ప్రిన్సెస్ లతీఫా: ఈ దుబాయ్ యువరాణిని ఎందుకు నిర్బంధించారు... ఆమె ఇప్పుడు ఎలా ఉన్నారు?

ఫొటో సోర్స్, GETTY IMAGES / PRINCESS LATIFA
- రచయిత, జేన్ మెక్‌ముల్లన్
- హోదా, బీబీసీ న్యూస్
దుబాయి యువరాణి ప్రిన్సెస్ లతీఫా కిడ్నాప్, నిర్బంధానికి సంబంధించిన అనేక సంచలన విషయాలు బైటికి వస్తున్నాయి. నిర్బంధంలోకి వెళ్లిపోయిన లతీఫా, మొదట్లో తన స్నేహితురాలు టీనా జౌహియైనెన్తో ఫోన్ ద్వారా మాట్లాడారు.
లతీఫా తాను రహస్యంగా దాచుకున్న మొబైల్ ఫోన్ ద్వారా ఇది సాధ్యమైంది. అయితే ఇప్పుడు ఆమె నుంచి కాల్స్, మెసేజ్‌లు ఆగిపోయాయి. టీనా జౌహీనియన్‌కు లతీఫాతో సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి.
దుబాయ్‌ని వదిలేయాలనీ, విదేశాలలో నివసించాలని కోరుకున్న లతీఫా, 2018 ఫిబ్రవరిలో దేశం విడిచి పారిపోవడానికి ప్రయత్నించి పట్టుబడ్డారు.
టీనా జౌహియైనెన్ తన స్నేహితురాలు లతీఫాను చివరిసారిగా హిందూ మహాసముద్రంలో తాము ప్రయాణిస్తున్న యాట్ (పడవ)లో చూశారు.

ఫొటో సోర్స్, Getty Images
ఎవరీ ప్రిన్సెస్ లతీఫా?
దుబాయ్ పాలకుడు షేక్ ముహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ 25 మంది సంతానంలో లతీఫా ఒకరు. పాలకుడిగా దేశాన్ని అందమైన ప్రాంతంగా, వ్యాపార కేంద్రంగా తీర్చిదిద్దారు షేక్ ముహమ్మద్ బిన్ రషీద్.
కానీ, అరబ్ ఎమిరేట్స్‌లోని కొన్ని చట్టాలు మహిళల జీవితాలను చీకటిమయం చేస్తున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ చట్టాలు, నిబంధనల కట్టడి నుంచి బయటపడేందుకు లతీఫా ప్రయత్నించారు.
పారిపోయే ముందు కూడా లతీఫా ఒక వీడియోలో "డ్రైవింగ్ చేయడానికి నాకు పర్మిషన్ లేదు. దుబాయ్‌లో ప్రయాణం చేయడానికి, దేశం విడిచి వెళ్లడానికి నాకు అనుమతులు లేవు" అని పేర్కొన్నారు.
"2000వ సంవత్సరం నుంచి నేను దేశంలోనే బందీ అయ్యాను. ఎక్కడి వెళ్లాలన్నా, ఏం చేయాలన్నా ఆఖరికి పుస్తకం చదవాలన్నా కూడా పర్మిషన్ తీసుకోవాలి. నేను అడిగినా వారు తిరస్కరిస్తూనే ఉన్నారు. నేను ఈ దేశంలో ఉండలేను" అన్నారామె.
స్నేహితురాలు టీనా అపార్ట్‌మెంట్‌లో ఉండగా తన భవిష్యత్తు గురించి లతీఫా ఓ వీడియో రికార్డు చేశారు. తాను ఎలా ఉండాలనుకుంటున్నానో ఆమె వీడియోలో వివరించారు.
"నాకు భవిష్యత్తు పట్ల ఎన్నో ఆలోచనలు ఉన్నాయి. నిద్ర లేచినప్పటి నుంచి రోజంతా నేను ఏం చేయాలో అది చేయగలిగే రోజు వచ్చినప్పుడు నేను ఎలా ఉంటానో నాకు తెలియదు. దాని కోసం ఎదురు చూస్తున్నాను" అన్నారామె.
లతీఫా పాస్‌పోర్ట్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆమెపై నిఘా పెట్టారు. ఈ పరిస్థితుల్లో కూడా ఆమె ఎలాగోలా దుబాయి నుంచి ఒమన్ తీరానికి చేరుకున్నారు. ఒక చిన్నబోటు ద్వారా తనను విదేశాలకు చేర్చే షిప్‌ను చేరుకున్నారు.
తర్వాత ఆమె ఓ స్నేహితురాలికి “ఇప్పుడు నేను స్వేచ్ఛగా ఉన్నాను” అని వాట్సప్ మెసేజ్ పంపారు. హిందూ మహాసముద్రం మీదుగా అమెరికా వెళ్లాలని ఆమె భావించారు.
అక్కడికి వెళ్లి రాజకీయ ఆశ్రయం పొందాలన్నది లతీఫా ఆలోచన.

ఫొటో సోర్స్, Getty Images
ఇండియా చేరాక నా కలలు కల్లలయ్యాయి: లతీఫా
ఎనిమిది రోజుల తరువాత భారత తీరానికి సమీపిస్తున్న తరుణంలో ఆమె ప్రయత్నాలు తలకిందులయ్యాయి. సాయుధులైన సైనికులు ఆమె ప్రయాణిస్తున్న షిప్‌లోకి ప్రవేశించారు. వారి నుంచి తప్పించుకోవడానికి ఆమె, ఆమె స్నేహితురాలు బాత్రూంలో దాక్కున్నారు.
స్మోక్ బాంబులు ఉపయోగించడంతో ఆమె, ఆమె స్నేహితురాలు బయటికి రాక తప్పలేదు.
“నన్ను తిరిగి యూఏఈ తీసుకెళ్లవద్దు. ఇక్కడే చంపేయండి అని లతీఫా అరుస్తూనే ఉన్నారు” అని టీనా తెలిపారు. లతీఫాను టీనా ప్రత్యక్షంగా చూడటం అదే చివరిసారి.
ఇటీవల పంపిన వీడియోలో ఆ రోజు షిప్‌లో ఏం జరిగిందో లతీఫా వివరించారు. “నేను సైనికులతో పెనుగులాడాను. నాకు మత్తు ఇంజెక్షన్ ఇచ్చారు. ఆ తర్వాత కమెండోలు నన్ను ఆర్మీ ఆఫీసుకు తీసుకెళ్లారు. అక్కడ నలుగురైదుగురు ఆర్మీ అధికారులు ఉన్నారు” అని ఆమె చెప్పారు.
“నా పేరు లతీఫా అల్ మక్తూమ్ అని నేను వారికి పదే పదే చెప్పాను. నేను మళ్లీ దుబాయ్ వెళ్ళను, నాకు ఆశ్రయం కావాలి అని అడిగాను. అంతర్జాతీయ జలాల్లో ఉన్నాను. మీరు నన్ను విడిచిపెట్టాలి" అని వారికి పదే పదే చెప్పినట్లు లతీఫా ఆ వీడియోలో వివరించారు.
కానీ, ఆమె మాటలను వారు వినిపించుకోలేదు. ఎమిరేట్స్‌కు చెందిన ఓ సైనికుడు తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడని ఆమె చెప్పారు.
“అతను నన్ను పట్టుకున్నాడు. ఎత్తుకుని వెళ్లడానికి ప్రయత్నించాడు. నేను అతనితో పెనుగులాడాను. అతను బలవంతుడు. నేను ఏమీ చేయలేక చేతిని కొరికాను. అతను పెద్దగా అరిచాడు" అని ఆనాటి సంఘటనలను గుర్తు చేసుకున్నారు లతీఫా.
తనకు మత్తు మందు ఇచ్చి దుబాయి తీసుకెళ్లారని లతీఫా వెల్లడించారు.
"నాకు చాలా బాధగా ఉంది. నేను చాలా సంవత్సరాలు పొందాలనుకున్న స్వేచ్ఛను కొల్లగొట్టినట్లు అనిపించింది. అప్పటి నుంచి నేను ఇక్కడ బందిఖానాలో ఉన్నాను. వైద్య సహాయం లేదు. విచారణ లేదు. అసలు నాపై ఎటువంటి ఆరోపణలు లేవు"అని చెప్పారామె.

ఫొటో సోర్స్, Getty Images
లతీఫా పారిపోయేందుకు సాయపడిన టీనాను, పడవ సిబ్బందిని యూఏఈకి తీసుకెళ్లారు. అక్కడ టీనాను రెండు వారాల పాటు కస్టడీలో ఉంచారు. ఆ తర్వాతే లతీఫా వివరాలను టీనా మీడియాకు చెప్పారు.
Free Latifa పేరుతో ఆమె ఒక ఉద్యమం ప్రారంభించారు. ఈ కేసును టీనా ఐక్యరాజ్య సమితికి నివేదించారు.
ఆ తర్వాత కొన్నాళ్లు లతీఫా గురించి ఎలాంటి వివరాలు రాలేదు. 2019లో ఆమె మళ్లీ టీనాకు టచ్‌లోకి వచ్చారు. తర్వాత నుంచి ఆమె తన కష్టాలను వీడియోల రూపంలో పంపించడం మొదలుపెట్టారు.
“నేను ఈ వీడియోను బాత్‌రూమ్ నుంచి చేస్తున్నాను. ఇదొక్కటే నేను తలుపులు వేసుకుని ఎవరికీ కనబడకుండా ఉండగలిగే ప్రదేశం. నేను స్వేచ్ఛగా లేను, నేను జైలులో ఉన్నాను. నా జీవితం నా చేతుల్లో లేదు” అని తన వీడియోలో చెప్పారు.
“ఈ విల్లాను జైలులాగా మార్చారు. ఐదుగురు పోలీసులు నాకు కాపలా పెట్టారు. నలుగురు బయట ఉంటారు. ఒకరు లోపల ఉంటారు. నాకు ఇక్కడ గాలి పీల్చే స్వేచ్ఛ కూడా లేదు” అన్నారామె.

ఫొటో సోర్స్, Tiina Jauhiainen
ప్రాణభయం
లతీఫా వీడియోలలో ఆమె ప్రాణాలకు ముప్పు ఉందన్న భయం స్పష్టంగా కనిపించింది. ఆమె గొంతులో ఒక రకమైన విరక్తి, అసహన భావన వినిపించేది.
"రోజూ నా భద్రత, ప్రాణాల గురించి ఆందోళన చెందుతున్నాను. ఇలా ఎంతకాలం బతుకుతానో నాకు తెలియదు. జీవితమంతా జైలులో ఉంటావంటూ పోలీసులు నన్ను భయపెడుతున్నారు. నాకిక్కడ భద్రత లేదు” అన్నారు లతీఫా.
వీడియో బయటికి వస్తే తన దగ్గర్నుంచి ఫోన్ తీసేసుకుంటారని తెలిసినప్పటికీ, తాను చెప్పదలుచుకున్నదంతా రికార్డు చేసి పెట్టుకున్నారు లతీఫా.
"ఇలా రికార్డు చేయడం నాకు పెద్ద కష్టం కాలేదు. నేను స్వేచ్ఛగా లేనన్న విషయాన్ని ఈ వీడియోల ద్వారా బయటి ప్రపంచానికి చెప్పాలనుకుంటున్నాను. వారు ఏం ప్రచారం చేస్తున్నారో నాకు అనవసరం” అన్నారామె.
లతీఫా దుబాయ్‌కి తిరిగి రావడాన్ని రెస్క్యూ మిషన్‌గా ప్రకటించారు షేక్ ముహమ్మద్. లతీఫా 2018 డిసెంబర్‌లో కనిపించకుండా పోయిన 9 నెలల తర్వాత నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌పై అంతర్జాతీయంగా ఒత్తిడి మొదలైంది.
ఆమె జీవించి ఉందో లేదో ఆధారాలు ఇవ్వాలంటూ ఐక్యరాజ్యసమితి కోరింది. దీనికి సమాధానం రాకపోయినట్లయితే ఆమె మరణించినట్లు ప్రజలు భావిస్తారని పేర్కొంది.
ఆ తర్వాత లతీఫా సవతి తల్లి ప్రిన్సెస్ హయా లతీఫాను కలవడానికి వచ్చారు. ఆమెను భోజనానికి రమ్మని పిలిచారు.
“ఇది నీకు పరీక్షలాంటిది. ఇన్ని రోజులు బందీగా ఉన్న తర్వాత నువ్వు మనుషులతో ఎలా ప్రవర్తిస్తున్నావో చూస్తారు. బాగానే ఉన్నట్లనిపిస్తే నిన్ను విడుదల చేస్తారని హయా నాతో చెప్పారు” అని లతీఫా వీడియోలో వెల్లడించారు.

ఫొటో సోర్స్, UAE GOVERNMENT HANDOUT
సవతి తల్లి పాత్ర ఏంటి ?
కానీ, లతీఫాకు చెప్పకుండానే ఆమె సవతి తల్లి ఒక ప్రకటన చేశారు. లతీఫా బైపోలార్ డిజార్డర్‌తో బాధపడుతోందని, కృశించి పోతోందని వెల్లడించారు. దీన్ని నిరూపించడానికి ఆమె ఐక్యరాజ్యసమితిలో మానవహక్కుల సంఘం మాజీ హైకమిషనర్‌గా పని చేసిన తన స్నేహితురాలు మేరీ రాబిన్సన్‌ను పిలిపించారు.
2018లో డిసెంబర్ 15న మేరీ రాబిన్సన్ దుబాయ్ చేరుకున్నారు. హయా, ఇతర అధికారులు లతీఫా ఆరోగ్య పరిస్థితులను వివరించారు. ఐక్యరాజ్య సమితి నుంచి సహాయం అందేలా కృషి చేస్తానని ఆమె హామీ ఇచ్చారు.
లతీఫాకు ఈ విషయాలేవీ తెలియదు. లంచ్ టైంలో పర్యావరణం, స్కైడైవింగ్‌తోపాటు మేరీ రాబిన్సన్ తాను రాసిన పుస్తకం గురించి లతీఫాతో చర్చించారు.
“నా గురించి, నా ఆరోగ్యం గురించి ఆమె ఏమీ చర్చించలేదు. నాకసలు ఆమె ఐక్యరాజ్యసమితి మాజీ అధికారి అని కూడా తెలియదు” అని లతీఫా చెప్పారు.
లతీఫా ఆరోగ్యం గురించి తాను ఆమెతో చర్చించలేదని మేరీ రాబిన్సన్ తెలిపారు. ఆమె పారిపోయినప్పటి వీడియో గురించి కూడా మాట్లాడలేదని వెల్లడించారు.
“అసలు బైపోలార్ డిజార్డర్ ఉన్నవారితో ఎలా వ్యవహరించాలో నాకు తెలియదు. వాటి గురించి చర్చించి ఆమెను మరింత బాధ పెట్టదలుచుకోలేదు. మేం కలిసి చక్కగా భోంచేశాం” అన్నారు రాబిన్సన్
ఫొటోలు తీసుకోవడానికి, వాటిని ఐక్యరాజ్యసమితికి పంపడానికి రాబిన్సన్ అంగీకరించారు. ఇవి ప్రైవేట్ ఫొటోగ్రాఫ్స్ అని, కానీ తొమ్మిది రోజుల తర్వాత వాటిని యూఏఈ ప్రభుత్వం విడుదల చేయడంపట్ల తాను ఆశ్చర్యానికి గురయ్యానని రాబిన్సన్ వెల్లడించారు.
“లంచ్ తర్వాత నన్ను మళ్లీ నా గదికి పంపించారు. ఇదంతా వాళ్ల ప్లాన్. దీని తర్వాత నాకు ఒరిగిందేమీ లేదు” అని లతీఫా వివరించారు.

ఫొటో సోర్స్, Getty Images
ప్రిన్సెస్ హయాకు సమస్యలు
ఇదంతా జరిగిన తర్వాత లతీఫా సవతి తల్లి హయా ఇబ్బందుల్లో పడ్డారని రాబిన్సన్ వెల్లడించారు. “కొద్ది రోజులకు నాకు హయా నుంచి కాల్ వచ్చింది. ‘నేను లండన్‌లోఉన్నాను, నేను నా ఇద్దరు పిల్లలను తీసుకుని కట్టుబట్టలతో వచ్చాను. నాకు చాలా భయమేస్తోంది. ఇక్కడా చాలా జరుగుతున్నాయి’ అంటూ హయా నాకు ఫోన్‌లో చెప్పారు” అని మేరీ రాబిన్సన్ వెల్లడించారు.
లతీఫా విషయంలో నా చొరవపై ప్రిన్స్ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని తర్వాత హయా వెల్లడించారు. 2019 ఏప్రిల్ నాటికి దుబాయ్‌లో తన పరిస్థితి ఏమీ బాగాలేదని అర్ధమైందని, అందుకే తాను బ్రిటన్ వచ్చానని హయా తెలిపారు.
ఇంటి నుంచి వెళ్లిపోయిన తన భార్య ఇద్దరు పిల్లలను అప్పగించాలంటూ షేక్ ముహమ్మద్ న్యాయస్థానంలో పిటిషన్ వేశారు. కానీ ఆయనకు అనుకూలంగా తీర్పు రాలేదు.
మార్చి 2020లో హైకోర్టు ఇచ్చిన తీర్పులో షేక్ ముహమ్మద్‌కు, తన కూతుళ్ల విషయంలో ఉన్న పాత వివాదాలు కూడా బైటికి వచ్చాయి.
అంతకు 18 సంవత్సరాల ముందు, షేక్ ముహమ్మద్ రెండో కూతురు షమ్సాను యూకేలో కిడ్నాప్ చేసి దుబాయి తరలించారు. ఆ తర్వాత ఆమె దుబాయి విడిచిరాలేక పోయారు. షేక్ ఏజెంట్లు షమ్సాను యూనివర్సిటీ నుంచి ఎలా కిడ్నాప్ చేశారు, ఎలా తమ దేశం తీసుకు పోయారో బైటపడింది.
ఇప్పుడు ప్రిన్సెస్ హయాకు ఎలా బెదిరింపులు వచ్చాయో, లతీఫాను ఎలా పట్టుకుపోయారో కూడా తమకు తెలిసిందన్న న్యాయమూర్తి, గత అనుభవాల దృష్ట్యా షేక్‌ను నమ్మలేమని తేల్చి చెప్పారు.
“ఈ తీర్పు కాస్త ఆశావహంగా ఉంది. దీనితోనైనా లతీఫా విడుదలవుతారన్న ఆశ ఉంది ఆమెకు స్వేచ్ఛను ప్రసాదించాల్సిందే” అన్నారు టీనా.
దుబాయిలోని తన విల్లాలో ఉంటూ లతీఫా తన కేసును ఫాలో అయ్యారు. తన తల్లి తరఫు కజిన్ మార్కస్‌తో ఫోన్‌లో టచ్‌లో ఉండే వారు. అయితే కొన్నాళ్లకు వీడియోలు ఆగిపోయి, వాటి స్థానంలో కేవలం టెక్ట్స్ మెసేజ్‌లు రావడం మొదలు పెట్టాయి.
దీన్నిబట్టి ఆమె పరిస్థితి ఏమంత బాగలేదన్న విషయం టీనాకు, మార్కస్‌కు అర్ధమైంది. ఇప్పటికే మూడేళ్లుగా లతీఫా బందిఖానాలో ఉంటున్నారు.
“ఆమెకు ప్రతిరోజూ ఒక పోరాటమే. చాలా అలసిపోయింది. ఆరోగ్యం కూడా బాగా ఉండి ఉండదు” అన్నారు సోదరుడు మార్కస్.
కొన్నాళ్లకు టెక్ట్స్ మెసేజ్‌లు కూడా ఆగిపోవడంతో ఆమెను విడిపించే ప్రయత్నంలో భాగంగా ఆమె గతంలో తయారు చేసిన వీడియోలను విడుదల చేయాలని టీనా, మార్కస్‌లు నిర్ణయించారు.
అయితే లతీఫా క్షేమంగా ఉన్నారని అటు దుబాయి, ఇటు యూఏఈ ప్రభుత్వాలు ప్రకటించాయి. కానీ టీనా మాత్రం తన స్నేహితురాలికి ఏమైనా జరిగి ఉంటుందేమోనని ఆందోళన పడుతున్నారు.
“మొదట్లో ఏదో ఫోన్‌లో సమస్య అనుకున్నాను. ఆమె మళ్లీ కనిపిస్తుందని భావిస్తున్నాను. ఒకవేళ ఫోన్‌తో లతీఫా పట్టుబడితే, ఆమె పరిస్థితి మరింత దారుణంగా ఉంటుంది” అన్నారు టీనా.

ఇవి కూడా చదవండి:
- ధోనీ వ్యవసాయం ఎలా చేస్తున్నారో చూశారా? కడక్‌నాథ్ కోళ్లు, స్ట్రాబెర్రీలు..
- నువ్వలరేవులో పెళ్లి: వధువు వరుడి మెడలో తాళి కట్టడమే కాదు, ఈ ఊరికి ఎన్నో ప్రత్యేకతలు
- కొటియా గ్రామాలు: ఆంధ్రా-ఒడిశా సరిహద్దులోని ఈ 34 గ్రామాలు ఏ రాష్ట్రానివి? దశాబ్దాలుగా ఈ వివాదం ఎందుకు కొనసాగుతోంది?
- కేజీఎఫ్: కోలార్ గోల్డ్‌ఫీల్డ్స్ ఇప్పుడు ఎందుకు వెలవెలబోతున్నాయి... ఏపీలో చిగురిస్తున్న ఆశలేంటి?
- స్పెషల్ స్టేటస్, త్రీ క్యాపిటల్స్: ఆంధ్రప్రదేశ్‌లో ఈ లిక్కర్ బ్రాండ్లు నిజంగానే ఉన్నాయా?
- సియాచిన్: ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన యుద్ధ క్షేత్రం
- డోనల్డ్ ట్రంప్‌కు అభిశంసన ఆరోపణల నుంచి విముక్తి... సెనేట్‌లో వీగిపోయిన తీర్మానం
- జ్యోతిషాన్ని నమ్మే వారి సంఖ్య విపరీతంగా పెరుగుతోంది... ఎందుకు?
- సెక్స్ సమయంలో శరీరంలో చేరి ప్రాణాలకే ముప్పు తెచ్చే ఈ బ్యాక్టీరియాలు మీకు తెలుసా?
- సెక్స్ పట్ల సమాజానికి గౌరవం ఉందా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









