భయపెట్టే కలలు ఎందుకొస్తాయి, రాకుండా ఏం చేయాలి?

పరీక్షల భయంతో అమ్మాయి , బెడ్‌పై పడుకున్న అమ్మాయి

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, హాజెల్ షీరింగ్
    • హోదా, ఎడ్యుకేషన్ కరస్పాండెంట్

ఒలువాటోసిన్ పరీక్ష హాలులో ఉన్నారు. ఆయన ముందు పరీక్షాపత్రం ఉంది.

కానీ ఆయన అనుకున్నట్టు అది స్టాటిస్టిక్స్, మెకానిక్స్ పరీక్ష కాదు. అది లెక్కల పరీక్ష.

ఒలువాటోసిన్‌లో కంగారు మొదలైంది. ఎందుకంటే ఆయన లెక్కలు కాకుండా స్టాటిస్టిక్స్, మెకానిక్స్ చదువుకుని వెళ్లారు.

ఆ పేపర్ నిండా ఆయన ఏమాత్రం ప్రిపేర్ కాని ప్రశ్నలే వచ్చాయి. పేపర్ చూడగానే ఒలువాటోసిన్ ఒళ్ళంతా చెమట పట్టింది.

ఇంతలో భయం భయంగా కళ్లు తెరిచారు. చూస్తే ఇంట్లో బెడ్‌ మీద పడుకుని ఉన్నారు.

ఇప్పటి దాకా తనకు అనిపించింది నిజం కాదని, అది కలని తెలుసుకుని హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకున్నారు. ఒలువాటోసిన్. మనసు కాస్త కుదుటపడింది.

పరీక్షల గురించి కలలు రావడం ఎంత సాధారణమనే విషయం తెలుసుకోవడానికి సరైన మార్గం లేదు. ఎందుకంటే వాటిని చాలామంది గుర్తుపెట్టుకోరు.

వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఒలువాటోసిన్ ఫోటో

ఫొటో సోర్స్, BBC/ Hazel Shearing

ఫొటో క్యాప్షన్, పరీక్షల ముందు పార్కులో మార్నింగ్ వాక్‌కు వెళతానని ఒలువాటోసిన్ చెప్పారు.

మనకు కలలు ఎందుకు వస్తాయి? కలలు రాకుండా ఏమైనా చేయగలమా?

''మనం నిద్రపోతున్నప్పుడు కూడా మన మెదడు మెలకువగానే ఉంటుంది. మనం తెలుసుకున్న విషయాలను క్రోడీకరించడం, మన జ్ఞాపకాలను నిక్షిప్తం చేయడం, మన భావోద్వేగాలను ప్రాసెస్ చేయడం వంటి పనుల్లో ఉంటుంది. ఈ ప్రక్రియ ఫలితాన్నే మెదడు మనకు కలగానూ అందిస్తుంటుంది'' అని ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో స్లీప్ మెడిసిన్ ప్రొఫెసర్‌గా ఉన్న కొలిన్ ఎస్పై చెప్పారు.

''అయితే మెదడు ఇలాంటి ప్రాసెస్‌లో ఉందని చెప్పడానికి ఆధారాలు దొరకడం కష్టం’’ అని ఆయన చెప్పారు.

మన బ్రెయిన్ పనిచేస్తోందని చెప్పడానికి కలలు ఓ పరోక్ష ఆధారం.

‘‘రాత్రి వేళ ఏం జరుగుతుందంటే.. మీకు పరీక్షల భయం ఉందని తెలుసు. ఇంకా చదవాల్సినవి ఉన్నాయని కూడా తెలుసు. నువ్వు చదివిన దానిపై నేను పనిచేస్తున్నాను అని మన మెదడు రాత్రిపూట మనకు ఊరటనిచ్చేలా చెబుతుంది’’ అని ఆయన తెలిపారు.

‘‘అంటే దానర్థం పగటిపూట మనం చదవక్కరలేదని కాదు. మనం పగలు నేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్న విషయాలను మెదడు కేవలం సమన్వయం చేసుకుంటుంది’’ అని కొలిన్ చెప్పారు.

జుహాల్ ఫోటో

ఫొటో సోర్స్, BBC/ Hazel Shearing

ఫొటో క్యాప్షన్, తాను సమాధానం ఇవ్వలేని ప్రశ్నలు పరీక్షల్లో వచ్చినట్టు జుహాల్‌కు కలలు వస్తుంటాయి. కానీ వాస్తవంగా అలా ఎప్పుడూ జరగలేదు.

పరీక్షల కలలే ఎందుకు?

మన జీవితంలో చాలా జరుగుతుంటాయి. కానీ పరీక్షల కలలే ఎందుకు ఎక్కువగా వస్తుంటాయి?

‘‘మనకు భయం కలిగించే అంశాల గురించి కలగనడం సాధారణమైన విషయం’’ అంటారు ప్రొఫెసర్ కొలిన్ ఎస్పై.

‘‘ఏదో ముప్పు పొంచి ఉన్నంత మాత్రాన అది చెడ్డదని అర్థం కాదు, కానీ అది సవాలుతో కూడుకున్నదని అర్థం. పరీక్షలంటేనే ఓ సవాలు అనే నిర్వచనం ఉంది కాబట్టి , దానివల్లే ఆ కలలు వస్తాయి’’ అని చెప్పారు.

‘‘చాలా మంది పరీక్షల కోసం ఎదురుచూడరనేది నిజమే కదా?’’

‘‘పగటిపూట మన మనసులో ఉండే విషయం రాత్రిపూట కూడా ఎదురైతే ఆశ్చర్యమేమీ కలిగించదు’’ అని తెలిపారు.

ప్రొఫెసర్ కొలిన్ ఎస్పై ప్రకారం ‘‘పరీక్షల గురించిన కలలు చాలా సాధారణం. ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోని కలలను ఎన్నో కంటుంటారు’’

‘‘చాలామందికి పరీక్షల కలల గురించిన ఎరుక ఉండదు. అందుకే అవి వారికి అసలు తెలియవు’’ అని చెప్పారు.

‘‘కొంతమందికి కలలు ఎక్కువగా వస్తుంటాయి. కొంతమందికి అప్పుడప్పుడు, మరికొందరికి ప్రతి రాత్రి సమస్యగానే ఉంటుంది’’ అని తెలిపారు.

భావోద్వేగ కలలు

తను ఎప్పుడూ ఆలస్యం అవుతున్నట్టు 19 ఏళ్ళ జుహాల్ తరచూ కలగంటూ ఉంటారు.

‘‘అలారం మోగకముందే ఒకటి రెండుసార్లు నిద్ర లేచి టైమ్ చూసుకుంటూ ఉంటాను. నేను ఇంకో గంట పడుకోవచ్చు. కానీ నేను ఆ పనిచేయలేను’’ అని ఆమె చెప్పారు.

ఇలాంటి వాటిని వివరించడం చాలా తేలికంటారు ప్రొఫెసర్ కొలిన్ ఎస్పై.

‘‘మీరు నిద్రలో ఉన్నా టైమ్ చెప్పగలుగుతారు. మానవజాతి పుట్టినప్పటి నుంచే స్మార్ట్ ఫోన్లు, గడియరాలు లేవు కదా. అందుకే సమయం గురించిన సహజమైన అభ్యాసం మనుషులందరికీ ఉంటుంది’’ అని చెప్పారు.

పీడకలలనేవి భావోద్వేగాల కలలు. మనం నిద్రపోతున్నప్పుడు మన భావాలను మెదడు ప్రాసెస్ చేస్తోందనడానికి సంకేతం.

పరీక్షలలాంటి కలలు కొన్ని దీర్ఘకాలం ఉంటాయి.

''పీడకలలనేవి ఒక్కోసారి ఒకే విధమైన భావోద్వేగాలను కలిగి ఉంటాయి. దీన్ని కొంచెం వివరంగా చెప్పుకుంటే మనం చిన్నప్పుడు దేనికైనా భయపడితే, పెద్దయ్యాక కూడా అలాంటి పరిస్థితే ఎదురైతే, మన మెదడు ఆ సారూప్యాన్ని పోల్చుకుని, అదేరకమైన భావోద్వేగాన్ని ప్రతిబింబిస్తుంది'' అని ప్రొఫెసర్ కొలిన్ ఎస్పై చెప్పారు.

ఆనందం కలిగించే విషయాలు, బాధ కలిగే విషయాలను మన మెదడు వర్గీకరించుకుంటుందని ఆయన చెప్పారు.

రోజ్ ఫోటో

ఫొటో సోర్స్, BBC/ Hazel Shearing

ఫొటో క్యాప్షన్, ఎగ్జామ్ వర్క్ షాపుల నుంచి తాను మద్దతు పొందుతానని రోజ్ చెప్పారు.

పరీక్షల కలలు రాకుండా ఉండాలంటే..

పరీక్షలకు సంబంధించిన కలలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి?

పరీక్షలు దగ్గరపడుతుంటే... క్రమం తప్పని విశ్రాంతితో చక్కని పాఠ్యప్రణాళిక ఉండాలని చెబుతారు ప్రొఫెసర్ కొలిన్ ఎస్పై. దీనివల్ల మీకు మీరే భరోసా ఇచ్చుకోగలుగుతారు. మీకో ప్రణాళిక ఉంది. దానిని మీరు పాటిస్తుంటారు. కానీ అర్ధరాత్రి వరకు చదవకండి.

‘‘మీరు మంచం మీదకు చేరే సరికి తలలో మీ లెక్కల సూత్రాలతో కుస్తీపడుతుంటే అర్ధరాత్రి కూడా మీరు ఆ ఆలోచనలతోనే నిద్రలేచే అవకాశం ఉంటుంది’’ అని ప్రొఫెసర్ కొలిన్ ఎస్పై చెప్పారు.

మీరు చదవడానికి, పడుకోవడానికి మధ్య కాస్త విరామం ఉండాలి.

మీరేదైనా చెడ్డ కల నుంచి నిద్రలేస్తే మిమ్మల్ని మీరే ఓదార్చుకోవడానికి, మీతో మీరు దయగా ఉండటానికి ప్రయత్నించాలి.

‘‘నిజానికి దేనిగురించైనా ఆందోళన చెందితే, రాత్రయినా, పగలైనా ఆందోళన రూపం ఒకలాగానే ఉంటుంది. మనం అనుకున్నది జరగకపోతే ఏం జరుగుతుందనే భయం నుంచే ఈ ఆందోళన వస్తుంది’’ అంటారు కొలిన్ ఎస్పై.

‘‘ఆలస్యానికి సంబంధించి లేదంటే పరీక్షల గురించిన కలలు రావడానికి ఈ ఆందోళనే కారణం కావచ్చు. అయితే దీనికి మన ప్రతిస్పందన ఏమిటనేది కూడా ఆలోచించాలి’’ అంటారు ఎస్పై.

‘‘ఇలాంటివి జరిగితే (అంటే ఆలస్యంగా వెళ్ళడం, లేదంటే పరీక్షల్లో జవాబులు గుర్తుకురాకపోవడం) మీ పరిస్థితి ఏంటని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకుంటే ఇంకేముంది మనపనైపోయిందనుకుంటారు. అలాంటి పరిస్థితే ఇతరులకు ఎదురైనప్పుడు మీరు మీ పని అయిపోయిందని చెప్పరు కదా. వారిని ఓదారుస్తారు. అలాగే మిమ్మల్ని మీరు ఓదార్చుకుంటే ఇలాంటి ఆందోళన కలిగించే కలలు రావు’’ అని ఆయన సూచించారు.

19 ఏళ్ళ రోజ్‌కు పరీక్షల గురించిన కలలు రావు. లేదంటే వాటిని ఆమె గుర్తుంచుకోరు. కానీ పరీక్షలు మాత్రం ఆమె నిద్రకు భంగం కలిగిస్తుంటాయి. తరుచూ రాత్రి 2 గంటలకు మెలకువ రావడాన్ని ఆమె గమనిస్తుంటారు.

ఈ సమస్యకు ఆమె కనుగొన్న పరిష్కారం... తనకు ఇష్టమైన రిక్ అండ్ మార్టీ అనే టీవీ షోను చూడటం. ఇది తనను ‘‘తేలికగా నిద్రపోయేందుకు సాయపడుతుందని’’ ఆమె చెప్పారు.

నువ్వు నిద్రలోకి జారుకోవాల్సిందే కానీ, నిన్ను నువ్వు నిద్రపుచ్చుకోలేవు అంటారు ప్రొఫెసర్ ఎస్పై.

మీరు తెల్లవారుజామున 4 గంటలకు కూడా పైకప్పు వంకే చూస్తున్నారంటే అదేపనిగా బాధపడక్కరలేదు. దాన్నుంచి ఎలా బయటపడాలో ఆలోచించాలి. పరీక్షల ముందు నిద్రపట్టడం లేదని బాధపడే బదులు మరో మూడుగంటలు నిద్రపోవడానికి అవకాశం ఉందన్నట్టు సానుకూలంగా ఆలోచించండి.

అప్పటికీ నిద్రపోలేకపోతే ఓ పదినిమిషాల సమయం తీసుకోండి. (పది నిమిషాల సమయం కోసం సెల్ ఫోన్లు, గడియారాలను సెట్ చేసుకోకండి).

అప్పటికీ నిద్రపట్టలేదా?

‘‘మీకు నిద్ర వచ్చేవరకు కొంతసేపు మంచం మీద నుంచి లేవండి. తరువాత మంచంపైకి చేరండి. నిద్రలోకి జారుకోవడానికి మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోండి. పర్వాలేదు, నిద్రపోవడానికి తగినంత సమయం ఉందని మీకు మీరు చెప్పుకోండి’’ అంటారు ప్రొఫెసర్ ఎస్పై.

‘‘నిద్రపట్టడం లేదనే విషవలయంలో అనవసరంగా చిక్కుకోకండి’’ అంటారాయన.

‘‘రాత్రివేళ జరిగేవాటికి మితిమీరి స్పందించకండి’’ అంటారు ఎస్పై.

‘‘మీ నిద్రను నమ్మండి’’ అని చెబుతారు.

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)