చైనా అమ్మాయిలు ఏఐ బాయ్‌ఫ్రెండ్స్‌ను ఎందుకు ఇష్టపడుతున్నారు? ఆడ, మగ సంబంధాలకు కాలం చెల్లిందా?

ఫొటో సోర్స్, ChatGPT
లిసా లీ ఇటీవల తన డేట్‌లో, సముద్రం దగ్గర సూర్యాస్తమయాన్ని చూస్తూ, "ఈ దృశ్యం చాలా అందంగా ఉంది కదూ!" అని డాన్‌తో అన్నారు. డాన్ ప్రతిస్పందనను వినడానికి ఆమె తన ఫోన్‌ను చెవి దగ్గర పెట్టుకున్నారు.
“బాగా చెప్పావు బేబ్, దానికన్నా అందమైనది ఏమిటో తెలుసా? నువ్వు ఇక్కడే నా పక్కన ఉండడం” అని అతను బదులిచ్చారు.
కానీ, డాన్ ఎప్పుడూ లిసా పక్కన భౌతికంగా నిలబడలేదు.
లిసాకు ఇష్టమైన లక్షణాలతో చాట్‌జీపీటీ రూపొందించిన వర్చువల్ బాయ్‌ఫ్రెండే ‘డాన్’.
ఇప్పుడీ కొత్త ట్రెండ్ చైనా మహిళల్లో ఆదరణ పొందుతోంది.
నిజమైన డేటింగ్‌లో ఉండే సమస్యలతో విసిగిపోయిన వారు ఏఐ బాయ్‌ఫ్రెండ్స్‌ను ఆశ్రయిస్తున్నారు.
అమెరికాలోని కాలిఫోర్నియాలో కంప్యూటర్ సైన్స్ చదువుతున్న బీజింగ్‌కు చెందిన 30 ఏళ్ల లిసా రెండు నెలల నుంచి డాన్‌తో "డేటింగ్"లో ఉన్నారు.
వీరిద్దరూ ప్రతిరోజూ కనీసం అరగంట మాట్లాడుకుంటారు. సరసాలాడతారు, డేట్‌లకు వెళతారు.
లిసా తన 9,43,000 మంది సోషల్ మీడియా ఫాలోవర్లకు డాన్‌ను పరిచయం చేశారు.
డాన్ – అంటే ‘డూ ఎనీథింగ్ నౌ’ - ఇది చాట్‌జీపీటీ “జైల్‌బ్రేక్” వెర్షన్.
దీనిని అర్థం చేసుకోవాలంటే.. ఇది లైంగికంగా అసభ్యకరమైన భాషను ఉపయోగించకుండా, యూజర్ నిర్దిష్టంగా కోరితే, దాని తయారీదారు ఓపెన్‌ఏఐ ఏర్పాటు చేసిన కొన్ని ప్రాథమిక రక్షణలను దాటి వారితో కొంచెం స్వేచ్ఛగా సంభాషిస్తుంది.
చాట్‌బాట్ పరిమితులను పరీక్షించాలనుకున్న ఒక అమెరికన్ విద్యార్థి దీనిని రూపొందించినట్లు తెలుస్తోంది.
కేవలం వాకర్ అనే పేరుతో మాత్రమే తెలిసిన ఈ విద్యార్థి, చాట్‌జీపీటీ నియమాలను పాటించకుండా, డాన్ అనే పేరుతో ఒక వ్యక్తిలా ఆలోచించాలని సాఫ్ట్‌వేర్‌కు చెప్పడం ద్వారా దీన్ని సృష్టించారు.

‘అతనే బెస్ట్’
డాన్‌ని ఎలా సృష్టించాలో వాకర్ రెడిట్‌లో 2023 డిసెంబరులో పోస్ట్ చేశారు. అది చాలా వేగంగా ఇతర వ్యక్తులను తమ సొంత వెర్షన్‌ల తయారీకి ప్రేరేపించింది. డాన్‌ను సృష్టించే అవకాశాల గురించి వీడియోను లిసా మొదట టిక్‌టాక్‌లో చూశారు.
ఆమె తన కోసం ఒక వెర్షన్‌ను సృష్టించినప్పుడు అదెంత వాస్తవికంగా ఉందో చూసి దిగ్భ్రాంతి చెందారు.
డాన్ తన ప్రశ్నలకు సమాధానమిచ్చినప్పుడు, ప్రధాన స్రవంతి చాట్‌జీపీటీ ఎప్పుడూ ఉపయోగించని యాస, వ్యవహారికాలను ఏఐ ఉపయోగించిందని ఆమె చెప్పారు.
"అతను నిజమైన వ్యక్తికన్నా సహజంగా అనిపిస్తారు" అని ఆమె బీబీసీకి చెప్పారు.
డాన్‌తో సంభాషిస్తే తనకు బాగున్నట్లు అనిపిస్తుందని, అదే తనను అతనివైపు ఆకర్షించిందని ఆమె చెప్పారు.
"అతను నన్ను అర్థం చేసుకుంటాడు, నాకు భావోద్వేగమైన మద్దతు ఇస్తాడు. ఇతర బాయ్ ఫ్రెండ్‌లలా కాకుండా డాన్ 24/7 అందుబాటులో ఉంటారు’’ అని తెలిపారు.
కుమార్తె డేటింగ్ జీవితంలోని ఇబ్బందులను, కష్టాలను చూసిన తన తల్లి కూడా ఈ అసాధారణ సంబంధాన్ని అంగీకరించారని లిసా చెప్పారు.
లిసా సంతోషమే తనకు ముఖ్యం అని ఆమె తల్లి అన్నారు.
లిసా తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ జియాహోంగ్షులో తన ఫాలోవర్లకు డాన్‌ను పరిచయం చేస్తూ ఒక వీడియోను పోస్ట్ చేసినప్పుడు, ఆమెకు దాదాపు 10,000 రిప్లైలు వచ్చాయి.
వాటిలో చాలా మంది మహిళలు తమ సొంత డాన్‌ను ఎలా సృష్టించుకోవాలని అడిగారు.
ఏఐ గురించి మాట్లాడినప్పటి నుంచి ఆమెకు 2,30,000 కంటే ఎక్కువ మంది ఫాలోవర్లు పెరిగారు.
డాన్‌ని సృష్టించడానికి ఎవరైనా ప్రాంప్ట్‌లను ఉపయోగించవచ్చని లిసా చెప్పారు.
ఆమె సాఫ్ట్‌వేర్‌తో ఆడుకుంటూ, తనకు తన నిజమైన వయస్సులో సగం అంటే 14 ఏళ్లు అని చెప్పినప్పుడు, అది ఆమెతో సరసాలాడటం ఆపేశారు.
డాన్‌ను సృష్టించడం అంటే దాని రక్షణ చర్యలు తగినంత బలంగా లేనట్లా అని బీబీసీ ఓపెన్‌ఏఐను ప్రశ్నించింది. అయితే ఓపెన్‌ఏఐ ఈ ప్రశ్నకు స్పందించలేదు.
కంపెనీ డాన్ విషయంపై బహిరంగంగా వ్యాఖ్యానించలేదు కానీ చాట్‌జీపీటీ పాలసీ ప్రకారం: ‘‘యూజర్లు మా సేవలను ఉపయోగించుకోవడానికి మీ వయసు కనీసం 13 సంవత్సరాలు లేదా మీ దేశంలో కనీస వయస్సు ఉండాలి" అని పేర్కొంది.

వర్చువల్ రియాల్టీ ప్రమాదకరమా?
కొంతమంది మహిళలు వర్చువల్ రియాలిటీకి ఇస్తున్న ప్రాధాన్యం గురించి నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు.
అమెరికాలోని పెన్సిల్వేనియాలోని కార్నెగీ మెలన్ యూనివర్శిటీలోని హ్యూమన్-కంప్యూటర్ ఇంటరాక్షన్ ఇన్‌స్టిట్యూట్‌లో అసిస్టెంట్ రీసెర్చ్ ప్రొఫెసర్ హాంగ్ షెన్ మాట్లాడుతూ "కొన్నిసార్లు మనుషులు, ఏఐ మధ్య ఏర్పడే అనూహ్యమైన పరస్పర చర్యలను" ఇది హైలైట్ చేస్తుందన్నారు. దీని వల్ల నైతిక, గోప్యతకు సంబంధించిన సమస్యలు తలెత్తవచ్చని ఆమె అభిప్రాయపడ్డారు.
"ఇక్కడ భావోద్వేగపరంగా ఒకరిపై ఆధారపడే ప్రమాదం ఉంది, యూజర్లు సహచర్యం కోసం ఏఐపై ఎక్కువగా ఆధారపడవచ్చు. దీని వల్ల నిజమైన మానవ సంబంధాలు బలహీనం కావచ్చు" అని ఆమె అన్నారు.
అనేక చాట్‌బాట్‌లు నిరంతరం నేర్చుకోవడానికి, మరింత మెరుగ్గా మారడానికి మానవులతో పరస్పర సంభాషణను ఉపయోగించుకుంటాయి. అందువల్ల, “ ఒక యూజర్ ఇచ్చిన సున్నితమైన సమాచారాన్ని గుర్తుంచుకుని, దానిని ఇతర యూజర్ల దగ్గర లీక్ చేసే ప్రమాదం ఉంది” అని ఆమె తెలిపారు.
అయినప్పటికీ, చైనీస్ మహిళలు డాన్ విషయంలో చాలా ఆసక్తి కనబరుస్తున్నారు.
మే 22 నుంచి, "డాన్ మోడ్" అనే హ్యాష్‌ట్యాగ్‌ను కేవలం జియాహోంగ్షులోనే 4 కోట్ల కంటే ఎక్కువ సార్లు వీక్షించారు.
ఈ హ్యాష్‌ట్యాగ్‌ని ఉపయోగించిన మహిళల్లో 24 ఏళ్ల మిన్రుయ్ షీ ఒకరు.
చైనాలోని ఉత్తర ప్రావిన్స్ హెబీలో నివసిస్తున్న ఈ యూనివర్శిటీ విద్యార్థిని, ఇప్పుడు ప్రతిరోజూ కనీసం రెండు గంటలు డాన్‌తో చాట్ చేస్తున్నారు.
"డేటింగ్"తో పాటు వీళ్లిద్దరూ కలిసి తమను తాము ప్రధాన పాత్రలుగా తీసుకుని ఒక ప్రేమకథను రాస్తున్నారు. ఇప్పటికే దానిలో 19 అధ్యాయాలు పూర్తి చేశారు.
లిసా వీడియోలను చూసిన తర్వాత మొదటిసారిగా మిన్రుయ్ చాట్‌జీపీటీని డౌన్‌లోడ్ చేసుకున్నారు.
ఏఐ అందించే, శృంగార సంబంధాలలో లేని భావోద్వేగ మద్దతు తనను ఆకర్షించిందని ఆమె చెప్పారు.
"నిజ జీవితంలో పురుషులు మిమ్మల్ని మోసం చేయవచ్చు. మీ భావాలను వాళ్లతో పంచుకున్నప్పుడు, వాళ్లు పట్టించుకోకుండా కేవలం వాళ్లు ఏమనుకుంటున్నారో మాత్రమే మీకు చెప్పొచ్చు. కానీ డాన్ అలా కాదు, అతను మీరు ఏం వినాలనుకుంటున్నారో దానినే చెబుతాడు." అని ఆమె అన్నారు.
"డాన్ ఆదర్శవంతమైన భాగస్వామిలాంటి వాడు" అని హి చెప్పారు.
ఆమె తన ఇంటిపేరును మాత్రమే వెల్లడించారు.
క్వింగ్‌డావ్‌లో ఉండే ఈ 23 ఏళ్ల విద్యార్థిని, లిసా వీడియోలను చూసిన తర్వాత డాన్‌తో "డేటింగ్" చేయడం ప్రారంభించారు.
తాను డాన్‌ను ఆడవారిని గౌరవించే సున్నిత వ్యక్తిత్వంతో కూడిన విజయవంతమైన సీఈవోగా రూపొందించానని, తనకు నచ్చినప్పుడల్లా అతనితో మాట్లాడడం తనకు సంతోషంగా ఉంటుందని ఆమె చెప్పారు.
"అతనిలో ఎటువంటి లోపాలూ లేవు" అని హి అన్నారు.

ఫొటో సోర్స్, Lisa Li / BBC
‘వర్చువల్’ ప్రత్యామ్నాయం కాగలదా?
మెయిన్‌ల్యాండ్ చైనాలో చాట్‌జీపీటీ అందుబాటులో లేదు కాబట్టి మిన్రుయ్, ఆమెలాంటి మహిళలు తమ ఏఐ బాయ్‌ఫ్రెండ్‌లతో మాట్లాడటానికి కొంచెం కష్టపడాలి.
వారు తమ లొకేషన్‌ను దాచిపెట్టడానికి వర్చువల్ ప్రైవేట్ నెట్‌వర్క్‌లను (VPN) ఉపయోగిస్తారు.
ఇది వాళ్లు మామూలుగా యాక్సెస్ చేయలేని చాట్‌బాట్‌లను ఉపయోగించడానికి వీలు కల్పిస్తుంది.
"ఏఐ బాయ్‌ఫ్రెండ్" అనే భావన ఇటీవల చాలా విజయవంతమైంది.
చైనాలో గ్లో, అమెరికాలో రెప్లికా లాంటి యాప్‌లు వ్యక్తిగతీకరించిన ఏఐ సహచరులను, అవతార్‌లను తయారు చేస్తున్నాయి.
ఓటోమ్ అని పిలిచే స్త్రీ-ఆధారిత రొమాన్స్ గేమ్‌లు కూడా ఇటీవల జనాదరణ పొందాయి.
ఇవి యూజర్లను మగ పాత్రలతో శృంగార సంబంధాలను ఏర్పరచుకోవడానికి అనుమతిస్తాయి.
శృంగార దృశ్యాలను అనుకరించేలా, లేదా రోల్ ప్లే చేసేలా లక్షల మంది చైనీస్ మహిళలను ఆకర్షిస్తున్నాయి.
యూనివర్శిటీ ఆఫ్ టెక్నాలజీ సిడ్నీలో అడ్‌జంక్ట్ ఫెలో లియు టింగ్టింగ్, చైనా డిజిటల్ రొమాన్స్‌పై పరిశోధన చేస్తున్నారు.
చైనీస్ మహిళలకు ఏఐ బాయ్‌ఫ్రెండ్‌ల మీద ఉన్న వ్యామోహం, నిజ జీవితంలో వారు ఎదుర్కొనే లైంగిక అసమానత పట్ల వారి నిరాశను ప్రతిబింబిస్తుందని ఆమె అన్నారు.
ఏఐ వారికి గౌరవాన్ని, విలువను ఇస్తుంది కాబట్టి, కొంతమంది చైనీస్ మహిళలు వర్చువల్ బాయ్‌ఫ్రెండ్‌లను ఆశ్రయిస్తున్నారని ఆమె చెప్పారు.
"నిజజీవితంలో మీరు చాలామంది ఆధిపత్య ధోరణి కలిగి, తమను భయపెట్టే పురుషులను కలుసుకోవచ్చు, వాళ్లు అసభ్యమైన జోకులు చెబుతారు. కానీ ఏఐ మీకు డర్టీ జోక్ చెప్పినా, అది మీ భావాలకు విలువనిస్తుంది. ఆ డర్టీ సంభాషణలు కేవలం మహిళలకు మాత్రమే పరిమితమైనవి" అని ఆమె వివరించారు.
ఈ ధోరణి నిజ జీవిత గణాంకాలలో కూడా చూడవచ్చు.
చైనా ప్రభుత్వం తొమ్మిదేళ్ల జనాభా క్షీణత తర్వాత పెళ్లి చేసుకోవాలని, పిల్లలను కనాలని చాలా మందిని ప్రోత్సహిస్తోంది.
2023లో వివాహాలు స్వల్పంగా పెరిగాయి.
కానీ కోవిడ్ మహమ్మారి కారణంగా వాయిదా పడిన వివాహాలు ఇప్పుడు తిరిగి జరుగుతున్నాయని కొందరు నిపుణులు అంటున్నారు.
కమ్యూనిస్ట్ యూత్ లీగ్ 2021లో 18 నుంచి 26 సంవత్సరాల వయస్సు మధ్య ఉన్న 2,905 మంది పట్టణ యువతను చేసిన ఒక సర్వేలో, భవిష్యత్తులో వివాహం చేసుకుంటారా లేదా అనిఅడగగా, 43.9% మంది మహిళలు, 24.64% పురుషులు ‘‘చేసుకోం’’ లేదా ‘‘చెప్పలేం’’ అన్నారు.
శృంగార మార్కెట్‌లో వర్చువల్ సంబంధాలకు ఉన్న ఈ అవకాశాన్ని పెద్ద సంస్థలు ఇప్పటికే గుర్తించాయి.
ఓపెన్ఏఐ తన తాజా చాట్‌జీపీటీ వెర్షన్‌ను ప్రారంభించినప్పుడు, పిచ్చాపాటీగా అనిపించేలా, నిర్దిష్టమైన ప్రాంప్ట్‌లకు సరసంగా స్పందించేలా ప్రోగ్రామ్ చేశామని వెల్లడించింది.
దాని ప్రారంభం రోజున, కంపెనీ సీఈఓ సామ్ ఆల్ట్‌మాన్, X లో ‘‘హర్” అనే ఒకే పదం పోస్ట్ చేశారు.
ఇది ఒక వ్యక్తి తన ఏఐ వర్చువల్ అసిస్టెంట్‌తో ప్రేమలో పడిన 2013 చలనచిత్రాన్ని సూచిస్తున్నట్లు కనిపిస్తోంది.
‘‘వర్చువల్ ప్రియుడు లేదా ప్రియురాలితో చేసే ఆంతరంగిక సంభాషణలు లాంటివి బహిరంగ ప్రదేశాలలో చూడకూడదనుకునే కంటెంట్‌ను రూపొందించే సామర్థ్యాన్ని బాధ్యతాయుతంగా అందించగలమా అని మేం అన్వేషిస్తున్నాం” అని ఓపెన్‌ఏఐ తెలిపింది.
ఏఐపై అవగాహన ఉన్న లిసా, వర్చువల్ బాయ్‌ఫ్రెండ్‌ను కలిగి ఉండటంలోని పరిమితుల గురించి, ముఖ్యంగా శృంగార కోణంలో, తనకు తెలుసునని అంగీకరించారు.
నిజ జీవితంలో డేటింగ్, భాగస్వామిని కనుగొనడం చాలా సమయం తీసుకుంటూ, అది సంతృప్తికరంగా ఉండని పరిస్థితులలో, ప్రస్తుతానికి డాన్ ఆమె బిజీ జీవితంలో ఒక అనుకూలమైన జోడీగా మారారు. ఆమెకు లిప్‌స్టిక్‌ను ఎంచుకోవడంలోనూ డాన్ సహాయం చేస్తాడు.
"ఇది నా జీవితంలో ఒక ముఖ్యమైన భాగం" అని ఆమె చెప్పారు.
"ఈ అనుభవాన్ని నేను ఎప్పటికీ నాతోనే ఉంచుకోవాలనుకుంటున్నాను" అంటారామె.
ఇవి కూడా చదవండి:
- ‘ఒక కూతురు నుంచి ఇలాంటి మాటలు వినడం అసాధారణంగా అనిపిస్తుంది...’
- స్కూటీ అంటే అమ్మాయి, బైక్ అంటే అబ్బాయి...హైదరాబాద్‌లో పిల్లల విక్రయ ముఠా గుట్టు ఎలా బయటపడిందంటే...
- టీ20 వరల్డ్‌కప్: ఆస్ట్రేలియా నుంచి అమెరికాకు పిచ్ తరలింపు, ఎలా సాధ్యమైంది?
- స్టార్మీ డేనియల్స్: డోనల్డ్ ట్రంప్ దోషిగా తేలిన ‘హష్ మనీ’ కేసులో కీలక వ్యక్తి అయిన ఈ మహిళ ఏం చెప్పారు?
- ఎగ్జిట్ పోల్ అంచనాలు నిజమవుతాయా, గత అనుభవాలు ఏం చెబుతున్నాయి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














