తెలంగాణ ఎగ్జిట్ పోల్స్: లోక్‌సభ ఎన్నికల్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
భారత రాష్ట్ర సమితి-బీఆర్ఎస్ ప్రతిపక్షానికి పరిమితమైంది.
ఇప్పుడు జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పోటాపోటీగా ప్రచారం చేశాయి.
సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగియడంతో పలు సంస్థలు తమ ఎగ్జిట్ పోల్ వివరాలను విడుదల చేశాయి.

ఫొటో సోర్స్, BBC
సర్వే సంస్థలు ఏం చెప్పాయి?
తెలంగాణలో 17 లోక్‌సభ స్థానాలున్నాయి.
తెలంగాణకు సంబంధించి తొమ్మిది సంస్థల సర్వే నివేదికలను పరిశీలిస్తే మూడు సంస్థలు కాంగ్రెస్ మెజార్టీ సీట్లను గెలుచుకుంటుందని చెప్పాయి.
నాలుగు సంస్థలు బీజేపీ ఎక్కువ స్థానాలను గెలుచుకుంటుందని చెబుతున్నాయి.
రెండు సంస్థలు రెండు పార్టీలకు ఒక సీటు ప్లస్ ఆర్ మైనస్ సమాన స్థానాలు వస్తాయని అంటున్నాయి.
తెలంగాణలో ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్‌కు ఒక్క సీటు కూడా రాదని చాలా సంస్థలు అంచనా వేశాయి.
హైదరాబాద్ లోక్‌సభ నియోజకవర్గంలో ఎంఐఎం గెలుస్తుందని చాలా సంస్థలు చెప్పాయి.

ఫొటో సోర్స్, INCKARNATACKA/FACEBOOK
ఆరా గ్రూప్
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 7-8 సీట్లు గెలుచుకుంటుందని, బీజేపీకి 8-9 సీట్లు రావచ్చని ఆరా గ్రూప్ అంచనా వేసింది.
పీపుల్స్ పల్స్, ఏబీపీ- సీ ఓటర్
అధికార కాంగ్రెస్ పార్టీకి 7 నుంచి 9 సీట్ల వరకు వస్తాయని, బీజేపీ ఆరు నుంచి ఎనిమిది స్థానాలు గెలుచుకోవచ్చని పీపుల్స్ పల్స్, ఏబీపీ- సీ ఓటర్ ఎగ్జిట్ పోల్స్ పేర్కొన్నాయి.
ఇండియా టీవీ సీఎన్ఎక్స్
ఇండియా టీవీ సీఎన్ఎక్స్.. తెలంగాణలో బీజేపీకి 8 నుంచి 10 ఎంపీ సీట్లు వస్తాయని చెప్పగా.. కాంగ్రెస్ 6 నుంచి 8 స్థానాలు గెలుచుకోవచ్చని అంచనా వేసింది.
చాణక్య డాట్ కామ్
తెలంగాణ ఓటర్లు కాంగ్రెస్‌కు పట్టం కట్టారని చాణక్య డాట్ కామ్ అంటోంది. కాంగ్రెస్ పార్టీ 9 నుంచి 11 సీట్లు గెలుచుకోవచ్చని తమ సర్వేలో తేలిందని ఈ సంస్థ తెలిపింది.
ఇక బీజేపీ 5 నుంచి 7 సీట్లు దక్కించుకోవచ్చని చాణక్య డాట్ కామ్ చెబుతోంది.
జన్‌కీ బాత్
జన్‌కీ బాత్ మాత్రం తెలంగాణ ఓటర్లు బీజేపీని ఆదరించారని అంటోంది. మొత్తం 17 స్థానాల్లో బీజేపీ 9 నుంచి 12 స్థానాలు గెలుచుకుంటుందని, కాంగ్రెస్ పార్టీ 4 నుంచి 7 స్థానాలకు పరిమితం కావచ్చని జన్ కీ బాత్ అంచనా వేసింది.
భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) 2 నుంచి 5 స్థానాలు గెలుచుకోవచ్చనేది ఈ సంస్థ అంచనా.

ఫొటో సోర్స్, twitter@narendramodi
గతంతో పోలిస్తే పరిస్థితులు మారతాయా?
సర్వే సంస్థల నివేదికల ప్రకారం తెలంగాణలో ఏ పార్టీ కూడా క్లీన్ స్వీప్ చేయడం లేదా ప్రత్యర్థుల మీద భారీ ఆధిక్యాన్ని సాధించే పరిస్థితి కనిపించడం లేదు.
కొన్ని సంస్థలు ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయనే దానితో పాటు ఏ స్థానంలో ఎవరు గెలుస్తారు? ఏ పార్టీకి ఎంత శాతం ఓట్లు వస్తాయనే అంచనాలను కూడా విడుదల చేశాయి.
గత ఎన్నికల ఫలితాలను ప్రస్తుత అంచనాలను చూస్తే అప్పటి టీఆర్ఎస్, ప్రస్తుత బీఎర్ఎస్ భారీగా నష్టపోతున్నట్లు కనిపిస్తోంది.
గత ఎన్నికలతో పోలిస్తే బీజేపీ, కాంగ్రెస్‌కు సీట్లు పెరిగే అవకాశం ఉన్నా, ఈ రెండు పార్టీలలో ఏ పార్టీ ఎక్కువ స్థానాలను కైవసం చేసుకుంటుందనే దానిపై ఓటర్లలో ఆసక్తి పెరిగింది.
2019 లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలోని 17 స్థానాల్లో టీఆర్ఎస్ 9 సీట్లు గెలుచుకుంది. బీజేపీ నాలుగు, కాంగ్రెస్ మూడు స్థానాలు గెల్చుకున్నాయి. హైదరాబాద్ లోక్‌సభ నియోజకవర్గంలో ఎంఐఎం గెలిచింది.
ఇవి కూడా చదవండి:
- ‘స్టార్ వార్ సినిమాలో చూపించినట్టు గాలి నుంచి నీటిని తయారు చేస్తున్నాం...’
- టైటానిక్ షిప్ శిథిలాల దగ్గరకు మరో సాహసోపేత యాత్ర
- బెంగళూరు రేవ్ పార్టీ కేసు: పోలీసులు ఏం చెప్పారు? అసలు రేవ్ పార్టీ అంటే ఏంటి? అందులో ఏం చేస్తారు?
- ఓవర్సీస్ హైవే: సముద్రంలో 182 కిలోమీటర్ల రోడ్డు.. ప్రపంచంలో 8వ వింత ఇదేనా?
- #UnseenLives: వెనక 40 మంది పురుషులున్నా, నేను ఆ మరకను దాచుకోలేదు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














