటనలతో ఏసీలను సురక్షితంగా ఎలా వాడాలి, ఒకవేళ ప్రమాదాలు జరిగితే ఎలాంటి రక్షణ చర్యలు తీసుకోవాలనే చర్చ మొదలైంది.
ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో ఓ హౌసింగ్ సొసైటీలో గురువారం జరిగిన అగ్నిప్రమాదానికి ఇంట్లో అమర్చిన ఏసీ కంప్రెసర్ పేలిపోవడమే కారణమని అధికారులు తెలిపారు.
ఈ పేలుడుతో ఓ ఫ్లాట్‌లో మంటలు చెలరేగుతున్న దృశ్యాలను మీడియా రోజంతా చూపిస్తూనే ఉంది.
ఎంతో శ్రమించి ఫ్లాట్‌లో మంటలను అదుపులోకి తెచ్చారు.
నోయిడా ఫైర్ బ్రిగేడ్ అధికారి ప్రదీప్ కుమార్ విలేఖరులతో మాట్లాడుతూ, ''ఇటీవల కొద్దిరోజుల్లోనే 10 నుంచి 12 ఏసీలు పేలిపోయాయి. ఇవి నివాస, వాణిజ్య భవనాల్లో జరిగాయి'' అన్నారు.
దానికి ముందు మే 27న ముంబయిలోని బోరివాలి వెస్ట్‌లో, ఓ ఫ్లాట్‌లో ఇలాంటి ఘటనే వెలుగులోకి వచ్చింది. నోయిడా ఘటన తరహాలోనే అక్కడ కూడా ఏసీలో మంటలు చెలరేగి ఫ్లాట్ మొత్తం కాలిపోయింది.
కొద్దిరోజుల కిందట హరియాణాలోని హిస్సార్ జిల్లాలో, వీకే న్యూరోకేర్ ఆస్పత్రిలో ఏసీ కంప్రెసర్ పేలిపోయి మంటలు వ్యాపించాయి.
ఈ ఏసీలు ఎందుకు పేలిపోతున్నాయి? ఏసీ పేలిపోకుండా ఎలా అడ్డుకోవాలి?
ఈ ప్రశ్నలకు సమాధానాలు కనుక్కునే ప్రయత్నం చేద్దాం.

ఫొటో సోర్స్, ANI
ఏసీలకు ఇది ప్రమాదకరం
ఏసీలు పేలిపోవడానికి ఉష్ణోగ్రత పెరుగుదలకు సంబంధం ఉంది.
దీని వెనక ఉన్న శాస్త్రీయ కారణాలను అర్థం చేసుకోవడానికి ఐఐటీ బీహెచ్‌యూ మెకానికల్ విభాగ ప్రొఫెసర్ జహర్ సర్కార్‌ని సంప్రదించాం.
గదిని ఏసీ చల్లగా మార్చాలంటే, బయట కంప్రెసర్ చుట్టూ ఉండే ఉష్ణోగ్రత, దాని కండెన్సర్ ఉష్ణోగ్రత కంటే దాదాపు 10 డిగ్రీల సెల్సియస్ తక్కువగా ఉండాలని ప్రొఫెసర్ సర్కార్ బీబీసీ ప్రతినిధి అర్షద్ మిసాల్‌తో చెప్పారు.
''సాధారణంగా భారత్‌లో వినియోగించే ఏసీల కండెన్సర్ ఉష్ణోగ్రత 50 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుంది. బయటి ఉష్ణోగ్రత కండెన్సర్ ఉష్ణోగ్రత కంటే ఎక్కువగా ఉంటే ఏసీ పనిచేయడం ఆగిపోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో కండెన్సర్‌పై ఒత్తిడి పెరుగుతుంది. దానివల్ల కండెన్సర్ పేలిపోయే అవకాశాలు కూడా పెరుగుతాయి'' అని ప్రొఫెసర్ జహర్ బీబీసీకి తెలిపారు.

ఫొటో సోర్స్, SAJJAD HUSSAIN/AFP VIA GETTY IMAGES
ఏసీలు ఎందుకు పేలతాయి?
అధిక ఉష్ణోగ్రతలే కాకుండా, ఏసీ ప్రమాదాలకు ఇంకా కొన్ని కారణాలున్నాయి.
గ్యాస్ లీకేజీ: కండెన్సర్ నుంచి గ్యాస్ లీక్ కావడం కూడా ఏసీ ప్రమాదాలకు కారణమవుతుందని నిపుణులు చెబుతున్నారు.
గ్యాస్ తగ్గినప్పుడు కండెన్సర్‌పై ఒత్తిడి పెరుగుతుంది. దీంతో అది మరింత వేడెక్కుతుంది. ఇది అగ్నిప్రమాదాలు జరిగే అవకాశాలను పెంచుతుంది.
కాయిల్స్ దుమ్ముకొట్టుకుపోవడం: చల్లబరిచే ప్రక్రియలో ఏసీ కండెన్సర్ కాయిల్స్ కీలకపాత్ర పోషిస్తాయి. అవి గాలి నుంచి వేడిని తొలగిస్తాయి.
కాయిల్స్ మురికిగా దుమ్ము కొట్టుకుపోయినప్పుడు వాటికి గ్యాస్ సరఫరాలో ఇబ్బందులు తలెత్తుతాయి. ఇది కండెన్సర్ మరింత వేడెక్కడానికి కారణమవుతుంది. తద్వారా అగ్నిప్రమాద అవకాశాలు పెరుగుతాయి.
వోల్టేజ్ హెచ్చుతగ్గులు: తరచూ వోల్టేజ్‌లో హెచ్చుతగ్గులు సంభవిస్తే కంప్రెసర్ పనితీరుపై ప్రభావం పడుతుంది. ఇది ప్రమాదానికి కారణమవుతుంది.

ఫొటో సోర్స్, ani
ఏసీలు పేలిపోకుండా చూసుకోవడం ఎలా?
ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నప్పుడు ఏపీ కంప్రెసర్ నీడలో ఉండేలా చూసుకోవాలి. కంప్రెసర్, కండెన్సర్ యూనిట్ చుట్టూ సరైన వెంటిలేషన్ ఉండాలి. అక్కడ గాలి వీచేలా ఉంటే, యూనిట్ మరింత వేడెక్కకుండా ఉంటుంది.
క్రమం తప్పకుండా ఏసీ సర్వీస్ చేయించాలి. ఇలా చేయడం ద్వారా ఏవైనా రిపేర్లు ఉన్నా సరి అవుతాయి.
ఎయిర్ ఫిల్టర్, కూలింగ్ కాయిల్స్‌ను క్రమం తప్పకుండా శుభ్రం చేయాలి. ఇలా చేయడం వల్ల కంప్రెసర్‌పై ఎక్కువ ఒత్తిడి పడకుండా ఉంటుంది.
కూలింగ్ ఫ్యాన్‌ను కూడా ఎప్పటికప్పుడు పరిశీలించాలి. అందులో ఏదైనా సమస్య ఉంటే వెంటనే రిపేర్ చేయించాలి.
ఏసీ కొనేముందు ఏయే విషయాలు గుర్తుంచుకోవాలి?
అల్యూమినియం కండెన్సర్లు ఉన్న ఏసీల కంటే కాపర్(రాగి)తో తయారైన ఏసీలు ధర ఎక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.
గాలిలోని నీరు, లేదా తేమతో కాపర్ ప్రతిచర్య జరపదు. అందువల్ల మరింత నిరోధకత కలిగిన వస్తువుగా పనిచేస్తుంది.
తక్కువగా వేడెక్కే లక్షణం కారణంగా రాగి త్వరగా వేడెక్కదు. అలాగే వేగంగా చల్లబడుతుంది కూడా.
అందువల్ల నిపుణులు అల్యూమినియం ఏసీల కంటే కాపర్ ఏసీలకే మొగ్గుచూపుతారు.
ఇవి కూడా చదవండి:
- లోక్‌సభ ఎన్నికలు 2024: మీకు చికెన్ ఇష్టమా, మటన్ ఇష్టమా అన్నది కూడా రాజకీయ నాయకులకు తెలిసిపోతుంది, ఎలాగంటే...
- విశాఖ టు కంబోడియా: ‘డేటా ఎంట్రీ జాబ్ అని చెప్పి, సైబర్ నేరాలు చేయించారు’- బాధితులు చెప్పిన విస్తుబోయే నిజాలు
- టీ20 వరల్డ్‌కప్: ఆస్ట్రేలియా నుంచి అమెరికాకు పిచ్ తరలింపు, ఎలా సాధ్యమైంది?
- దిల్లీలో 52.3 డిగ్రీలు నమోదు, ఈ వేడిని మన శరీరం తట్టుకోగలదా?
- CARA: భారత్‌లో బిడ్డను దత్తత తీసుకోవడం ఎందుకంత కష్టం, నిబంధనలు ఏం చెబుతున్నాయి, ప్రక్రియ ఏమిటి?
బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














