యూఏఈలో పది లక్షల కోట్ల ఖర్చుతో నిర్మించిన ఈ కృత్రిమ దీవుల్లో ఏముంది?

ఫొటో సోర్స్, Getty Images
గత శతాబ్ధం ముగింపు సమయంలో, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ విలాసవంతమైన కృత్రిమ ద్వీప సముదాయాలను నిర్మించడానికి ఒక ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు ప్రారంభించింది.
ఇదొక విప్లవాత్మక పరిష్కారం కానప్పటికీ, చరిత్రలో చాలా కాలం క్రితమే టిటికాకా సరస్సులో కృత్రిమ దీవులు ఉన్నాయి. ఈ ప్రాజెక్టు ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. మిగతా అంశాలతో పాటు ఆకాశం నుంచి చూస్తే ఈ ప్రాజెక్టు ఆకృతిని అందరూ ప్రస్తుతించారు.
ఈ ప్రాజెక్టులలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైనది ‘ది వరల్డ్’. ఇది దాదాపు 300 కృత్రిమ ద్వీపాలతో కనిపించే ద్వీప సమూహహం. ఇది ప్రపంచ పటాలలో కనిపించే ఏడు ఖండాల ఆకారానికి పునః సృష్టి లాంటిది.
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ 2003లో ఈ ప్రాజెక్టును ప్రారంభించారు.
ఈ ప్రాజెక్టులో ఆకర్షణీయ అంశం ఏంటంటే కొనుగోలుదారులు, బ్రిటన్, అమెరికా, గ్రీన్‌లాండ్, సోమాలియా వరకు ఆయా దేశం ఆకారంలో ఉండే ఈ దీవుల్లో తమకు నచ్చిన దాన్ని ఎంచుకోవచ్చు.
పది లక్షల కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడి పెట్టి, 32.1 కోట్ల క్యూబిక్ మీటర్ల ఇసుక, 38.6 కోట్ల టన్నుల రాళ్లు ఉపయోగించి సృష్టించిన ఈ ద్వీపాల్లో ప్రపంచంలోని సంపన్నులు విలాసవంతమైన ఇళ్లను నిర్మించుకోవచ్చు.
“యునైటెడ్ ఎమిరేట్స్ ప్రధాన ఆదాయ వనరు చమురు మీద ఆధారపడటాన్ని తగ్గించుకోవడానికి ఆ దేశం కనుక్కున్న ఒక మార్గం రియల్ ఎస్టేట్ వ్యాపారం” అని న్యూకాజిల్ యూనివర్సిటీలో ప్రొఫెసర్, ‘ఏ జర్నీ ఇన్ టు ద ఎరా అఫ్ అర్టిఫిషియల్ ఐలండ్స్’ పుస్తక రచయిత అలెస్టర్ బొన్నెట్ బీబీసీతో చెప్పారు.
“కృత్రిమ ద్వీపాల నిర్మాణం మోడల్‌ను నైజీరియా కూడా కాపీ కొట్టింది. అయితే అక్కడ కొన్ని విజయాలు, కొన్ని వైఫల్యాలు ఉన్నాయి” అని ఆయన అన్నారు.


ఫొటో సోర్స్, Getty Images
ఎమిరేట్స్‌లో వ్యాపారం అనుకున్నట్లుగా జరగలేదని అనిపిస్తోంది.
“ప్రపంచంలో నిరుపయోగంగా మారిన భారీ ప్రాజెక్టులలో ఇదొకటి” అని ప్రముఖ లగ్జరీ వెబ్ పోర్టల్ పేర్కొంది.
ఈ ప్రాజెక్టు ప్రారంభించి 21 ఏళ్లు గడిచాయి. కేవలం రెండు ద్వీపాలను మాత్రమే పూర్తి స్థాయిలో నిర్మించారు. ఆకాశం నుంచి చూస్తే ప్రపంచ పటంలో ఎక్కువ భాగం ఎడారిలా ఉన్న ద్వీపాలే కనిపిస్తున్నాయి..
“ఈ ప్రాజెక్టులో భాగంగా రచించిన ప్రణాళికలు వాస్తవ రూపం దాల్చలేదు. పనులు ప్రారంభమైన తర్వాత “ది వరల్డ్” లో కనిపిస్తున్న ద్వీపాలన్నీ ఇసుక దిబ్బలుగా కనిపిస్తున్నాయి” అని పోర్టల్ ఎత్తి చూపింది.
ఈ ప్రాజెక్టు కోలుకునే పరిస్థితి మరింత అస్పష్టంగా ఉంది. ప్రాజెక్టులో 60 శాతం అమ్ముడుపోయింది. తమ పనులు ప్రణాళిక ప్రకారం కొనసాగుతాయని డెవలపర్లు చెబుతున్నారు. ఈ ద్వీపాలు ఇప్పటికే కోతకు గురవుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయని అనేక పరిశోధనల్లో తేలింది.
ఒక అద్బుతమైన దేశం మద్దతు ఉన్న ప్రాజెక్టు ‘ఘోస్ట్ కాంప్లెక్స్’గా ఎలా మారింది?

ఫొటో సోర్స్, Getty Images
ది పామ్ అండ్ ది వరల్డ్
1999లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తనను తాను ఆధునిక, అంతర్జాతీయ దేశంగా ప్రపంచానికి పరిచయం చేసుకుంది.
సరిగ్గా అదే సంవత్సరం బర్బ్ అల్ అరబ్ హోటల్‌ను ప్రారంభించారు. ఇది ప్రపంచంలోని లగ్జరీ భావనను పునర్నిర్వచించింది.
అదే ఏడాది, యూఏఈ షేక్ “ది పామ్ జుమేరా” ప్రాజెక్టును ప్రకటించారు. ఈత చెట్టు ఆకారంలో ఉండే ఈ కృత్రిమ ద్వీపాల సముదాయంలో నివాస గృహాలతో పాటు హోటల్ కాంప్లెక్స్ ఇందులో నివాస గృహాలు, హోటల్ కాంప్లెక్స్ నిర్మిస్తామని చెప్పారు.
ఈ ప్రాజెక్టుకు సంబంధించి అమ్మకాలు బాగా జరిగాయి, ఇది ఇలాంటి మరి కొన్ని ప్రాజెక్టుల రూపకల్పనకు దారి తీసింది.
2003లో అల్ మక్తూమ్ స్వయంగా “ది వరల్డ్” నిర్మాణానికి పచ్చజెండా ఊపారు. దుబాయ్ సాగర తీరానికి దూరంగా నిర్మించిన 300 ద్వీపాల నెట్‌వర్క్ పామ్ జుమేరా విజయాన్ని ప్రతిబింబించింది.
“ఈ ప్రాజెక్టు మీద చాలా ఆసక్తి ఉంది. ఇది ప్రపంచంగా పిలిచే ద్వీపాల సముదాయం. ఇందులో అంతరిక్షంలో కనిపించే పాలపుంత, సూర్యుడు, భూమిని డిజైన్ చేశారు” అని బోన్నెట్ చెప్పారు.
ఈ ప్రణాళిక చాలా విస్తృతమైనది, అదే సమయంలో సరళమైనది కూడా. 300 కృత్రిమ ద్వీపాలతో ప్రపంచాన్ని నిర్మించడం, ఆ ప్రపంచంలో సంపన్నులు తమకు నచ్చనట్లుగా చిన్న ప్రపంచాన్ని నిర్మించుకోవడం, ఇదే ఈ ప్రాజెక్టు లక్ష్యం.
“ప్రతీ దీవిలో చేపట్టే ప్రాజెక్టులు కూడా అద్భుతంగా ఉన్నాయి. చైనీస్ బిలియనీర్ ఒకరు తన ద్వీపంలో షాంఘై స్కైలైన్ నిర్మించాలని ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. అందులో ఐకానిక్ షాంఘై టవర్ కూడా ఉంటుంది” అని గార్డియన్ రిపోర్టర్ ఒలివర్ వెయిన్ రైట్ గుర్తు చేశారు.
“ఒపులెన్స్ హోల్డింగ్స్ అనే సంస్థ సోమాలియా ఆకారంలో ఉన్న దీవిని కొనుగోలు చేసింది. దాన్ని సముద్ర గుర్రం ఆకారంలోకి మార్చి, ఆ దీవిలో ఉండేవారు తమ ఇళ్ల బాల్కనీలో నుంచి గోల్ఫ్ బంతులను కొట్టేలా డిజైన్లు రూపొందించింది” అని వెయిన్ రైట్ చెప్పారు.
వాస్తవం ఏంటంటే ఇప్పటికి పూర్తయింది రెండు మాత్రమే.
అందులో ఒకటి గ్రీన్‌ల్యాండ్ ఆకారంలో ఉంది. ఇందులో మోడల్ హౌస్ లాంటి దాన్ని అమర్చారు. ఈ ప్రాజెక్టులోకి వచ్చే ప్రతీది అందరికీ కనిపిస్తుంది. అందులో నివాస స్థలాలే కాదు, రిసార్టులు, రెస్టారెంట్లు లాంటివి కూడా ఉన్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
మరో అంశం ఏంటంటే ఈ ఇంటిని ఫార్ములా వన్ వరల్డ్ ఛాంపియన్ మైకేల్ షూమాకర్‌కు దానమిచ్చారు.
2008లో వచ్చిన ఆర్థిక సంక్షోభం ఈ ప్రాజెక్టుని దెబ్బ తీసింది.
ఇందులో ఇల్లు కొంటామని నిర్ణయించుకున్న వారిలో చాలా మంది వద్ద ఇల్లు కొనేందుకు డబ్బులు లేని పరిస్థితులు వచ్చాయి.
అయినప్పటికీ ఈ ప్రాజెక్టు కొనసాగుతోంది, అయితే అందులో పెద్దగా పురోగతి లేదు.
“ది వరల్డ్ ప్రాజెక్టున్న అతి పెద్ద సమస్యల్లో ఒకటి ఏంటంటే ది పామ్ కున్నట్లుగా ది వరల్డ్ ప్రాజెక్టుకు దుబాయితో నేరుగా సంబంధాలు లేవు. ఈ దీవుల్లో ఒక దాని నుంచి మరొక దానికి కార్లలో వెళ్లేందుకు వంతెనలు లాంటివి ఏమీ లేవు” అని బొన్నెట్ట్ చెప్పారు.
ప్రస్తుతం ఈ ప్రాజెక్టు డెవలపర్ నఖీల్ ప్రాపర్టీస్ ‘ది వరల్డ్’ ప్రాజెక్టు కొనసాగుతుందని పలు సందర్భాల్లో ప్రకటించింది. అయితే దీన్ని కొనసాగించేందుకు అవసరమైన నిధుల కోసం ఎదురు చూస్తున్నామని చెబుతోంది.

ఫొటో సోర్స్, Getty Images
ఇతర ప్రాజెక్టులు
“ది వరల్డ్” ప్రాజెక్టులో అనుకున్న స్థాయిలో పురోగతి లేకపోవడం అంటే దుబాయి రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగా లేదని కాదు.
ప్రస్తుతం పామ్ జుమేరా, మిగతా కృత్రిమ దీవుల్లో 4 వేల ఇళ్లున్నాయి. వీటిలో 25 వేల మంది నివసిస్తున్నారు. డజన్ల కొద్దీ హోటళ్లు, ఇతర ప్రత్యేక ఆకర్షణలు కూడా తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి.
ప్రస్తుతానికి ఈ ప్రాజెక్టు పని తీరు బాగానే ఉన్నప్పటికీ, నగరాల అభివృద్ధి కోసం స్థలాన్ని సృష్టించేందుకు కృత్రిమ ద్వీపాల నిర్మాణ వ్యాపారం రిస్కుతో కూడుకున్నది.
“పెరుగతున్న సముద్రాల నీటి మట్టం కృత్రిమ ద్వీపాల నిర్మాణ వ్యాపారాన్ని ప్రమాదంలోకి నెడుతోంది. అయితే దుబాయ్ ఓ విషయంలో తన ప్రత్యేకతను చాటుకుంటోంది. రిస్క్ తీసుకునేందుకు అది ఏ మాత్రం వెనుకాడటం లేదు. అది ఖరీదైనది అయినప్పటికి కూడా” అని ప్రొఫెసర్ అలిస్టర్ బోన్నెట్ అన్నారు.
జుమేరా, “ ది వరల్డ్” ‘డెయిరా ఐలండ్’ లాంటి ఇతర సముదాయాల నిర్మాణం నిధులు లేకపోవడం వల్ల ఆగిపోయింది. వీటి నిర్మాణం వల్ల పర్యావరణం దెబ్బ తింటోందని విమర్శలు వస్తున్నాయి.
ఈ ప్రాజెక్టు పర్యావరణ పరంగా హితమైనది కాదని గ్రీన్‌పీస్ సంస్థ ఆరోపిస్తోంది. కృత్రిమ ద్వీపాల నిర్మాణం వల్ల ఎమిరేట్స్ తీరంలోని పగడపు దిబ్బలకు తీవ్రమైన ముప్పు ఏర్పడుతుందని చెబుతోంది.
పర్యావరణ కోణంలో చూస్తే, ఈ ప్రాజెక్టు నిర్మాణం వల్ల సముద్ర పర్యావరణ వ్యవస్థలు ప్రభావితం అయ్యాయని డెవలపర్ సంస్థ నఖీల్ ప్రాపర్టీస్ అంగీకరించింది. ప్రాజెక్టు నిర్మాణంలో దెబ్బ తిన్న పగడపు దీవులను పునర్నిర్మించేందుకు నిపుణులైన సముద్ర జీవశాస్త్రవేత్తల బృందాన్ని నియమిస్తామని చెబుతోంది.
ఇవి కూాడా చదవండి:
- ఏసీ పేలి ఇల్లంతా కాలిపోయింది.. అసలు ఏసీ ఎందుకు పేలుతుంది.. పేలకుండా ఏం చేయాలి?
- గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి: కొత్తగా తీసిన పాత కథ.. విశ్వక్సేన్ నటన మెప్పించిందా?
- స్కూటీ అంటే అమ్మాయి, బైక్ అంటే అబ్బాయి...హైదరాబాద్‌లో పిల్లల విక్రయ ముఠా గుట్టు ఎలా బయటపడిందంటే...
- ‘ఒక కూతురు నుంచి ఇలాంటి మాటలు వినడం అసాధారణంగా అనిపిస్తుంది...’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














