తేనెటీగలు అంతరించిపోతే మానవ జాతి ఏమవుతుందో తెలుసా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, సిరాజ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
''ప్రపంచంలో తేనెటీగలు అంతరించిపోతే, ఆ తర్వాత నాలుగేళ్లలో మానవ జాతి కూడా కనుమరుగవుతుంది'', ఇది తేనెటీగల గురించి ఐన్‌స్టీన్ కోట్‌గా చెబుతుంటారు. ఐన్‌స్టీన్ ఇలా చెప్పినట్లు ఆధారాలు లేకపోయినప్పటికీ, తేనెటీగలు లేకపోతే ప్రపంచ ఆహారోత్పత్తికి తీవ్ర నష్టం వాటిల్లుతుందన్నది మాత్రం కాదనలేని వాస్తవం.
ఆహార ఉత్పత్తి, పోషకాహారం పెంపుతో పాటు ఆకలితో పోరాడడంలో తేనెటీగల ప్రాధాన్యాన్ని గుర్తించి, 2018 నుంచి ఏటా మే 20వ తేదీని ప్రపంచ తేనెటీగల దినోత్సవంగా నిర్వహిస్తున్నారు.
వాతావరణ మార్పులు, అడవుల నరికివేత, కొన్ని రసాయన ఎరువులు, పురుగుమందుల వాడకం, వాయు కాలుష్యం కారణంగా తేనెటీగల సంఖ్య తగ్గిపోతోందని ఐక్యరాజ్యసమితి ఆహార, వ్యవసాయ సంస్థ చెబుతోంది. మానవ కార్యకలాపాల వల్ల తేనెటీగల తరహాలోనే సీతాకోకచిలుకలు, గబ్బిలాలు, హమ్మింగ్‌బర్డ్ వంటి పరాగ సంపర్క జీవులకు ముప్పు ఎక్కువగా పొంచి ఉందని తెలిపింది.
ప్రపంచ ఆహారోత్పత్తిలో తేనెటీగల పాత్ర ఏమిటి? తేనెటీగలు లేకపోతే ఏమవుతుంది?

ఫొటో సోర్స్, Getty Images
తేనెటీగలపై ఆధారపడిన ఆహారోత్పత్తి
ఐక్యరాజ్య సమితి ఆహార, వ్యవసాయ సంస్థ నివేదిక ప్రకారం, ప్రపంచంలోని మొత్తం వ్యవసాయ భూమిలో 35 శాతం లేదా మానవ ఆహార ఉత్పత్తిలో మూడింట ఒక వంతు తేనెటీగల వంటి జీవులపై ఆధారపడి ఉంటుంది.
పుప్పొడి రేణువులు ఒక పుష్పం నుంచి మరో పుష్పం కీలాగ్రానికి చేరినప్పుడు పరాగ సంపర్కం జరుగుతుంది. దీని వల్ల కాయలు, గింజలు తయారవుతాయి. తేనెటీగలు, సీతాకోకచిలుకల వల్లే 80 శాతం మొక్కల పరాగ సంపర్కం జరుగుతుందని ఐక్యరాజ్యసమితి తన నివేదికలో పేర్కొంది.
పువ్వు నుంచి మకరందాన్ని సేకరించేప్పుడు తేనెటీగల పాదాలకు అంటుకునే పుప్పొడి, అవి పక్కనే ఉన్న పూలపై వాలినప్పుడు వాటికి వ్యాపిస్తుంది.
అడవులు, ఒయాసిస్‌ల (ఎడారి ప్రాంతాల్లో పచ్చదనం, నీటి వనరులుండే ప్రాంతం) విస్తరణకు ఇదే ప్రధాన కారణం. ఒక పువ్వు నుంచి పుప్పొడిని ఇతర పూలకు చేర్చడం ద్వారా తేనెటీగలు మొక్కలకు గొప్ప సాయం చేస్తున్నాయని చెప్పవచ్చు.
''తేనెటీగలు లేకపోతే, కూరగాయాలు, నూనె గింజల వంటి పంటలు మాత్రమే కాకుండా, బాదం, వాల్‌నట్, కాఫీ, కొకో బీన్స్, టమోటాలు, యాపిల్స్ తదితర మొక్కల పరాగ సంపర్కం దెబ్బతింటుంది. ఇది మానవ ఆహారంలో పోషకాహార లోపానికి దారితీస్తుంది'' అని ఐక్యరాజ్యసమితి నివేదిక పేర్కొంది.
కాబట్టి, తేనెటీగలు కేవలం తేనె ఉత్పత్తికి మాత్రమే కాకుండా ప్రపంచ ఆహార ఉత్పత్తికి చాలా కీలకం.

ఫొటో సోర్స్, Getty Images
తేనెటీగల ప్రాముఖ్యత
''మనుషులు తేనెటీగలను మాత్రమే కాదు, ఎన్నో కీటకాలను జీవులుగా పరిగణించరు. ఈ ప్రపంచంలో తేనె ఇవ్వడానికి మాత్రమే తేనెటీగలు ఉన్నాయని చాలా మంది అనుకుంటారు'' అని కాలమిస్ట్, వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ ఎ.షణ్ముకానందం అన్నారు.
''ఈ ప్రపంచమంతా కీటకాలతో నిండిపోయి ఉంది. ఇప్పటికీ చాలా కీటక జాతులను కనుక్కోలేదు. కీటకాల్లో తేనెటీగలు చాలా ముఖ్యమైనవి. అవి సేకరించి పెట్టే తేనెను మనుషులు మధురంగా భావిస్తారు. దాని ఔషధ గుణాల గురించి తర్వాత మాట్లాడుకుందాం'' అని ఆయన అన్నారు.
''పరాగ సంపర్కం కోసం మనుషులు తేనెటీగలను కాపాడాలి. అవి ప్రపంచంలోనే అత్యుత్తమ పరాగ సంపర్క జీవులు. తేనెటీగల వల్ల పరాగ సంపర్కం జరగకపోతే మొక్కలపై తీవ్ర ప్రభావం పడుతుంది. అప్పుడు ఆహారోత్పత్తి కూడా తగ్గిపోతుంది. అది మానవ జాతి వినాశనానికి నాంది అవుతుంది'' అని షణ్ముకానందం అన్నారు.
''పూలల్లోని పుప్పొడి, మకరందం రెండూ తేనెటీగలకు ఆహారం, అవి ఆకలిగా ఉన్నప్పుడు వాటిని ఆహారంగా తీసుకుంటాయి. పూలు వికసించని శీతాకాలంలో ఆహార కొరతను అధిగమించేందుకు తేనెటీగలు తేనెను సేకరిస్తాయి. నృత్యం ద్వారా అవి పూలు లేదా మకరందం దొరికే దిశను తెలియజేయగలవు'' అని షణ్ముకానందం చెప్పారు.
ఉదాహరణకు, తేనెటీగలు ఎత్తులో ఎగురుతూ తోకను ఊపితే సూర్యుడి దిశలోనే ఆహారం ఉందని, కిందకు చూస్తూ తోక ఊపితే సూర్యుడికి వ్యతిరేక దిశలో ఆహారం ఉందని అర్థం.
జంతువుల ప్రవర్తనపై అధ్యయనం చేసిన నిపుణులు కార్ల్ వాన్ ఫ్రిష్ తేనెటీగల నృత్యం గురించి వివరించారు. కీటకాలపై చేసిన పరిశోధనలకు గానూ 1973లో ఆయనకు నోబెల్ బహుమతి లభించింది.
''తేనెటీగలు ఎక్కువ సువాసన వెదజల్లే అందమైన మల్లె, గులాబీ వంటి పూల కోసం వెతకవు. తేనెటీగలు ఎక్కువగా మామిడి పూలు, పొద్దుతిరుగుడు పూలు, నువ్వులు, మునగ పూల వంటి వాటి కోసం వెతుకుతాయి. ఏ రుతువులో ఏ పూలు పూస్తాయో కూడా వాటికి తెలుసు.
వాసనను పసిగట్టడం ద్వారా కూడా తేనెటీగలు పూలు, లేదా తమ ఆహారం ఎక్కడుందో గ్రహిస్తాయి. ఇవి అత్యంత లౌక్యం కలిగిన జీవులు. అవి ప్రత్యేకమైన పూలను పసిగట్టి, వాటి నుంచి మాత్రమే మకరందాన్ని సేకరిస్తాయి. ప్రతి ఒక్కటీ తేనెను సేకరిస్తాయి. అత్యాధునిక ఇంజనీరింగ్ పరిజ్ఞానంతో నివసించేందుకు వీలుగా తేనెతుట్టెను నిర్మించుకుంటాయి.
అలాంటి తేనెటీగలను మనుషులు చాలా సాధారణ కీటకాలుగా భావిస్తారు. వాటి గురించి కనీసం పట్టించుకోకుండా, వాటిన నాశనం చేసేందుకు సిద్ధంగా ఉంటారు'' అని షణ్ముకానందం చెప్పారు.

తేనెటీగలకు పొంచివున్న ప్రమాదాలు
మానవుల వల్ల ఎన్ని విధాలుగా తేనెటీగలు అంతరించిపోతున్నాయో వివరించారు డాక్టర్ ప్రియదర్శనన్ ధర్మరాజన్. ఆయన అశోకా ఫౌండేషన్ ఫర్ ఎకాలజీ అండ్ ఎన్విరాన్‌మెంటల్ రీసర్చ్ సీనియర్ స్పెషలిస్ట్‌గా ఉన్నారు.
బెంగళూరుకు చెందిన అశోకా ఫౌండేషన్ బయోడైవర్సిటీ కన్జర్వేషన్ (జీవవైవిధ్య పరిరక్షణ), సస్టైనబుల్ డెవలప్‌మెంట్‌లో పరిశోధన చేస్తోంది.

ఫొటో సోర్స్, Getty Images
వాతావరణ మార్పులు
''వాతావరణ మార్పు ఒక ముఖ్యమైన సమస్య. వాతావరణంలో మార్పుల కారణంగా ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల తేనెటీగల జీవక్రియ రేటు కూడా పెరుగుతుంది. దీనివల్ల ఆహార సేకరణకు తేనెటీగలు సాధారణం కంటే ఎక్కువ శక్తిని ఖర్చు చేస్తాయి.
తేనెటీగలు తాము సేకరించిన తేనెను తేనెతుట్టెలో పోసి, ఆ తడిని ఆరబెట్టుకునేందుకు రెక్కలను ఊపుతాయి. దీని ద్వారా అవి తేనెతుట్టె ఉష్ణోగ్రతను సమతుల్యంగా ఉంచుతాయి. తుట్టెలో ఉష్ణోగ్రతలు పెరిగితే అవి బతకడం కష్టమవుతుంది.
అలాగే, వాతావరణ మార్పులు పూల ఉత్పత్తిని కూడా ప్రభావం చూపుతాయి. ఉదాహరణకు, వసంత రుతువులో పూలు ముందుగా పూస్తే తేనెటీగలు వాటి నుంచి ఆహారం సేకరించుకోలేవు. తద్వారా వసంత రుతువులో అవి ఆహారం లేక చనిపోతాయి'' అని డాక్టర్ ప్రియదర్శనన్ చెప్పారు.
పొద్దుతిరుగుడు మొక్క పరాగ సంపర్కంలో తేనెటీగలు కీలకపాత్ర పోషిస్తాయి. పొద్దుతిరుగుడు పూలు వికసించే సమయంలో పరాగ సంపర్కం బాగా జరిగితే అధిక దిగుబడులు వస్తాయి.
గత ఏడాది తమిళనాడులోని తెన్‌కాశీ జిల్లాలో 500 ఎకరాల్లో పొద్దుతిరుగుడు సాగు చేశారు. కానీ, తేనెటీగల సంఖ్య బాగా తగ్గిపోవడంతో తమిళనాడు వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రైతులకు కృత్రిమ పరాగ సంపర్కానికి సంబంధించిన రెండు పద్ధతులను నేర్పించి అమలు చేశారు.
కానీ, ఇలాంటి కృత్రిమ పరాగ సంపర్క పద్ధతులు అంత ప్రభావవంతమైనవి కావు. పంట దిగుబడి, నాణ్యత, పోషకాలు తగ్గుతాయి. అలాగే, జీవవైవిధ్యానికి కూడా పెద్దగా ప్రయోజనం ఉండదని డాక్టర్ ప్రియదర్శనన్ చెప్పారు.

పురుగుమందుల వాడకం
"కొన్ని రకాల పురుగుమందులు, కలుపు నివారణ మందులు వాడడం వల్ల తేనెటీగలు చనిపోవచ్చు, లేదా బలహీనంగా మారవచ్చు. నన్నడిగితే, అవి తేనెటీగల నాశనానికి ప్రధాన కారణమని చెబుతా'' అని డాక్టర్ ప్రియదర్శనన్ చెప్పారు.
తేనెటీగల ఆవాసాల్లో మార్పు
''తేనెటీగలు ఆహారం, పరాగ సంపర్కం కోసం పూలు, మొక్కలపైకి వాలుతాయి. పంటలు పండే భూములు నాశనమైతే అవి కూడా ఆహారం లేక అంతిరించిపోతాయి. తేనెటీగలలో అడవి తేనెటీగ రకాలు ఎక్కువగా ఉంటాయి. సాధారణ తేనెటీగల తరహాలో కాకుండా, అడవి తేనెటీగలకు పెద్ద ఆవాసం అవసరం. ఒకవేళ అడవులు, చెట్లు నాశనమైతే, వాటి ఆవాసాలు, ఆహార సేకరణ ప్రదేశాలు కూడా నాశనమవుతాయి.
విదేశాల్లో అయితే, నగరాల్లోనూ తేనెటీగల కోసం పరాగ సంపర్క ప్రదేశాలను, పార్కులను ఏర్పాటు చేస్తారు. అలాంటి విధానాలను ఇక్కడ కూడా అమలు చేయాలి. గ్రామాల్లోని చిన్నచిన్న అడవులను కాపాడాలి'' అని డాక్టర్ ప్రియదర్శనన్ అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
'తేనెటీగల చుట్టూనే ప్రపంచం'
తేనెటీగల సంఖ్య తగ్గితే, మొదట ప్రభావం పడేది మనుషులపైనేనని కాలమిస్ట్, వైల్డ్‌లైఫ్ ఫోటోగ్రాఫర్ షణ్మకానందం హెచ్చరిస్తున్నారు.
''మానవ జాతి మనుగడకు ముందే, మిలియన్ సంవత్సరాల కిందటే ఈ ప్రపంచంలో కీటకాలు ఉన్నాయి. మనుషులు దీనిని గ్రహించి ప్రకృతితో మమేకమై జీవించినప్పుడే సస్టైనబుల్ డెవలప్‌మెంట్ సాధ్యమవుతుంది.
మన చుట్టూ ఉన్న పచ్చని అడవులు, చెట్లు, మొక్కలను సంరక్షించడం ద్వారా తేనెటీగలు, కీటకాల మనుగడకు అనువైన వాతావరణాన్ని కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. మనిషి దానిని గుర్తెరిగి ప్రవర్తించాలి'' అని ఆయన అన్నారు.
ఇవి కూడా చదవండి:
బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














