పొగ తాగడం కొన్ని దేశాల్లో నిషేధం, అక్కడ ఎలా అమలు చేస్తున్నారంటే....

సిగరెట్లు, ధూమపాన నిషేధం

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, జెరెమీ హోవెల్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

మే 31న ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం. ఈ ఏడాది ప్రపంచ ఆరోగ్య సంస్థ, యువతను లక్ష్యంగా చేసుకునే పొగాకు సంస్థలను నియంత్రించడంపై దృష్టి పెట్టింది.

పొగాకు వ్యతిరేక ప్రచారంలో డబ్యూహెచ్‌వో చాలా ప్రభావవంతంగా ఉంది. ప్రపంచంలోని చాలా దేశాలు ఇప్పుడు ధూమపానాన్ని అరికట్టడానికి చర్యలు తీసుకుంటున్నాయి.

ఏయే దేశాలు ధూమపాన నిషేధాన్ని అమలు చేస్తున్నాయి?

151 దేశాలలో ఇప్పుడు ఇళ్లు, బహిరంగ ప్రదేశాలలో ధూమపానాన్ని నిరోధించే చట్టాలు ఉన్నాయని డబ్యూహెచ్‌వో చెబుతోంది.

ఈ చట్టాలు ప్రపంచంలోని ప్రతి 10 మందిలో ఏడుగురిని- అంటే 560 కోట్ల మందిని, ఇతరులు పొగ తాగడం వల్ల కలిగే ప్రభావం నుంచి కాపాడతాయని తెలిపింది.

2004లో, ఆఫీసులు, బార్‌లు, రెస్టారెంట్లు, ప్రజా రవాణా వంటి బహిరంగ ప్రదేశాల్లో ధూమపానాన్ని నిషేధించిన ఐర్లండ్, ప్రపంచంలోనే అలాంటి నిర్ణయం తీసుకున్న మొదటి దేశంగా మారింది.

అప్పటి నుంచి, యూరోపియన్ యూనియన్ అంతటా 16 ఇతర దేశాలు ఇలాంటి చట్టాలను ఆమోదించాయి. అయితే తమ సభ్య దేశాలలో కొన్ని వాటిని సరిగా అమలు చేయడం లేదని ఈయూ అంటోంది.

దక్షిణ అమెరికాలోని ప్రతి దేశంలో ఇప్పుడు ధూమపాన వ్యతిరేక చట్టాలు ఉన్నాయి.

2006లో ఉరుగ్వే అన్ని అంతర్గత, బహిరంగప్రదేశాలతో పాటు, ఆసుపత్రులు, పాఠశాలల సమీపంలో పొగ తాగడాన్ని నిషేధించింది.

ఆ ఖండంలో ధూమపానానికి వ్యతిరేకంగా చట్టాలను ఆమోదించిన చివరి దేశం పరాగ్వే. కానీ 2020 నుంచి అక్కడ నిర్దిష్టమైన, రద్దీ లేని, బహిరంగ ప్రదేశాల్లో మాత్రమే ఎవరైనా పొగాకు ఉత్పత్తులను ఉపయోగించవచ్చు.

ప్రపంచంలోనే అత్యంత కఠినమైన ధూమపాన నిరోధక చట్టాలలో ఒకదాన్ని 2023లో మెక్సికో ప్రవేశపెట్టింది. దాని ప్రకారం పార్కులు, బీచ్‌లు, హోటళ్లు, ఆఫీసులు, రెస్టారెంట్‌లతో సహా అన్ని బహిరంగ ప్రదేశాల్లో పొగ తాగడాన్ని నిషేధించారు. దీని అర్థం మెక్సికన్లు తమ ఇళ్లలో తప్ప ఎక్కడా పొగ తాగే వీల్లేదు.

జూలై 2024 నుంచి, కెనడాలోని పొగాకు తయారీదారులు ప్రతి ఒక్క సిగరెట్టు మీదా ఆరోగ్య హెచ్చరికలను ముద్రించాలి.

పాన్ అమెరికన్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం, పొగతాగడం లేదా పొగ తాగేవారి నుంచి వచ్చే పొగను పీల్చడం(పాసివ్ స్మోకింగ్) వల్ల అమెరికాలో సంవత్సరానికి దాదాపు 10 లక్షల మంది మరణిస్తున్నారు.

స్మోకింగ్ నిషేధం
ఫొటో క్యాప్షన్, 150కి పైగా దేశాలలో పొగతాగడాన్ని నిషేధిస్తూ చట్టాలు

యూకేలో పొగ తాగడంపై నిషేధం ఏమైంది?

ఈ ఏడాది ప్రారంభంలో, యూకే ప్రభుత్వం ఒక వినూత్నమైన చట్టాన్ని ప్రవేశపెట్టింది. అది టొబాకో అండ్ వేప్స్ బిల్.

దాన్ని అమలు చేసి ఉంటే, 2009 జనవరి 1న లేదా ఆ తర్వాత పుట్టిన వారికి పొగాకు ఉత్పత్తులను విక్రయించడం ఇంగ్లాండ్, వేల్స్‌లో చట్టవిరుద్ధం అయ్యేది.

స్కాట్లండ్, నార్తర్న్ ఐర్లండ్ కూడా అలాంటి చట్టాలనే ప్రవేశపెట్టాలని భావించాయి.

ప్రస్తుతం, యూకేలో సిగరెట్‌లాంటి పొగాకు ఉత్పత్తులను కొనాలంటే కనీసం 18 ఏళ్లు ఉండాలి. కొత్త చట్టం అమలులోకి వచ్చి ఉంటే, ప్రతి సంవత్సరం దీనిని ఒక ఏడాది పెంచుతూ పోయేవారు, అంటే చివరికి ఎవరూ వాటిని కొనలేరు.

అయితే, జూలై 4న జరగనున్న సాధారణ ఎన్నికల నేపథ్యంలో, మేలో యూకే పార్లమెంటును రద్దు చేశారు. దీంతో బిల్లు చట్టంగా మారక ముందే రద్దయింది.

ఈ యూకే బిల్లు, న్యూజీలాండ్‌లో 2023లో ఆమోదించిన చట్టం నుంచి ప్రేరణ పొందింది, అది కూడా 2009 తర్వాత జన్మించిన వ్యక్తులకు పొగాకు అమ్మకాలను నిషేధించింది.

న్యూజీలాండ్ చట్టం జూలై 2024లో అమల్లోకి రావాల్సి ఉంది, అయితే ప్రభుత్వం మారిన తర్వాత అది కూడా రద్దయింది.

ఆస్తమా, బ్రిటన్, సిగరెట్ స్మోకింగ్
ఫొటో క్యాప్షన్, బ్రిటన్‌లో బహిరంగ ప్రదేశాలలో పొగ తాగడాన్ని నిషేధించిన తర్వాత ఆస్తమాతో బాధపడుతూ ఆసుపత్రులకు వెళుతున్న కొంతమంది చిన్నారులు

పొగ తాగడంపై నిషేధం నిజంగా పని చేస్తుందా?

యూకే నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ హెల్త్ అండ్ కేర్ రీసెర్చ్ 21 దేశాలలో ధూమపాన నిషేధాల ప్రభావాన్ని పరిశీలించింది.

ధూమపాన నిషేధం గుండెపోటు, స్ట్రోక్‌లు వచ్చే అవకాశాలను; అదే విధంగా బ్రాంకైటిస్, ఆస్తమా వచ్చే అవకాశాలనూ తగ్గించినట్లు రుజువులు ఉన్నాయని తెలిపింది.

2007లో, ఇండోర్ పబ్లిక్ ప్లేసులు, కార్యాలయాలలో ధూమపానంపై నిషేధాన్ని యూకే అంతటికీ విస్తరించారు.

బ్రిటిష్ మెడికల్ జర్నల్‌లో ప్రచురించిన ఒక నివేదిక ప్రకారం, ఆ తర్వాత సంవత్సరంలో, గుండెపోటుతో ఆసుపత్రిలో చేరిన వాళ్లు అంతకుముందు సంవత్సరం కంటే 1,200 తక్కువగా ఉన్నారు.

గ్లాస్గో విశ్వవిద్యాలయం అధ్యయనం ప్రకారం, స్కాట్లండ్‌లో బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం నిషేధం తర్వాత ఆస్తమాతో ఆసుపత్రికి వెళ్లే పిల్లల సంఖ్య మూడేళ్లలో దాదాపు ఐదవ వంతు తగ్గింది.

స్కాట్లండ్‌లో నిషేధం విధించక ముందు, ఆస్తమాతో బాధపడుతూ ఆసుపత్రిలో చేరే పిల్లల సంఖ్య సంవత్సరానికి 5% పెరుగుతూ పోయింది.

ధూమపాన నిషేధం చాలామంది ఆ అలవాటును విడిచిపెట్టడానికి ప్రేరేపించింది.

యూకే ప్రభుత్వ డేటా ప్రకారం, 2006లో ఆ దేశంలో 22% మంది పెద్దలు ధూమపానం చేసేవాళ్లు. 2023 నాటికి, కేవలం 14% పెద్దలు మాత్రమే ధూమపానం చేస్తున్నారు.

ప్రపంచవ్యాప్తంగా గత 15 సంవత్సరాలుగా తీసుకున్న ధూమపాన వ్యతిరేక చర్యలతో, ప్రపంచ జనాభాలో ధూమపానం చేసేవారి సంఖ్య 30 కోట్లు తగ్గి ఉండొచ్చని డబ్యూహెచ్‌వో చెబుతోంది.

సిగరెట్లు, స్మోకింగ్, కెనడా, బ్రిటన్
ఫొటో క్యాప్షన్, 2024 జులై తర్వాత కెనడాలో ప్రతీ సిగరెట్ మీద ఆరోగ్యపరమైన హెచ్చరిక ముద్రించాల్సిందే

యువతను టార్గెట్ చేసుకున్న పొగాకు కంపెనీలను ఆపడం ఎందుకు?

2022 డేటా ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా, 13-15 సంవత్సరాల వయస్సు గల కనీసం 3.7 కోట్ల యువత ఏదో ఒక రకమైన పొగాకును ఉపయోగిస్తున్నారని డబ్ల్యూహెచ్‌వో తెలిపింది. యూరప్‌లో, 13-15 సంవత్సరాల వయస్సు గల వారిలో 11.5% మంది అబ్బాయిలు, 10.1% బాలికలు పొగాకును వినియోగిస్తున్నారు.

ముఖ్యంగా యువతలో ఎలక్ట్రానిక్ సిగరెట్లు, నికోటిన్ పౌచ్‌లు వంటి ఉత్పత్తులు బాగా ప్రాచుర్యం పొందాయని డబ్ల్యూహెచ్‌వో చెబుతోంది.

2022లో యూరప్‌లో 12.5 % కౌమారదశలో ఉన్నవారు ఈ-సిగరెట్‌ లను ఉపయోగించారని అంచనా వేసింది. కానీ, పెద్దల్లో కేవలం 2% మంది మాత్రమే వీటిని ఉపయోగించారని తేలింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)