‘గాంధీ’ సినిమాకు ముందు ఆయన గురించి ప్రపంచానికి తెలియదా, మోదీ ఏమన్నారు?

మహాత్మా గాంధీ

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, మురళీధరన్ కాశీవిశ్వనాథన్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచారం చివరి దశలో భాగంగా ఒక ప్రైవేట్ న్యూస్ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో, 1982లో రిచర్డ్ అటెన్‌బరో తీసిన ‘గాంధీ’ సినిమా విడుదలకు ముందు వరకు, విదేశాల్లో ఉండే వారికి మహాత్మా గాంధీ గురించి ఏమీ తెలియదని అన్నారు.

‘‘మహాత్మా గాంధీ వ్యక్తిత్వం చాలా గొప్పది. గత 75 ఏళ్లుగా గాంధీ గురించి ప్రపంచానికి తెలియజేయాల్సిన బాధ్యత మనకు లేదా? నన్ను క్షమించండి. కానీ, గాంధీ గురించి ఎవరికీ తెలియదు’’ అని అన్నారు.

‘‘గాంధీ గురించి సినిమా తీసినప్పుడు, ఆయన గురించి తెలుసుకోవాలని ప్రపంచానికి ఆసక్తి కలిగింది. ఒక దేశంగా, వారిని మనం ప్రపంచానికి పరిచయం చేయలేకపోయాం. కానీ, వారిని ప్రపంచానికి పరిచయం చేయడం మన దేశ కర్తవ్యం’’ అని వ్యాఖ్యానించారు.

ఈ వ్యాఖ్యలను కాంగ్రెస్ నేతలు, గాంధేయవాదులు తప్పుబడుతున్నారు.

మోదీ ప్రకటనపై మాట్లాడిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ‘ఎవరెవరు శాఖల్లో ప్రపంచ జ్ఞానాన్ని పొందారో, వాళ్లకు గాంధీ గురించి తెలీదు. కానీ గాంధీని హత్య చేసిన గాడ్సే గురించి వారికి తెలుసు’ అని అన్నారు.

బీబీసీ వాట్సాప్ చానెల్
బెన్ కింగ్‌స్లీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, గాంధీ పాత్రలో నటించిన బెన్ కింగ్‌స్లీకి ఆస్కార్ అవార్డు లభించింది.

రిచర్డ్ అటెన్‌బరో సినిమా ‘గాంధీ’ ఎలా ఉంది?

భారత స్వాతంత్య్ర సంగ్రామాన్ని ముందుండి నడిపిన మోహన్‌దాస్ కరమ్‌చంద్ గాంధీ జీవితంపై సినిమా తీసేందుకు 1952 తర్వాత నుంచి పలుమార్లు ప్రయత్నించారు. కానీ, అది జరగ లేదు.

బ్రిటీష్ డైరెక్టర్ రిచర్డ్ అటెన్‌బరో తొలిసారి గాంధీ జీవితంపై సినిమా తీసేందుకు 1960ల్లోనే ప్రయత్నించారు.

20 తర్వాత 1980 నవంబర్‌లో అటెన్‌బరో ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభించారు. ఈ సినిమా షూటింగ్ ఏడాదిన్నర పాటు కొనసాగింది. 1981 మే నెలలో ఈ సినిమా షూటింగ్‌ను పూర్తి చేసుకుంది.

ఈ సినిమాలో గాంధీ పాత్రను బెన్‌ కింగ్‌స్లీ పోషించారు. నెహ్రూ పాత్రలో రోషన్ సేథ్, గాంధీని హత్య చేసిన నాథూరామ్ గాడ్సే పాత్రలో హర్ష్ నాయర్ నటించారు.

ఈ సినిమా 1982 నవంబర్ 30న దిల్లీలో ప్రదర్శించారు. ఆ తర్వాత ఇది అమెరికా, బ్రిటన్‌లలో కూడా విడుదల చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులు, విమర్శకుల నుంచి ఈ సినిమాకు మంచి స్పందన వచ్చింది.

మహాత్మా గాంధీపై తీసిన ఈ సినిమా కమర్షియల్‌గా మంచి విజయాన్ని సాధించింది. ఆస్కార్, బ్రిటీష్ అకాడమీ వంటి ప్రతిష్టాత్మక పురస్కారాలను ఈ సినిమా గెలుచుకుంది.

మహాత్మా గాంధీని తెరపై కళ్లకు కట్టినట్లు చూపిన బెన్‌ కింగ్‌స్లీకి ఆ ఏడాది ఉత్తమ నటుడి కేటగిరీలో ఆస్కార్ అవార్డు లభించింది.

అయితే, ఈ సినిమా వచ్చిన తర్వాతనే గాంధీ గురించి నిజంగా ప్రపంచానికి తెలిసిందా?

అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, గాంధీకి ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీ 1930ల్లోనే లభించింది.

చార్లీ చాప్లిన్‌తో మహాత్మా గాంధీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, చార్లీ చాప్లిన్‌తో మహాత్మా గాంధీ(1931లో లండన్‌లో తీసిన ఫోటో)

మహాత్మా గాంధీ పేరును నోబెల్ పురస్కారానికి ఎప్పుడు ప్రతిపాదించారు?

1930ల్లో నోబెల్ పురస్కారం కోసం పలుసార్లు మహాత్మా గాంధీ పేరు చర్చకు వచ్చింది.

గాంధీకి ఎందుకు ఈ అవార్డు లభించలేదు అనే ప్రశ్నకు సమాధానంగా నోబెల్ ప్రైజ్ కమిటీ రాసిన ఒక కథనంలో దీని గురించి ప్రస్తావించింది.

నోబెల్ విజేతల గురించి జరిగిన చర్చలలో మొత్తంగా ఐదుసార్లు మహాత్మా గాంధీ పేరు ప్రతిపాదనకు వచ్చినట్లు ఈ కథనంలో పేర్కొంది.

1937, 1938, 1939, 1947, 1948లలో మహాత్మా గాంధీ పేరును నోబెల్ పురస్కారం కోసం పరిగణనలోకి తీసుకున్నట్లు చెప్పింది.

ఈ కథనంలో నోబెల్ ప్రైజ్ కమిటీ ఇచ్చిన సమాచారం మేరకు, గాంధీ పేరును నోబెల్ పురస్కారానికి ప్రతిపాదించిన సంస్థల పేర్లను చదివితే, ఆ దశాబ్దంలో ప్రపంచవ్యాప్తంగా గాంధీ ఎంత ప్రభావితం చేయగల వ్యక్తో తేలికగా అర్థమవుతుంది.

‘‘గాంధీ ఫాలోయర్స్‌లో అత్యంత ముఖ్యమైన సంస్థ ‘ఫ్రెండ్స్ ఆఫ్ ఇండియా’ ఒకటి. 1930 దశకం తొలినాళ్లల్లోనే యూరప్, అమెరికాల్లో ఈ సంస్థ ఏర్పాటైంది’’ అని నోబెల్ ప్రైజ్ కమిటీ రాసిన తన కథనంలో పేర్కొంది.

1937లో నార్వే ఎంపీ ఓలే కల్బ్‌జాన్సన్ గాంధీకి నోబెల్ శాంతి పురస్కారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆ తర్వాత ఈ అవార్డు కోసం పరిశీలించిన 13 మంది పేర్లలో మహాత్మా గాంధీ పేరు కూడా ఉన్నట్లు నోబెల్ ప్రైజ్ కమిటీ తన కథనంలో తెలిపింది.

మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్

కానీ, ఆ ఏడాది ఎందుకు మహాత్మా గాంధీకి నోబెల్ పురస్కారం ఇవ్వలేదు?

ఈ ప్రశ్నకు సమాధానాన్ని కూడా ఈ కథనంలో ఇచ్చింది.

‘‘ఓలే కల్బ్‌జాన్సన్ 1938, 1939 ఏళ్లలో గాంధీ పేరును ప్రతిపాదించారు. కానీ, ఆయనకు ఈ పురస్కారం ఇవ్వలేదు. 1947లో మరోసారి గాంధీ పేరు నామినేట్ అయింది. గాంధీ పేరు తుది జాబితాలోకి కూడా వచ్చింది. 1948లో గాంధీ హత్యకు గురైన తర్వాత కూడా నోబెల్ పురస్కాారానికి గాంధీ పేరును ప్రతిపాదించారు’’ అని నోబెల్ ప్రైజ్ కమిటీ తన కథనంలో పేర్కొంది.

కానీ, 1948లో నోబెల్ ప్రైజ్ కమిటీ ఎవరికీ నోబెల్ శాంతి పురస్కారం ఇవ్వలేదని తెలిపింది. మరణానంతరం మహాత్మా గాంధీకి నోబెల్ ప్రైజ్ ఇచ్చేందుకు కమిటీ ఇష్టపడకపోవడంతో గాంధీకి కూడా ఈ బహుమతి రాలేదు’’ అని రాసింది.

అయితే, నోబెల్ పురస్కారం కోసం గాంధీ పేరు పలుసార్లు ప్రతిపాదనలోకి రావడం ఒక్కటే ప్రపంచవ్యాప్తంగా గాంధీ పాపులారిటీ సంపాదించారన్న దానికి కొలమానంగా చెప్పగలమా? అంటే అలా అని చెప్పలేం.

మహాత్మా గాంధీ తన జీవిత కాలంలో ప్రపంచవ్యాప్తంగా మానవ హక్కుల కోసం పోరాడిన ఎంతో మంది ప్రముఖ కార్యకర్తలకు స్ఫూర్తిగా నిలిచారు.

వారిలో అత్యంత ప్రముఖ వ్యక్తి మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ ఒకరు. అమెరికాలో పౌర హక్కుల కోసం పోరాటం చేసిన వ్యక్తి ఆయన.

‘మై పిలిగ్రిమేజ్ టూ నాన్-వయెలెన్స్’ అనే పుస్తకంలో ‘‘అణగారిన వర్గాల విముక్తి కోసం జరిగిన ప్రతి పోరాటంలో, గాంధీ మార్గం అత్యంత నైతికమైంది, న్యాయపూర్వకమైంది. భగవంతుడు మాకు ఈ మార్గం చూపించాడు. గాంధీ ఈ పోరాటం కోసం ఒక ప్రణాళికను చూపించారు’’ అని మార్టిన్ లూథర్ కింగ్ రాశారు.

గాంధీ సిద్ధాంతం కేవలం మార్టిన్ లూథర్ కింగ్‌కు మాత్రమే స్ఫూర్తిదాయకం కాలేదు. నెల్సన్ మండేలాకు కూడా ప్రేరణగా నిలిచింది.

దక్షిణాఫ్రికాలో వర్ణవివక్షకు వ్యతిరేకంగా అతిపెద్ద పోరాటాన్ని చేశారు నెల్సన్ మండేలా.

‘‘గాంధీ అహింస మార్గానికి కట్టుబడి ఉన్నారు. గాంధీ సిద్ధాంతాలను అనుసరించేందుకు నా వంతు ప్రయత్నిస్తాను’’ అని నెల్సన్ మండేలా అన్నారు.

మహాత్మా గాంధీ 70వ పుట్టిన రోజు సందర్భంగా 1939లో ప్రచురితమైన ‘మహాత్మా గాంధీ’ పుస్తకం 1930ల నాటికే గాంధీకి ఉన్న అంతర్జాతీయ ప్రాచుర్యాన్ని తెలియజేసింది.

గాంధీ గురించి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ రాసిన ఈ పుస్తకం పలు కథనాలు, వ్యాసాల సమాహారం. మహాత్మా గాంధీ కృషిని, ఆయన జీవిత విశేషాలను తెలుపుతూ పలు ఆర్టికల్స్‌ను ఇది ప్రచురితం చేసింది.

1931లో బ్రిటన్‌ను సందర్శించిన మహాత్మా గాంధీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, 1931లో బ్రిటన్‌ను మహాత్మా గాంధీ సందర్శించినప్పుడు తీసిన ఫోటో

యూరప్‌లో మహాత్మా గాంధీకి ఆహ్వానాలు

మహాత్మా గాంధీ లండన్ వెళ్లినప్పుడల్లా ఇతర యూరప్ దేశాలకు ఆయన్ను ఆహ్వానించడం సంప్రదాయంగా మారింది.

గాంధీకి అత్యంత ఉత్సాహంతో స్వాగతం చెప్పేవారు. రౌండ్ టేబుల్ సమావేశం కోసం లండన్‌కు గాంధీ వెళ్లినప్పుడు, ఆయన భారత్‌కు తిరిగి రావడానికి ముందు ఫ్రాన్స్, స్విట్జర్లాండ్, ఇటలీ వంటి పలు దేశాలలో పర్యటించారు.

గాంధీ విదేశీ ప్రయాణాలపై తరచూ కథనాలు రాసే సీనియర్ జర్నలిస్ట్ మీరా కామ్దార్, ‘‘1931లో మహాత్మా గాంధీ ప్రపంచంలోనే అత్యంత ప్రముఖమైన వ్యక్తి. దండీ మార్చ్ గురించి యూనైటెడ్ ప్రెస్ జర్నలిస్ట్ వెబ్ మిల్లర్ రాసిన కథనం వేలకు పైగా వార్తాపత్రికలలో ప్రచురితమైంది’’ అని చెప్పారు.

‘‘1931లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశానికి గాంధీ హాజరయ్యారు. ఆ తర్వాత, జెనీవాకు వెళ్లి రొమైన్ రోలాండ్‌ను కలవడానికి ముందు పారిస్ వెళ్లారు. అక్కడ పెద్ద ఎత్తున చేరిన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు’’ అని మీరా కామ్దార్ రాశారు.

1930ల్లో గాంధీ ప్రపంచానికి ఎలా తెలిశారో తెలుపుతూ చరిత్రకారులు వెంకట చలాపతి ఒక ఉదాహరణ చెప్పారు.

‘‘1930 మార్చిలో దండీ మార్చ్‌ను గాంధీ ప్రారంభించినప్పుడు, ఈ ప్రయాణాన్ని కవర్ చేసేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న జర్నలిస్టులు, ఫోటోగ్రాఫర్లు భారత్‌కు వచ్చారు. దండీ మార్చ్ ఘట్టాన్ని వారి కెమెరాలలో బంధించారు. గాంధీ పాపులారిటీ ఏ స్థాయిలో ఉందో చెప్పేందుకు ఇదే నిదర్శనం’’ అని చెప్పారు.

నెహ్రూ, గాంధీ

ఫొటో సోర్స్, Getty Images

గాంధీ సినిమాకు ముందు కూడా డాక్యుమెంటరీ విడుదల

‘గాంధీ’ పేరుతో రిచర్డ్ అటెన్‌బరో సినిమా విడుదల చేయడానికి సుమారు 40 ఏళ్ల ముందు, గాంధీ జీవితంపై ఒక డాక్యుమెంటరీని రూపొందించారు. దీన్ని ఎ.కె.చెట్టియార్ రూపొందించారు. 20వ శతాబ్దంలో ప్రముఖ తమిళ్ డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్ ఇతను.

ఈ డాక్యుమెంటరీ కోసం చెట్టియార్ 1930ల్లో గాంధీ గురించి తెలుసుకునేందుకు ప్రపంచవ్యాప్తంగా వేల కి.మీలు ప్రయాణం చేశారు.

1940లో 2 గంటల నిడివితో డాక్యుమెంటరీని విడుదల చేశారు. ఆ తర్వాత తెలుగు, హిందీలో ఈ డాక్యుమెంటరీ విడుదలైంది. అమెరికాలో కూడా ఈ డాక్యుమెంటరీని ప్రదర్శించారు.

1931లో అమెరికాకు చెందిన టైమ్ మేగజైన్ తన కవర్‌ పేజీపై గాంధీ ఫోటోను వేసి ‘మ్యాన్ ఆఫ్ ది ఇయర్’గా గౌరవించింది. అంటే, అమెరికాలో కూడా గాంధీకి ఆ సమయంలోనే ప్రాచుర్యం ఉందని స్పష్టమైంది.

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)