చంద్రుడిపై ఆవల వైపు దిగిన చైనా స్పేస్‌క్రాఫ్ట్

చంద్రుడు

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, జార్జినా రనార్డ్
    • హోదా, బీబీసీ సైన్స్ రిపోర్టర్

చంద్రుడి దక్షిణ ధ్రువం ప్రాంతంలో తమ స్పేస్‌క్రాఫ్ట్ దిగిందని చైనా ప్రకటించింది.

చంద్రుడిపై ఈ ప్రాంతం గురించి ఇప్పటి వరకు ఎవరూ పరిశోధించలేదని, ఇక్కడికి వెళ్లేందుకు ఎవరూ ప్రయత్నించలేదని చైనా చెబుతోంది.

ఈ ప్రాంతం ఉపరితలం ఎగుడుదిగుడుగా ఉంటుంది. చంద్రుడి మీద మనకు కనిపించని భాగం ఇది. దీన్ని చంద్రుడి ఆవలి వైపు అనొచ్చు.

బీజింగ్ కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం 6:23 గంటలకు చంద్రుడి దక్షిణ ధ్రువం-ఏకెన్ బేసిన్‌లో స్పేస్‌క్రాఫ్ట్ చాంగ్-6 దిగిందని చైనా నేషనల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (సీఎన్‌ఎస్‌ఏ) వెల్లడించింది.

మే 3న ప్రయోగించిన ఈ మిషన్ లక్ష్యం చరిత్రలో మొదటిసారిగా చంద్రుడి మీది ఈ రీజియన్ నుంచి విలువైన రాళ్లు, మట్టిని, శిలల్ని సేకరించడం.

ఈ స్పేస్‌క్రాఫ్ట్ చంద్రుడి దక్షిణ ధ్రువం మీద ఉన్న ఒక భారీ బిలం నుంచి కొన్ని పురాతన శిలలను తీసుకొస్తుంది.

చంద్రుడి దక్షిణ ద్రువాన్ని చేరిన తర్వాత అంతరిక్షనౌకతో కమ్యూనికేషన్ చాలా కష్టం. కాబట్టి, ఈ ప్రాంతంలో స్పేస్‌క్రాఫ్ట్‌ను దించడం అంత సులువు కాదు.

అయితే, 2019లోనూ చాంగ్ 4 అనే అంతరిక్ష నౌకను ఇక్కడ దించిన చైనా ఈ ఘనత సాధించిన ఏకైక దేశంగా నిలిచింది.

చంద్రుడు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, 2020లో చైనా చేపట్టిన మూన్ మిషన్‌లో భాగంగా స్పేస్ క్యాప్సూల్ చంద్రుడిపై నుంచి మట్టిని, రాళ్లను తీసుకొచ్చింది

వెన్‌‌చాంగ్ అంతరిక్ష కేంద్రం నుంచి నింగికెగిరిన తర్వాత చాంగ్-6 అంతరిక్ష నౌక చంద్రుడి కక్ష్యలో తిరుగుతుంటుంది.

అప్పుడు చంద్రుడి ఆవల వైపు దిగడానికి కక్ష్యలోని అంతరిక్ష నౌక నుంచి ల్యాండర్ వేరుపడింది.

తర్వాత, చంద్రుడి మీద సురక్షితంగా భావించే ప్రాంతానికి 100మీ. ఎత్తులో నిలిచిన ల్యాండర్, నెమ్మదిగా నిట్టనిలువుగా చంద్రుడి మీద దిగడానికి ఒక త్రీడీ స్కానర్‌ను ఉపయోగించింది.

చంద్రుడికి ఆవలవైపు విజయవంతంగా ల్యాండర్ దిగడం ఒక చారిత్రక క్షణమని చైనా ప్రభుత్వ మీడియా అభివర్ణించింది.

ఈ ఆపరేషన్‌కు క్వాకియో-2 ఉపగ్రహం మద్దతుగా నిలిచిందని సీఎన్‌ఎస్‌ఏ తెలిపింది.

ఈ ల్యాండర్ అక్కడి ఉపరితలం నుంచి పదార్థాలను సేకరించడానికి మూడు రోజులు వెచ్చించాలని సీఎన్‌ఎస్‌ఏ చెప్పింది. ల్యాండర్ ఈ ఆపరేషన్ చేపట్టడానికి చాలా ఇంజినీరింగ్ నైపుణ్యాలు, అధిక రిస్క్‌తో కూడిన ఇబ్బందులు ఎదురవుతాయని వెల్లడించింది.

ఇంతవరకు ఎవరూ చూడని ఈ శిలల్ని చూసే అవకాశం మనకు దక్కుతుందంటూ ఇక్కడ అందరూ చాలా సంతోషంగా ఉన్నారని ప్రొఫెసర్ పెర్నెట్ ఫిషర్ చెప్పారు.

మాంచెస్టర్ యూనివర్సిటీ లునార్ జియాలజీ స్పెషలిస్ట్ పెర్నెట్ ఫిషర్. చంద్రుడికి ఆవలవైపున శిలల్ని విశ్లేషిస్తే గ్రహాలు ఎలా ఏర్పడతాయనే ప్రాథమిక ప్రశ్నలకు సమాధానాలు దొరకవచ్చని ఆయన అన్నారు.

చంద్రుడు

ఇప్పటివరకు చంద్రుడిపై నుంచి సేకరించిన చాలావరకు శిలలు ఐస్‌లాండ్ లేదా హవాయి‌లలో దొరికే అగ్నిపర్వత శిలల్లాగే ఉంటాయి.

కానీ, చంద్రుడిపై ఆవల వైపు ఉండే శిలలు చాలా భిన్నంగా ఉంటాయి.

డ్రిల్, మెకానికల్ చేయిని వాడుతూ దాదాపు 2 కిలోల మెటీరియల్‌ను సేకరించడమే ఈ మిషన్ లక్ష్యమని సీఎన్‌ఎస్‌ఏ చెప్పింది.

సౌరవ్యవస్థలో తెలిసిన అతిపెద్ద బిలాల్లో దక్షిణ ధ్రువం ఎయికెన్ బేసిన్ ఒకటి.

చంద్రుడి దక్షిణ ధ్రువం మీద మంచు ఉండే అవకాశం ఉండటంతో లునార్ మిషన్లలో ప్రపంచ దేశాలన్నీ ఈ భాగంపైనే ఆసక్తిని కనబరుస్తున్నాయి.

నీటి లభ్యత ఉంటే చంద్రుడి మీద శాస్త్రీయ పరిశోధనలకు మానవ సహిత స్థావరాలను ఏర్పాటు చేసే అవకాశాలను బాగా పెంచుతుంది.

ఒకవేళ ఈ మిషన్ విజయవంతమైతే, ప్రత్యేకమైన క్యాప్యూల్‌లో విలువైన శాంపుల్స్‌ తీసుకొని ఈ అంతరిక్ష నౌక భూమికి తిరిగొస్తుంది.

ఈ స్పేస్‌క్రాఫ్ట్‌ తీసుకొచ్చిన మెటీరియల్‌ను సాధ్యమైనంత సహజ వాతావరణంలో ఉంచేందుకు ప్రత్యేక పరిస్థితుల్ని సృష్టిస్తారు.

ఈ శిలల్ని విశ్లేషించడానికి చైనాలోని శాస్త్రవేత్తలకు మొదట అవకాశం ఉంటుంది. తర్వాత, ప్రపంచవ్యాప్తంగా పరిశోధకులకు వీటిని పొందడానికి దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తారు.

చంద్రుడి నుంచి నమూనాలను సేకరించే మిషన్‌ను చైనా నిర్వహించడం ఇది రెండోసారి.

వీడియో క్యాప్షన్, ఇదొక చరిత్రాత్మక ముందడుగని ప్రకటించిన బీజింగ్

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)