Mental Health: వర్చువల్ రియాలిటీతో మానసిక అనారోగ్యానికి చికిత్స -డిజిహబ్

మానసిక ఒత్తిడి

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, పూర్ణిమ తమ్మిరెడ్డి
    • హోదా, బీబీసీ కోసం

'గేమ్ ఓవర్' (2019) సినిమాలో కథానాయకురాలైన స్వప్న (తాప్సీ పన్ను) ఒక న్యూ ఇయర్ పార్టీకి వెళుతుంది. అక్కడ ఓ చీకటి గదిలో రేప్‍కు గురవుతుంది. అప్పటి నుంచి ఆమెకు ట్రామా (PSTD) వల్ల చీకటి గదిలో ఉండాలంటే భయం. ఉక్కిరిబిక్కిరి అవుతుంటుంది.

ఆ భయాన్ని దూరం చేయడానికి, ఒక సైక్రియాట్రిస్ట్ వర్చువల్ టెక్నాలజీ వాడి ఆమెకు చికిత్స (థెరపీ) చేస్తారు.

స్వప్న, డాక్టర్ ఇద్దరూ ఆమె ఇంట్లోనే, సోఫాలో కూర్చుని ఉంటారు. ఆమె కళ్ళకు వి.ఆర్ హెడ్‍సెట్ తగిలించగానే, ఒక వర్చువల్ ఇంట్లోకి ఆమె ప్రవేశిస్తుంది. డాక్టర్ మాటలు కూడా వినిపిస్తుంటాయి.

సొంత ఇంట్లో, పగటి పూట వెలుతురు పడుతున్న రూములో, డాక్టర్ పక్కనే కూర్చుని ఉన్నా.. వి.ఆర్ హెడ్‍సెట్‍లో కనిపిస్తున్న ఇంట్లో ఉన్నట్టు ఆమెకి అనిపిస్తుంది. ఆ ఇంట్లో ఆమె నడవగలదు, చుట్టూ తిరగలదు, వేటినైనా తాకగలదు.

ఈ వర్చువల్ వాతావరణంలో, గేమింగ్‍లో ఉన్నట్టే లెవల్స్ ఉంటాయి.

లెవల్-1లో బాగా వెలుతురు ఉన్న గది.. దాంట్లో ఆమె ఏ ఇబ్బందీ లేకుండా మసలుతుంది.

లెవల్-2లో ఇంకో గదిలో మసక వెలుతురు.. దాంట్లోకి ప్రవేశించేసరికి ఆమెకు భయం మొదలవుతుంది, శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది. అయినా, డాక్టర్ పక్కనే ఉండి ధైర్యం చెబుతుండడంతో ఆ గదిలో ఉండగలుగుతుంది.

లెవల్-3లో పూర్తిగా చీకటిగా ఉన్న గది. ఆమె భయంతో ఉక్కిరిబిక్కిరి కావడంతో డాక్టరు సూచనలు కూడా బుర్రకెక్కవు. ఆ గదిలో క్షణం కూడా ఉండలేక, వెంటనే వి.ఆర్ హెడ్‍సెట్ తీసేస్తుంది.

వర్చువల్ థెరపీతో మానసిక సమస్యలను దూరం చేయవచ్చు

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, వర్చువల్ థెరపీతో మానసిక సమస్యలను దూరం చేయవచ్చు

ఒక మనిషి ఏ పరిస్థితుల వల్ల భయాందోళలనకు గురవుతున్నారో, దేన్ని ఎదుర్కోలేక మాటమాటికీ తప్పించుకుంటున్నారో, ఆ పరిస్థితినే వర్చువల్‌గా సృష్టించి, ఆ మనిషిని అందులో నిలిపి, దాన్ని ఎదుర్కొనేలా చేయడాన్ని 'ఇన్-సిట్యు' (in-situ) కోచింగ్/థెరపీ అంటారు.

ఇది ఎప్పటినుంచో వాడుకలో ఉన్న సాంకేతిక ప్రక్రియే అయినా వర్చువల్ టెక్నాలజీ ద్వారా దీన్ని మరింత సమర్ధవంతంగా, తక్కువ ఖర్చులో వినియోగించే ప్రయత్నాలు ఇటీవల ఊపందుకుంటున్నాయి.

పైన చెప్పుకున్న ఉదాహరణలో, గదిని చీకటిగా చేస్తే చాలు. అందుకోసం మామూలు థెరపీ రూమ్‍లో కూడా లైట్లు తీసేసి చీకటి వాతావరణాన్ని సృష్టించవచ్చు.

కానీ, ఆప్తులను విమాన ప్రమాదంలో పోగొట్టుకున్నాక ఫ్లైట్ అంటే భయంపట్టుకున్న వాళ్ళని మాటిమాటికీ నిజమైన విమానాల్లో తిప్పుతూ భయం పోగొట్టాలంటే ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చుకోగలగాలి.

అదే, వర్చువల్ టెక్నాలజీతో అయితే సోఫాలో కూర్చున్నా, నిజంగా ఫ్లైటులో ప్రయాణిస్తున్న భావన కలిగించి, భయాందోళనలు ఎదుర్కోగలిగేలా థెరపీ అందించవచ్చు.

వర్చువల్ రియాలిటీ అంటే ఏమిటి?

వర్చువల్ రియాలిటీని, సింపుల్‍గా అర్థం చేసుకోవాలంటే, కంప్యూటర్లు సృష్టించే 3D లోకం. నమ్మశక్యంగా, ఇంటరాక్టివ్‍గా.. మనం శారీరకంగా, మానసికంగా అక్కడే ఉన్నామనిపించేంత నిజంగా ఉంటుందా లోకం.

దీనికి ఉండే కొన్ని ముఖ్య లక్షణాలు:

  • నమ్మశక్యంగా ఉంటుంది: ఆ కృత్రిమ ప్రపంచమే మన వాస్తవమన్న నమ్మకం కలిగించేలా ఉంటుంది. ఆ భ్రమ తొలిగిపోతే వర్చువల్ రియాల్టీకి, 3D సినిమాకి తేడా ఉండదు.
  • ఇంటరాక్టివ్‍గా: మన లోకంలో కదలికలను బట్టి వినిపించేవి, కనిపించేవి ఎలా మారుతుంటాయో, ఈ కృత్రిమ లోకంలో కూడా అలాంటి మార్పులే అనుభవంలోకి రావాలి. మన కదలికలను బట్టి వి.ఆర్ ప్రపంచమూ కదలాలి.
  • కంప్యూటర్ల నిర్మాణం: వాస్తవ ప్రపంచాన్ని తలపింపజేయగలిగేది కేవలం high-end కంప్యూటర్లు మాత్రమే. రియల్ టైమ్‍లో పరిసరాల్లో మార్పులు రావాలి, దానికి చాలా ఎక్కువ కంప్యూటింగ్ కెపాసిటీ అవసరమవుతుంది.
  • అన్వేషణకు అనుకూలం: ఒక పెయింటింగ్‌గానీ, ఫోటోగానీ తీస్తే మనకి ఆ ఆర్టిస్ట్ ఏం చూపదల్చుకున్నారో అదే హైలైట్ అవుతుంది. అయితే, హడావిడిగా ఉన్న ఒక వీధిని చిత్రీకరించిన బొమ్మలో ఏదో మూలన ఉన్న ఓ దుకాణం మన దృష్టిని ఆకర్షిస్తే, వి.ఆర్ లోకంలో ఆ మూలకి వెళ్ళి ఆ షాపులో ప్రవేశించగలగాలి.
  • ఆ లోకంలో మునిగిపోయేట్టు చేస్తుంది: మనసు, శరీరం కూడా ఆ కృత్రిమ లోకమే మన వాస్తవంగా స్వీకరించగలగాలి. వాస్తవంలో పంచేద్రియాలకు అనుభవంలోకి వచ్చేది అక్కడ కూడా అనుభవంలోకి రావాలి. చూపు, వాసన, స్పర్శ, రుచి అన్నీ ఆ లోకానివై ఉండాలి.
వీడియో క్యాప్షన్, మానసిక ఆరోగ్యం: మీకు దిగులుగా ఉంటోందా... గుండె దడ పెరుగుతోందా?

వర్చువల్ రియాల్టీ పరికరాలు

హెడ్-మౌంటెడ్ డివైజులు ఇవి కళ్ళకు పెట్టుకునే హెడ్‍సెట్‍లు. వీటిల్లో 3D ఇమేజులు మన కళ్ళ కదలికను బట్టి ఎంత వేగంగా, ఎంత సున్నితంగా మారిపోతాయంటే రియల్‍ ప్రపంచంలో చూస్తున్నట్టే అనిపిస్తుంది.

ఈ హెడ్‍సెట్‌లో మూడు ముఖ్య భాగాలు: 1) రెండు కళ్ళ ముందు రెండు చిన్న స్క్రీనులు, 2) బయట ప్రపంచపు సంగతులేవీ కనిపించకుండా ఒక బ్లైండ్ ఫోల్డ్, 3) స్టీరియో హెడ్‍ఫోన్స్.

తల, శరీర కదలికలను పసిగట్టే సెన్సార్స్ కూడా ఉంటాయి. ఇవన్నీ ఉండడంతో వి.ఆర్ హెడ్‍సెట్లు బరువుగా ఉంటాయి.

'స్మార్ట్ గ్లాసెస్'లో ఉండే అద్దాలు అగ్మెంటెడ్ రియాల్టీ అద్దాలు. అవి చాలా తేలిగ్గా ఉండి, వాస్తవ ప్రపంచాన్ని చూపిస్తూనే దానిపైన డేటాను కూడా మనకు చూపిస్తాయి.

వి.ఆర్ హెడ్‍సెట్‌లో మాత్రం మన ప్రపంచం పూర్తిగా మాయమైపోయి ఒక కొత్త లోకం అనుభవంలోకి వస్తుంది. అందుకే దీన్ని immersive technology అంటారు.

వర్చువల్ థెరపీ

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఇమర్సివ్ రూమ్స్ (Immersive rooms)

పైన చెప్పుకున్న హెడ్‍సెట్లు పెట్టుకునే బదులు ఒక ప్రత్యేకమైన గదిలో ఉండవచ్చు. ఆ గది గోడలపైన బయటనుంచి పంపిస్తున్న ఇమేజ్‌లు చాలా వేగంగా మారుతూ నిజంగా చూస్తున్నామన్న భ్రమ కలిగింపజేస్తాయి.

పైలట్ ట్రైనింగ్‍లో ఎత్తైన పర్వతాల మీద, సముద్రాల మీద విమానం నడిపే శిక్షణ ఇవ్వాలంటే ఇలా ఒక గదిలో సిమ్యులేటర్‌పై కూర్చుని ఆ పరిసరాలను రిక్రియేట్ చేసుకోవచ్చు.

డేటా గ్లవ్స్

ఏదన్నా చూడగానే తాకాలనిపించడం సహజం. తాకగలిగినది ఏదన్నా మనకు వాస్తవం అనిపిస్తుంది.

వి.ఆర్ లోకంలో దృష్టికి మాత్రమే కాదు, స్పర్శకు కూడా చాలా ప్రాముఖ్యత ఉంటుంది. మన మెదడును నమ్మించాలంటే స్పర్శ ముఖ్యం.

మామూలు గ్లవ్స్‌కు సెన్సర్లు పెడితే అవి మన చేతి, వేళ్ళ కదిలికలను బట్టి మెదడుకు సంకేతాలు పంపిస్తాయి.

అంటే, ఒక వి.ఆర్ గదిలో సోఫా మీద చేయి ఆనిస్తే మెత్తగా తగలాలి, పెయింటింగ్ ఫ్రేమ్ తాకితే నున్నగా అనిపించాలి. డేటా గ్లవ్స్ ఆ పనిచేస్తాయి.

మానసికారోగ్యంలో వర్చువల్ రియాల్టీ పాత్ర

వ్యాసం మొదట్లో చెప్పుకున్న 'in-situ' థెరపీ కేవలం ఒక ఉదాహరణ మాత్రమే. మానసికారోగ్య రంగంలో వర్చువల్ రియాల్టీ ఇంకెన్నో విధాలుగా సహాయపడగలదు.

రోల్ ప్లే థెరపీ: ఇందులో,ఏదన్నా చెడు సంఘటన ఎదుర్కొన్నాక, ఆ ట్రామాను దూరం చేయడానికి అదే సంఘటనను మళ్ళీ మళ్ళీ రిపీట్ చేయిస్తారు. వాళ్ళకి కాక, వేరెవరికో జరిగినట్టు కూడా చూపించగలరు.

వేరొకరి దృష్టికోణం నుంచి చూసినప్పుడు అదే సంఘటన ఎలా మారుతుందన్నది పాయింట్ అక్కడ. అయితే ఇవన్నీ 'టాక్ థెరపీ'లు. బాగా మాట్లాడాలి వీటిల్లో.

చిన్నపిల్లలు, టీనేజర్లు, మాట్లాడలేనంత షాక్‍కి గురైనవారు అంతగా సహకరించరు. ఆ సందర్భాల్లో, వర్చువల్ రియాల్టీతో ఆ సంఘటనను పునఃసృష్టించి అందులో వారిని భాగం చేస్తే, మానసిక నిపుణులు తోడుగా ఉంటారు కాబట్టి భావోద్వేగాలు సరిగ్గా ప్రాసెస్ చేసుకోగలుగుతారు.

ఫోబియాలకు థెరపీ: కొంతమందికి పబ్లిక్ స్పీకింగ్ అంటే భయం, మరికొందరికి ఎత్తులంటే. ఇంకొందరికి క్రిమి కీటకాలంటే భయం. ఇలాంటివాటికి exposure therapy చేస్తుంటారు. అంటే, ఏదంటే భయమో దానితోనే సమయం గడిపేలా చేయడం.

దశలవారిగా ఈ ఫోబియాలు దూరం చేయడంలో వి.ఆర్ బాగా పనికొస్తుందని అంచనా.

కోడింగ్ ద్వారా రోగి కోలుకుంటున్న విధానం బట్టి వాతావరణాన్ని కంట్రోల్ చేసుకుంటూ పోవచ్చు. ఉదాహరణకు, ఎన్ని అంతస్థుల ఎత్తులో నిలబెట్టాలి అన్నది కంట్రోల్ చేయవచ్చు.

ఈటింగ్ డిసార్డర్ థెరపీ: ఏ ఆహారం, ఎలా తీసుకుంటున్నారు, ఎంత వేగంగా తింటున్నారు లాంటి వివరాలను వి.ఆర్‌లో కంట్రోల్ చేయడం ద్వారా ఆహారపు అలవాట్లను మెరుగుపర్చుకోవచ్చు.

ఫలానా ఆహారం తీసుకోవడం వలన శరీరంలో రాబోయే మార్పులు గురించి ముందే వి.ఆర్ లో చూపించడం వల్ల వాటి నుంచి ధ్యాస మార్చవచ్చు.

రియాలిటీనే కాదు మనుషులూ వర్చువల్: కృత్రిమ వాతావరణంతో పాటు కృత్రిమ మనుషులనూ తయారుచేసి వి.ఆర్ లోకంలో ప్రవేశ పెట్టవచ్చు.

ప్రస్తుతం కాలంలో థెరపీలు ఖర్చుతో కూడుకున్న పని. అందరికీ అందుబాటులో ఉండవు. అలాంటప్పుడు, అంతగా జటిలం కాని సమస్యలకు వర్చువల్ థెరపిస్ట్ సృష్టించిన థెరపీ రూమ్‌లో ఉంచినా మంచి ఫలితాలు ఆశించవచ్చని కొన్ని పరిశోధనలు చెప్తున్నాయి.

ఒక చాట్ బోట్‌తో స్క్రీన్ మీద మాట్లాడినట్టు కాకుండా నిజమైన మనిషితో మాట్లాడిన భావన కలుగుతుంది.

ఇదే టెక్నాలజీని మరోలా కూడా వాడుకోవచ్చు. కొన్ని కేసుల్లో మనిషి తన ఆగ్రహావేశాలను ఇంకో మనిషిపై చూపెడితే కానీ వాళ్ళ ట్రామా పోదు.

ఉదాహరణకు, తండ్రే కూతురిపై అత్యాచారాలు చేసుంటే, తండ్రి పట్ల ఆ అమ్మాయికి విపరీతమైన ద్వేషం, అసహ్యం కలుగుతాయి. వాటిని తండ్రి మీద చూపించే అవకాశాలు దాదాపుగా ఉండవు.

మామూలుగా అయితే, థెరపిస్టులు ఎంతో శ్రమపడి ఆ కోపాన్నీ, ద్వేషాన్నీ వెళ్లగక్కేలా చేస్తుంటారు. బొమ్మనో వస్తువునో చేతిలో పెట్టి దాన్నే మనిషి అనుకుని ఏమన్నా చేయమంటారు.

అదే, వి.ఆర్‌లో ఆ తండ్రి వర్చువల్ రూపాన్ని ఎదురుగా కూర్చోబెట్టి, తన కోపాన్ని చూపించే పరిస్థితి సృష్టిస్తే, లోపల కరుడుకట్టుకున్న భావాలు బయటకొచ్చే అవకాశాలు ఎక్కువ. నిజమైన మనుషులు ఉండరు కాబట్టి, జరిగే హాని ఏమీ ఉండదు.

వర్చువల్ థెరపీ

ప్రయోజనాలు సరే, ఇదో ఊబి కూడా

మానసిక ఆరోగ్య రంగంలో టెక్నాలజీ పాత్ర ఊహించినదాని కంటే వేగంగా పెరుగుతోంది. ముఖ్యంగా, కోవిడ్ తరువాత 'ఆన్‍లైన్ థెరపీలు' అందుబాటులోకి వచ్చాయి.

థెరపిస్ట్, రోగి ఎదురెదురుగా కూర్చుని మాట్లాడుకోనవసరం లేకుండా ఆప్స్, బోట్స్ (bots) పుట్టుకొచ్చాయి. కోవిడ్ సృష్టించిన భీభత్సానికి తట్టుకోలేక, గత్యంతరం లేక చాలా మంది వాటిని ఆశ్రయించారు కూడా.

అదే అదను అనుకుని టెక్ కంపెనీలు ఈ రంగంపై విశేషంగా దృష్టి పెడుతున్నాయి.

వర్చువల్ రియాల్టీ ద్వారా మానసికారోగ్యం అందించే థెరపీలకు మార్కెట్ తయారవుతోంది. అయితే, ఇది ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కావడంతో కొందరికే అందుబాటులో ఉంటుంది. ఇది ఒక సమస్య.

వర్చువల్ రియాల్టీ ఒక వినూత్న అనుభవాన్ని కలిగించే టెక్నాలజీ. ఏది నిజం, ఏది అబద్ధం అన్న విచక్షణను (కాసేపటికే అయినా) పోగొడుతుంది.

ఇలాంటి టెక్నాలజీ వల్ల కొత్త సమస్యలు పుట్టుకు రావొచ్చని నిపుణులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

వి.ఆర్ హెడ్‍సెట్స్ పెట్టుకుని ఎక్కువ సేపు ఉండడం వల్ల సైబర్ సిక్‍నెస్ కలగవచ్చు. అసలే మానసికంగా దెబ్బ తిన్న రోగులపై ఇవన్నీ ఎలాంటి దుష్ప్రభావాలు చూపుతాయో ప్రస్తుతానికి తెలీదు.

ఏ టెక్నాలజీ అయినా దాన్ని ఎక్కడ, ఎవరు, ఎలా ఉపయోగిస్తున్నారు అన్నది కూడా కీలకమే అవుతుంది. దీని అర్థం చేసుకుని వ్యవహరించాల్సిన బాధ్యత టెక్ కంపెనీలది మాత్రమే కాదు, మనందరిదీ కూడా.

(అక్టోబర్ 10, ప్రపంచ మానసికారోగ్య దినం (మెంటల్ హెల్త్ డే) సందర్భంగా ఈ వారం డిజిహబ్ లో మానసిక ఆరోగ్యానికి వర్చువల్ రియాలిటీ అన్న అంశం గురించిన వివరాలు అందిస్తున్నాం.)

(అభిప్రాయాలు రచయిత వ్యక్తిగతం)

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)