తెలంగాణ: కాకతీయ తోరణాల చరిత్ర ఏమిటో తెలుసా?

కాకతీయ కళాతోరణం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, వరంగల్‌లోని కాకతీయ కళాతోరణం
    • రచయిత, ప్రవీణ్ శుభం
    • హోదా, బీబీసీ ప్రతినిధి

తెలంగాణ రాష్ట్ర అధికార చిహ్నం (రాజముద్ర)లో మార్పు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. కొత్త చిహ్నం డిజైన్ విషయంలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధ్యక్షతన క్యాబినెట్ సబ్ కమిటీ వేశామని తెలిపారు. అన్ని వర్గాల సూచనలను పరిగణనలోకి తీసుకుని కొత్త చిహ్నాన్ని రూపొందిస్తామన్నారు.

రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే తెలంగాణ రాష్ట్రాన్ని పొడి అక్షరాల్లో సూచించే ‘టీఎస్’ కు బదులు ‘టీజీ’ గా మారుస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

ప్రస్తుత తెలంగాణ రాజముద్రలో ఉన్న కాకతీయ తోరణం, చార్మినార్‌లను తొలగించబోతున్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. కాయతీయ తోరణం, చార్మినార్‌‌లను రాజముద్ర నుంచి తొలగించొద్దంటూ బీఆర్ఎస్ నాయకులు ఆందోళనలు చేస్తున్నారు. ఈ అంశంపై చరిత్రకారులు, సాంస్కృతిక సంఘాల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

హైదరాబాద్, తెలంగాణ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, 2014 జూన్ 2న ప్రత్యేక రాష్ట్రంగా అవతరించిన తెలంగాణ

కొత్త రాష్ట్రం.. కొత్త రాజముద్ర

2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత కొత్త రాజముద్ర అవసరమైంది.

తెలంగాణకు చెందిన ప్రముఖ చిత్రకారుడు ‘ఏలె లక్ష్మణ్’ ప్రస్తుతం ఉన్న రాజముద్రను రూపొందించారు.

అందులో కాకతీయ తోరణం, చార్మినార్ ప్రధానంగా హైలైట్ అవుతూ ‘తెలంగాణ ప్రభుత్వం’ అని తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ భాషల్లో ఉంది.

అదే సందర్భంలో తెలంగాణ రాష్ట్రపక్షిగా పాలపిట్ట, రాష్ట్ర జంతువుగా జింక, రాష్ట్ర వృక్షాలుగా జమ్మిచెట్టును ప్రకటించారు.

కాకతీయ కళాతోరణం, చార్మినార్ రాచరికాన్ని సూచించేలా ఉన్నాయని అందుకే వాటిని ప్రభుత్వ అధికారిక ముద్ర నుంచి తొలగించాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉందన్న ప్రచారం జరుగుతోంది.

కాకతీయులు, ఓరుగల్లు

ఫొటో సోర్స్, RAJU

ఫొటో క్యాప్షన్, కాకతీయుల కీర్తి తోరణం

నిజమైన కాకతీయ కళాతోరణాలు ఎక్కడున్నాయి?

వరంగల్ రాజధానిగా విశాల సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసిన కాకతీయులు శిల్పకళను బాగా ప్రోత్సహించారనే గుర్తింపు తెచ్చుకున్నారు.

ఇటీవల ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన రామప్ప ఆలయంతో పాటు వెయ్యి స్తంభాల గుడి కాకతీయుల కాలంలో విలసిల్లిన శిల్పకళ పోషణకు సజీవ సాక్ష్యాలు.

తెలంగాణ ప్రభుత్వం నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాలు, ఇతర ప్రధాన కార్యక్రమాల్లో తరచూ కాకతీయ కళాతోరణాల నమూనా స్వాగత ద్వారాలను చూస్తుంటాం.

చరిత్రకారులు వీటిని కాకతీయ తోరణ ద్వారాలు, తోరణ స్తంభాలు, కీర్తి తోరణాలు, హంస ద్వారాలు ఇలా వివిధ పేర్లతో పిలిచారు.

తెలుగు నేలకు చెందిన ప్రముఖ చరిత్రకారులు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పురావస్తు శాఖ డిప్యూటీ డైరెక్టరుగా పనిచేసిన పివి.పరబ్రహ్మ శాస్త్రి రాసిన ‘కాకతీయులు’ అనే పుస్తకంలో వీటిని కాకతీయ తోరణాలుగా ప్రస్తావించారు.

కాకతీయులు, హైదరాబాద్

ఫొటో సోర్స్, Praveen Shubham

ఫొటో క్యాప్షన్, కాకతీయుల చరిత్రపై పీవీ పరబ్రహ్మ శాస్త్రి ప్రామాణిక రచన

కాకతీయ తోరణాలను ఎవరు చెక్కించారు?

భారత పురావస్తు శాఖ నిర్వహణలో ఉన్న వరంగల్ కోటలో ఈ నాలుగు కీర్తి తోరణాలు ఇప్పటికీ ఉన్నాయి.

కోటలోని ఆలయానికి నాలుగు దిక్కులా అవి ప్రధాన ప్రవేశ ద్వారాలుగా ఉండేవని చరిత్ర కారులు చెబుతున్నారు.

అయితే వీటిని కాకతీయ రాజుల్లో ఎవరి కాలంలో చెక్కించారన్న విషయంపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.

కాకతీయ తోరణాల గురించి తన పుస్తకంలో పివి. పరబ్రహ్మశాస్త్రి పలుమార్లు ప్రస్తావించారు.

కీర్తి తోరణాల నిర్మాణం ఒకే కాలంలో కాకుండా వేర్వేరు కాకతీయ రాజుల ఆధ్వర్యంలో సాగిందన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు.

‘’ఓరుగల్లు కోటలో జరిపిన తవ్వకాలలో గణపతి దేవుడు కట్టించినట్లు భావించే దేవాలయ శిథిలాలు లభించాయి. నున్నగా చెక్కిన పెద్ద రాళ్లతో ఈ గుడిని నిర్మించారు. ఈ ఆలయానికి నాలుగువైపులా నిర్మించిన నాలుగు అద్భుతమైన తోరణాలు ఒక విశిష్ట లక్షణం’’ అని పీవీ పరబ్రహ్మ శాస్త్రి తన కాకతీయులు పుస్తకంలో రాశారు.

‘’ఈ ఆలయం మొత్తం నిర్మాణాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే అది ఒక్కసారిగా కాక అంచెలంచెలుగా నిర్మించారనిపిస్తుంది. తూర్పువైపున ఉన్న కట్టడం గణపతి దేవుని కాలానికి, పశ్చిమం వైపు మండపం, తోరణాలు రుద్రమదేవి కాలానికి చెందినవిగా కనిపిస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం స్తంభాల మీద కనిపిస్తున్న గజకేసరి చిహ్నం. ఏనుగు తొండం మీద నిలిచిన సింహం మీద ఒక యోధురాలి శిరస్త్రాణంతో కత్తి ధరించిన ఒక స్త్రీ శిల్పం ఉంది. ఒక రాణి సింహం మీద కూర్చుని యుద్ధం చేస్తున్నట్లుగా చెక్కిన ఈ శిల్పంలోని స్త్రీ మూర్తి రుద్రమదేవే అయ్యుండాలి. సాధారణంగా సింహం మీద కూర్చున్నట్లుగా మానవ వనితలను చిత్రించరు’’ అని పీవీ పరబ్రహ్మ శాస్త్రి తన కాకతీయులు పుస్తకంలో వివరించారు.

‘’పదమూడో శతాబ్దం ద్వితీయార్థంలో రుద్రమదేవి స్వయంభూదేవాలయ మండవ భాగాన్ని నిర్మించినట్లు తెలుపుతున్నాయి. తూర్పు ద్వారానికి సమీపంలో ప్రధాన దేవాలయానికి సరిగా అతకని తోరణాలు రుద్రమదేవి విజయ మండపానికి తరువాత జోడించినవే అయి ఉంటాయి’’ అని పరబ్రహ్మ శాస్త్రి తన గ్రంథంలో అభిప్రాయం వ్యక్తం చేశారు.

వరంగల్, హైదరాబాద్

ఫొటో సోర్స్, RAJU

ఫొటో క్యాప్షన్, కాకతీయుల కాలం నాటి శిల్పకళకు సాక్షిగా శిలా తోరణం

చెక్కుచెదరని తోరణాలు

రుద్రదేవుని కాలంలో ప్రారంభమై రుద్రమదేవి వరకు ఈ ఆలయ నిర్మాణం కొనసాగిందని కాకతీయ యూనివర్సిటీ చరిత్ర విభాగం రిటైర్డ్ ప్రొఫెసర్ హైమవతి బీబీసీతో చెప్పారు.

‘’అవి ఆలయానికి చెందిన స్వాగత తోరణాలే. ఆ ఆలయం యూ ఆకారంలో నిర్మించారు. ఇది 2002లో కోటలో జరిపిన తవ్వకాల్లో బయటపడింది. కాకతీయుల చివరి రాజు ప్రతాపరుద్రుడు శత్రువులకు పట్టుబడ్డాక సంపద కోసం కోటలో నిర్మాణాలు కొన్ని నెలల పాటు ధ్వంసం చేశారు. అయితే స్వాగత తోరణాలకు ఎలాంటి హాని చేయలేదు. దీనికి కారణం వాటిపై ఎలాంటి మత సంబంధ చిహ్నాలు లేకపోవడమే’’ అని కాకతీయ యూనివర్సిటీ చరిత్ర విభాగం రిటైర్డ్ ప్రొఫెసర్ హైమవతి బీబీసీకి వివరించారు.

‘‘ఈ తోరణాలపై ఉన్న అధోఃముఖ పద్మాల మొగ్గలు సప్తమాతృకలకు ప్రతీకలు. కాకతీయ తోరణాలపై కనిపించే హంసలు కాకతీయుల రాజ్యంలో నీటి వనరుల ప్రాధాన్యత తెలియజేస్తున్నాయి. రాజ్య ఆదాయానికి పాడిపంటలతో పాటూ హార్టీకల్చర్ (ఔషధ మొక్కల ఉధ్యానవనాలు), మత్స్య సంపద కూడా తోడయ్యింది. 1,000 స్తంభాల గుడిలో చేతిలో చేపను పట్టుకుని ఉన్న కుబేరుని విగ్రహం ఈ విషయం స్పష్టం చేస్తోంది. కాకతీయ తోరణాలపై సాంచీస్తూపం ప్రభావం కనిపిస్తుంది. కోటలో సంపద పోయినప్పటికీ వాటిని చూసే వారికి రాచఠీవి, ఆత్మవిశ్వాసం అందించేలా తోరణ ద్వారాలు కనిపిస్తాయి. కాకతీయుల నిబద్దత వారి శిల్పాల్లో కనిపిస్తుంది’’ అని రిటైర్డ్ ప్రొఫెసర్ హైమవతి అన్నారు.

వరంగల్ ప్రాంతంలో జేగురు రంగు రాయి కనిపిస్తుందని, కీర్తి తోరణాలు చెక్కిన నల్ల రంగు రాయి ఖమ్మం, నల్గొండ ప్రాంతాల నుంచి తెచ్చి ఉండవచ్చన్న అభిప్రాయాన్ని హైమవతి వ్యక్తం చేశారు.

కాకతీయ కీర్తి తోరణాలు యుద్దాల్లో సాధించిన గెలుపును తెలిపే విజయచిహ్నాలని ప్రముఖ శిల్ప చరిత్రకారులు ఈమని శివనాగి రెడ్డి బీబీసీతో చెప్పారు.

‘కాకతీయ చక్రవర్తి గణపతి దేవుడు 62 ఏళ్ల సుదీర్ఘ కాలం పాలించారు. తెలుగు నేలకు నలువైపులా జయించిన విజయస్పూర్తికి చిహ్నంగా స్వయంభూదేవాలయం ప్రవేశద్వారాలుగా తోరణాలు చెక్కించారు. హంసలు కీర్తికి, గొప్పతనానికి ప్రతీకలు. అందుకే వాటిని కాకతీయ కీర్తి తోరణాలు అన్నారు. కాకతీయుల కంటే ముందు కళ్యాణీ చాళుక్యులు ఇలాంటి నిర్మాణాలు చేశారు. అయితే జంట స్తంభాలతో చక్కని సౌందర్యంతో కాకతీయ కీర్తి తోరణాలు అత్యున్నత స్థాయి నైపుణ్యాన్ని ప్రదర్శిస్తాయి’’ అని శివనాగి రెడ్డి అన్నారు.

హైదరాబాద్, తెలంగాణ

ఫొటో సోర్స్, RAJU

ఫొటో క్యాప్షన్, తెలంగాణ అధికార చిహ్నంలో చోటు దక్కించుకున్న కాకతీయ శిలా తోరణం

శిల్పాల తయారీ కేంద్రంగా వరంగల్

కాకతీయుల రాజధాని ఓరుగల్లులో శిల్పాల తయారీ భారీ పరిశ్రమలా సాగేదన్న అభిప్రాయాన్ని పీవీ. పరబ్రహ్మశాస్త్రి తన ‘కాకతీయులు’ గ్రంథంలో వ్యక్తం చేశారు.

ఓరుగల్లులో శిల్పాలను చెక్కించి తమ ప్రాంతాల్లో నిర్మించే ఆలయాలలో వాటిని వాడేవారని ఆయన అభిప్రాయపడ్డారు.

‘’ఆ నాడు ఓరుగల్లులో మహాశిల్పులు పని చేసిన ఒక గొప్పశిల్ప కర్మాగారం ఉన్నట్లుగా అనిపిస్తోంది. వారు చెక్కిన శిల్పాలను రాజ్యంలోని వివిధ ప్రదేశాలలో ఆలయ నిర్మాతలు కొనేవారు. పాలంపేట, నాగులపాడు, పిల్లలమర్రులలోని సుప్రసిద్ధ దేవాలయాలలోనే కాక చిన్నచిన్న దేవాలయాల్లో కూడా ద్వారబంధాలు, ద్వారఫలకాలు, లోకప్పు ఫలకాలు వంటి కొన్ని విశిష్ట భాగాలు గొప్ప పనితనాన్ని చూపుతున్నాయి. ఈ గుళ్లలో తక్కిన భాగాలు సాధారణంగానే ఉంటాయి. తెలంగాణలోని అనేక దేవాలయాలలో దర్శనమిచ్చే అందమైన నందులు ఓరుగల్లు శిల్పవిధానంలో చెక్కబడి ఆయా స్థలాలకు చేరుకున్నట్టు కనిపిస్తుంది’’ అని ఆయన తన పుస్తకంలో రాశారు.

‘ధిక్కారం, పోరాటాలను ప్రతిబింబించేలా చిహ్నం ఉండాలి’ - సీఎం రేవంత్

కొత్తగా రూపొందించే రాజముద్రలో కాకతీయ కళాతోరణం ఉంటుందా? ఉండదా? అన్నది ప్రభుత్వం ఇంకా అధికారికంగా వెల్లడించలేదు.

‘‘చిహ్నం ఒక జాతి చరిత్రకు అద్దంపడుతుంది. జాతి చరిత్ర మొత్తం నిక్షిప్తమై ఉండేది చిహ్నంలో మాత్రమే. తెలంగాణ అంటే ధిక్కారం, పోరాటం. రాష్ట్ర అధికారిక చిహ్నంలో అది ప్రతిబింబించాలి. ఆ దిశగా ప్రజా ప్రభుత్వం నూతన చిహ్నాన్ని రూపొందించే పనిలో ఉంది. వివిధ వర్గాల నుంచి వచ్చిన సూచనలు, సలహాలు పరిగణనలోకి తీసుకుని నూతన చిహ్నాన్ని రూపొందించే పనిలో ఉన్నాం’’ అని తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం ప్రసంగంలో సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)