పొగ తాగడం మానేస్తే మన శరీరంలో వచ్చే 10 మార్పులు ఇవి

ధూమపానం మానేస్తే ఏమవుతుంది?

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం
    • రచయిత, విష్ణు స్వరూప్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

పొగ తాగడం ఆరోగ్యానికి హానికరం అని చాలామందికి తెలుసు.

ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు పొగ తాగడం ఒక కారణమని చెబుతుంటారు.

స్మోకింగ్ వల్ల ఇంకా అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయని, వీలైనంత త్వరగా ధూమపానం మానేయాలని ఎంతోమంది వైద్యులు సూచిస్తుంటారు.

'సరదా కోసం' మొదలుపెట్టే ధూమపానం, మానుకోలేని అలవాటుగా మారుతుందని డాక్టర్లు చెప్పారు.

ధూమపానం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం (పొగ తాగడం ఆరోగ్యానికి హానికరం)

పొగ తాగడం మానేయడం ఎందుకంత కష్టం?

పొగాకులో ఉండే 'నికోటిన్' కారణంగానే ధూమపానం వదులుకోలేని అలవాటుగా మారుతుందని చెన్నైకి చెందిన సీనియర్ పల్మోనాలజిస్ట్ ఎస్.జయరామన్ అంటున్నారు.

కాస్త పట్టుదలగా ప్రయత్నిస్తే పొగ తాగడం మానేయడం కష్టమేమీ కాదు.

పొగతాగడం వల్ల కలిగే నష్టాలతో పాటు మానేస్తే కలిగే లాభాల గురించి తెలుసుకుంటే మానేయాలన్న ప్రయత్నం మొదలుకావొచ్చు.

స్మోకింగ్ వల్ల ఆరోగ్యానికి ఎంత ప్రమాదమో చాలా మందికి తెలుసు. కానీ ధూమపానం మానేసిన తర్వాత శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయి? ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి?

ఈ విషయాలు తెలుసుకునేందుకు మేం చెన్నైలోని స్టాన్లీ మెడికల్ కాలేజీలో జనరల్ మెడిసిన్ విభాగాధిపతి డాక్టర్ ఎస్.చంద్రశేఖర్‌తో పాటు ఎస్.జయరామన్‌ను కలిశాం.

చంద్రశేఖర్

ఫొటో సోర్స్, S CHANDRASEKAR

ఫొటో క్యాప్షన్, చెన్నైలోని స్టాన్లీ మెడికల్ కాలేజీలో జనరల్ మెడిసిన్ విభాగాధిపతి డాక్టర్ ఎస్.చంద్రశేఖర్‌.

మానేస్తే ఎలాంటి మార్పులు వస్తాయి?

"సాధారణంగా ఒక వ్యక్తి ధూమపానం మానేస్తే, వారి ఆయుర్దాయం 10 సంవత్సరాలు పెరుగుతుందని చాలామంది చెబుతుంటారు.

ఎవరైనా ధూమపానం మానేస్తే, వారి శరీరంపై ధూమపానం ప్రభావాలు 90 శాతం వరకు తగ్గుతాయి, కానీ వారి ఆయుర్దాయం పెరుగుతుందని స్పష్టంగా చెప్పలేం’’ అని డాక్టర్ చంద్రశేఖర్ అన్నారు.

సాధారణంగా పొగతాగడం వల్ల క్యాన్సర్, గుండెపోటు వస్తాయని చాలా మంది అనుకుంటారు. కానీ ధూమపానం రుచి, శరీర వాసన, దంతాల రంగుపై కూడా ప్రభావం చూపుతుంది. ధూమపానం మానేసినప్పుడు ఈ సమస్యలు క్రమంగా తగ్గుతాయని డాక్టర్ చంద్రశేఖర్ చెప్పారు.

ధూమపానం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం

1. రుచి మెరుగుపడుతుంది

ధూమపానం చేసేవారు కొన్ని రకాల అనారోగ్యకరమైన ఆహారాలను ఎక్కువగా తీసుకోవడానికి కారణమేంటని డాక్టర్ చంద్రశేఖర్‌ను అడగగా.. "ధూమపానం వల్ల నాలుక సున్నితత్వాన్ని కోల్పోతుంది. రుచి గుర్తించే సామర్థ్యం తగ్గుతుంది. తీపి, ఉప్పు తదితర రుచులపై వారి అవగాహనను మారుస్తుంది" అని ఆయన బదులిచ్చారు.

మనకు జ్వరం వచ్చినప్పుడు నోటికి రుచించదు, అదే మాదిరి పొగతాగే వారికి కూడా అలాగే ఉంటుందని చంద్రశేఖర్ తెలిపారు. దీన్నే డిస్గ్యుసియా అంటారు. దీంతో బాధితులు రుచి కోసం అనారోగ్యకరమైన ఆహారాన్ని కోరుకుంటారని ఆయన అన్నారు.

పొగ తాగడం మానేస్తే ఈ పరిస్థితి క్రమంగా మెరుగుపడుతుందని డాక్టర్ చంద్రశేఖర్ చెప్పారు.

ధూమపానం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం

2. నోటి, శరీర దుర్వాసన తగ్గుతుంది

ధూమపానం చేసేవారి శ్వాసలో దుర్వాసన వస్తుందని చాలామందికి తెలుసు.

అలాగే వారి జుట్టు, చెమటలో కూడా ఈ వాసన ఉంటుంది.

వారు పొగతాగడం మానేస్తే 2-3 రోజుల్లోనే దుర్వాసన తగ్గిపోతుందని డాక్టర్ చంద్రశేఖర్ చెప్పారు.

జయరామన్

ఫొటో సోర్స్, DR S JAYARAMAN

ఫొటో క్యాప్షన్, సీనియర్ పల్మోనాలజిస్ట్ ఎస్.జయరామన్

3. శరీరం నుంచి విష రసాయనాలు వెళ్లిపోతాయి

పొగాకులో దాదాపు 4,000 రకాల రసాయనాలు ఉంటాయని డాక్టర్ జయరామన్ చెప్పారు. వీటిలో 70కి పైగా క్యాన్సర్ కారకాలని తెలిపారు.

“ఒక వ్యక్తి ధూమపానం చేసినప్పుడు, వారు ఈ రసాయనాలను కూడా వారి ఊపిరితిత్తులలోకి పంపుతారు. ఇవి రక్తంలోకి ప్రవేశించి, అలా శరీరంలోనే ఉంటాయి.

ఒకవేళ బాధితులు ధూమపానం మానేసిన ఒక రోజు తర్వాత నుంచి వారి రక్తం, కణాలలో ఈ విష రసాయనాలు (టాక్సిన్లు) బయటికి వెళ్లడం ప్రారంభమవుతాయి’’ అన్నారు జయరామన్.

"ధూమపానం మానేసిన వారం రోజుల్లో ఆరోగ్యకరమైన ఆహారాన్ని అనుసరిస్తే, శరీరం నుంచి ఈ మిగిలిన విష రసాయనాలు కూడా బయటకు వెళ్లిపోతాయి" అని డాక్టర్ చెప్పారు.

4. చర్మం ముడతలు తగ్గుతాయి

ధూమపానం గుండె రక్తనాళాలను మాత్రమే కాకుండా, చర్మ రక్త నాళాలు సంకోచించడానికి కారణమవుతుంది.

ఇది చర్మం ముడతలు, వృద్ధాప్య రూపానికి దారితీస్తుంది.

ధూమపానం మానేసినప్పుడు, ఈ పరిస్థితి కూడా మెరుగుపడుతుందని డాక్టర్ జయరామన్ చెప్పారు.

5. దంతాలు, పెదవుల రంగు మారడం

ఒక వ్యక్తి ధూమపానం చేసినప్పుడు పొగాకులోని ‘తారు’ దంతాలపై పేరుకుపోతుంది.

దీని కారణంగా ధూమపానం చేసేవారి దంతాలు పసుపు రంగులోకి మారతాయి. లేదా దంతాలపై గోధుమ రంగు మరకలు కనిపిస్తాయి.

ధూమపానం చేసేవారి పెదవులు, నాలుకపై కూడా తారు పేరుకుపోతుంది. అవి ముదురు రంగులోకి మారుతాయి.

ధూమపానం చేసేవారిలో కొందరి వేళ్లు కూడా నల్లగా మారతాయి.

ధూమపానం మానేసినప్పుడు ఈ సమస్యలు క్రమంగా తగ్గుతాయి.

ధూమపానం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం

6. ఊపిరి మెరుగుపడటం

మెట్లు ఎక్కినప్పుడు లేదా ఎక్కువ దూరం నడిచినప్పుడు ధూమపానం చేసే కొందరికి ఊపిరి పీల్చుకోవడం కష్టంగా అనిపిస్తుంది. కొన్నిసార్లు వారిలో దడ కూడా వస్తుంది. వ్యాయామం చేసే సమయంలో కూడా ఈ పరిస్థితి రావచ్చు.

పొగాకులోని హైడ్రోజన్ సైనైడ్, ఫినాల్, నైట్రోసమైన్స్ వంటి విషపూరిత రసాయనాలు రక్తంలో కలిసిపోయి నాడీ వ్యవస్థను ప్రభావితం చేయడమే దీనికి కారణమని డాక్టర్ జయరామన్ చెప్పారు. దీని కారణంగా హృదయ స్పందన రేటు, రక్తపోటు పెరుగుతుందన్నారు.

"ధూమపానం మానేసిన 1-2 వారాలలో ఈ పరిస్థితి స్థిరంగా మెరుగుపడుతుంది. 2 నెలల్లో మార్పులు ఉంటాయి. ప్రారంభంలో 10-15 నిమిషాలు నడవడం కష్టంగా భావించిన వ్యక్తులు, ధూమపానం మానేసిన ఆరు నుంచి ఎనిమిది నెలల తర్వాత 25 నిమిషాలు ఇబ్బంది లేకుండా నడవగలరు" అని డాక్టర్ చంద్రశేఖర్ చెప్పారు.

గుండె జబ్బులు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం

7. గుండె జబ్బులు తగ్గుతాయి

ధూమపానం చేసిన వ్యక్తికి గుండె సంబంధిత వ్యాధుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అయితే ధూమపానం మానేసిన తర్వాత ఈ గుండెపోటు, స్ట్రోక్, హృదయ సంబంధ వ్యాధులు వచ్చే అవకాశం తగ్గుతుంది.

2 నుంచి 5 సంవత్సరాలుగా పొగతాగే వారికి ఈ వ్యాధులు రావొచ్చు. తారు, కార్బన్ మోనాక్సైడ్, హైడ్రోజన్ సైనైడ్‌తో సహా పొగాకులోని రసాయనాలు గుండె ధమనులలో కొవ్వు నిల్వలను పెంచుతాయి.

ఫలితంగా రక్తనాళాలు కుంచించుకుపోయి గుండెపోటు, ఇతర వ్యాధుల ప్రభావం పెరుగుతుందని డాక్టర్ జయరామన్ చెబుతున్నారు.

పొగతాగడం మానేసిన తర్వాత ఏడాదిలోపే ఈ వ్యాధుల ప్రభావాలు తగ్గుతాయని డాక్టర్ చంద్రశేఖర్ చెప్పారు.

ధూమపానం మానేసిన 10-15 సంవత్సరాలలో బాధితుడి గుండె ఆ ప్రభావాల నుంచి కోలుకుంటుందని, ధూమపానం చేయని వ్యక్తుల హృదయం మాదిరి అవుతుందని ఆయన తెలిపారు.

8. స్ట్రోక్ ప్రమాదం తగ్గడం

పొగాకులోని పలు రసాయనాలు మెదడు వైపు వెళ్లే రక్తనాళాలపై కూడా ప్రభావం చూపుతాయి. దీని కారణంగా మెదడుకు చేరే రక్తం, ఆక్సిజన్ పరిమాణం తగ్గుతుంది.

ఇది స్ట్రోక్‌కు దారితీస్తుంది. ధూమపానం మానేసినప్పుడు ఈ ప్రమాదం కూడా తగ్గుతుంది.

ధూమపానం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం

9. అంగస్తంభన సమస్య

పొగాకులోని విషపూరిత రసాయనాలు రక్తనాళాల సంకోచంపై ప్రభావం చూపగలవు. పురుషుడు లైంగికంగా ప్రేరేపితమైనపుడు అంగస్తంభన కావాలంటే, అతని పురుషాంగంలోని రక్తనాళాలలోకి ఎక్కువ రక్తం ప్రవహించాలి.

కానీ ధూమపానం చేసే వారి రక్త నాళాలపై పడే ప్రభావం కారణంగా, అంగస్తంభన సమస్య తలెత్తే అవకాశం ఉంది.

ధూమపానం మానేయడం వల్ల కూడా ఈ ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు.

10. రక్త ప్రసరణ మెరుగుపడుతుంది

ధూమపానం వల్ల రక్త నాళాలు కుచించుకుపోయి శరీరంలోని ఏదో ఒక భాగానికి సరైన రక్తప్రసరణ జరగని పరిస్థితి ఏర్పడవచ్చు.

దీంతో ఆ భాగానికి అవసరమైన ఆక్సిజన్ అందడం కష్టం. ఇది కణజాల మరణం నెక్రోసిస్, అల్సర్లకు దారితీస్తుంది.

ధూమపానం మానేయడం వల్ల ఈ ప్రమాదం తగ్గుతుంది.

అయితే, ఆరోగ్య సమస్యలకు ధూమపానం ఒక్కటే కారణం కాదు. ఇతర సమస్యలు, రోగ నిరోధక వ్యవస్థ పనితీరు వంటి అనేక అంశాలు మన ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంటాయి.

పొగ తాగడం మానేసిన తర్వాత తీసుకునే ఆహారం, రోగ నిరోధక వ్యవస్థ పనితీరు ఆధారంగా మార్పులు ఒక్కొక్కరిలో ఒక్కోలా కనిపించొచ్చు.

(గమనిక- ఈ కథనం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య సమస్యలు, సందేహాలు ఉంటే వైద్యులను సంప్రదించండి)

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)