తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం: సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఏమన్నారంటే..

ఫొటో సోర్స్, FACEBOOK
తెలంగాణ అస్తిత్వానికి, ఆత్మగౌరవానికి పట్టాభిషేకం జరిగి దశాబ్ద కాలం పూర్తయిందని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రజలు బానిసత్వాన్ని భరించరని వ్యాఖ్యానించారు.
సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించిన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం, దశాబ్ది వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర సాధన కోసం ప్రాణాలు అర్పించిన అమరులకు నివాళి అర్పించారు.
తెలంగాణ ప్రజల ఆరు దశాబ్దాల కలను నిజం చేసిన నాటి ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్, యూపీఏ ఛైర్ పర్సన్ సోనియాగాంధీలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
అంతకుముందు జాతీయ పతాకాన్ని ఆవిస్కరించి పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. తర్వాత రాష్ట్ర గీతం ‘జయ జయమే తెలంగాణ’ను రేవంత్ రెడ్డి విడుదల చేసి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.
రేవంత్ రెడ్డి ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే...
- తెలంగాణ బానిసత్వాన్ని భరించదు. ప్రేమను పంచడం, పెత్తనాన్ని ప్రశ్నించడం తెలంగాణ తత్వం.
- 2023 డిసెంబర్ 7న ప్రారంభమైన ప్రజా పాలనలో స్వేచ్ఛ పునరుద్ధరణకు మొదటి ప్రాధాన్యత ఇచ్చాం.
- ముళ్ల కంచెలు, ఇనుప గోడలు తొలగించి పాలకులు, పాలితుల మధ్య గోడలు బద్ధలు కొట్టాం.
- మున్సిపల్ కౌన్సిలర్ నుంచి, ముఖ్యమంత్రి వరకు ప్రజలకు అందుబాటులో ఉండే పాలన తెచ్చాం.
- ప్రగతి భవన్‌ను మహాత్మ జ్యోతిరావు పూలే ప్రజా భవన్‌గా మార్చి ప్రతి మంగళ, శుక్రవారాల్లో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం.
- సచివాలయంలోకి ఈ రోజు సామాన్యుడు కూడా రాగలిగే పరిస్థితి తెచ్చాం.
- ఇందిరాపార్కులో ధర్నచౌక్ కు అనుమతి ఇచ్చాం.
- మీడియాకు స్వేచ్ఛను ఇచ్చాం. ప్రతిపక్షానికి గౌరవం ఇచ్చాం.
- మా నిర్ణయాల్లో లోటుపాట్ల సమీక్షకు అవకాశం ఇస్తున్నాం.
- తప్పులు జరిగితే సరిదిద్దుకోవడానికి సిద్ధంగా ఉన్నాం.
- ప్రజలకు స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అవకాశాలు ఇవ్వాలన్నది మా ప్రభుత్వ ప్రాధాన్యత.

- 2014 జూన్ 2న ఏర్పడిన తెలంగాణ దశాబ్దకాలం మైలురాయిని చేరింది. పదేళ్ల పాలనలో తెలంగాణ వందేళ్ల విధ్వంసానికి గురైంది.
- ప్రజా ప్రభుత్వంలో జరుపుకుంటున్న మొదటి ఆవిర్బావ దినోత్సవం ఇది. అందుకే ఈ ఆవిర్భావ దినోత్సవానికి చరిత్రలో ప్రత్యేక స్థానం ఉంటుంది.
- దశాబ్ది ఉత్సవాల శుభ సందర్భంలో అమరుల ఆశయాలు, ప్రజల కలలు నెరవేర్చే దిశగా ప్రజా ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది.
- తెలంగాణ వచ్చి పదేళ్లైనా ఇప్పటికీ మనకు రాష్ట్ర గీతం లేదు.
- ఉద్యమ కాలంలో ఉవ్వెత్తున స్ఫూర్తిని రగిలించిన “జయ జయహే తెలంగాణ జననీ జయకేతనం...” గేయమే మన రాష్ట్ర అధికార గీతం కావాలని ఆనాడు ఆశించాం.
- ప్రజల ఆకాంక్షల మేరకు ఈ పర్వదినాన “జయ జయహే తెలంగాణ...” గీతాన్ని రాష్ట్ర అధికారిక గీతంగా సగర్వంగా ప్రకటిస్తున్నాం.
- తెలంగాణ అంటే ధిక్కారం, పోరాటం. రాష్ట్ర అధికారిక చిహ్నంలో అది ప్రతిబింబించాలి.
- ఆ దిశగా ప్రజా ప్రభుత్వం నూతన చిహ్నాన్ని రూపొందించే పనిలో ఉంది.
- తెలంగాణ తల్లి నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్షల ప్రతిరూపంగా ఉండాలి.
- ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించేలా తెలంగాణ తల్లి త్వరలో రూపుదిద్దుకుంటుంది.
- మేం అధికారం చేపట్టేనాటికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ 7 లక్షల కోట్ల రూపాయల అప్పుల ఊబిలో ఉంది.
- తెలంగాణను మూడు జోన్లుగా విభజించి, ఆయా జోన్లవారీగా అభివృద్ధి ప్రణాళికలు ప్రకటిస్తాం.
- తెలంగాణలో డ్రగ్స్ అన్న మాట వినిపించడానికి వీలు లేదని మేం సంకల్పం తీసుకున్నాం. డ్రగ్స్, గంజాయి విషయంలో ప్రభుత్వం అత్యంత కఠినంగా వ్యవహరిస్తోంది.
- ఇందిరమ్మ గ్రామ సభల ద్వారా 2023 డిసెంబర్ 28 నుంచి, 2024 జనవరి 6 వరకు అభయ హస్తం గ్యారెంటీల అమలుకు దరఖాస్తులు స్వీకరించాం.
- ఈ దరఖాస్తులు కంప్యూటరీకరించి, పరిష్కరించే ప్రక్రియ నడుస్తోంది.
- ప్రభుత్వ ఆసుపత్రుల ఆధునీకరణకు కట్టుబడి ఉన్నాం.

- యువత ఉద్యోగ నోటిఫికేషన్లు, పరీక్షల నిర్వహణ పారదర్శకంగా నిర్వహించడానికి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను ప్రక్షాళన చేశాం.
- 70 రోజుల్లోనే 30 వేల మంది యువతకు ఎల్బీ స్టేడియంలో ఉద్యోగ నియామక పత్రాలు అందించాం.
- గ్రూప్ - 1 నోటిఫికేషన్ ఇచ్చాం. ఈ నెల తొమ్మిదిన ప్రాథమిక పరీక్ష జరగబోతోంది. 11,062 పోస్టులతో మెగా డీఎస్సీ నిర్వహణకు నోటిఫికేషన్ ఇచ్చాం.
- వయో పరిమితిని 44 నుంచి 46 ఏళ్లకు పెంచాం. ప్రభుత్వంలో ఖాళీలను భర్తీ చేస్తాం.
- రైతు బాగుంటే రాష్ట్రం పచ్చగా ఉంటుందని విశ్వసించే ప్రభుత్వం మాది.
- గతంలో రైతుకు ఉచిత విద్యుత్, రుణమాఫీ చేసిన చరిత్ర కాంగ్రెస్‌ది.
- ఇటీవల అకాల వర్షాలతో పంట నష్టం జరిగితే ఎకరాకు 10 వేల రూపాయలు పరిహారం ఇచ్చాం.
- ధాన్యం సేకరణ కోసం 7,245 కేంద్రాలు తెరిచాం. ఎలాంటి షరతులు లేకుండా తడిచిన ధాన్యం కొంటున్నాం.
- రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది మార్చి 6న అత్యధికంగా 298 మిలియన్ యూనిట్ల విద్యుత్ సరఫరా చేసి, రికార్డు సృష్టించాం.
- పేదల గృహాలకు 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ ఇస్తున్నాం.
- దావోస్ పర్యటనలో భాగంగా 40 వేల కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించి ఒప్పందాలు కుదుర్చుకున్నాం.
- గ్యాస్ బండను కేవలం 500 రూపాయలకే ఇచ్చే పథకాన్ని ప్రారంభించాం.
- తెలంగాణ ముందు పలు సవాళ్లు కూడా ఉన్నాయి. కృష్ణా, గోదావరి జలాల్లో మన వాటా లెక్క తేల్చాల్సిన అవసరం ఉంది. పదేళ్లైనా నీటి పంపకాలు జరగ లేదు.
- హైదరాబాద్ ఉమ్మడి రాజధానికి ఈ రోజుతో కాలం చెల్లింది.
- ఆంధ్రప్రదేశ్‌తో ఆస్తుల విభజనకు సంబంధించి సమస్యలను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించుకుంటాం.
- తెలంగాణను ప్రపంచానికి డెస్టినేషన్‌గా మార్చాలన్న తపన ఉంది.
- దీనికి నాలుగు కోట్ల ప్రజల ఆశీస్సులతో పాటు రాజకీయ, పరిపాలన, పత్రికా, న్యాయ, సామాజిక వ్యవస్థల సహకారం కావాలి.
- ఆ దిశగా ప్రతి ఒక్కరు, ప్రతి క్షణం ఆలోచన చేయాలని... ప్రజా ప్రభుత్వానికి మీ సంపూర్ణ సహకారం అందించాలని కోరుకుంటున్నా.

ఫొటో సోర్స్, BRSParty
తెలంగాణ భవన్‌లో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు, కేసీఆర్ ఏమన్నారంటే..
రాష్ట్ర ఆకాంక్షను పూర్తిచేయడంలో వెంట నిలిచిన తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు అని భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అన్నారు. ఇదొక గొప్ప ఉద్విగ్నభరిత క్షణమని పేర్కొన్నారు.
బీఆర్‌ఎస్ ఆధ్వర్యలో తెలంగాణ భవన్‌లో రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది వేడుకలు జరిగాయి.
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, జాతీయ జెండాను ఆవిష్కరించారు.
ఉద్యమంలో ఎన్నో ఆటంకాలు, అవమానాలు ఎదురయ్యాయని, అన్నింటినీ ఎదుర్కొని రాష్ట్రాన్ని సాధించామన్నారు. ఉద్యమం సమయంలో తన అనుభవాలను ఆయన పంచుకున్నారు. తొమ్మిదేళ్ల తమ పాలనలో రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేశామన్నారు.
ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చాక అమలు చేయట్లేదని కేసీఆర్ విమర్శించారు. ఎన్నికల ఫలితాలు ఎలా వచ్చినా తాత్కాలికమేనని, ప్రజా సమస్యలపై ఇక నుంచి నూతన పంథాలో పనిచేస్తామన్నారు.

తెలంగాణ ప్రజలే పోరాటమే నాకు ప్రేరణ: సోనియా గాంధీ
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ ఒక వీడియో విడుదల చేశారు.
రాష్ట్ర సాధన కోసం ప్రాణ త్యాగం చేసిన అమరులను ఈ సందర్భంగా ఆమె గుర్తు చేసుకున్నారు.
‘‘తెలంగాణ ప్రజల ప్రత్యేక రాష్ట్ర సాధనను కాంగ్రెస్ పార్టీ పూర్తి చేస్తుందని 2004లో కరీంనగర్ వేదికగా తెలంగాణ ప్రజలకు నేను మాట ఇచ్చాను. ఆ తర్వాత మా సొంత పార్టీలోనూ అసమ్మతి ఎదురైంది. కొందరు పార్టీని వీడారు.
కానీ మీ పోరాటం, సంకల్పం ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు కావాల్సిన ధైర్యాన్ని, సాహసాన్ని, ప్రేరణను నాకు అందించాయి. గత పదేళ్లుగా తెలంగాణ ప్రజల నన్ను గౌరవిస్తున్నారు.
తెలంగాణలో రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ మీ ఆకాంక్షలకు పూర్తి చేయడంలో వెనుకడుగు వేయదు’’ అని సోనియా పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి:
- ‘ఒక కూతురు నుంచి ఇలాంటి మాటలు వినడం అసాధారణంగా అనిపిస్తుంది...’
- స్కూటీ అంటే అమ్మాయి, బైక్ అంటే అబ్బాయి...హైదరాబాద్‌లో పిల్లల విక్రయ ముఠా గుట్టు ఎలా బయటపడిందంటే...
- టీ20 వరల్డ్‌కప్: ఆస్ట్రేలియా నుంచి అమెరికాకు పిచ్ తరలింపు, ఎలా సాధ్యమైంది?
- స్టార్మీ డేనియల్స్: డోనల్డ్ ట్రంప్ దోషిగా తేలిన ‘హష్ మనీ’ కేసులో కీలక వ్యక్తి అయిన ఈ మహిళ ఏం చెప్పారు?
- ఎగ్జిట్ పోల్ అంచనాలు నిజమవుతాయా, గత అనుభవాలు ఏం చెబుతున్నాయి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














